(వినదగు చరిత్ర)added



"వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలోసుమతీ"

"ఎవరేది చెప్పినను అది మంచిదైనను, చెడ్డదైనను మొదట వినవలెను" అని, పై పద్యములో కనబడుచున్నది. పూర్తిగా వినకముందు ఇది మంచిది కాదనరాదు. ఏ మతబోధయైనను మొదట వినవలసినదే.


విన్న తర్వాత పరీక్షింపవలెను. మంచిదని తోచినచో అవలంభింపవలెను 1థెస్స. 5:21. మా బోధలను గురించి తప్పుడు ఊహలు కలిగియుండుట; కల్పనాకథలాలకించుట; లేనిపోని వదంతులు వ్యాపింపచేయుట; వ్యాఖ్యానము అవసరము లేనంత స్పష్టముగా సత్యమును బైలుపరచే దైవవాక్యమును, సిద్ధాంతములలో లేదనే వంకమీద ఎదిరించుట; బైబిలు పండితులు బోధించలేదనే మిషమీద తుంచనాడుట; ఈ బోధలు పూర్వకాల ప్రజలకేగాని నేటికాల ప్రజలకుకాదు అనే సాకు మీద వదలి పెట్టుట; కడవరి దినములలో అబధ్ధ ప్రవక్తలువచ్చి దుర్బోధలు చేయుదురు గనుక వారే వీరు అని అపార్ధము చేసికొనుట; పిశాచికూడ బైబిలు వాక్యములు ఎత్తి చూపించును అని చెప్పుకొనే మాట సమయము సందర్భము లేకుండ పలుకుట; పూర్వకాలమందు సంఘములో కొందరు లేచి విపరీతమైన బోధలుచేసి మతశాఖలేర్చరచినప్పటికిని అవి కాలక్రమమున అంతరించిపోయినవి అనే సంఘచరిత్ర వృత్తాంతమును పేర్కొనుట; అట్టి తలంపులు సత్యము అవలంభింపకోరువారికి శుభము కాదు. మరియు ఇట్టి మాటలు అనువారు బైబిలులోని సత్యముయొక్క విలువను తగ్గించేటందుకు అందురు. మరియు తెలియని వారిలో సందేహములు పుట్టింతురు, వచ్చేవారిని ఆటంకపెట్టుదురు.


పిశాచివల్ల జరిగే పనియు, క్రీస్తువల్ల జరిగే పనియు, తెలిసికోవడము సహజజ్ఞానానికిన్నీ విశ్వాసికిన్నీ కష్టమైయుండును. గనుక మన మిషనులోని క్రైస్తవులకు ఈ సిద్ధాంతములు తెలిపేటందుకు మేము చేసిన బాహాటమైన ప్రయత్నములు మన మిషనుకు సత్యము తెలుసుకొనేటందుకై మంచి తరుణములైయున్నవి. అవి ఏవనగా:


   (1) 1934 సం॥ము పెద్దాపురము దేవాలయమందు పెంతెకొస్తు పండుగ కాలమందు రెవ. వి. జోనాతానుగారి ఏర్పాటు ప్రకారము యం. దేవదాసు అయ్యగారు పది దినములు కూటములు పెట్టి పరిశుద్దాత్మ బాప్తిస్మమును గురించి వివరించిరి. అచ్చట అందరు మొదటగా ధవళ వస్త్రధారులై పెంతెకొస్తు పండుగను ఆచరించిరి.


   (2) 1935 సం॥ము రాజమండ్రి సెయింటు పౌలు దేవాలయమందు రెవ. ఇ. ప్రకాశముగారి ఏర్పాటు ప్రకారము పెంతెకొస్తు కాలమందు యం. దేవదాసు అయ్యగారు పది దినములు పరిశుద్దాత్మ బాప్తిస్మమును గురించి విపులముగా వివరించియున్నారు. ఆ పది దినముల ఉపదేశములు విన్న తదనంతరము అంగీకార మనస్సుతో మా రాజమండ్రిలోని క్రైస్తవులందరును ప్రధమ పెంతెకొస్తు పండుగ నాచరించి యున్నారు.


