English


క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

3. దైవలక్షణముల స్తుతి

( ప్రార్ధన మెట్లులోని స్తుతులు )



మనలో దైవలక్షణములును, దుర్గుణములును మిళితమైయున్నవి. గనుక దైవలక్షణ ధ్యానము వలన దుర్గుణ పరిహారము గావించుకొనవలెను. దైవప్రార్ధన యీ పనికి మిగుల సహాయకారి.


1. దైవ వ్యక్తి:- దేవుడు దేవుడై యుండు లక్షణము. దేవుడు అనగా దివ్యమైనవాడు గనుక అన్నిటికన్న మొదటివాడు. గొప్పవాడు మంచివాడు, దేవుడు నిరాకారుడైనను ఒక వ్యక్తియైయున్నాడు.


విశ్వాసము, స్తుతి :- దేవా! నీవు దేవుడవు గనుక మా ఊహకు అందునట్టి అన్నిటికంటెను గొప్పవాడవు. గనుక నీకనేక నమస్కారములు. నీవు ఉన్నావను తలంపు నీవే కలిగించినావు గనుక స్తోత్రములు.


2. జీవము :- దేవుడు జీవము గనుక ఏ పనియు చేయకుండా ఉండలేడు. నరుడు పాపములో పడిపోయిన యెడల అతనిని రక్షింపనైన రక్షించునుగాని మొదలే అతనిని సృజింపకుండ ఉండలేడు. జీవము అనునది తక్కిన లక్షణములలో గూడ ఉన్నది. అట్లే అన్ని లక్షణములుకూడ మిగిలిన అన్ని లక్షణములలో ఇమిడియున్నవి. ఒక దానికొకటి సంబంధించియున్నవి. ఒకపని చేయవలసి వచ్చినపుడు అన్ని లక్షణములు ఒక్కలక్షణముగ పనిచేయును.


విశ్వాసము, స్తుతి :- దేవా! నీవు జీవమై నాలో అనుదినము జీవము కలిగించువాడవై యున్నావు గనుక నీకు స్తోత్రములు. నీవు నాలో ధారపోసిన జీవమునకు శక్తి తగ్గినపుడు నా జీవమును బలపరచు వాడవైయున్నావు. గనుక నీకు స్తోత్రములు. నరులకు జీవమును బలపరచువాడవైయున్నావు. గనుక నీకు స్తోత్రములు.

నరులకు జీవము పూర్తిగా పోయి మరణము కలుగునుగాని కొన్ని యేండ్లకు మరల నీవు బ్రతికింతువు, జీవము కల్గింతువు గనుక నీ కనేక స్తోత్రములు.

శరీర జీవమునకు మాత్రమేగాక ఆత్మజీవమునకు గూడ నీవే ఆధారమై యున్నావు. నేను ఆత్మజీవన విషయములో తగ్గినప్పుడు నాలో మరల నూతన జీవము ధారపోయుదువు. గనుక నీకు స్తోత్రములు.

నాకు పరలోకములో నిత్యజీవము కలిగించుటకు నాలో దానిని ఇక్కడే ప్రారంభించినావు గనుక నీకనేక స్తోత్రములు. నీవు అనంత కాలము పొడవున జీవించుచునే యుండురీతిగా నేనును నీతో జీవించుచునే యుండగల కృప నాకు దయచేసినావు గనుక నీ కనేక స్తోత్రములు.


3. ప్రేమ :- దేవుడు ప్రేమయైయున్నాడు గనుక మనమెన్ని తప్పులు చేసినను క్షమించుచున్నాడు. మనము పుట్టకముందే మనకు కావలసినవన్నియు దయచేసియున్నాడు. అన్నియు మనకు యిచ్చివేయుటయే ఆయన ప్రేమయొక్క లక్షణమైయున్నది.


విశ్వాసము, స్తుతి :- దేవా! నీవు ప్రేమా స్వరూపివై యున్నందుకు నీ కనేక వందనములు.

ఓ తండ్రీ! నీవు ప్రేమవు గనుక నన్ను కలుగజేయకుండ ఉండలేక పోయినావు. నీ సన్నిధి భాగ్యము నేను నిత్యము అనుభవింపవలెనని కోరి నన్ను సృజించినావు. గనుక నీ కనేక వందనములు.

