ఏడు సిద్ధాంతములు (ఆంధ్ర క్రైస్తవులకొక విజ్ఞాపనము)
1. పరిశుద్ధాత్మ బాప్తిస్మము:- క్రైస్తవ బాప్తిస్మము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను త్రియేక దేవుని నామమున వాక్య సేవకులిచ్చు బాప్తిస్మము. అయితే పరిశుద్దాత్మ బాప్తిస్మము, పరిశుద్దాత్మను కుమ్మరించుచు, విశ్వాసులకు క్రీస్తుప్రభువిచ్చు బాప్తిస్మమై యున్నది (కార్య. 1:5; 2:23). నీళ్ళతో ఇచ్చిన బాప్తిస్మము పొందిన క్రైస్తవులు కూడ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందవలసివచ్చెను (కార్య. 8:14-17). ఇది అందరకును ఉద్దేశింపబడినట్లు కార్య. 2:39 వల్ల తెలియుచున్నది. క్రైస్తవ బాప్తిస్మము పొందకముందే అన్యులు కొందరు ఇది పొందినట్టును, భాషలతో మాట్లాడినట్టును (కార్య. 10:44-48)లో నున్నది. మనమును అపోస్తలులవలె పరిశుద్దాత్మ కొరకు ప్రార్ధించిన యెడల పొందగలము. రక్షణపొందిన వారలారా! మీ రక్షణజీవనమును, ప్రభువును గురించి మీరిచ్చుచున్న సాక్ష్యమును మరింత వృద్ధియగునట్లు; పరిశుద్దాత్మ బాప్తిస్మముగూడ పొందుట అవసరమైయున్నది.
2. భాషావరము:- దీనిని గురించి 1కొరింధి. 14వ అధ్యాయములో ఎంతో వివరముగానున్నది. నేడును దేవుడు కొందరికి ఈ వరమిస్తే ఎవరు అడ్డుపెట్టగలరు? "అందరును భాషలతో మాటలాడ కోరుచున్నాను" అని పౌలు వ్రాయుచున్నాడు. నమ్మువారు క్రొత్త భాషలతో మాటలాడుదురని మార్కు 16:17లో ఉన్నది.
3. (ప్రవచన వరము)added
(1) దర్శనవరము:- పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించియున్న యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో ఈ వరముకూడ గలదు. ప్రవక్తలకు దర్శనమిచ్చిన దేవుడు మనకును దర్శనమిచ్చును. అప్పుడు తాను దర్శనమిచ్చిన వాక్యముయొక్క నిజార్థము మరింతతేటగా తెలియగలదు.
(2) స్వప్నవరము:- ఇది దర్శనవరము వంటిదే నేడును దేవుడు స్వప్నములలో తన చిత్తమును బయలుపరచును (యోవేలు 2అధ్యా.)
4. దైవిక స్వస్థత: - ఔషధములు లేకుండ మన విశ్వాస 'ప్రార్ధనవల్లనే, నేడును ప్రభువు వ్యాధులను బాగుచేయును' (మార్కు 16:18, నిర్గమ. 15:26, మత్త. 8:17, యాకోబు 5:13-16). అయినను మందులను వాడువారిని తుంచనాడగూడదు. ఔషధములు నిషేదములుకావు.
5. దయ్యములను వెళ్ళగొట్టువరము:- విశ్వాసులకు ఇయ్యబడిన వరములలో ఇది మరియొకటి. యేసు నామ ఉచ్చారణ వలననే ఇది జరుగును (మార్కు 9:29).
6. ప్రభువు రాకడకాల సామీప్యము:- జరుగవలసిన గురుతులైన వెంటనే ప్రభువు విశ్వాసుల గుంపును తీసికొని వెళ్ళుటకై వచ్చునని మనము గ్రహించుచున్నాము. యూదులిప్పుడు యెరూషలేమునకు వెళ్ళుచున్నారు. ఇదియొక చివరి గుర్తు. ఇది రాకడ సమీపకాలమని మాత్రమే చెప్పగలముగాని, ప్రభువు ఫలాని తారీఖున వచ్చునని నిర్ణయింపలేము.