   (3) 1936 సం॥ము ధవళేశ్వరము దేవాలయములో రెవ. పి. సి. యోసేపుగారి ఏర్పాటు ప్రకారము పెంతెకొస్తు కాలమందు యం. దేవదాసు అయ్యగారు మరింత వివరముగా పరిశుద్దాత్మ కుమ్మరింపును గురించి ప్రసంగించిరి. ఆ సంఘస్థులు బహు సంతోషముతో పెంతెకొస్తు పండుగను ఆ సంవత్సరము ప్రథమముగా నాచరించిరి.


   (4) 1937 సం॥ము ఆ ఊరిలోనే, ఆ దేవాలయమందే రెవ. యస్ జీవరత్నముగారి ఏర్పాటు ప్రకారము యం. దేవదాసు అయ్యగారు అపో॥కార్య॥ 2 అధ్యాయములో నున్న పెంతెకొస్తు పండుగ కథను గురించి ప్రసంగించిరి. ఆ సంవత్సరములో ఆ సంఘస్థులు 'పెంతెకొస్తు పండుగ' నాచరించియున్నారు.


   (5) 1936 సం॥ము గుంటూరు పరి. మత్తయి దేవాలయమందు పెంతెకొస్తు కాలమందు పది దినములు రెవ. వి. సత్యానందంగారి యొక్కయు, ఆ సంఘ పంచాయితీ యొక్కయు ఏర్పాటు ప్రకారము నేను మారుమనస్సును గూర్చియు, ముఖ్యముగా పరిశుద్దాత్మ బాప్తిస్మమును గూర్చియు, పరిశుద్దాత్మ వరములను గూర్చియు, రెండవ రాకడను గూర్చియు ప్రసంగించి, వారు వేయు ప్రశ్నలన్నిటికిని జవాబులివ్వగా విన్న వారంగీకరించినందున ఒక దినము దేవాలయమందు ఆత్మ కుమ్మరింపుకొరకు ఉపవాసప్రార్థన పెట్టగా కొందరు అట్టి సమయమందు ఆత్మ బాప్తిస్మము పొందినట్టును ఆ పెంతెకొస్తు కాలమున మన వారి మధ్యను, టౌన్ హాలులో హిందువుల మధ్యను జరిగిన సేవనుగూర్చి సద్విషయములనే నా మొదటి పుస్తకములో వ్రాసిన సంగతి మీరెరిగినదే. గుంటూరు సంఘస్థులందరు అంగీకరించి ప్రథమముగా ఆ సంవత్సరమే పెంతెకొస్తు పండుగను అలంకాలములతోను, వీధులలో తిరుగుచు, పాటలు పాడుటతోను, సువార్త ప్రకటించుటతోను, క్రిస్మస్ పండుగ వంటి ఆనందముతో ఆచరించిరని నిస్సందేహముగా చెప్పుచున్నాను.


   (6) 1936 సం॥లో నేను త్రివిధ విజ్ఞాపనమనే పత్రిక వేసి సంఘాధ్యక్షులకును, సంఘస్థులకును పంపితిని.


   (7) 1936 సం॥ము అక్టోబరులో మన ఏ.ఇ.యల్.సి. రాజమండ్రిలో సమావేశమైన సందర్భమున అప్పటి ప్రెసిడెంటు గారగు ఇ. న్యూఢార్ఫర్ దొరగారికి నేను స్వయముగా ఈ విషయములను గూర్చి ఉత్తరము వ్రాసితిని.


   (8) ఆ నమయమందే మా నమాజకులును, ఏ.ఇ.యల్.సి డెలిగేట్లను అగు ముగ్గురు ఈ బోధల విషయమై బోధించువారిని పిలిచి అడగవలెననియు, అడగకుండ ఎట్టి తీర్మానము చేయరాదనియు, బోధించువారు ప్రశ్నలడిగితే చెప్పుటకు సిద్ధముగానున్నారనియు, అప్పటి ప్రసిడెంటుగారగు ఇ. న్యూఢార్ఫర్ గారికి వ్రాసిరి. జవాబురానందున అచ్చువేసి అందరకును పంచిరి.


