English


క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

5. దైవలక్షణముల స్తుతి

( ఉపవాస ప్రార్ధన ప్రకరణములోనివి )



1 ప్రేమ:- తండ్రీ! నీవు ప్రేమయై యున్నావు. నీవు ప్రేమవైయున్నందుకు స్తోత్రములు.

నీలోని లక్షణములను మానవులమైన మేము అనుభవించుటకు వాటితో మనుష్యులను కలుగజేసియున్నావు. కాబట్టి నీకు స్తోత్రములు.

మేము పుట్టక ముందును, నిన్ను ప్రేమింపక ముందును నీవు మమ్ములను ప్రేమించినావు స్తోత్రములు.

మేము పాపులమై యుందుమనియు, అవిధేయులమై యుందుమనియు నీకు ముందే తెలిసినప్పటికిని నీవు మమ్మును ప్రేమించుచున్నావు. మామీద నీకున్న ప్రేమను చూపించుట కొరకు నా విషయమై దేవదూతలను పరిచారకులుగాను, భూమిని నివాస స్థలముగాను కలుగజేసినావు. గనుక నీకు స్తోత్రములు.

మాకు కావలసినవన్నియు ముందే కలుగజేసినావు స్తోత్రములు.

మేము చెడిపోతే రక్షించుటకు నీ ప్రియకుమారుని పంపించినావు స్తోత్రములు.

నీ కుమారుని ఇచ్చుటవల్ల మాకు సమస్తమును యిచ్చివేసినావు. నీకు స్తోత్రములు.

మేము నీ ప్రేమకు ఏమి చెల్లించగలము? ఓ ప్రేమగల తండ్రీ! ఓ కటాక్షముగల తండ్రీ! నీ ప్రేమ లక్షణములకు, నీ ప్రేమ క్రియలకు, నీ ప్రేమ పిలుపునకు, నీ ప్రేమ సహవాసమునకు, నీవు బైబిలులో వ్రాయించిన ప్రేమగల మాటలకు అనేక స్తోత్రములు.

మేము కష్టములలోను, యిబ్బందులలోను, శోధనలలోను, మాకు వెంటనే సహాయము కలుగక పోవుట చూచి, నీవు ప్రేమలేని వాడవని పొరపాటున అనుకొనే బలహీనులమై యున్నాము. నీ ప్రేమను మేము గ్రహించకపోవుట మా తప్పైయున్నది. నీ ప్రేమ యొక్క ఎత్తయినను వెడల్పయినను గ్రహించలేము. ఇంత గొప్ప ప్రేమతో మమ్ములను ఆవరించుకొనుచున్న తండ్రీ! నీకు స్తోత్రములు.

ఈ మా యొక్క స్తోత్రములను నీ ప్రేమ కుమారుడును, మా ప్రభువైన యేసు పరిశుద్ధ సముఖమున చెల్లించుకొనుచున్నాము.


2. సర్వశక్తి :- సర్వశక్తిగల దేవా! నీవు చేయలేనిది ఏదియు లేదు. అందుచేత నిన్ను స్తుతించుచున్నాను. నా విషయమై నీవనుకొన్నది తుది వరకు నెరవేర్చుకొనే శక్తిగలవాడవై యున్నావు. నీకు స్తోత్రములు.

మేము ఏమి ప్రార్ధింతుమో అవి నెరవేర్చగల తండ్రివి గనుక స్తోత్రములు. మా ఊహకు మించిన నీ సహాయము మాకు దయచేయు తండ్రివి. నీకు స్తోత్రములు.

పాపమునకు సంబంధించినది నీవు చేయలేవు. కాబట్టి నీవే సర్వశక్తిగలవాడవై యుందువు. స్తోత్రములు.

మరియు నేను పాపములో పడకుండ సహాయము చేయు తండ్రివి. నీవు నా విషయమై పనిచేయు సమయములో, నీ సర్వశక్తిని ఉపయోగించువాడవని ఒప్పుకొనే కృప దయచేయుము. నాలో యున్న బలహీనతను చూడక, నీ యందున్న బలమును చూచే కృప దయచేయుము. నీ శక్తి నా బలహీనతను హరింప చేయుననియు, నీ శక్తి బయలుదేరుననియు, తుదకు నీ శక్తి వల్లనే మేము రక్షింపబడుదుమనియు నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాము.