నామీద నీకున్న ప్రేమను బట్టి నేను జన్మింపక ముందే నాకు కావలసినవన్నియు కలుగచేసియుంచినావు. నీకు నాయందు అధికమైన ప్రేమ గనుక నా రక్షణార్థమై భూలోకమునకు నరావతారిగా ప్రత్యక్షమైనావు గనుక నీ కనేక వందనములు.

ఈ సందర్భమున "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను" అని చదువుకొని ఆనందించుచున్నాను. నీవు ప్రేమగలవాడవని బాగుగా గ్రహించునట్లు మనుష్యులలో మనుష్యులకు, జీవరాసులలో జీవరాసులకు ప్రేమ కలిగించినావు. నీ ప్రేమాది సద్గుణములు నీ వాక్యములో బయలుపరచి నీ ఆత్మచేత బోధపరచుచున్నావు గనుక నీ కనేక వందనములు.


4. న్యాయము :- దేవుడు న్యాయవంతుడు గనుక ప్రకృతి ధర్మమునకు భిన్నముగ ఏదియు చేయడు. రెండు ఐదులు పది. దీనిని తొమ్మిదిగా మార్చుమని అడిగిన యెడల మార్చడు. అట్లు మార్చిన సృష్టి క్రమమునకు విరుద్ధమగును. దేవుడు న్యాయస్థుడు గనుక బహుమానములను, శిక్షలను నరులకు నిర్ణయించుటలో ధర్మానుసారముగానే నిర్ణయించును.


విశ్వాసము, స్తుతి :- ఓ దేవా! నీవు న్యాయ స్వరూపివైయున్నావు. గనుక నీ కనేక స్తుతులు. నీవు న్యాయమైయున్నందున నేరస్థులను శిక్షించుచున్నావు. నీవు న్యాయస్థుడవై యున్నందున ఎంత పాపియైనను ప్రార్ధించినప్పుడు, ప్రార్థించినాడు గనుక రక్షించుట న్యాయమే అని చెప్పి రక్షించుచున్నావు. నీకనేక స్తుతులు.

నీవు న్యాయస్థుడవు గనుక ఎవరికి ఏస్థితి అనుగ్రహింపవలెనో ఆ స్ధితి అనుగ్రహించుచున్నావు. ఎవరికి ఏమి దయచేయవలనో అవి దయచేయుచున్నావు. గనుక నీకనేక స్తుతులు, నీవు అన్యాయము చేయజాలవు గనుక నీ కనేక స్తుతులు.

లోకములో చెడుగు జరుగుటయు, కష్టములు కలుగుటయు చూచి నీవు ఊరుకొనుచున్నావు. ఇది న్యాయమే. ఎందుకనిన నరులకు స్వతంత్రత ఇచ్చియున్నావు. అడ్డము వెళ్ళవు. మరియు పాప శిక్షార్దమై న్యాయపు తీర్పు దినమొకటి యేర్పరచినావు. నరులు నీ తట్టు తిరుగగలందులకు కావలసినంత గడువు దయచేయుచున్నావు. ఈ కారణముచేత నీవు ఊరుకొనుచున్నావు. కాబట్టి నీ కనేక స్తుతులు.

నరులకు జ్ఞానాభివృద్ధియు, మార్పును కలిగించు నిమిత్తమై కష్టకాలమున ఊరుకొనుచున్నావు. గనుక నీకనేక స్తుతులు.


5. శక్తి :- దేవుడు శక్తిమంతుడు కనుక సమస్త కార్యములు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియులేదు. దేవుడు పాపము చేయగలడా? అని ఒకరు ఒక క్రైస్తవ బోధకుని అడిగిరి. అందుకాయన చేయలేడని జవాబు చెప్పిరి. అప్పుడు ఆ ప్రశ్నకుడు అలాగైతే దేవుడు సర్వశక్తి గలవాడని అనకూడదు అని పల్కెను. అందుకా బోధకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. పాపము చేయుట పరిశుద్ధత నుండి పడిపోవుటయై యున్నది. పడిపోవుట కూడా ఒక శక్తియేనా? ఒకరు పై నుండి పడిపోవుట చూచినపుడు అతడు మహాశక్తి గలవాడు గనుకనే పడిపోయినాడు అందురా?


