(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
కనిపెట్టు గంట
(కనిపెట్టు గంట అనగా దేవుని సన్నిధిలో మోకాళ్ళూని కనిపెట్టపలసిన సమయము)
మనమొక అధికారియొద్దకు వెళ్లి, "ఐదు రూపాయలు దయచేయండి" అని అడిగినయెడల, ఆయన ఇచ్చుననిగాని, ఇయ్యడనిగాని తెలియక ముందు వచ్చివేయముగదా! ఆవిధముగానే మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనకు కావలసినవి దయచేయుమని ప్రార్ధించి, ఆయన మన మనసులో ఏదైన ఒక తలంపు కలిగించువరకు, మోకాళ్లమీదనే ఉండవలెను గాని ఆమేన్ అని వచ్చివేయుట మర్యాదకాదు. "సత్యమనగా ఏమిటని" పిలాతు యేసుక్రీస్తు ప్రభువును ఒక ప్రశ్న అడిగెను. ఆ ప్రశ్నకు ప్రభువు జవాబియ్యకముందే ఆయన ఇంటిలోనికి వెళ్ళిపోయెను. జడ్జిగారింకను కనిపెట్టుకొనియున్న యెడల, ప్రభువేమి జవాబిచ్చునో అది సువార్తికులు వ్రాసియుందురు. మనము తెలిసికొని యుందుము. అవతలివారు పలుకువరకు మనము విలుచుచునే యుందుముగదా! కనిపెట్టుకొనియే యుందుముగదా! పలికిన వెంటనే పిలుచుట మానివేయుదుము. పూర్వికులైన ప్రవక్తలు దేవుని సన్నిధిలో ఎంతోసేపు కనిపెట్టియుందురు! వారట్లు కనిపెట్టబట్టియే గొప్పగొప్ప ప్రవచన గ్రంథములు వ్రాయగలిగిరి, దేవుని అభిప్రాయములు తెలిసికొనగలిగిరి. తమ అభిప్రాయములలో పొరబాట్లుండునుగదా! కనిపెట్టిన పిమ్మట ప్రార్ధించినామను సంతోషమేగాక దేవుడు జవాబిచ్చినాడను సంతోషముకూడ మనకు కలుగును. ప్రార్ధనలో కనిపెట్టువాడుక సంఘములో సంఘనాయకులు ప్రవేశపెట్టలేదు. ఇది గొప్పలోపము. అక్కడక్కడ కొంతమంది విశ్వాసులకు మాత్రమే ఈ వాడుక గలదు. కాని సంఘమంతటికిలేదు. ఇప్పుడైనను సంఘమంతట ఈ వాడుకను ప్రవేశపెట్టినయెడల సంఘముయొక్క విశ్వాసమును, ఆనందమును ఎంతో వృద్ధియగును. కనిపెట్టు గంటలో అన్నియు పరిష్కారమగును. నీ కఠిన ప్రశ్నలన్నిటికి జవాబు దొరుకును. ఏదైన ఒక సంగతిమీద “దేవునికొరకు కనిపెట్టటలయునను” విషయము బైబిలులోగలదు. కనిపెట్టుటను గురించి బైబిలులోయున్న వాక్యములు చదివినయెడల ఇది తేలును. మన మనసులోనున్న సంగతి నెరవేరు వరకు కని పెట్టవలసిన కాలము ఒక గంటమాత్రమే అయ్యుండదుగదా! మరియు అది ఒక అరగంటకూడ అయ్యుండవచ్చును గదా!
“ఈ కీడు యెహోవాచేత కలుగుచున్నది. నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కని పెట్టియుండవలెనని” ఒక అవిశ్వాసి పలికినట్లు మనమును పలుకకుందుముగాక! (2రాజులు 6:33). ఇదివరకున్న మతాచారవిధులే మేము నెరవేర్చలేకపోవుచుండగా, మీరీ క్రొత్త ఆచారమొకటి తెచ్చిపెట్టినారు. ఇదెట్లు నెరవేర్చ వీలుండునని ఎదురు చెప్పువారికి మేమేమి చెప్పగలము? చేసి చూడండని మాత్రమే చెప్పగలముగాని వాగ్వాద ప్రశ్నలకెట్లు సమాధానము చెప్పగలము? ఎంత చెప్పినను వంకలు తెచ్చువారు ఉండకపోరు. అయినను అవి వినక, “కనిపెట్టువేళ నీ నిమిత్తమై కనిపెట్టుకొని యున్నట్లు భావించుకొని, కనిపెట్టుచోటికి వెళ్ళుము. ప్రభువు రాకడ మిగుల సమీపమని నమ్మువారు సిద్దపడుటకు కనిపెట్టు సమయమొక గొప్ప సాధనమని మా తాత్పర్యము. కనిపెట్టుగంట సర్వమతముల వారికిని, నాస్తికులకును, భక్తులకును, మానవజన్మమెత్తిన ప్రతివారికిని ఉపయోగమే.
