అభయాని (Fight for the Right)



ప్రియ సోదరులగు పాస్టరులారా:- మీరు పాఠములు మరల చూచుకొనేటందుకు వచ్చినందువలన దైవవాక్యము పునర్విచారణచేసే ఒక తరుణ భాగ్యము మీకు కలిగినందుకు ఆనందించుచు దానిని సద్వినియోగపరచవలెనని మిమ్మును యేసు నామమున బ్రతిమాలుకొనుచున్నాను. మా షారోను సంస్తుతి సమాజముయొక్క బోధలు కొద్దిగనో, గొప్పగనో మీరు ఆలకించియున్నారు. అవి బైబిలులో ఉన్నప్పటికిని మన లూథరన్ మిషను (A.E.L.C) సిద్ధాంతములలో లేవని చెప్పి కొందరు సంభాషణలలోను, వివాదములలోను, ప్రసంగ పీఠములలోను, మీటింగులలోను, వత్రికలలోను దోషారోపణచేయుచూ, దూషించుచూ, అవమానపరచుచున్నారు. ఇవి ఇదివరకు మీరు బోధించని బోధలగుటచేతను సంఘస్థులమగు మేము బోధించుటచేతను, మీరు తృణీకరింపకుండవలెనని నా కోరిక.


వీరికి మాకంటె మహాఎక్కువ తెలుసునా? అని అనుకొనే స్వభావమునకును; మాకులేని వరములు వీరికెందుకు అని అనుకొనే స్వభావమునకును; వాకబుచేయుటకు ఒకరి దగ్గరకు వెళ్ళితే మా గౌరవమునకు లోపముగలుగును గనుక వారే రావలెను అనే స్వభావమునకును మీరు సందివ్వకండి. ఇస్తే మీ మనస్సాక్షి నిర్మలముగ ఉండదు. ఉండకపోతే సత్యము ఎప్పటికిని బోధపడదు.


మేము వ్రచురంచిన ఈ బోధలు దేవుని వాక్యమునకు అనుకూలముగ ఉన్నవో లేవో, మనస్సాక్షికి అనుకూలముగ ఉన్నవో లేవో, దేవుడిచ్చిన సహజ జ్ఞానమునకు అనుకూలముగ ఉన్నవో లేవో బాగుగా పరీక్షించుట సంఘాధ్యక్షులైన మీ విధియైయున్నది. అది మాత్రమే కాకుండ మీరందరు ఏకీభవించి దేవుని సన్నిధిలో మోకాళ్ళూని ఓ ప్రభువా! ఈ బైలుదేరిన బోధల విషయములో మేమేమి చేయవలెనో మాకు చూపించుమని జవాబు వచ్చేవరకును, మహా విధేయతతో వేడుకొనుటకై ప్రత్యేక ప్రార్ధన ఏర్పాటు చేసుకొని ప్రార్ధించవలెనని నా మనవియైయున్నది. నేను సాత్విశయము చేతగాని, స్వప్రయోజనము నిమిత్తముగాని, ఎదురించే స్వభావముతోగాని ఈ బోధలు బోధించుచున్నానేమో అనే అనుమానము మీకుంటే అదియు మీరు ప్రభువు నడగండి. మీరు మా సమాజములోని కొందరి చర్యలను గురించి విన్న దుర్వార్తలనుబట్టి ఈ బైబిలు బోధలు కొట్టివేయని ధర్మజ్ఞానులై యుండవలెనని నా ప్రార్ధనయైయున్నది.