3. సర్వన్యాయము :- దేవా! నీ యందు జీవించేవారి విషయములో సహాయము చేయుటచే న్యాయకార్యము జరిగించుచున్న నీకు స్తోత్రములు.

ఎవరు నిన్ను ప్రార్థింతురో, ఎవరు నీ వాక్యానుసారముగా ప్రవర్తింతురో, ఎవరు నీకు విధేయులైయుందురో, వారికి నీవు ఎల్లప్పుడు ఉపకారము చేయుచు, నిన్ను నీవు బయలుపర్చుకొందువు. న్యాయస్తుడవైన దేవా! నేను ఎరిగిన నీ న్యాయ స్వభావము యొక్క ఉద్యోగము నిమిత్తమై నీకు స్తోత్రములు.

"నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రము త్రోసివేయను" అనే అమూల్య వాగ్దానమును తలంచుచు నిన్ను స్తుతించుచున్నాను. న్యాయస్తుడైన దేవుడే నా తండ్రియై యున్నాడు. కాబట్టి మాకు కావలసినవి తప్పకుండా యిచ్చునను న్యాయమైన విశ్వాసము దయచేయుము.

ఓ దయగల తండ్రీ! నీవు పరిశుద్ధమైన న్యాయముగలవాడవు. గనుక నీ ఆజ్ఞలు మీరే వారిలో నీ బిడ్డలమైన మేము ఉన్నప్పటికిని తద్వారా కలుగవలసిన కష్టములు మా మీదికి వచ్చుట చూచి ఊరుకొనుట అను న్యాయకార్యము జరిగించినందులకై నీకు స్తోత్రములు. దయగల తండ్రీ! మాకు కష్టములు రానిచ్చి ఆ కష్టములలో నీ ఆజ్ఞలు బోధించి, దాని చొప్పున మేము నడుచునట్లు చేసి, అట్లు నడచినామని మెచ్చుకొని, బహుమానమిచ్చే న్యాయమైన తండ్రివని నిన్ను స్తుతించుచున్నాను.


4. సర్వాధికారి:- సర్వాధికారివైన దేవా! నీవు ఏమి సృజించినావో, దానియంతటి మీదను నీకు పూర్ణాధికారము కలిగియున్నందున నీకు స్తోత్రములు.

నా మీద కూడ నీకు సర్వాధికారము కలిగియున్నందున నీకు స్తోత్రములు. నేను నీ అధికారమునకు ఆనందించుచున్నాను, అంగీకరించుచున్నాను. నీకు నా మీద అధికారమున్నందువల్ల, అపవాదికిగాని, అతని సంబంధికులకుగాని నా మీద యేవిధమైన అధికారము లేకుండ చేయుచున్నందుకు నీకు స్తోత్రములు.

సర్వాధికారియగు దేవా! అధికారము నీదే. గనుక నా యిష్ట ప్రకారము నేను నడువక నీ యిష్టప్రకారము నడిచే బాగ్యము కలుగునని నేను ఆనందించుచున్నాను. నీ అధికారమే నాకు లేనియెడల నా యిష్టాధికారము చెల్లుబడి కాక, ఎన్నో చిక్కులలో పడుదును. అట్టిది యెన్నడైన జరుగకుండునట్లు నీ సర్వాధికారమునకు "చిత్తము ప్రభువా"! అనుచు నీకు వందనములు అర్పించుచున్నాను.