   (9) ఆ సమావేశకాలమందు మీరు ఆలోచింపవలసినది కూటములను గరించికాదు. "పరిశద్దాత్మ బాప్తీస్మము బైబిలులో ఉన్నదా? లేదా" అని ఆలోచించి, మీ అభిప్రాయము నాకు తెలియజేయుమని ఒక పత్రిక వ్రాసి అచ్చువేసి, ప్రతినిధులకు అందింపజేసితిని.


   (10) 1936 నం॥ము అక్టోబర్ 18వ తేదీని “సద్విషయములు” అనేపేరుతో ఒక పుస్తకము వ్రాసి అచ్చువేసి ఏ.ఇ.యల్.సి. ప్రతినిధులందరకును నేను పంచిపెట్టించిన సంగతి ఇప్పటివరకు మీకు జ్ఞాపకమున్నది.


   (11) 1936 సం॥ము నవంబరులో మన సంఘ పంచాంగము ప్రకారముగా అడ్వెంటుకాలమందు రెండవ రాకడను గురించి "ద్వితీయాగమనము" అనుపేరుతో ఒక పుస్తకము అచ్చువేసి, పాస్టరులకును, మిషనెరీలకును మాత్రమేకాక కైస్తవులందరకును అందింపచేసితిని.


   (12) 1936 సం॥ము డిసెంబరులో రాజమండ్రి వీరభద్రాపురమందు మా ప్రార్ధన కూటములయొక్క సమావేశము (కన్వెన్షన్) నాల్గు దినములు పెట్టి ఆ సమయమందు మేము బోధించు ముఖ్య సిద్ధాంతములు బోధించుచుండగా, అట్టి బహిరంగ కూటములలోనికి రాజమండ్రిలోనున్న రెవ. ఏ.సి. కిన్సింగర్ గారును, లూథరుగిరి వేదాంత పాఠశాల ఉపాధ్యాయులగు రెవ. పి. పరదేశిగారును, రెవ. పి.బి. పౌలుగారును మిగత విద్యార్థులును వచ్చి విని, నోట్సు వ్రాసికొని వెళ్ళిరి. ఎఫ్. సిగ్నేర్, జె. యస్. థామస్ మిస్సమ్మలుకూడ ఒక రాత్రి మీటింగునకు వచ్చిరి. వేగు చూడడమునకు ఎంతమంది వచ్చినను, పిలవనిదే వచ్చినను; సత్యమునుగాక మరేమి చూడగలరు? ఇదియు బాహాటముగా చేసినాము అనే సంగతి మీకందరును ఇందు మూలముగా తెలియజేయుచున్నాను.


   (13) 1937 సం॥ము జూన్ లో "విమలాత్మ ప్రోక్షణము" అను పుస్తకమును ప్రచురించియున్నాము. దానిలో మోటు ప్రశ్నలకు జవాబులున్నవి. మా బోధలు కొందరు ఖండిస్తున్నారు. గనుక వారి ఖండనలకు మేము జవాబులు వ్రాసియున్నాము. ఇదియు మిషనెరీలకును, మొత్తముమీద పాస్టరులకును పోస్టు ద్వారాను, మనుష్యులద్వారాను పంపియున్నాము.


   (14) ఈ ఏడు సిద్ధాంతములు ఆలోచింపుడనియు, మన లూథరన్ సిద్ధాంతములలో కలుపుటకు అమెరికన్ బోర్డు వారికిని తెలియజేయుడనియు, ప్రస్తుతము ఏ.ఇయల్.సి. ప్రెసిడెంటు గారగు డాక్టర్ స్ట్రాక్ దొరగారికి మనవి చేయుచు ఈ మధ్యనే ఒక ఉత్తరమును వ్రాసియున్నాను.


   (15) లూథరగిరి వేదాంత పాఠశాలలో తర్ఫీదు అగువారిని; పరిశుద్దాత్మ బాప్తిస్మమును పొందువరకు పనులలోనికి పంపకూడదని ప్రిన్స్ పాల్ గారికి, డాక్టర్. ఇ. న్యూఢార్ఫర్ గారికి మనవి చేయుచు ఈ మధ్యనే ఒక ఉత్తరము వ్రాసితిని.