క్రైస్తవ బోధకులలో కొందరు బాగుగాలేరని చెప్పి, అన్యులు క్రైస్తవ మతములోనికి రాకుంటే, "అవునవును రావద్దు" అని మనమందుమా? క్రీస్తుమతము క్రీస్తునుబట్టి ఉన్నదా? క్రైస్తవులనుబట్టి యున్నదా? అని ప్రశ్నవేతుముగదా? గనుక మొదట మీరు ఈ బోధ విషయములలో వాక్యపరిశీలన చేయండి, అప్పుడు మీరు ప్రవర్తన దిద్దుబాటు చేయగలరు. వాక్య పరిశీలన చేయుటకు ఇష్టపడని అనంగీకార ప్రవర్తననేగాని మీలో ఉంటే ఇతరుల ప్రవర్తనను మీరు దిద్దనేలేరు. సంఘాధికారులమైన మమ్ము నడగకుండ వీరిట్టి బోధలు ప్రచురము చేస్తున్నారనే కక్ష మీలోకి రాకుండ చేసికొనండి. సమాజకులయొద్దకు మీరువెళ్లి సంగతి, సందర్భములు తెలిసికొని; చెప్పవలసిన హితోపదేశములు చెప్పి, మీకర్తవ్యము నెరవేర్చుకొన్నంత మాత్రమున మీ ఉద్యోగమునకు పరాభవము రాదుగాని ఘనతేగాని తప్పు బోధచేసేవారుంటే "ఇదిగో తప్పు బోధిస్తున్నాను", పాస్టరులారా రండి అని వారంతట వారే అనరు. పాస్టర్లే వారియొద్దకు వెళ్లి, బాగుగా విని ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పవలెను. ఇది వారి ఉద్యోగ ధర్మములలో ఒకటి.


మత్తయి. 18:15-17లో అధ్యాయములలో ప్రభువు చెప్పిన విచారణ క్రమము ఉదహరించుచున్నాను.

ఇక్కడకూడ నీవే వెళ్ళుము అనే సంగతి ఇమిడి యున్నది. ప్రభువు నేర్పిన ఈ పద్ధతి ననుసరించని వారు ఎటువంటి క్రైస్తవులో! ఈ పద్ధతిలేని సంఘము ఎలాంటి సంఘమో! సత్యము కొరకు వెలివేయబడుట అవమానముకాదు. డా॥ మార్టిన్ లూధర్ డి.డి. గారు వెలివేయబడెను. తుదకు ఆయన అనుచరులు ఒక పెద్ద సంఘమైనారుగదా?


మన మిషను గ్రామములోనికి సెవెంత్ డే వారు వచ్చి సంఘమును స్థాపిస్తూ ఉంటే, ఓ పాదిరిగారూ! మీరు వెళ్ళి వారితో మాట్లాడవలెనా? వారు మీ మద్యకు వచ్చేవరకు మీరు కూర్చుండవలెనా? మీరైతే ఏమిచేస్తారు? (మందలోనికి తోడేలు వస్తే గొల్లవాడు తోడేలు దగ్గరకు వెళ్ళవలెనా? తోడేలు గొల్లవాని దగ్గరకు రావలెనా?) వారు రావలెనని కోరుదువేమో? వారు రావడమునకు వారికేమి అవసరము? వారిని చెడబడ తిడితే వారు మన దగ్గరకు వస్తారా? తిట్టినందుకు కేసు వేస్తారు గాని రారు. మీరు సమాజములయొద్దకు వెళ్ళి కనుగొన్నందువల్ల మీకు అమర్యాద రాదు గాని వారు చాల సంతోషిస్తారు.


మీరు హిల్ దొరగారు వ్రాసినవి ప్రచురించితిరిగదా! ఆయన కొన్నాళ్లు మీటింగులకు హాజరైన పిదప ఆ సంగతులు వ్రాసియున్నారు. ఆ కూటములకు వెళ్లుట నాకు నామోషీ ఆయన అని అనుకున్నాడా? "నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించవలెననియు, శత్రువులను ప్రేమించవలెననియు", బైబిలులో వ్రాయబడియున్నది. దీని ప్రకారము మీరు చేయవద్దా? మీదృష్టిలో సమాజకులు అబద్ధ బోధకులును, శత్రువులును, పొరుగువారును అయియున్నారు గనుక వారిని క్షమించండి, ప్రేమించండి, దీవించండి, వారికి మేలు చేయండి, వారికొరకు ప్రార్ధించండి (మత్తయి. 5:44 లూకా. 6:35).