విశ్వాసము, స్తుతి :- ఓ దేవా! నీవు శక్తిమంతుడవైయున్నావు గనుక నిన్ను కొనియాడుచున్నాను.

ఓ తండ్రీ! నీవు శక్తిమంతుడవు గనుకనే ఇంత గొప్ప భూమండలమును, అంతగొప్ప ఆకాశమును కలుగజేసినావు. గనుక నిన్ను కొనియాడుచున్నాము.

ఓ తండ్రీ! నా విషయమై నీవు చేయలేని పని ఏదియు ఉండదు గనుక నిన్ను కొనియాడుచున్నాను.

నేను చెడిపోయి అధోలోకమునకు వెళ్ళినను నీవు నన్ను అక్కడినుండి రక్షింపగల శక్తిమంతుడవు గనుక నిన్ను కొనియాడుచున్నాను.

నేను చేయలేని పనులు నాతో చేయింపగల శక్తిమంతుడవైయున్నావు. గనుక నిన్ను కొనియాడుచున్నాను.

నాకు కావలసిన వన్నియు తెచ్చి పెట్టగల శక్తిమంతుడవు. నాకు అక్కర లేనివి, నన్ను బాధించునవి పరిహారము చేయగల శక్తిమంతుడవు.

నేను మోక్షమునకు ఎగిరి రాలేను. అయినను నన్నక్కడికి తీసికొని వెళ్ళగల శక్తిమంతుడవు. ఇవన్నియు తలంచుకొని నిన్ను నా మనస్సులో కొనియాడుచున్నాను.


6) జ్ఞానము :- దేవుడు జ్ఞానస్వరూపియై యున్నాడు. అందుచేత ఆయనకు అలోచన చెప్పగలవారెవరునులేరు. నవీనకాల మానవులు తమ జ్ఞానమును ఎంత ఎక్కువగా వృద్ధిచేసికొన్నారో నూతన కల్పనలను బట్టి తెలిసికొనగలము. మానవ జ్ఞానమే ఇంత గొప్పదై యుండగా మానవుల కట్టి జ్ఞానమిచ్చిన దేవుని జ్ఞానమెంత గొప్పదై యుండును!

దేవుని జ్ఞానము ఎంత గొప్పదో తెలిసికొనుటకై మన అందరి జ్ఞానమంతయు ఉపయోగించినను తెలిసికొనజాలము. వస్తువు వంటి వస్తువులేదు. మనిషివంటి మనిషిలేడు. జంతువు వంటి జంతువులేదు. చెట్టు వంటి చెట్టులేదు. ఇది అధిక పరీక్ష వలన తెలియగలదు.

"ఆహా! దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పును శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గము లెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి యున్నవి. యుగముల పర్యంతము ఆయనకు మహిమ కలుగునుగాక!" (రోమా. 11: 33-36) ఆమెన్.


విశ్వాసము, స్తుతి :- ఓ దేవా! నీవు జ్ఞానరూపివి, అందుచేత నాకెంతో ఆనందము. నా తెలివి తక్కువతనము వలన నేనేదైన యొకపని చేయుచున్నప్పుడు నీ జ్ఞానదీపముతో నాకొద్దిపాటి జ్ఞానమును వెలిగించి, నాచేత జ్ఞానయుక్తమైన పనులు చేయింతువు. గనుక నాకెంతో ఆనందము.

నీవు సర్వలోకమును కలుగజేసిన సృష్టిచరిత్ర చూడగా ఎంతో గొప్ప క్రమము కనబడుచున్నది. నరులకు కావలసినవన్నియు మొట్టమొదట సృజించి పిమ్మట నరుని చేయుటలో నీ జ్ఞాన లక్షణములోని గొప్ప క్రమము కనబడుచున్నది. నీవు మొదట చేయవలసినవి పిదప, పిదప చేయవలసినవి మొదట చేయలేదు. ఎప్పుడు యేదిచేయవలెనో అప్పుడది చేసినావు. గనుక నాకెంతో ఆనందము.