   (16) "అభయాని" అనే ఈ పుస్తకముకూడ ఒక మంచి తరుణమైయున్నది. ఇన్ని తరుణములు కలిగియుండియు అంగీకరించకుండుట ఎవరిది లోపము?


ఈ బోధలు చాల ఆలోచించి, మేము మొదట అభ్యాసము చేసి, అనుభవించి, ఆ తరువాత ఇన్ని తరుణములద్వారా మీకు తెలియపరచియున్నాము. ఆ తరువాత మీ ఇష్టము. ఈ బోధలు సరియైనవో కావో అని మా ఐదు పుస్తకములు చదువకముందును, విచారణ చేయకముందును, దేవునిని అడుగకముందును, అడిగిన తర్వాత తెలిసికొనకముందును, ఈ సమాజములో వారిని ఉద్యోగములనుండి తొలగించుదుమనియు, సంఘములోనుండి వెలివేయుదుమనియు, మీరు మమ్ములను బెదిరించడము అన్యులైన శత్రువులయొక్క ధర్మముగా కన్పిస్తున్నది. గాని విశ్వాసుల యొక్క ధర్మముగా కనిపించుటలేదు. ఒకవేళ మీరు వెలివేస్తే మమ్మును మిషనులో నుండి వెలివేయగలరుగాని క్రీస్తు సంఘములోనుండి వెలివేయలేరు గదా! మిషను మిషనే. సంఘము సంఘమే. వీరు ఈ బోధలను అంగీకరించినా, అంగీకరించకపోయినా అనేకమందికి మేము ఈ సత్యములను బైలుపరచి యున్నామను సంతోషము మాకు గలదు.


"ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు, క్రీస్తుయేసుకు మంచి పరిచారకుడవై యుందువు" 1తిమోతి. 4:6 ఈ వాక్యముననుసరించి మేము చేసియున్నాము.


క్రీస్తుమత సత్యముల పరీక్షకాలమందు, ప్రారంభము నుండి సత్యమును ఎదిరించినవారు సంఘనాయకులే. ఏలాగనగా, ప్రభువు కాలములో అదివరకున్న బోధకును, క్రీస్తుప్రభువు చేసిన బోధకును తేడా కనిపించగానే శాస్త్రులును, పరిసయ్యులును ఎదిరించడము మొదలుపెట్టిరి. పరిశీలించినయెడల ఆ కాలమందే వారికి సత్యము బైలుపడియుండును. మత్తయి. 23వ అధ్యాయమంతటిలో క్రీస్తుప్రభువు మత బోధకులనే గద్దించి యున్నారు. అపోస్తలుల కాలములో సంఘనాయకులే సువార్త నెదిరించి యున్నారు. అప్పుడు అపోస్తలులు "దేవునిమాట వినుటకంటె మీ మాట వినుట దేవునిదృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి" అని పలికిరి. లూథరు కాలములోకూడ సంఘనాయకులే ఎదురు తిరిగి యున్నారు. నేడుకూడ ఇట్టి చరిత్రయే జరుగుచున్నది. నాయకులు విసర్జించుచున్నారు అనే విచారము మాకున్నప్పటికిని, సత్యమును బైలుపరచినామనే ఆదరణ మాకు కలదు. మీలాటివారు మా బోధలు విన్న తరువాత, ఈ బోధలు నడిపే మా పద్ధతి మీకు నచ్చకపోతే, ఇంతకంటె ఉత్కృష్టమైన సలహాలు, పద్ధతులు మాకు చెప్పవలెనుగాని పగతీర్చుకొనే దూషణలు పలుకుట మీకే మాత్రమును క్షేమముకాదు.


ఈ మా వ్రాతలు సత్యము నెదిరించువారికేగాని అందురకును సంబంధించవు. ముఖాముఖిగా మాట్లాడుటకు వీలు కలిగినయెడల ఇంతకంటె వివరముగా చెప్పగలము.


