(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
సన్నిధి కూటము
దైవసన్నిధికూట వివరము: క్రైస్తవులలో కొందరు ప్రతిదినము కొంతసేపు దైవధ్యానములో ఉండవలసిన మీటింగు పెట్టుకొనుచున్నారు. ఆ మీటింగులోనికి
- 1) ఒకరోజు క్రీస్తుప్రభువు వచ్చి కనబడును. చెప్పవలసిన సంగతులు చెప్పును. అడుగు ప్రశ్నలకు జవాబు వినిపించును.
- 2) ఇంకొకనాడు ఆయన దేవదూతలలో ఒకరిని పంపును. ఆ దూత కనబడును. వార్త చెప్పును. అడిగిన ప్రశ్నలకు జవాబు వినిపించును.
- 3) మరియొకనాడు ఆయన పరలోక భక్తులలో ఒకరిని పంపును. ఆ ఒకరు కనబడుదురు, చెప్పవలసిన సంగతులు చెప్పుదురు. అడిగిన ప్రశ్నలకు జవాబు వినిపింతురు.
- 4) వేరొకనాడు ఆయన భూలోక విశ్వాసులలో ఒకరి ఆత్మను పంపును. ఆ యాత్మ నరరూపములో కనబడును. సంగతులు చెప్పును. అడిగిన ప్రశ్నలకు జవాబు వినిపించును.
- 5) ఇంకను మరియొకనాడు ఆయన పాతాళ లోకములోని మృతులలో ఒకరిని పంపును. ఆ మృతులు మోక్షమునకు వెళ్ళనివారు. ఆ ఒకరు కనబడుదురు, సంగతులు చెప్పుదురు. అడిగిన ప్రశ్నలకు జవాబు వినిపింతురు.
- 6) తుదకు ఒక భూతమును రానిచ్చును. ఆ భూతము కనబడును, సంగతులు చెప్పును. అడిగిన ప్రశ్నలకు జవాబు వినిపించి వెళ్ళిపోయిన తరువాత క్రీస్తుప్రభువు వచ్చి, మీరు భూతము పలికిన మాటలు నమ్మకుడి, భయపడకుడి అని చెప్పి ఆదరించును.
షరా:- బైబిలులోని వాక్యముల అర్ధములు క్రీస్తు ప్రభువు చెప్పును. ఇది దైవపూజయై యున్నది. శ్రక్తిపూజకాదు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున కూడుకొందురో, అక్కడ నేనుందునని ప్రభువు చెప్పినమాట మీకు ఆధారము. బైబిలులోని విశ్వాసులకు ఆయన కనబడిన విధముగానే నేడును ప్రభువు విశ్వాసులకు కనబడును. ఒకానొకప్పుడు ఆయన అవిశ్వాసులకుకూడ కనబడి మాటలాడును.
క్రీస్తుయొక్క రెండవరాకడ మిక్కిలి సమీపముగా నున్నది. గనుక ఆయన మేఘాసీనుడై వచ్చి, భూమిమీదనున్న భక్తులను ప్రాణముతో తీసికొని వెళ్ళనైయున్న సమయము మిగుల సమీపించినది గనుక సిద్ధపడండి. అందుకే ఈ కూటములు, ఈ పత్రికల ప్రచురణలు.
లోకములోనున్న ఏ మతస్తులైనా సరే, సన్నిధి కూటములు పెట్టుకొనవలెనని మా కోరిక. క్రీస్తు పేరు ఎత్తుట ఇష్టము లేనివారు - “దేవా! సృష్టికర్తా! మాకు కనబడి మాటలాడుమని ప్రార్థింపవచ్చును. ఏ మతమునైనను దూషింపరాదు. తెలియని సంగతులు దేవునిని అడిగి తెలునుకొనవలెను.