7. కనిపెట్టుట:- ప్రార్ధనలో దేవుని సన్నిధానమందు కనిపెట్టువాడుక గలదు. ఉదయమున పనులు ప్రారంభింపక ముందే ఒక గంట దైవసన్నిధిలో కనిపెట్టుట చాల అవసరము గనుక నేను ప్రతి ఉదయము పనులు ప్రారంభము కాకముందే ఒక గంట తప్పక కనిపెట్టుదునని మన మనస్సులో తీర్మానము చేసికొనవలయును. ఒకవేళ ఆ తీర్మాన ప్రకారముగా ఉదయమున సమయము లేనియెడల దినములో ఏదో ఒక గంట సమయము ఏర్పాటు చేసికొనుట మంచిది. బైబిలు చదువుట, కీర్తనలు పాడుట, ప్రార్ధనలు చేసికొనుట ఈ మొదలైనవి కనిపెట్టు సమయములో చేర్చక, వేరు సమయములలో వాటిని ఏర్పాటు చేసికొని కనిపెట్టు సమయములో కేవలము కనిపెట్టవలయును. మన బ్రతుకులో చేసికొన్న తీర్మానములలో ఇది మహా ముఖ్యమగు తీర్మానముగా ఉండవలయును. అనుదినము విదాయకముగ ఆచరించునదై యుండవలెను. దినములో ఏది తప్పినను ఇది మాత్రము తప్పరాదు.
మనుష్యుల దగ్గర ఏదైన ఒక అవసరమైన వస్తువు అడుగవెళ్ళునప్పుడు అడిగిన పిదప వారు ఇచ్చువరకు లేదా ఏదోయొక జవాబు చెప్పువరకు కనిపెట్టుకొని యుందుము గదా! మనుష్యుల దగ్గర కని పెట్టుట అవసరమైతే, దేవుని దగ్గర కనిపెట్టుట మరెంత అవసరమో ఆలోచించుడి. మనము మనో నిదానము కలిగి, మన తలంపులు వేటిమీదకును పోనియ్యక, ప్రభువు వైపుననే ఉంచి, ప్రభువును తలంచుకొనుచు, ఆయన సన్నిధిలో మౌనముగా కనిపెట్టిన యెడల, ఆయన మహిమగల కిరణములు మన శరీరాత్మలమీద పడును. అప్పుడు ఆత్మలోనున్న కళంకము కరిగిపోవును, చీకటి పారిపోవును. పాపములను, సాతానును జయించుటకు నూతన బలము వచ్చును. ఈలాగు అనుదినము చేస్తే నూతనబలము పొందగలము. హృదయము పవిత్రముగా నుండును. దీనిని గురించి బైబిలులో అనేకమగు వాక్యములున్నవి. మేము బోధించు బోధలలో ముఖ్యమగు విషయమిదియే. ప్రతిదియు దేవునిని అడుగుట, ఆయన ఏమి చెప్పునో అని కనిపెట్టుట, ప్రభువు చెప్పునది వినుట; ఆ ప్రకారముగ నెరవేర్చుట, మా ముఖ్యఉద్దేశమును, మా అవలంబానుభవమైయున్నది. “ఆయన మీతో చెప్పునది చేయుడి” యోహాను. 2:5 అను వాక్య ప్రకారము కనిపెట్టుటలో నున్నవారికి ప్రభువు చెప్పును. అట్టి వారితోనే ప్రభువు మాట్లాడును. అపోస్తలుల అనుభవములో ఇది ఉన్నట్లు కార్యముల గ్రంథములో మనము చూడగలము.
ముగింపు:- దేవుడిచ్చు వరములు ఈ కాలమునకు కాదనియు, లిఖీత వాక్యమున్నందున అవి ఇప్పుడు అవసరము లేదనియు కొట్టివేయుట మనకు హాని, పురాతన సంఘములందు వాడుకలో లేని ఈ సంగతులను గూర్చి చాలా దూరమాలోచించి, దేవుని నడుగనిదే సత్యాసత్యములు తీర్మానించవద్దు. మీరు ఆలోచించుటకును; ఇవి సత్యమని తోచినయెడల మీ సంఘములో ప్రవేశపెట్టుడి అని మేము చెప్పుటకును ఈ పుస్తకమును ప్రచురించుచున్నాము. మేమీ సంగతులు బోధించుచుండగ అనేకులివి తప్పు సిద్ధాంతములని దూషించు చున్నారు.
ఈ ఏడు సిద్ధాంతముల విషయమై మరియొక గ్రంథము వ్రాసెదము. ముందే ఆ వివరము తెలుసుకొనగోరువారు నాకు వ్రాయవచ్చును. ఇదియును, ఈ 7 అంశములనుగూర్చి బైబిలులోనున్న వాక్యములన్నియును చదివి తండ్రిని వేడుకొన్న యెడల మీకు సత్యము బైలుపడకమానదు. మీలోనున్న పరిశుద్ధాత్మ మీకు తోడ్పడునుగాక!
ఇట్లు మీ సోదరుడు
కె. విజయరత్నము