అధికారులైన మిషనెరీలలారా! మన మిషనులో ఈ బోధలు విన్నటువంటివారిలో అనేకమంది పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందవలెననెడి ఆసక్తి కలిగియున్నారు. గాని మిషనెరీలగు మీకు భయపడి ఎదుటికి రాలేకపోవుచున్నారని నేను నిశ్చయము చెప్పగలను. "అయ్యా! బాగుగానేయున్నవిగాని మిషనెరీలకు ఇన్టములేదు గనుక ఊరుకొనవలనివచ్చింది అని ఒక పాదిరిగారన్నమాట, అనేకమంది విషయములోకూడ నిజమే అయియున్నది" గనుక వాక్య సేవకులారా! మీరు ఆసక్తిపరులకు అడ్డముగా ఉండకండి.


“అయ్యో! వేషధారులైన శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మనుష్యుల ఎదుట పరలోకరాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు. ప్రవేశించువారిని ప్రవేశింపనియ్యరు” అని మత్తయి 23:13-14లో ప్రభువు మతబోధకులను గురించి చెప్పిన వాక్యములు మీకు ఏమాత్రమును సంబంధించకుండ ఉండేటట్లు జాగ్రత్త పడుడని నా మనవియైయున్నది. మరియు ఆయనను అరాధించువారు ఆత్మతోను, సత్యముతోను, ఆరాధింపవలసియున్నదిగదా! గనుక మన ఆరాధనలు వట్టి ఆచారములతోగాని, నామకార్థమైన చర్యలతోగాని ఉండకూడదు. ఇవి లేకుండ చూచుకొనవలయును. ఒకరిలోనున్న లోపములు ఎత్తి చూపించి, ఖండించి, గద్దించకుండ, పైపై బోధలు చేస్తున్నారని మమ్ములను కొందరు నిందించు చున్నారు. అట్టివారు మా కూటములకు వచ్చి బోధలు వింటే నిజము తెలిసికొందురు. మేము సంఘస్థులము, వారు మిషనెరీలును, పాష్టరులును, సంఘనాయకులై యున్నారు. వారిలోని లోపములు మాకు కనబడినప్పుడు మేమెత్తి చూపిస్తే, వారికి ఎంతో కోపము వచ్చునుగదా! వేము మా వ్రాతలో అట్టి లోపములను చూపిస్తుయున్నాము. అందుచేతవారు ఆనందింపవలసినది గాని పగబట్టుచున్నారు. ఒక దృష్టాంతరమేమిటంటే "అవునవును, పరిశుద్ధాత్మను గురించి మాత్రమెకాక, పరిశుద్ధాత్మయొక్క బాప్తిస్మమును గురించికూడ బోధించడము బైబిలు ప్రకారము మన విధియైయున్నదని" తెలిసికొని, బోధకులందరును సంతోషముతో బోధిస్తే ఎంత బాగుండును.


ఫలానివారు క్రొత్త బోధ ప్రవేశపెట్టి అందరిని చెడగొట్టు చున్నారని కొందరు ఆలోచనలేకుండ మాట్లాడుచున్నారు. ఇదేమాత్రమును న్యాయము కానేకాదు. ఒక మంచి బోధ ప్రవేశపెట్టుట హానియైతే, మేలుచేసే అట్టి మంచి బోధ దాచియుంచి, బైలుపరచువారిని ఆటంకపరచుట అంతకంటె హానియై యున్నది. ఇది చదువరు లెల్లరును గుర్తించవలెనని నా కోరికయైయున్నది.


