క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
6. దైవలక్షణముల స్తుతి
( సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు )
1. దేవా, తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా, నా ప్రభువా! నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక, నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకు నీ కనేక వందనములు.
నీ దానముల మూలముగాను, నీ సహింపు మూలముగాను, నీ నడిపింపు మూలముగాను, మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను, నాకు నీవు చూపుచున్న ప్రేమను తలంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమైఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు, నడిపించుచు, వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు, యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు నిశ్చయముగ నన్ను పరలోకమునకు చేర్చుకొందువని నిరీక్షించుచున్నాను. నీ కనేక వందనములు.
2. (i) అనాది దేవా! అనంతదేవా! ఉన్నదేవా! సృష్టింపబడకుండనున్న దేవా! నీ గొప్పతనమునకు అనేక స్తోత్రములు.
(ii) జీవమైయున్న దేవా! నాలోని జీవము నా బలహీనతను బట్టి నిర్జీవ స్థితిలోనికి వచ్చునప్పుడు మరల నాలో నూతన జీవము ధార పోయుదువు. గనుక నీకు నిత్యజీవ స్తోత్రములు.
(iii) అనంత దేవా! నీవు యెల్లప్పుడు ఉండగల దేవుడవు గనుక నీకు నిత్య స్తోత్రములు. నీవు యెల్లప్పుడుండువాడవు గనుక నీకు అనంత స్తోత్రములు.
(iv) శక్తిమంతుడవగు దేవా! నా విషయములో యెంత గొప్ప కష్టమైన పనియైనను, అసాధ్యమైన పనియైనను చేయగలవు. గనుక నీకు నా శక్తికొలది వందనములు.
(v) జ్ఞానివైయున్న, దేవా! నీవు జ్ఞానివి గనుక నా కష్టములు, నా కోరికలు, నేను నీకు చెప్పుకొనకముందే నీకు తెలిసియున్నవి. అందుచేతనే నీవు నా కోర్కెలను తీర్చగలవు. నా కోర్కెలు నెరవేర్చుటకు యెన్ని చిక్కులు అడ్డముగా నున్ననూ, ఆ చిక్కులన్నియు విడదీసి నా కోర్కలు నెరవేర్చగల జ్ఞానోపాయము నీకు గలదు. గనుక నీకు నాకు తెలిసినన్ని వందనములు. నా జ్ఞానమునకు తోచినన్ని వందనములు చేయుచున్నాను.
(vi) పరిశుద్ధుడవైన దేవా! నీవు నన్నును, సమస్తమును కలుగజేసినప్పుడు పరిశుద్ధముగానే కలుగజేసినావు. గాని పాపప్రవేశమును బట్టి నాకు అపరిశుద్ధత కలిగెను. అయినను నీ పరిశుద్ధతను బట్టి నాకు మరల పరిశుద్ధత దయచేయగలవు. గనుక నిష్కళంకమైన పరిశుద్ధ మనస్సుతో నీకు స్తుతులు చేయుచున్నాను.
(vii) ప్రేమా స్వరూపివైన తండ్రీ! భూలోకమందలి తల్లితండ్రులు తమ బిడ్డలను ప్రేమించుట కన్న, నన్ను నీవు యెంతో యెక్కువగా ప్రేమించుచున్నావు. కాబట్టి నీకు నా ప్రేమ వందనములు.
(viii) న్యాయ స్వరూపివైన దేవా! నేను పొరబాటులో నున్నప్పుడు న్యాయమైన రీతిగా నన్ను గద్దించి, ప్రేమతో శిక్షించు దేవుడవు. గనుక నీకు వందనములు ఆచరించుట న్యాయమైయున్నది. గనుక నీకు వందనములు ఆచరించుచున్నాను.
(ix) నిరాకారుడవైన దేవా! నా బలహీనతనుబట్టి నేను నిన్ను చూడలేకపోయినను నీవు నన్ను చూచుచున్నావు. నీవు నిరాకారుడవు. అయినప్పటికిని నాకు ఉపయోగమైన శరీరాకారమును దయచేసినావు. మరియు నా ఆత్మకు నిరాకారము అనుగ్రహించినావు. కాబట్టి నా శరీరముతోను, నా ఆత్మతోను నిన్ను స్తుతించుచున్నాను.
(x) సర్వవ్యాపివైయున్న తండ్రీ! నీవు పరలోకమందును, భూలోకమందును, అన్ని స్థలములలో ఉండగలవాడవు గనుక నీకు స్తోత్రములు. నేను యెక్కడున్నను నీవు అక్కడుందువు. ఉండగలవు. నీవు నాకు జతగా ఉండగలవు. ఉండి సహాయము చేయగలవు. నేను ఒంటరిగా ఉన్నాను అను చింతలేకుండ చేయగలవు. కనుక నీకు వందనములు. అన్ని స్థలములలో నీకు వందనములు.
