(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
జ్ఞానాత్మ యత్నము
ప్రియులారా! దేశీయులారా! సృష్టికర్తయైన దేవుని నామమును బట్టి మీకు శుభము కలుగునుగాక!
ప్రార్ధన క్రమము:-
- 1) మోకాళ్ళూని కన్నులు మూసికొని చెడ్డసంగతులు గాని, మంచి సంగతులుగాని తలంపక, క్రీస్తుప్రభువుని మాత్రమే తలంచుకొనండి.
- 2) తలంపులోను, మాటలలోను, క్రియలలోను గల పాపములు ఒప్పుకొనండి.
- ౩) “నాకు తెలిసిన పాపములు ఇకమీదట చేయకుండా ఉండుటకు ప్రయత్నింతును" అని ప్రమాణము చేయండి.
- 4) “నాకు కలిగియున్న శరీరమును, ప్రాణమును, ఆత్మను, అన్న వస్త్రాదులను, ధనమును, ఆస్థిని, ఇంటిని నీకు స్వాధీనము చేయుచున్నాను” అని చెప్పండి.
- 5) క్రీస్తు తొలగించిన కష్టములను తలంచుకొని ఆయనను స్తుతించండి.
- 6) క్రీస్తు చేసిన మేళ్ళు తలంచుకొని ఆయనను స్తుతించండి.
- 7) మీ కోరికలన్నియు చెప్పుకొని అడుగవలసినవన్నియు అడుగండి.
- 8) ఇప్పుడు ఆయన జవాబు కొరకు కనిపెట్టండి.
కనిపెట్టు క్రమము:- దేవా! నాకు కనబడుము, నాతో మాట్లాడుము; అందరికి కనబడుము, అందరితోను మాటలాడుము; అందరికిని నీ విషయము తెలియపర్చుము; నా ప్రశ్నలకు జవాబు చెప్పుము అని మరియొకమారు ప్రార్థించండి. అప్పుడు ఏమి జరుగునో వినండి.
- 1) క్రీస్తుప్రభువు మహిమ శరీరముతో మీకు కనబడును, మీతో మాటలాడును. మీ ప్రశ్నలకు జవాబులు చెప్పును. అవి మీరు వ్రాసికొనండి.
- 2) మరియొకసారి ఆయన దేవదూతలను పంపును. వారు మీతో మాటలాడుదురు. మీ ప్రశ్నలకు జవాబులు చెప్పుదురు. అవికూడ మీరు వ్రాసికొనండి.
- 3) ఇంకొకసారి ఆయన పరలోక పరిశుద్దులను పంపును. వారు మీతో మాటలాడుదురు. మీ ప్రశ్నలకు జవాబులు చెప్పుదురు. అవి మీరు వ్రాసికొనండి.
- 4) వేరొకమారు ఆయన భూలోక పరిశుద్ధుల ఆత్మలను పంపును. వారు మీతో మాటలాడుదురు. మీ ప్రశ్నలకు జవాబులు చెప్పుదురు. అవి మరు వ్రాసికొనండి.
- 5) తరువాత ఆయన అవిశ్వాసుల ఆత్మలనుకూడ పంపవచ్చును. వారు మీతో మాటలాడుదురు. మీ ప్రశ్నలకు జవాబులు చెప్పుదురు. అవి మీరు వ్రాసికొనండి.
- 6) అటుతరువాత ఆయన పాతాళములోని మారని మృతుల ఆత్మలను పంపవచ్చును. వారు మీతో మాటలాడుదురు. అవి వ్రాసికొనండి.
- 7) పిమ్మట ఆయన ఒక భూతమును పంపవచ్చును. ఆ భూతము మీతో మాటలాడును. మీ ప్రశ్నలకు జవాబులు చెప్పును. అవి వ్రాసికొనండి.
- 8) అటుపిమ్మట ప్రభువువచ్చి భూతముచెప్పిన మాటలు నమ్మకండి. ఆ మాటలకు బెదరకండి అని చెప్పి ఆదరించును.
షరా:- క్రీస్తుప్రభువు మీకు ఏదైనను చూపవచ్చును. మీరు కోరినప్పుడెల్లా సంస్కారపు భోజనము వడ్డించును. ఇవి బైబిలుమిషను బోధలు గనుక మీరు దేవునిని అడిగి సత్వానత్యములు తెలిసికొనండి. ఏ మతస్టులైనను, దీనిలోని పద్ధతులు వాడుకొనవచ్చును. క్రీస్తు అను మాటకు బదులుగా దేవునిపేరు ఎత్తవచ్చును.