(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
స్వస్థిశాల
- (1) స్థలము:- గుంటూరునకు 8 కి.మీ. దూరమున, మంగళగిరి రోడ్డున క్రీ॥శే॥ జె. రాజారావుగారి కాకానితోట.
- (2) కాలము:- ప్రతి సోమవారము ఉ॥ 9గం॥ల నుండి సాయంకాలము 5గం॥ల వరకు.
- (3) వారము:- ప్రతి సోమవారము
ఇక్కడికి నలుగురు బైబిలు మిషను పాదుర్లు వచ్చి; అనారోగ్యవంతులకు క్రీస్తు బోధలు, ప్రార్ధనలు, కీర్తనలు నేర్చింతురు. క్రీస్తు ప్రభావమువలన పాపులకు, రోగులకు, బీదలకు, బిడ్డలు లేనివారికి, భూతపీడితులకు, అప్పులు పాలైనవారికి, కోర్టులో వ్యాజ్యములు గలవారికి, తప్పిపోయిన వస్తువులు గలవారికి, పెళ్ళి సమకూడనివారికి, కుటుంబ కలహములు గలవారికి, ఉద్యోగములు లేనివారికి, విషపు పురుగులవల్ల బాధపడువారికి, పశ్వాదులకు మేలు కలుగుచున్నది. కొందరికి వెంటనే, మరికొందరికి ఇంటియొద్ద స్వస్థత కలుగుచున్నది. తమ కోరికలు నెరవేర్చుకొనగోరువారు; పాప కార్యములు ఇతర పూజలు మానివేసి క్రీస్తును మాత్రమే పూజింపవలెను.
బోధ వినిపించుట పాదుర్ల పని; నమ్ముట ప్రజలపని; బాగుచేయుట క్రీస్తు ప్రభువు పని. క్రీస్తు ఎంత దేవుడైనను మన నిమిత్తమై నరుడుగా జన్మించి, మోక్షమార్గము బోధించి, ఔషధములు లేకుండా తన ప్రభావము వలననే వ్యాధిగ్రస్తులను స్వస్థపరచి, ఆకలిగా నున్నవారికి ఆహారము కల్పించి, ఆపదలోనున్నవారిని విమోచించి, మాదిరికి మృతులలో కొందరిని బ్రతికించి, ఇట్లు అనేకమైన ఉవకారములు చేసెను. అయినను ఆయన దేవుడని గ్రహింపనివారు ఆయనను సిలువకు అంటగొట్టి క్రూరముగా చంపిరి. ఆయన వారిని నాశనము చేయలేదు. ఎందుకనిన ఆయన లోకమును రక్షించుటకు వచ్చెను. మూడవదినమందు బ్రతికివచ్చి, నలుబది దినములు మరికొన్ని ధర్మములు బోధించి, మోక్షలోకమునకు వెళ్ళెను. ఆయన వెళ్ళకముందు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: నేను మరలావచ్చి మిమ్మును తీసుకొని వెళ్ళుదును. అంతవరకు నా విషయములను లోకములోనున్న వారందరికి బోధించుడి, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును”.
ప్రియులారా! ఆయన మేఘాసీనుడై వచ్చి, భూమిమీద నున్న భక్తులను ఆకర్షించి మోక్షమునకు తీసుకొని వెళ్ళును. ఆ సమయము మిగుల సమీపించినది. కనుక సిద్ధపడండి. ఎన్నో పరోపకారములు చేసిన క్రీస్తుప్రభువును మీరు నమ్మి ప్రార్థించినయెడల, మీ కోరికలన్నియు నెరవేర్చును. ఈ సంగతులన్నియు ఉన్న బైబిలును చదువుకొనండి. మీకు శుభముకలుగును గాక! ఆమేన్.