- 1. బోధవినుట అనిష్టము: సద్భోద వినుటకు నీకిష్టము లేకపోవచ్చును. ఇది ఒక దుర్భుద్ధి. ఇది దుర్భుద్ధి అని తెలిసినను ప్రార్ధనలో కనిపెట్టుట మానవద్దు. దేవుడిచ్చిన రోజులోని 24గంటలలో, ఒక గంటయైనను కనిపెట్టుటయందు గడపలేవా? కనిపెట్టగా కనిపెట్టగా, బోధయందు ఇష్టము కలుగును. కనిపెట్టుటవలన నీ బ్రతుకు ఎంత శుభకరముగా వర్ధిల్లునో తెలిసికొనగలవు.
- 2. పాపములు ఒప్పుకొనుట అనిష్టము: నీది తప్పు అని తెలిసికొనినను, తప్పు ఒప్పుకొనుటకు ఇష్టపడవు. ఇదియొక దుర్భుద్ధి. ఇంత పాపము పెట్టుకొని, తగుదునని ఎట్లు కనిపెట్టు స్థలమునకు వెళ్ళగలనని అనుకొనవద్దు. వెళ్ళుము, మోకరించుము, కనిపెట్టుము, అప్పుడు పాపములు ఒప్పుకొనుటకు నీకిష్టము కలుగును.
- 3. పాపములు విసర్జించుట అనిష్టము: నీవు వదలజాలని పాపమేదోయొకటి నీలోనుండవచ్చును. ఎన్ని పాపములైనను విసర్జింపగలవు గాని అది విసర్జింపలేవు. దానిని విసర్జించుట నీకిష్టమై యుండదు. ఇది నీమీద ఏలుబడిచేయు పాపమైయుండును. అది నిన్ను చిక్కులుపెట్టు పాపము. అయినను ఉదయముననే లేచి, శరీరశుద్ధి గావించుకొని, పాపములేనివానివలె దైవసన్నిధిలోనికి పరుగెత్తుము, కనిపెట్టుము. ఆ నీ పాపముమీద అప్పుడు నీకు అసహ్యత కలుగును. నీకది బానిసయగును. నీవే దానిని ఏలుబడిచేయుదువు.
- 4. పాపమును గెలువలేని బలహీనత: పాపమున్నది. దానిని విసర్జించుట నీకు ఇష్టమే. గెలువవలెనని ఎన్నోమారులు ప్రయత్నించినావు. ఎంతోమందిచేత ప్రార్ధన చేయించుకొన్నావు. అయినను గెలువలేకపోవు చున్నావు. దిగులుపడకుము కనిపెట్టు సమయములో నీవు బాగుపడుదువు. "పాపమును గెలువలేని నీకెందుకు ఇక కనిపెట్టుటని" నిన్నెరిగినవారందురు. అయిననూ, బెదిరిపోవద్దు: సన్నిధిలోనికి వెళ్ళుము; కనిపెట్టుము, అపుడు కనిపెట్టుఫలమును పొందుదువు.
- 5. బైబిలు చదువుట అనిష్టము: ఒకానొక సమయమందు బైబిలు చదువుటకు నీకిష్టము కలుగదు. ఇదియొక దుర్భుద్ధి. ఇది దుర్భుద్ధియని నీవు నమ్మినను, కనిపెట్టుగంట మరచిపోవద్దు. వెళ్ళుము, ఒక గంటసేపు దేవుని సన్నిధిలో మోకాళ్ళమీదనే కనిపెట్టుము, తుదకు బైబిలు చదువుటయందు నీకిష్టము కలుగును.
- 6. ప్రార్ధనచేయుట నీకు అనిష్టము: ప్రార్ధన చేయుటకు ఒకానొకప్పుడు ఏమియు ఇష్టముండదు. బలవంతముగా చేయబోయినను మాటలే రావు. ఇదియొక బలహీనత. అయినను ఒకగంట కనిపెట్టుట మానవద్దు. “అయ్యో! ప్రార్ధనమీద ఇష్టము లేకపోవుచున్నది. ఎట్లు కనిపెట్టగలనని” అందువేమో! ఫరవాలేదు. వెళ్ళి కనిపెట్టుము. అప్పుడు నీకు ప్రార్ధయందు ఇష్టము కలుగును.