మిషను ఉద్యోగస్తులారా! ఈ క్రొత్త బోధనుచూచి బెదిరిపోవద్దు, చెదరిపోవద్దు, అదరిపోవద్దు, సందేహింపవద్దు. బైబిలులో దీనినిగురించి మర్మముగాలేదుగాని, స్పష్టముగానే యున్నది. గనుక ఈ బోధ ఇదివరకెవరూ బోధించని బోధ అని అశ్రద్ధచేయవద్దు. దేవుని వాక్య ప్రకారము ప్రవర్తింపనియెడల మేలు దాటిపోవునని మరచిపోవద్దు. దేవుని వాక్యమునకే భయపడుడి గాని మనుష్యులయొక్క మాటలకు, బెదిరింపులకు భయపడకుడి. మరియు దేవునికి భయపడుడి గాని మనుష్యులకు భయపడవద్దు. "ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడిగాని ఆత్మను, దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి" (మత్తయి. 10:28; లూకా. 12:4-5). ఇది సత్యమని మీ మనస్సులో తోచినప్పుడు, బహిరంగముగ అవలంభించుటకు భయపడకుడి. ఏమైననుసరే అవలంభించండి. దైవాత్మ మీకు సహాయము చేయునుగాక!


మీ మట్టుకు మీరుకూడ ఈ సత్యమునుగూర్చి పరీక్షిస్తూ, ప్రభువునడిగి ఉత్తమమైనదని మీకుతోస్తే వెంటనే అవలంభించండి. మనము చేదస్తములతోను, క్రొత్త సంగతులు నేర్చుకొనుటకు ఇష్టపడని అజ్ఞానముతోను పోరాడవలెను. సత్యముకొరకు పోరాడుట నేర్చుకొనుడి. Fight for the Right అని ఇంగ్లీషువారు అనుచున్నారు గదా! అభయాని అనగా అర్ధమేమియో ఆలోచించండి.


ప్రియ క్రైస్తవలారా! సంఘస్థులారా! సర్వ స్వతంత్రులారా! మీరు ధైర్యము తెచ్చుకొనండి. మీ సర్వస్వతంత్రతను వాడుకొనండి. ఈ ఏడు సిద్ధాంతముల సంగతి మాకు బైబిలులో ఉన్నదున్నట్లుగా బాగా వివరింపవలసినదని, మిషను ఉద్యోగస్తులను అడిగి, వారు చెప్పే వరకు గట్టి పట్టుపట్టండి. ఇదివరకు ఈ సిద్ధాంతములను గురించి మేము నెర్చుకొనలేదని వారంటే, సరే ఇప్పుడైన నేర్చుకొని మాకు చెప్పండి అని సలహా ఇవ్వండి. మాకు చెప్పడము మీ ఉద్యోగ విధులలో ఒక విధి గనుక ఇదివరకు మీరు చెప్పుచున్న సంగతులు ప్రస్తుతము కనిపెట్టి, ఈ సంగతులు కొన్నాళ్లు బోధించండని వేడుకొనండి. ఏమి బోధించవలెనని మీరు ఏర్పాటు చేసికొన్నారో అది బోధించుట మాత్రమే మీ విధికాదుగాని; సంఘస్థులు బోధించవలసినదని ఏది కోరుదురో అదికూడ బోధించడము మీ విధియైయున్నదని తెలిసికొనుడని వారికి జ్ఞాపకము చేయండి. ఎప్పటికప్పటికే క్రొత్త క్రొత్త సంగతులు నేర్చుకొను ఆసక్తి మీలో వృద్ధిపొందునుగాక!


మా బోధలు విని ఆనందించేవారు కొందరు; అవలంభించే వారు కొందరు; అవలంభించి వెనుకకుపోయేవారు కొందరు; అవలంభించి అవలంభించనివారు కొందరు, దూషించే వారు కొందరు, అబద్ధబోధ అనేవారు కొందరు, ఏమి తోచడము లేదనేవారు కొందరు : ఈ మా బోధలు వాక్యానుసారముగా ఉన్నవి గనుక అవలంభించేవారు లేకపోయినను, మెచ్చుకొనేవారు లేకపోయినను; మేము నిరాశపడముగాని అట్టి వారిని గురించి మేము విచారపడుచున్నాము.


దేవుని సమ్మతిలేకుండమేమేమియు చేయదలంచు కొనలేదు, చేయడములేదు.


చదువరులందరకు శుభము కలుగునుగాక! మరనాత.


2 సెప్టెంబరు 1937
షారోను గృహము
రాజమండ్రి
ఇట్లు మీ విధేయుడు
కె. విజయరత్నము
స్వతంత్ర సువార్త ప్రచారకుడు.