చేసిన వస్తువులను ఎక్కడ ఏమి అమర్చవలెనో, అక్కడవి అమర్చినావు. అడవిలో నుండవలసినవి అడవిలోను, సముద్రములో ఉండవలసినవి సముద్రములోను ఉంచినావు. వస్తువులను అమర్చుటలో నీ జ్ఞానము కనబడుచున్నది. నీ జ్ఞాన కార్యమువల్ల నాకెంతో ఆనందము.


7) పరిశుద్ధత:- పాపపుణ్యములు దేవుడే కలిగించినాడని కొందరు దురభిప్రాయపడుచున్నారు. పరిశుద్ధుడైన దేవుడెట్లు పాపము చేయగలడు? ఒకవేళ దేవుడేకాని పాపము చేసిన యెడల ఆయన పాపులందరికంటె పాపియగును. పాపియైతే దేవుడెట్లు కాగలడు? వెలుగు చీకటిగాను, చీకటి వెలుగుగాను ఉండగలదా!


విశ్వాసము, స్తుతి :- ఓ తండ్రీ! నీవు పరిశుద్ధుడవు గనుక సమస్తమును పరిశుద్ధముగానే సృజించినావు. నీకు స్తోత్రార్పణములు.

పాపినైన నన్ను పరిశుద్ధునిగ జేతువు. తుదకు నన్ను ఈ పాపలోకము నుండి తప్పించి పరిశుద్ధ స్థానమగు మోక్షలోకమునకు చేర్చెదవు గనుక స్తోత్రార్పణములు.

పరిశుద్ధుడవైన తండ్రీ! నీవు పరిశుద్ధుడవు గనుక పాపమును అసహ్యించుకొందువు. అయినను పాపిని కనికరింతువు గనుక నీకు స్తోత్రార్పణలు.

కడవరి తీర్పు అయిన తరువాత నీవు ఈ పాపలోకమును పరిశుద్ధ లోకముగా మార్చి మోక్షలోకములో నొక భాగముగా జేర్చెదవు. గనుక అనేక స్తోత్రార్పణలు.

ఆ తర్వాత భూలోకములో శేషించి యుండువారు, పాపమెరుగనివారై యుందురు. అందుచేతను నేడు మోక్షములో నున్నవారు పాపమెరుగనివారై యుందురు. అందుచేతను నీకు స్తోత్రార్పణలు.

పరిశుద్ధుడా! పరిశుద్ధుడా! త్రికాలములందు, సర్వ స్థలములందు, రక్షితులందరి యందు నీవే స్తోత్రార్పణకు పాత్రుడవు.


నీవు పరిశుద్ధుడవు గనుక పాపము కలుగజేయలేదు. నీకు స్తోత్రార్పణలు. పాపమునకైనను, పాప ఫలితమునకైనను సృష్టికర్తవు కానట్టి తండ్రీ! పరిశుద్ధతకు మాత్రమే సృష్టికర్తవై యున్న తండ్రీ! నీకు నిత్యానంద స్తోత్రార్పణలు.


8) స్వతంత్రత :- దేవుడు సర్వ స్వతంత్రుడు. గనుక ఆయన ఒకరి ఇష్టమును అనుసరింపనక్కరలేదు. ఒకరిమీద ఆనుకొని యుండవలసిన అగత్యములేదు. ఆయనకు పైగా ఎవరులేరు. గనుక ఆయన ఒకరికి లోబడవలసిన పనిలేదు. ఆయన తన ఇష్టానుసారముగా సర్వకార్యములు చేయునప్పుడు అడ్డము అనునది యుండదు.


విశ్వాసము, స్తుతి :- ఓ తండ్రీ! నీవు సృష్టిలో స్వాతంత్ర్యము దయచేసినందుకు నాకెంతో మనసానందము. నేను నిన్ను బలవంతముగా ఆరాదింపక నా ఇష్టానుసారముగ ఆరాధింపగలందులకై స్వాతంత్ర్యము అనుగ్రహించినావు. కనుక నీకు నా మనసానంద వందనములు.

ఆది తలిదండ్రులకు నీవు స్వాతంత్ర్యమిచ్చి, తోటలోని పండ్లు నిరభ్యంతరముగ తినవచ్చునని సెలవిచ్చినావు. మేమును ఇట్టి సెలవు గలవారమే. సృష్టిలోనున్న సమస్తమును మేము నిరభ్యంతరముగా అనుభవింపవచ్చును. ఇట్టి కృప నిమిత్తమై నీకు నా మనసానంద వందనములు.