- 7. సువార్త ప్రకటించుట అనిష్టము: నీకు సువార్త తెలుసును. నీ హృదయము సరిగానే యున్నది. ఎందుచేతనోగాని సువార్త ప్రకటించుట నీకిష్టములేదు. “వారికి సువార్త ప్రకటించిన, విందురా” అని అందువు. ఇదియు దుర్భుద్ధియే. సువార్తవలన మేలుపొందిన నీవు ఇతరులు మేలు పొందుటకు ఇష్టపడనియెడల అది దుర్భుద్ధికాక మరేమిబుద్ధి? అయినను నీగదిలోనికి వెళ్ళుము. కనిపెట్టుటయను గొప్ప కార్యమును చేయుము. అప్పుడు సువార్త బోధించుటకు నీకిష్టమగును.
- 8. విశ్వాసములేని స్థితి: ఒకానొకప్పుడు దైవ విషయములయందు ఏమియు విశ్వాసము గలుగదు. ఏ మతమును నిజముకాదని తోచును: “దేవుడున్నట్టు, మోక్షమున్నట్టు, నరకమున్నట్టు ఎవరు చూచినారు? క్రీస్తు వచ్చినట్టు చూచినవారేరి?" అనునిట్టి అవిశ్వాస ప్రశ్నలు మనసులో పుట్టును. ఇట్టి ప్రశ్నలతోనే కనిపెట్టు స్థలమునకు వెళ్ళుము. సందేహింపకుము. కనిపెట్టుము. కనిపెట్టగా నీ ప్రశ్నలన్నియు అంతరించిపోవును. స్థిర విశ్వాసము కలుగును.
- 9. నిరాశ: నీ కథలు తెలిసిన ఒక బోధకుడు నీకు దారిలో కనబడి, "ఓ దురంతకుడా! దేవుడు నీకు రక్షణ అనుగ్రహించనప్పుడు నీవెక్కడికి వెళ్ళుదువు? నీవు రక్షణను నిర్లక్ష్యపెట్టుచున్నావు. నీకు మారుమనస్సు కలుగుట దుర్లభము" అని పలుకును. అప్పుడు నీ ముఖములో కళ తగ్గును. నీ గుండె కొట్టుకొనును. రాత్రులు నీ స్వప్నములలో దయ్యములు కనబడును. చావుపెట్టె కనబడును; నరకము, నరకము అను శబ్ధము వినబడును. వెర్రికేకలు వేయుదువు; అంతలో మెళుకువ వచ్చును. ఏమి చేయుదువు? నిరాశపడుదువు గదా? ఆ బోధకుని మాటలను, దుష్టస్వవ్నములను మందలింపు క్రింద లెక్కకట్టుకొనుము: వెళ్ళుము, కనిపెట్టు గదిలో ఉండుము విశ్వాసము వచ్చువరకు. అప్పుడు నీ మనస్సులో ధైర్యము, సంతోషము కలుగును.
- 10. విసుగుదల: “నేను ఒకసంగతిని గూర్చి ఎన్నో రోజులనుండి ప్రార్ధించుచున్నాను, విశ్వాసముతో అడుగుచున్నాను. నాకు తెలిసినంత మట్టుకు నాలో ఏ అడ్డములేదు. అయినను దేవుడు నా ప్రార్ధన ఆలకించుట లేదు; ఎందుకో తెలియదు. దేవుని వాగ్ధానములు చూడగా నోరూరుచున్నదని” ఈ రీతిగా దేవునిమీద విసుగుకొనుచున్నావుగదా! ఇది ఒక నీరస బుద్ధి. కనిపెట్టుచోటునకు వెళ్ళుము. నీ మనసుకు శాంతి కలుగును. దేవుని యెడల నీకు మంచి అభిప్రాయములు పుట్టును.
- 11. అసూయ: "నేనెన్నోమారులు ప్రార్థించగా దేవుడు వినలేదు గాని, వీరు ప్రార్థింపగానే విన్నాడు" అని ఇతరులమీద అసూయపడుదువు. దేవుడు పక్షపాతియని తలంతువు. ఇవియు దుర్భుద్దులే. అయినను సన్నిధిలోనికి వెళ్ళుటకు జంకకుము; కనిపెట్టుము. ఈ దుర్గుణములు నివారణయగును.