5. దైవ వ్యక్తి :- దేవా! నీవు దేవుడవై యున్నందుకు స్తోత్రములు. నీవు దేవుడవు గనుక అన్ని లోకముల కంటె గొప్పవాడవు. అందరికంటె గొప్పవాడవు. అందరికంటె, అన్నిటికంటె నీవు శ్రేష్టుడవు. కనుక స్తోత్రములు. తండ్రివైన దేవా! మా దృష్టిలో ఏదిగొప్పదై ఉన్నదో అది మాకు గొప్పదికాదు. నీవే గొప్ప. గనుక నీకనేక స్తోత్రములు. అన్నిటికంటే నీవే పైగా వున్నావు. అందుకు నీకు స్తోత్రములు. నీవట్లు బయలుపడినందుకు స్తోత్రములు. దేవాది దేవుండ్లని మనుష్యులనుకొనే దేవుండ్ల కంటే గొప్పవాడవైన దేవా! నీ కనేక స్తోత్రములు. మేమేది చూచుచున్నామో, మాకు ఏది కావలెనో, మేమేది యెరుగుదుమో, మేమేది పొందియున్నామో, మనుష్యులందరు ఏమి యెరుగుదురో, ఏమి తెలిసికొందురో, యేమేమి క్రొత్త క్రొత్తగా కనిపెట్టుచున్నారో వాటన్నిటికంటె గొప్ప వస్తువు నీవైయున్నావు గనుక స్తోత్రములు. అన్నియు లేకపోయిన, నీవు ఒక్కడవే ఉంటే మాకు అన్నియు ఉన్నట్లే. నీవిచ్చిన అన్నిటిని చూచునప్పుడెల్ల నీవే మాకు జ్ఞాపకము వస్తావు. నీకు స్తోత్రములు. ఎందుకంటె ఆ వస్తువు కంటె ఆ వస్తువును పుట్టించిన నీవే గొప్ప వాడవు గనుక స్తోత్రములు.


దేవా! నీవు మా ప్రభువువైయున్నావు. అందరికి ప్రభువువై యున్నావు. ఏలుబడి నీదై యున్నది. మా మీద నీవు ప్రభువువై యున్నావు. గనుక మమ్ములను నీ మార్గములలో, నీ నీతి మార్గములలో నడిపించెదవు. మేము నీ ప్రజలమైయున్నాము. నీ యేలుబడిలో క్షేమము, శాంతి, సంతోషము పొందుదుము.


అంజూరపు చెట్ల క్రిందను, ద్రాక్షచెట్ల క్రిందను ప్రజలు నిర్భయముగా బ్రతికిరని సొలోమోను రాజ్యనివాసులను గూర్చి చెప్పబడిన మాట వాస్తవమైతే (1 రాజు 4:25) ఓ ప్రభువా! ఓ దివ్య ప్రభువా! ఓ లక్షణముగల ప్రభువా! ఓ మహాప్రభువా! నిన్ను గూర్చియు, నీ యేలుబడిని గూర్చియు మరింత వాస్తవమైయున్నది.


6. పరిశుద్ధత:- తండ్రివైన దేవా! నీవు పరిశుద్ధుడవైయున్నావు. నీవు యెంత పరిశుద్ధుడవై యున్నావో ఎవరునూ గ్రహింపలేరు. ఎన్నడు పాపము ఎరుగనటువంటి పరిశుద్ధులైన దేవదూతలు సహితము నీ పరిశుద్ధత యెదుట ఉండలేక, చూడలేక రండు రెక్కలతో ముఖమును కప్పుకొన్నారని (యెషయా 6:25) వ్రాయబడి యుండగా, నీ పరిశుద్ధత ఎంత గొప్పదో యిందులో చూచుచున్నాము. మహాపరిశుద్ధుడా! అత్యంత పరిశుద్ధుడా! నీకు స్తోత్రములు.

నిన్ను ఏమని స్తుతింపగలము? మేము ఎంత బాగుగా స్తుతి చేసినను దానిలో ఏదో ఒకచోట లోపముండును. మా హృదయములు ఎంత శుద్ధిగా ఉన్నను, ఎక్కడైన ఒకచోట అపవిత్రత ఉండును. నీ పరిశుద్ధత యెదుట, యే పరిశుద్ధత పరిశుద్ధత యనిపించుకొనగలదు? నీ కాంతి యెదుట నీ పరిశుద్ధమైన కాంతి యెదుట సూర్యకాంతి, చంద్రకాంతి కాదని (ప్రకటన 21:23 లో) వ్రాయబడియుండగా, నీ పరిశుద్ధతను గూర్చి ఎట్లు స్తుతించగలము? మహా పరిశుద్ధుడవైన తండ్రీ! నీలో మేము ఏమి లోపములు కనిపెట్టగలము? మా విషయములో నీకున్న ప్రేమ ఎంత పరిశుద్ధమైనదో ఏమి చెప్పగలము? గనుక నీకనేక స్తోత్రములు. నీవు పరిశుద్ధుడవు గనుక సర్వలోకమును పరిశుద్ధమైన రీతిగా కలుగజేసినావు. నీకు స్తోత్రములు. నీవు పరిశుద్ధుడవు గనుక న్యాయము చొప్పున మేము నిన్ను పరిశుద్ధతతో స్తుతించవలసినది. గాని ఏమి చేయగలము! చేయలేము. చేయగల్గుచున్నదేమో అదే అంగీకరించుమని వేడుకొనుచున్నాము.