ఆత్మీయ జీవనములో విశ్వాసులకు సమస్త భాగ్యములను అమర్చి పెట్టి యుంచినావు. అదిలేదు, ఇదిలేదు అనక సమస్తమును నేను అనుభవింపవలెనని నీవు కోరుకొనుచున్నావు. గనుక నీకు నా మనసానంద వందనములు.

"సమస్తము మీవి. పౌలైనను, అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను, రాబోవునవియైనను, సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు; క్రీస్తు దేవునివాడు." అని పౌలుచేత వ్రాయించిన మాటలు చదివి ఆనందించుచున్నాను (1కొరింధి. 3:22, 23). గనుక నీకు నా మనసానంద వందనములు.


9) సర్వవ్యాపకత్వము :- దేవుడు, సర్వవ్యాపియై యున్నాడు. ఆయన లేనిచోటు లేదు గనుక నీవు ఎక్కడేమి చేసినను ఆయనకు తెలుసును గనుక జాగ్రత్తగా మసలుకొనుము. నీవాయనకు దాగియుండలేవు. నీవంగీకరించినయెడల సర్వవ్యాపియైన ఆయన నీకు అన్ని స్థలములలో సహాయము చేయును. క్రీస్తుప్రభువు శిష్యులు ప్రార్థన గృహమందు సమావేశమై పరిశుద్ధాత్మ రావలెనని ప్రార్థించుచుండగా ఆయన వారిలో ప్రవేశించినపుడు యొకధ్వని కల్గెననియు, అది వారు కూర్చుండియున్న గృహమంతయు వ్యాపించియుండెననియు వ్రాయబడియున్నది. (అ.కార్య. 2:1-4). దైవాత్మ వారి గృహమందు వ్యాపించెను. నీవంగీకరించిన యెడల నీ హృదయమంతయు ఆయన వ్యాపించియుండును. ఇది నీకు మహానందకరమైన వార్తకాదా!


విశ్వాసము, స్తుతి :- ఓ తండ్రీ! నీవు సర్వవ్యాపివై యున్నందుకు నీకనేక స్తోత్రములు.

నేను ఇంటిలో ఉన్నను, బయటనున్నను, స్థలాంతరమందున్నను, దేవాలయమున నున్నను, పాఠశాలయందున్నను, వృత్తిశాలయందున్నను, నీవు నాయొద్దనే ఉండగలవు.
నేను సౌఖ్య స్థలములో నున్నను, అపాయకరమైన స్థలములో నున్నను నీవు నా యొద్దనే ఉండగలవు. గనుక నీకు నా స్తోత్రములు.

నేను ఈ లోకములో ఉన్నను, పరలోకమునకు వచ్చినను నీవు నా దగ్గరనే ఉండగలవు. నేను నిద్రమీదనున్నను, అజాగ్రత్తగా నున్నను, చీకటిలోనున్నను, వెలుతురులో నున్నను, నీవు నా చెంతనే యుందువు గనుక నీకనేక స్తోత్రములు,

అనంత లోకములో అనంత దేవుడవైన నీవు అనంతకాలము నాయొద్దనే యుందువనియు, నేను నీ యొద్దనే యుందుననియు తలంచుకొని ఇప్పుడే ఆనందించుచున్నాను. ఇట్టి జీవభాగ్యము నాకు కలుగును గనుక నీకు నా వందన స్తోత్రములు.

నాతోపాటు పరిశుద్ధులును, దేవదూతలును నీ సన్నిధిలో నుందురు. ఈ తలంపు నాకానందముగ నున్నది. నీకు నా వందన స్తోత్రములు.