- 12. వీలులేనిస్థితి: కనిపెట్టవలెననిన అన్నియు అడ్డములే. మనసు కుదరదు, స్థలము దొరకదు, స్థలము దొరికినను అందరి మాటలు వినబడుచుండును. స్థలము దొరికిన సమయము దొరకదు; సమయము దొరికిన స్థలము దొరకదు. స్థలము, సమయము దొరికిన, నిద్ర నిద్ర అని అనుకొందువేమో: విస్తారముగా అలోచింపకుము. చొరవచేసికొని ఎక్కడో ఒకచోట ఇరుకుకొనుము. కనిపెట్టుము. కనిపెట్టుటయందు నీకిష్టమున్నదని నీ తండ్రికి తెలుసుగదా! నీ ఆశకు విలువగలదు. వీలులేకపోయినను బలవంతముగా వీలు కలుగజేసికొనుము. పనులకు వీలు కలుగజేసికొనుచున్నావు గదా! కనిపెట్టుటకు వీలు కలిగించుకొనలేవా? ఇట్లు నీవు కనిపెట్టు అలవాటు కలిగియున్నయెడల క్రమేణ చెడుగంతయు ఒత్తిగిలిపోవును. మంచి నీ జీవితములో ప్రవేశించును; దైవాత్మ నీకు సహాయము చేయును. నా సలహా ప్రకారము నీవు చేసినందుకు విచారపడవు. దేవుని సన్నిధిలో గడిపిన సమయము వృధాగా గడిపిన సమయమని భావించుకొనవద్దు. ఒకసారి కనిపెట్టగా నెమ్మది దొరకకపోయినయెడల, మరియొకసారి కనిపెట్టుము అశ్రద్ధ చేయవద్దు.
- 13. కృపను లోకువకట్టు స్థితి: కనిపెట్టు గదియొకటి ఉన్నది గదా! గనుక ఎన్ని పాపములైనను చేసికొనవచ్చును. (అలాగు పాపములు) చేసి కనిపెట్టు గదిలోనికి వెళ్ళినయెడల, పాపములన్నియు, పరిహారమగునని అనుకొందువేమో! ఇట్లనుకొనుట దేవుని కృపను లోకువకట్టుటయైయున్నది. ఇది అపాయకరమైన స్థితి. నేను నీకు సదుపాయము చూపించుచుండగా నీవట్లనుకొనకూడదు. కనిపెట్టు స్థలమునకు వెళ్ళుము; కనిపెట్టుము; మేలు కలుగకమానదు.
- 14. కనిపెట్టు సమయమున కలుగు భాగ్యము: కనిపెట్టు సమయములో ఒకరికి పాపములొప్పుకొను వాలుకలిగినది. ఒకరికి ప్రార్ధన ధోరణి కలిగినది. ఒకరికి స్తుతిచేయు ప్రవాహము వచ్చినది. ఒకరికి దర్శనవరము లభించినది. ఈ ప్రకారముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగ్యము కలిగినది. ఎన్ని భాగ్యములో వివరింపలేము. మేము వ్రాసినది తక్కువైనను ఎక్కువ గ్రహించుకొనవలెను. ఈ పత్రికలో మేము వ్రాసిన బలహీనతలు గలవారు మాత్రమేకాదు, లేనివారును ఈ కనిపెట్టు సమయమును ఉపయోగించుకొనవలెను. కీర్తనలు పాడుకొనుట, ప్రార్ధనలు చేసికొనుట, బైబిలు చదువుకొనుట అనుపనులు, తత్పూర్వమే అనగా కనిపెట్టుకొనుటకు ముందుగానే ముగించుకొనుట మంచిది. తరువాతకూడ చేసికొనవచ్చును. ఎవరి వీలుకొలది వారు చేసికొనవచ్చును. కనిపెట్టు సమయములో దైవసహవాసానుభవము కలుగును. ఏలీయా తన ప్రార్ధన నెరవేరు వరకును, కర్మెలు కొండమీద కనిపెట్టుకొని ప్రార్ధన సాగించుచూనే యుండెను. మొదటిమారు ప్రార్ధనకు నెరవేర్పు కనబడనప్పుడు రెండవమారు ప్రార్ధనచేసెను. ఈ ప్రకారముగా ఏడుమారులు ప్రార్ధన చేయుచునె నెరవేర్పుకొరకు కనిపెట్టెను. తుదకు నెరవేర్పు కలిగెను (1రాజులు 18అధ్యా॥).
మూడు సంగతులు:
- 1) కనిపెట్టుగదిలో మనోనిదానము కలిగియుండుము; అనగా చెడు తలంపులు రానీయకుము, మంచి సంగతులుకూడ జ్ఞాపకము చేసికొనకుము. తండ్రి, కుమార, పరిశద్ధాత్మలు నీ ఎదుట ఉన్నారను ఒక తలంవు మాత్రమే చివరవరకును ఉండవలెను. ఇదే నీవక్కడ చేయవలసిన గొప్పపని. యత్నించుము.
- 2. ఎన్నో రోజులనుండి కనిపెట్టు గంటను వాడుకొనుచున్నాను. నాకేమియు అనుభవము కలుగలేదని అనుచున్నావు. అట్లు కని పెట్టుటయే నీకు కలిగిన మొదటి భాగ్యముకదా!
- 3. కనిపెట్టుగంట అభ్యాసము గలిగిన వారితో మాటలాడినయెడల కొన్ని సంగతులు నేర్చుకొనగలవు.