మహా పరిశుద్ధుడవైన దేవా! నీవెంత పరిశుద్ధుడవైనప్పటికిని అపరిశుద్ధమైన ఈ లోకమునకు నరావతారిగా వచ్చినావు గనుక స్తోత్రములు. అంత మాత్రముచేత నీ పరిశుద్ధతకు లోపము కలుగలేదు. సూర్యరశ్మి అపవిత్రత స్థానములపై ప్రకాశించినను, దాని కళకు కళంకము కలుగదు. నీ పవిత్రత, అపవిత్రత దగ్గరకు వచ్చినను యే మాత్రము తగ్గదు.

ఓ దేవా! నీవు పాపులతోను, సుంకరులతోను కూర్చుని భుజించినను నీవు పరిశుద్ధుడవే. అపరిశుద్ధురాలైన స్త్రీ వచ్చి నిన్ను ముట్టగా, నీవు ముట్టనిచ్చినప్పటికిని నీవు పరిశుద్ధుడవే.

మహా పరిశుద్ధుడవైన దేవా! నీవు దేవుడవుగానున్నప్పుడు మాత్రమేగాక మా శరీరమును ధరించుకొన్నప్పుడు కూడ నీవు పరిశుద్ధుడవే. నీలో నేరమున్నదని ఎవరు బుజువు చేయగలరు? నీ క్రియలు పరిశుద్ధ క్రియలైయున్నవి.

మహా పరిశుద్ధుడా! నీవు సృజించిన క్రియలు పరిశుద్ధములైయున్నవి. అవి మాత్రముగాక నీవు మమ్ములను రక్షించుట సృష్టిలో భూమి మీద చేసిన క్రియలు కూడ పరిశుద్ధమైనవి. అవి మాత్రమే కాక మమ్ములను రక్షించుట నీవు నడిచిన క్రియలు కూడ పరిశుద్ధమైనవి. అవి మాత్రమే గాక నీవు చేసిన బోధలు పరిశుద్ధమైనవి. అవి మాత్రమే గాక నీవు పొందిన శ్రమలు పరిశుద్ధమైన రీతిగా అనుభవించిన శ్రమలై యున్నవి. వీటన్నిటిని బట్టి నీవు పరిశుద్ధుడవని బయలుపర్చుకొనుచున్నావు. గనుక స్తోత్రములు.

ఓ పరిశుద్ధుడవైన యేసుక్రీస్తు ప్రభువా! లోకరక్షకులని మానవులు చెప్పుకొనే రక్షకులందరికంటె నీవే మొదటివాడవు. నీవే పరిశుద్ధుడవు. నీవే రక్షకుడవు గనుక స్తోత్రములు.

ఓ పరిశుద్ధుడవైన రక్షకా! నీవు పాపములేని వాడవును, పరిశుద్ధుడవును, అయి ఉన్నందువల్ల అందరిని రక్షించగలవు. నన్నును రక్షించగలవు. గనుక స్తోత్రములు.

మహా పరిశుద్ధుడవైన నీ కాంతిని రెండవమారు నీ రాజ్యములో చూచి, మేమెంతగా ఆనందింతుమో, ఆశ్చర్యపడుదుమో నీకు స్తోత్రములు.


పరిశుద్ధుడవైన పరిశుద్ధుడా! దైవాత్మవైన పరిశుద్ధుడా! జీవాత్మవైన పరిశుద్ధుడా! మోక్షపావురమైన పరిశుద్ధుడా! ఓ పరిశుద్ధమైన దేవా! నీవు కేవలము పరిశుద్ధుడవైనందుకు స్తోత్రములు.

నీ పరిశుద్ధతను గూర్చి నీవు మాకు యెంత బయలుపర్చినావో అంత మాకు తెలుసుగాని, యెక్కువ తెలియదు. తెలిసినదంతయు మహాపరిశుద్ధమైనది. గనుక నీకు స్తోత్రములు.

