క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
4. దైవలక్షణముల స్తుతి
( ఉపవాస దీక్షలోని స్తుతులు )
1) దేవా! అనాది దేవా! నీకు స్తోత్రములు, నిన్ను ఎవ్వరు కలుగజేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు. సృష్టింపబడకుండ ఉన్న దేవా! ఈ నీ గొప్పతనమునకు అనేక స్తోత్రములు.
2) అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండగల దేవుడవు గనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు. నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక నీకు అనంత స్తోత్రార్పణలు.
3) నిరాకారుడవైన దేవా! నీకు మహిమ కల్గునుగాక. పాపులమైన మేము మా స్థితిని బట్టి నిన్ను చూడలేకపోవుచున్నాము. నీవు మాకు కనబడవు. అయినను నీవు మాత్రము మమ్మును చూచుచున్నావు. గనుక నీకు మహిమ. కనబడని తండ్రివైనప్పటికిని దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచునే యున్నావు. అందుకై నీకు మహిమ. నీవు నిరాకారుడవైనప్పటికిని నాకు ఉపయోగకరమైన శరీరాకారమును నిర్మించినందులకై నీకు మహిమ, మరియు నా ఆత్మకు నిరాకారము దయచేసినావు. అందుచేత ఆకారముగల నా శరీరముతోను, నిరాకారముగల నా ఆత్మతోను నిన్ను మహిమ పరచుచున్నాను.
4) జీవమైయున్న దేవా! నాలోని జీవము నా బలహీనతను బట్టి నిర్జీవ స్థితిలోనికి వచ్చునప్పుడు, తిరిగి నాలో నూతన జీవము పుట్టించుటకై నీ జీవము ధారపోయుదువు గనుక నీకు నిత్యజీవధార స్తోత్రములు.
5) శక్తియైయున్న దేవా! నీవు మానవులకు, జీవరాసులకు శక్తియిచ్చినావు. అందువలన వారు నడువగలరు, పనిచేయగలరు. గనుక నీకు కీర్తి కలుగునుగాక. మరియు నీవు నన్ను నేటి వరకు కాపాడుచు, నడిపించుచు వృద్ధిలోనికి తీసుకొని వచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచున్నాను. నా విషయములో ఎంత గొప్ప కష్టమైన పనియైనను, అసాధ్యమైన పనియైనను చేసిపెట్టగలవు. గనుక నా శక్తి కొలది నిన్ను కీర్తించుచున్నాను.
6) జ్ఞానియైయున్న దేవా! నీ సృష్టిలోని దేవదూతలకు, జీవరాసులకు, మనుష్యులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియుచున్నవి గనుక నీకు మహిమ కలుగును గాక! మరియు నా కష్టములు, నా కోరికలు నేను నీకు చెప్పుకొనక ముందే నీకు తెలిసేయున్నవి. గనుక నా కష్టములు తొలగింపగలవు. నా చిక్కులు విడదీయగల జ్ఞానోపాయము నీకు కలదు. మరియు నీ అపరిమిత జ్ఞానమును నా పరిమితి జ్ఞానస్థితితో తెలిసికొనలేను. అయినను నా పరిమిత జ్ఞానమంతటితో నిన్ను మహిమ పరచుచు స్తుతించుచున్నాను.
7) పరిశుద్ధుడవైన తండ్రీ! నీవు నన్నును, సమస్త సృష్టిని పరిశుద్ధముగానే కలుగజేసినావు. గనుక నీకు ఘనత కలుగును గాక! అయినను పాపప్రవేశమును బట్టి నాకు అపరిశుద్ధత కలిగెను. అయినను నీ పరిశుద్ధతను బట్టి నాకు తిరిగి పరిశుద్ధత కలుగజేయగలవు. గనుక నిష్కళంకమైన మనస్సుతో నిన్ను ఘనపరచుచున్నాను.
8) ప్రేమారూపివైన తండ్రీ! నిన్ను సంస్తుతించుచున్నాను. నీ దానముల మూలముగాను, నీ సహింపు మూలముగాను, నీ నడిపింపు మూలముగాను, మా కష్టములు నివారణచేయు నీ క్రియల మూలముగాను, నీవు మాకు చేయు ఉపకారముల మూలముగాను, మాకు నీవు చూపుచున్న ప్రేమను తలంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ ఎదుట ఏ మాత్రము? జీవరాసులు ఒకదాని నొకటి ప్రేమించుకొనుట, మనుష్యులు కూడ ఒకరినొకరు ప్రేమించుకొనుట ఎరుగుదుము. మరియు భూలోకమందలి తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేమించుటకన్న ఎంతో ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావు. కనుక నా హృదయమంతటితో కూడిన ప్రేమానంద సంస్తుతులు నీకు సమర్పించుచున్నాను.
9) న్యాయస్వరూపివైన దేవా! నేను పొరపాటులోనున్నప్పుడు న్యాయమైన రీతిగా నన్ను గద్దించి, ప్రేమతో శిక్షించు దేవుడవు. నీ న్యాయమును బట్టి నా మనస్పూర్తిగా నీకు ప్రణుతులు చెల్లించుచున్నాను.
10) సర్వవ్యాపివైయున్న తండ్రీ! నీవు పరలోకమందును, భూలోకమందును, అన్ని స్థలములలో, అన్ని వేళలలోను ఉండగల వాడవు గనుక నీకు స్తుతులు. నేను ఎక్కడ ఉన్నను నీవు అక్కడ నుందువు, ఉండగలవు. నీవు నా జతగా నుండి నాకు సహాయము చేయగలవు. నేను ఒంటరిగా నున్నానను చింత లేకుండ చేయగలవు. అందువలన నా మనస్సంతటితోను, హృదయమంతటితోను కృతజ్ఞతతో కూడిన స్తుతులు నీకు చెల్లించుచున్నాను.
11) స్వతంత్రుడవైన ప్రభువా! సమస్తకార్యములు నీయంతట నీవు చేయగల తండ్రీ! నీకు మంగళార్చ. ఎవ్వరును నీకు సలహా ఇవ్వనక్కరలేదు. అన్నియు నీ యిష్టప్రకారమే చేయగలవు. నీ మీద ఆధారపడి నాలోని స్వతంత్రతను బట్టి నా కార్యములు చేసికొనగల స్థితి అనుగ్రహించినావు. గనుక నేను స్వతంత్రముగా నిన్ను కొనియాడుచు మంగళార్చ పాడుచున్నాను.
12) వెలుగై యున్న దేవా! సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగు నిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు. అందువలన కృతజ్ఞతతో కూడిన వందనార్పణలు అర్పించుచు కీర్తించుచున్నాను.
నాకు శరీరమును అనుగ్రహించిన దేవా! నీకు స్తుతులు. ఈ శరీరము పాపశరీరమైనందున దీనిని పరిశుద్ధ శరీరముగ మార్చుచున్నావు. తుదకు నాకు మహిమ శరీరము యిచ్చి నీ యొద్దకు తీసుకొని వెళ్ళుదువు. గనుక నీకు మహిమ, ఘనత, కీర్తి, ఆర్భాటము, సంకీర్తనము కలుగును గాక.
దేవా! నీ దివ్యలక్షణములు దేవదూతలకు, మనుష్యులకు యిచ్చినావు. గనుక నీకు ఆర్భాటము కల్గును గాక. మరియు సృష్టిలోని వస్తువులు పరీక్షించిన నీ సుగుణములు అందులోనున్నవి గనుక నీకు మంగళస్తోత్రములు. ఆమెన్.