English


క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

1. దైవలక్షణముల స్తుతి

దైవలక్షణముల జాబితా



ప్రారంభ ప్రార్థన

ఓ త్రియేక దేవుడవైన ప్రభువా! నీ దివ్యలక్షణములు మా జీవిత కాలముయొక్క ఉపయోగార్థమై వాడుచున్నావు. గనుక నీకు స్తోత్రములు.


నీ వెలుగు మాలో ప్రవేశపెట్టుచున్నావు, నీలోని జీవము మాలో ప్రవేశపెట్టుచున్నావు.


నీలోని ప్రేమ మా విషయమై చూపించుచున్నావు.


నీలోని శక్తి మా బలహీనత సమయములో చూపించుచున్నావు.


నీలోని న్యాయముద్వారా మమ్మును తప్పుదారిలో నుండి తప్పించుటకు ప్రయత్నించుచున్నావు.


నీలోని పరిశుద్ధతతో మమ్ములను పవిత్రపరచుచున్నావు.


నీలోని నిరాకారముతో మాలోని విశ్వాసమును బలపరచుచున్నావు.


నీలోని సర్వ సద్గుణముల నిమిత్తమై నీకు వందనములు. నీ సద్గుణములు మాలో ప్రవేశపెట్టుటకు నిత్యము ప్రయత్నించుచున్నావు. గనుక నీకు స్తోత్రములు.


నీ అనాదిలో అనంతమున్నది. నీ అనంతములో ప్రేమ యున్నది. నీ ప్రేమలో న్యాయమున్నది. నీ న్యాయములో పరిశుద్ధతయున్నది. నీ పరిశుద్ధతలో శక్తియున్నది. నీ శక్తిలో నిరాకారమున్నది. నీ నిరాకారములో ప్రత్యక్షతయున్నది. నీలోని ప్రతీ ఒక్క లక్షణములో అన్ని లక్షణములు ఇమిడి ఉన్నవి.


ఒక్క లక్షణము మాలో పెట్టియున్నావు అని తలంచినప్పుడు తక్కినవి కూడ పెట్టియున్నావని మేము గ్రహించుకొనుచున్నాము.


నీకు ఆది లేదు అని మేము అనుకొన్నప్పుడు నీలోని అన్ని గుణములకు కూడ ఆది లేదు అని మేము గ్రహించుకొనుచున్నాము. నీకు అంతము లేదు అని మేము అనుకొన్నప్పుడు నీలోని అన్ని గుణములకు కూడ అంతము లేదని మేము గ్రహించుకొనుచున్నాము.


తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను మేము ఎట్లు విడదీయలేమో అట్లే కలిసియున్న నీ గుణములను వేరుచేయలేము. ఒక్క లక్షణమును గురించి, మా మనస్సు లోనికి తలంపు వచ్చినయెడల లక్షణములన్నియు దొంతిగా జ్ఞాపకమునకు వచ్చునని తెలుసుకొనుచున్నాము.


నీకు ఎన్ని దివ్యలక్షణములున్నవో అవన్నియు సమానముగా నున్నవి. అవన్నియు మాలో శాశ్వతముగా నుండునట్లు ముద్రవేయగోరుచున్న నీకు అనేక స్తోత్రములు.


అగ్ని జ్వాలలో ఒకటి వేడి, రండవది వెలుగు, మూడవది ఆకారము - ఇవి ఎట్లు కలిసియున్నవో అట్లే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను దేవుడవైన నీవును ఉన్నావు. గనుక నీకు అనేక స్తోత్రములు. జ్వాలలో నున్న మూడింటిలో ఒకటి తీసివేసిన తక్కిన రెండును ఆగిపోవును, తక్కిన రెంటిని కూడా మనము తీసివేసినట్లే.


నీ దివ్య లక్షణములలో ఒకటి మాకు అక్కర లేదన్నయెడల తక్కిన లక్షణములన్నియు అక్కర లేదన్నట్లే. నీవు న్యాయమైన రీతిగా ఒకరిని శిక్షించినప్పుడు మా కిష్టముండదు. అలాగైనయెడల నీవు మమ్మును ప్రేమించునప్పుడు మాకు ఎందుకు ఇష్టముండవలెను? మా విమర్శ సరికాదు. నీ విమర్శ పవిత్రమైనది. కాబట్టి నీకు వందనములు.


మాలో ఎవరు నీ గుణ లక్షణములన్నియు సంపాదించుకొంటారో వారు నీయొద్దకు రాక మరి ఎవరియొద్దకు వెళ్ళుదురు!


ఓ దేవా! నీలోనున్న గుణములన్నియు మాలో స్థిరముగా నుండునట్లు కృప దయచేయుము.

దయగల ప్రభువా! నీ గుణములన్నియు మేము మా ఇష్టము వచ్చినంత ధారాళముగా వాడుకొనునట్లు నీవు మాకు స్వతంత్ర లక్షణము కూడ అనుగ్రహించినావు. అన్నియు అనుగ్రహించి స్వతంత్రత ఒక్కటి అనుగ్రహింపనియడల, అవన్నియు యిచ్చిన ప్రయోజనములేదు. కాబట్టి అదికూడ యిచ్చినందుకు నీకనేక వందనములు.