అగ్ని నాలుకలుగా ప్రత్యక్షమగు దేవా! అగ్ని నాలుకలు పరిశుద్ధమైనవై యుండగా నీవెంత కాంతి కలవాడవో మేమేమి చెప్పగలము? నిత్యము ప్రకాశించే ఆత్మవైన ఓ దేవా! నీవు మా హృదయములోనికి వచ్చుటకు ఏ మాత్రము సందేహించవు. నీవు పరిశుద్ధుడవని చెప్పి పాపులమైన మాలో నివసించుటకు అసహ్యించుకొనవు. నీది ఎంత గొప్ప పరిశుద్ధత! నీది ఎంత అరమరలేకుండా యుండే పరిశుద్ధత! పరిశుద్ధుడా! నీకు పరిశుద్ధమైన వందనములు.

తండ్రి యొద్ద నుండి, కుమారుని యొద్ద నుండి వచ్చిన ఓ పరిశుద్ధాత్మ దేవా! యిదివరకున్న నా హృదయమనే వస్తువు నేటికి కొంత మెరుగైన వస్తువుగా మార్చిన ఓ దేవా! ఇక మీదట ఈ వస్తువునకెంత మెరుగు పెట్టుదువో ఎవరు ఎరుగ గలరు? మేము మహిమలోనికి వచ్చిన తరువాత మమ్మును ఎంత చక్కని వస్తువుగా మార్చెదవో మేము గ్రహించలేము. నీ వల్ల మార్చబడిన హృదయములే పరిశుద్ధములైయుంటే నీవెంత పరిశుద్ధుడవో ఎవరెరుగుదురు? ఓ పరిశుద్ధ దేవా! నీ కార్యములు పరిశుద్ధమైనవి. నీ మార్పు అద్భుతము. నీ వెలిగింవు నూతనమైన సృష్టియైయున్నది. పరిశుద్ధుడా! నీకు పరిశుద్ధమైన స్తోత్రములు.

ఓ పరిశుద్ధాత్మ దేవా! సృష్టి కాలమందే సృష్టి అంతటి మీద రెక్కలు చాచి కాపాడుచున్న ఓ దైవాత్మా! కడవరి రోజులలో "ప్రభువైన యేసూ రమ్ము" (ప్రకటన. 22: 20) అని సంఘములు చేయు ప్రార్ధనకు సహాయము చేయుచున్న తండ్రీ! నీకు స్తోత్రములు.


7. సర్వవ్యాపకత్వము :- ఓ దేవా! నీవు సర్వ వ్యాపివైయున్నావు గనుక స్తోత్రములు. నీవే సర్వమును సృజించుచున్నావు. గనుక సమస్తముండే చోట నీవున్నావు. నీవు కలుగజేసిన వాటిలో దేనికైనను నీవు వేరుగాను దూరముగాను ఉండవని మేమెరుగుదుము. నీవు పరలోకమందును, భూలోకమందును అన్ని స్థలములలో నుండ గలవాడవు. గనుక స్తోత్రములు.

నేను యెక్కడ వున్ననూ నీవు అక్కడ నుండగలవు. నీవు నాకు జతగా నుండగలవు. ఉండి నాకు సహాయము చేయగలవు. గనుక నేను ఒంటరిగా ఉన్నాను అను చింతలేకుండా చేయగలవు. నీకు వందనములు. అన్ని స్థలములలో ఉన్న నీకు వందనములు. నీవు లేని స్ధలములేదు. నీవు లేకుండా యేదియు లేదు గనుక స్తోత్రములు.

రెప్పపాటులో ఎక్కడకు బడితే అక్కడకు, యెప్పుడుబడితే అప్పుడు వెళ్ళగలవు. నీవు సర్వవ్యాప్తివైయున్నావు. అంత గొప్ప అంతస్థు మాకు కూడా అన్నుగ్రహించినందులకు వందనములు.


8. జీవము :- జీవమైయున్న దేవా! నాలోని జీవము నా బలహీనతను బట్టి నిర్జీవ స్థితిలోనికి వచ్చునప్పుడు, మరలా నాలో నూతన జీవము ధారపోయుదువు గనుక నీకు నిత్యజీవ స్తోత్రములు.