10) త్రైకస్థితి:- దేవుడొక్కడేయైనను మనకు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను వాక్యగ్రంధమునందు ప్రత్యక్షమైనాడు. దేవుని గురించి మాట్లాడునప్పుడు ఒక్కడు ముగ్గురుగాను, ముగ్గురొక్కరుగాను ఉన్నట్లు మాట్లాడుదుము. అయినను దేవుడొక్కడే. ముగ్గురు దేవుండ్లు లేరు. ఆయన ముగ్గురుగా బైలుపడినాడని చెప్పి, ముగ్గురు దేవుండ్లని అన్నయెడల ఆ మూడు అను అంకె దైవవ్యక్తి విషయమై సరిపోదు. తండ్రి సర్వలోకమును కలుగజేసెను. కుమారుడు సర్వలోక పాపభారమెత్తుకొనెను. పరిశుద్ధాత్ముడు సంగతులు వివరించును. జ్ఞానోదయము కలిగించును. శక్తి దయచేయును. ఈ త్రైకమర్మము మనకు అందనిది. గనుక దీనిని గురించి దీర్ఘాలోచన చేయుట మానవలెను. అయినను మనకు బయలుపడిన దానితో సంతుష్టిపడి ఆత్మానందము కల్గించుకొనుట మంచిది. జ్వాల, కాంతి, వేడి ఈ మూడును కలసి దీపమైనది. వీటిలో ఒకటి తీసివేసిన యెడల తక్కిన రెండును అంతరించును. వీటిని మూడు వస్తువులని చెప్పము గాని వస్తువు ఒక్కటే అని చెప్పుదుము. దీనినిబట్టి త్రిత్వమొక్కటేయని గ్రహింపగలము.


విశ్వాసము, స్తుతి:- ఓ తండ్రీ! నీవు నా తండ్రివిగాను, కుమారుడవుగాను, పరిశుద్ధాత్మగాను బైలుపడిన మహత్తును, ఒక్కడవైన నీవు ముగ్గురవుగాను, ముగ్గురవైన నీవు ఒక్కడవుగాను ప్రత్యక్షమైన మహత్తును స్మరించి నీకు ఆత్మానంద స్తోత్రములాచరించుచున్నాను.

తండ్రీ! నీవు త్రిత్వమైయున్నట్లు మేమును త్రిత్వమైయుండుటకై మాకు ఆత్మను, జీవమును, శరీరమును దయచేసినావు. కనుక నీకు నా ఆత్మానంద స్తోత్రములు.


11) లక్షణదానము:- దేవుడు నరులను తన స్వరూపమందు సృజించెనని వ్రాయబడియున్నది. (ఆది. 1:26,27; 5:1) ఆయన స్వరూపమనగానేమి? ఆయన లక్షణములే ఆయన స్వరూపము. దేవుడు తన లక్షణములు పెట్టి నరుని చేసెను. తండ్రి లక్షణములు కుమారునికి కలుగుచున్నవి కదా! మనము దేవుని ఎరుగకముందే మన కాయన లక్షణములను దానముచేసెను. దీనిలో దేవుని ప్రేమ కనబడుచున్నది. ఆయన సృజించినవి కూడ మనకు దానము చేసెను. దీనిలో దేవుని ప్రేమ కనబడుచున్నది. ఇందును బట్టి ఆయన ప్రేమను తెలిసికొనుచున్నాము. ఆయన యావత్తు, ఆయన కలుగజేసినది యావత్తు మనదే కాబట్టి మనము మన హృదయములను కృతజ్ఞతతో నింపుకొనవలెను.


విశ్వాసము, స్తుతి :- ఓ దేవా! నీ దివ్య లక్షణములను మాకు దానముగ నిచ్చిన నీ అత్యధిక కృపకు నీకనేకమైన ఆత్మానంద స్తోత్రములు.

నీ పావన లక్షణములకు భిన్నమైన చెడు లక్షణములు మాలో ప్రవేశించినందున నీకును మాకును చాల విచారమే. అయినను నీ దానములకు అపకీర్తి కలుగకుండనట్లును, మేము విచారముచేత నశింపకుండునట్లును, మా దుర్గుణములను పరిహరించునట్టి నీ కుమారుని అమూల్య రక్త పద్ధతి నేర్పరచిన నీ జ్ఞానలక్షణార్థమై నీకు నా ఆత్మానంద స్తోత్రములు.

నీవు మా కనుగ్రహించిన భూదానములన్నిటి కంటెను నీ లక్షణదానమే గొప్పది. ఇది తెలిసికొనుటకై యిచ్చిన వాక్యదానము మా హస్తములందున్న గొప్ప దానమైయున్నది. అన్ని దానముల నిమిత్తము నీకు నా యాత్మానంద స్తోత్రములు. ఆమెన్.