నీ లక్షణములన్నియు మాకనుగ్రహించినప్పుడు, మేము వాటిని అందుకొన్నప్పుడు అవన్నియు మా హృదయములలో దొంతర్లుగా అమర్చి పెట్టిన వెలుగువలె ఉండును. స్తోత్రములు.


దీపములను దగ్గర దగ్గరగా పెట్టిన వాటి కాంతి ఒకదానికొకటి అంటుకొనును. ఒకదాని కాంతి మరియెకదానిలో అనుసరించియే ఉండును, గాని వేరుగా ఉండదు. ఆలాగే నీ లక్షణములు ఒకదానికొకటి హత్తుకొని యుండును. అట్లే అవి మాలో కూడా హత్తుకొని యుండునట్లు భద్రపరచుము.

దీపములను వెలిగించువారు, వాటిని ఆరిపోకుండా ఎట్లు కాపాడుదురో, అట్లే మాలో నీవు నీ దీపమును పెట్టి వెలిగించినావు గనుక ఆరిపోకుండునట్లు కాపాడుము. "నేను లోకమునకు వెలుగై యున్నాను" అని నీవు చెప్పినావు గదా! లోకములో అనగా ప్రతి మనిషిలో నీ వెలుగు పెట్టియున్నావని మేము గ్రహించుచు నీకు వందనములు చేయుచున్నాము.


మరియు మనుష్యులను చూచి "మీరు లోకమునకు వెలుగైయున్నారు" అని నీవు చెప్పినావు గదా! కాబట్టి మాలో నీ వెలుగు పెట్టియున్నావని మేము గ్రహించుచున్నాము. నీకు వందనములు. తండ్రీ! నీలో వెలుగు ఆ కాలమందున్న వారు చూచినారు. ఆలాగే మాలో నీవు పెట్టిన వెలుగు ఇతరులు చూచునట్లు చేయుము. వెలుగు అనగా నీ అన్ని గుణముల యొక్క సముదాయము అని మేము గ్రహించుచున్నాము.


ప్రభువా! నీ సృష్టివలన, నీ ప్రవర్తన వలన మాలో వెలుగు పెట్టియున్నావు. మా వెలుగును ప్రకాశింపనియ్యుడి అని చెప్పుచున్నావు. లెమ్ము, తేజరిల్లుము అని యెషయా. 60:1 వాక్యములోనున్నది. గనుక మాలో నున్న దైవలక్షణములు యితరులకు కనబడునట్లు వారియెదుట మా వెలుగు ప్రకాశింపనీయగల శక్తి దయచేయుము. స్విచ్చ్ (Switch) నొక్కనప్పుడు దానిలో వెలుగున్నది. గాని బయటకు కనబడదు. నొక్కినప్పుడు ఆ వెలుగు బయటకు కనబడును. అలాగే దేవా! నీవు మాలో పెట్టిన నీ గుణములను మా జ్ఞానము చేత నొక్కిన యెడల నీ లక్షణములు బయటకు కనబడును. నీకు వందనములు.


దేవా! నీవు మాలో పెట్టిన నీ దివ్యలక్షణములలో యేదో యొక లక్షణము యొక్క కాంతి తగ్గిపోవునప్పుడు పూర్తిగా ఆరిపోనీయక మరల వెలిగించుచుండుము.


వివరము:- నాలుగు దీపములలో ఒకటి తగ్గినప్పుడు, యజమానుడు మరల వెలిగించును. ఇది వరకు నేను చెప్పినట్లు ఒక దీపము ఆరిపోయిన యెడల తక్కినవన్నియు ఆరిపోవును. ఈ పని జీవితాంతమందు జరుగును. కృపాకాలమందు జరుగదు. ఒక దొంగలో మంచి గుణము కూడ ఉండుట మనము చూచుచున్నాము గదా!


పరీక్ష:- దేవుడు మీలో ఉంచిన తనయొక్క మంచి గుణములలో ఏ మంచి గుణము మీలో ఈ వేళ వరకు నిలిచి వున్నదో పరీక్షించుకొనండి. ప్రేమ, న్యాయము, దీర్ఘశాంతము, ఏదివున్నదో పరీక్షించుకొనండి. అనాది మాత్రము ఉండదు. అనంతము ఉండవచ్చును. మీతో మాట్లాడి మసలే జీవముకాక, ఆత్మీయ జీవమున్నదో లేదో మీకు మీరే పరీక్ష చేసికొనండి. మీలో దేవుడు పెట్టిన ప్రేమ వున్నదా, తగ్గినదా? సన్నిధి కూటములవల్ల ఈ లక్షణములు తగ్గకూడదు. వృద్దికావలెను. అలా కాకపోతే సన్నిధి కూటములు ఎత్తివేయవలెను.


ఈ క్రింది దైవలక్షణములను బట్టి మిమ్ములను మీరే పరిశీలించుకొనండి.