(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

శిరచ్చేదనమునకు శిరచ్చేదన



గమనిక:- భయంకరమును, పాపభూయిష్టమునైన ఈ సాతానుయొక్క శిరచ్చేదనము చేయుటకై, ప్రతి క్రైస్తవుడు ఈ ప్రార్ధన చేయుట అవసరము.


సాతాను నెదిరించు పద్యము



సీ॥
సాతాను సర్పమా! సర్వకార్యములందు
     శ్రమలతో కూడిన । చావు నీకు
నరులను బాధించు । నపుడెల్ల వ్రాతలో
     పడిన శిక్షలు పయి । బడును నీకు
యూఫ్రటీస్ నది వద్ద । ఉన్న భూతాలకు
     కలిగిన దుర్గతి - కలుగు నీకు
విజ్ఞప్తి పత్రిక । వెల్లడించక ముందె
     కంపము భీతియు । కలుగు నీకు


తే॥గీ॥
హేడెస్సను మాట తలనొప్పి । హింస నీకు
హర్మ గెద్దోను యుద్ధం । హడలు నీకు
కడతరుగని గొయ్యియె మొట్టి । కాయ నీకు
అగ్నిగుండ మనంత ని । రాశ నీకు


పరిత్యాగ పత్రిక



ఓ సాతానా! నీవంటే మాకు ఇష్టము లేదు. గనుక నీకు పరిత్యాగపత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడనే కనబడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వతము వరకు పనిచేస్తుంది.

పరిత్యాగ పత్రిక కీర్తన వచనము

పోపొమ్ము ఓ లోకమా! చాలిక చాలు - నీ పొందు
మేమొల్లము = పోపొమ్ము ఓ సాతానా!
చాలిక చాలు - నీ పొందు మేమొల్లము.


ఓ సాతానా అనుమాటకు బదులుగా, ఈ క్రింది పదములు ఉపయోగించి పాడవలెను.


ఓ పాపమా, ఓ పాప ఫలితమా, ఓ దయ్యమా, ఓ భూతమా, ఓ రోగమా, ఓ దుఃఖమా, ఓ లోపమా, ఓ శోధనా, ఓ మందమా, ఓ కంపమా, ఓ దుర్దశా, ఓ పాప నైజమా, ఓ మరణమా, ఓ నరకమా, ఓ హేడెస్సా.