9. జ్ఞానము :- జ్ఞానమైయున్న దేవా! నీవు జ్ఞానివి గనుక నా కష్టములు, నాకోరికలు నేను నీకు చెప్పుకొనక ముందే నీకు తెలిసియున్నవి. అందుచేత నీవు నా కోర్కెలు తీర్చగలవు. నా కోర్కెలు నెరవేర్చుటకు ఎన్నో చిక్కులు అడ్డముగా వున్నను, ఆ చిక్కులన్నియు విడదీసి నా కోర్కలు నెరవేర్చగల జ్ఞానోపాయము నీకు గలదు, గనుక నీకు! నాకు తెలిసినన్ని వందనములు. నా జ్ఞానమునకు తోచినన్ని వందనములు చేయుచున్నాను.


10. నిరాకారము :- నిరాకారుడవైన దేవా! నా బలహీనతను బట్టి నేను నిన్ను చూడలేకపోయినను నీవు నన్ను చూచుచున్నావు. నీవు నిరాకారుడవు. అయినప్పటికిని నాకు ఉపయోగకరమైన శరీరాకారమును దయచేసినావు. మరియు నా ఆత్మకు నిరాకారము అనుగ్రహించినావు. కాబట్టి నా శరీరముతోను నా ఆత్మతోను నిన్ను స్తుతించుచున్నాను.


11. స్వతంత్రత :- స్వతంత్రుడవై యున్న తండ్రీ! సమస్త కార్యములు నీయంతట నీవు చేయగల తండ్రీ! నీకు స్తోత్రములు.

నేను కూడ స్వతంత్రముగా పనిచేయగల శక్తి అనుగ్రహింపగలవు. నీ మీద మాత్రమే ఆధారపడి నాలోని స్వతంత్రతను బట్టి నా కార్యములు చేసికొనగల స్ధితి అనుగ్రహించినావు గనుక నీకు స్తోత్రములు. స్వేచ్చాపూర్వకమైన స్తోత్రములు.

బలవంతము లేక కేవలము స్వతంత్రతముగా నిన్ను స్తుతింపగోరుచున్నాను. నీ గుణములన్నియు నాకు కూడ అనుగ్రహించుట వలన నీ లక్షణ రూపము నీ కోరిక నాకు అనుగ్రహించినావు. అన్నియు అనుగ్రహించి ఒక్క స్వతంత్రత లక్షణముగాని అనుగ్రహింపకున్న యడల తక్కినవన్ని యిచ్చినను ప్రయోజనములేదు. గనుక స్వాతంత్ర్య లక్షణము యిచ్చినందుకు నీకు స్తోత్రములు.


12. త్రైక స్థితి:- తండ్రీ, కుమార, పరిశుద్ధాత్మలను పేరులతో బైలుపడిన త్రియేక దేవుడవైన తండ్రీ! నీ ప్రత్యక్షత విషయమై నీకనేక వందనములు. నీవు నాకు దాగియుండు దేవుడవుకావు. గాని బైలుపడు దేవుడవు నీ లక్షణములు, నీ క్రియలు, నీ గొప్పతనము నాకు బైలుపర్చు దేవుడవు గనుక నీకు వందనములు, నీవు ఒక్కడవుగాను, ముగ్గురవు గాను బైలుపడినావు. ఈ మర్మము నాకు తెలియదు. గాని నమ్ముచున్నాను. నేను నీ యొద్దకు, పరలోకమునకు జేరినప్పుడు తెలిసికొనగలను. నీ అపరిమిత జ్ఞానస్థితిని నా పరిమిత జ్ఞాన స్థితితో ఎట్లు తెలిసికొనగలను? అనంత కాలము నీ విషయములు క్రొత్త క్రొత్తగా తెలిసికొనుచునే యుందును. నీ ప్రత్యక్షతకును నేను తెలిసికొనుటకును అంతము లేదు. గనుక నీకు అంతములేని స్తుతులు చెల్లించుచున్నాను.


మహిమ స్వరూపీ! ఆనంద స్వరూపీ! నేను నిత్యము నీ మహిమ కొరకు, నీ ముఖ దర్శనములో, నీ సన్నిధిలో నీ సహవాసములో మిగుల ఆనందముగా గడుపగల స్ధితి నాకు దయచేయుదువని నమ్ముచు నీ కనేక వందనములు చేయుచున్నాను.