క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
7. దైవలక్షణముల స్తుతి
జన్మదినము మొదలు నేటివరకు శరీర సంబంధమైన మేళ్ళను గూర్చిన స్తుతులు.
1. ఓ మహిమా స్వరూపివైన దేవా! నేను పుట్టకముందే అనగా తల్లి గర్భమందు రూపింపబడక ముందే మా నిర్మాణ విషయములన్నియు నీ పుస్తకములో వ్రాసిపెట్టినావు. దీనిని బట్టి చూచి మామీద నీకుగల ప్రేమ, జ్ఞానము, శ్రద్ధ అను వాటిని బట్టి నిన్ను స్తుతించుచున్నాను.
2. ఓ దేవా! మేము జన్మించిన పిమ్మట మేము జీవము కలిగియున్నప్పటికిని మమ్మును మేము కాపాడుకొనలేమని నీవు యెరిగినవాడవై, ఆపని మా తల్లిదండ్రులకు అప్పగించినావు. గనుక నీకు స్తోత్రములు. నీ కృపలో ఒక భాగమైయున్న నీ కాపుదలను స్మరించుచు నీకు వందనములు అర్పించుచున్నాము.
3. ఓ దేవా! మమ్మును పోషించవలసినదని మేము నిన్ను అడుగలేదు. అయినను మమ్మును పాలవలనను, ఆహారము వలనను పోషించుచున్నావు. నీ పోషణను, నీ ప్రేమను తలంచుకొని నిన్ను ఘనపరచుచున్నాము.
4. ఓ దేవా! మాకు అనుదినాహారము మాత్రమే గాక తినుబండారములను దయచేయవలసినదని నేను నిన్ను అడుగకపోయినను అవి కూడ దయచేయుచున్నావు. గనుక నీకు కీర్తి కలుగు గాక!
5. ఓ దేవా! సమస్త వస్తువులు నా ఉపయోగనిమిత్తమై కలుగజేసి ఇచ్చిన నీ కృప నిమిత్తమై నీ ధర్మఉపయోగ నిమిత్తమై నీకు స్వభావము కలుగును గాక!
6. ఓ దేవా! వస్త్రములు దయచేయుమని మేము నిన్ను అడుగక పోయినను అవి కూడ దయచేసిన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కష్టపడి సంపాదింపని వాటిని కూడ అనుగ్రహించుచున్నావు. ఈ నీ సంపాదన ప్రేమ నిమిత్తమై నిన్ను ఘనపరచుచున్నాము.
7. ఓ దేవా! మమ్మును బడికి పంపించి అందుకు అవసరమైన వస్తువులు, పుస్తకములు యిప్పించి విద్యనేర్పించిన ఉపాధ్యాయ ప్రేమ నిమిత్తమై నీకు చాలా వందనములు చెల్లించుచున్నాము.
8. ఓ దేవా! నాకు చదువు చెప్పు ఉపాధ్యాయులను; విద్యలోను, ఆటలలోను, సహకారులుగా ఉండవలసిన తోటి పిల్లలను అనుగ్రహించినావు. గనుక నీకు స్తోత్రములు. నీ సహాయ ప్రేమ నిమిత్తమై నీకు అనేక నమస్కారములు.
9. ఓ దేవా! మేము చదువు ముగించిన తరువాత ఏదో ఒక పనిలో ప్రవేశ పెట్టినందుకు నీకు ప్రభావములు కలుగును గాక! మా పనిలో తోడు, సహాయము అనుగ్రహించుచున్న నీ ప్రేమకు స్తుతి కల్గును గాక!
10. ఓ దేవా! మా దేశమును న్యాయముగాను, చక్కగాను పరిపాలించే అధికారులను అనుగ్రహించినావు. వారు మమ్మును కాపాడు విషయములోను సహాయముచేసే విషయములలోను పూచీదారులైయుండునట్లు చేసినావు గనుక స్తోత్రములు. మరియు ఆ అధికారము నీ వలననే కలిగినది. అందువలన నీవు అందరిపై అధికారివై యున్నావు. గనుక నీకు కృతజ్ఞతార్పణలు చెల్లించుచున్నాము.
11. ఓ దేవా! దేశములో మాత్రముగాక ఇంటిలో కూడ అధికారులను బోలిన తల్లితండ్రులను, మాకంటె పెద్దవారైన సోదర సోదరీలను మా మేలు కోరిన వారినిగా ఏర్పాటుచేసిన నీకు వేలాది నమస్కారములు.
12. ఓ దేవా! మా సంతోషాభివృద్ధి నిమిత్తమై స్నేహితులను, బంధువులను అనుగ్రహించియున్నావు. స్తోత్రములు. వీరికంటే నీవు గొప్ప స్నేహితుడవు, బంధువుడవైయున్నావు. అందుకు నిన్ను పూజించుచున్నాము. మనుష్యుల ద్వారా నీవు మాకు చేయుచున్న సమస్త ఉపకారముల నిమిత్తమై నీకు స్తోత్రములు.
13. ఓ దేవా! మత భక్తి నిమిత్తము మమ్మును కాపాడుటకు ఇవాంజిలిస్టులను, పాదిరీలను, మిషనెరీలను అనుగ్రహించిన నీకు ఘనత కలుగునుగాక! అందరికంటే నీవు గొప్ప గురువువై యున్నావు. గనుక నీకు పూజార్పణలు యేసు నామమున అర్పించుచున్నాము. ఆమెన్. (నెహెమ్యా. 9:5,6)
స్తుతి ప్రార్ధన :- ఓ దేవా! నీవు ప్రేమవైయున్నావు. గనుక నేనెంత పాపినైనను నన్ను ప్రేమించుచున్నందులకు నీకు స్తోత్రములు.
ఓ దేవా! నీవు శక్తి మంతుడవైయున్నందున, నాకు అన్నియు దయ చేయగలవు. అన్ని పనులలోను సహాయము చేయగలవు. అందుచేత నీకు వందనములు చెల్లించుచున్నాను.
ఓ దేవా! నీవు పరిశుద్ధుడవైయున్నందువలన సృష్టిని, మానవుని పరిశుద్ధముగా కలుగజేసియున్నావు. మానవుడు పాపము చేయుట ద్వారా పరిశుద్ధతను కోల్పోయినను తిరిగి పరిశుద్ధులనుగా చేయుటకు నీవే లోకమునకు బలియైతివి. ఇందుకు నీకు స్తోత్రములు.
జీవమైయున్న ఓ దేవా! మట్టి ఘటమైన మానవునిలోనికి నీ జీవాత్మను పంపి జీవింపజేయుచున్నందుకు స్తోత్రములు.
ఓ దేవా! నీవు సర్వవ్యాపివి. గనుక నేను ఎక్కడ వుంటే నీవు అక్కడుందువు. గనుక ఓ దేవా! నీవు ఆది, అంతములేని దేవుడవు గనుక నాతో యెల్లప్పుడునుందువు గనుక నీకు మహిమ కలుగునుగాక! ఆమెన్.