(xi) స్వతంత్రుడవైన ప్రభువా! సమస్తకార్యములు నీయంతట నీవు చేయగల తండ్రీ! నీకు స్తోత్రములు. నేను కూడ స్వతంత్రముగా పనిచేయగల శక్తి అనుగ్రహింపగలవు. నీ మీద మాత్రమే ఆధారపడి నాలోని స్వతంత్రమును బట్టి నా కార్యములు చేసికొనగల స్థితి అనుగ్రహించినావు. గనుక నీకు స్తోత్రములు. స్వేచ్చా పూర్వకమైన స్తోత్రములు. బలవంతముగా కాక కేవలము స్వతంత్రముగా నిన్ను స్తుతింపగోరుచున్నాను. నీ గుణములన్నియు నాకు కూడ అనుగ్రహించుట వలన నీ లక్షణ రూపము, నీకోరిక నాకు అనుగ్రహించినావు. అన్నియు అనుగ్రహించి ఒక్క స్వాతంత్ర్య లక్షణము అనుగ్రహింపకున్న యెడల తక్కినవన్నియు యిచ్చిన ప్రయోజనము లేదు. కనుక స్వాతంత్ర్య లక్షణము యిచ్చినందుకు నీకు స్తోత్రములు.
(xii) తండ్రీ, కుమార, పరిశుద్ధాత్మలను పేరులతో బైలుపడిన త్రియేక దేవుడవైన తండ్రీ! నీ ప్రత్యక్షత విషయమై నీకనేక వందనములు. నీవు నాకు దాగియుండు దేవుడవుకావు. గాని బైలుపడు దేవుడవు. నీ లక్షణములు, నీ క్రియలు, నీ గొప్పతనము, నాకు బైలుపర్చు దేవుడవు గనుక వందనములు. నీవు ఒక్కడవుగాను ముగ్గురవుగాను బైలుపడినావు. నీ మర్మము మాకు తెలియదుగాని నమ్ముచున్నాను. నేను నీ యొద్దకు, పరలోకమునకు జేరినప్పుడు తెలిసికొనగలను. నీ అపరిమిత జ్ఞానస్థితిని నా పరిమిత జ్ఞానస్థితితో ఎట్లు తెలిసికొనగలను? అనంత కాలము నీ విషయములు క్రొత్త కొత్తగా తెలిసికొనుచునే యుందును. నీ ప్రత్యక్షతకును నేను తెలిసికొనుటకును అంతములేదు. గనుక నీకు అనంత స్తుతులు చెల్లించుచున్నాను.
(xiii) మహిమ స్వరూపీ! ఆనంద స్వరూపీ! నేను నిత్యము నీ మహిమ కొరకు, నీ ముఖదర్శనములో, నీ సన్నిధిలో, నీ సహవాసములో, మిగుల ఆనందముగా గడుపగల స్థితి దయచేయుదువని నమ్ముచు నీ కనేక వందనములు చేయుచున్నాను.
(xiv) మాకు శరీరమును అనుగ్రహించిన దేవా! నీకు వందనములు. ఈ శరీరము పాపశరీరమైనందున దీనిని పరిశుద్ధ శరీరముగ మార్చుచున్నావు. తుదకు నాకు మహిమ శరీరము యిచ్చి నీయొద్దకు తీసుకొనివెళ్ళుదువు గనుక నీకు వందనములు. నీవు మూడు విధములుగా బయలుపడినావు. అట్లే నాకు మూడు విధములైన స్థితులు అనుగ్రహించినావు. జీవము, శరీరము, ఆత్మ అను మూడు స్థితులు దయచేసినందుకు నీకు వందనములు. ఈ మూడు కలిపి నన్ను ఒక వ్యక్తిగా నిలిపినావు. గనుక నీకు స్తోత్రములు. నేను ఒక విధముగ నీకు బిడ్డవలెనున్నాను. మరియొక లెక్కకు మూడుగానున్నాను. ఈ పవిత్రమైన సృష్టి నిమిత్తమై నీకు వందనములు. నీవు నాకు యిచ్చినవన్నియు నేను నిలుపుకొనునట్లు తోడ్పడుదువని నమ్మి వందనములు చేయుచున్నాను.
3. తండ్రీ! నీ స్థితిని, నీ క్రియలను, నీ దివ్య గుణములను, నా యెడల ఉన్న నీ తీరును, నీ మహిమను ఎవరు వర్ణింపగలరు? నీకనేక వందనములు.
1. దానకర్తవైన తండ్రీ! నీ ఉచితదానముల నిమిత్తమై నీకు స్తోత్రములు. గాలి ఉచితము. నేను పన్ను కట్టుటలేదు. ఒకవేళ నేను కట్టినను అదిచాలదు. నీ ఉచిత ధర్మము నిమిత్తమై అవి యున్నంత కాలము నీకు స్తోత్రములు. లోకాన్ని కలుగజేసినది మొదలుకొని లోకాంతము వరకు నీవు నరులందరకు అవిశ్వాసులకు, విశ్వాసులకు, మృగములకు, వృక్షాదులకు, జీవరాసులకు ఉచితముగా ధర్మము చేయుచునేయున్నావు. ఇవన్నియు మేము సంపాదించుకొనవలెనన్న యెడల రవ్వంతయైనను సంపాదించుకొనలేము. ఎన్నో పండ్లు ఎన్నో కూరగాయలు యిచ్చుచున్నావు. మానవులు తినగా ఎన్నో మిగిలిపోవుచున్నవి. నీ కనేక స్తోత్రములు. నీళ్ళు కూడ మిగిలిపోవుచున్నవి. నీవు భూమిలో పెట్టిన ఖనిజములు, లోహములనేకములున్నవి. మానవులు ఇంకా వీటిని తీసికొని వాడుకొనలేదు. కొన్ని వాడుకొనుచున్నారు గాని తరగడములేదు. నీవు మా యెదుట వేసిన భోజనపు బల్లమీద నున్న పదార్థములు యింకా తరగడము లేదు. ఒక దరినుండి మేము వాడుకొనుచుండగా, నీవు ఒకదరినుండి యింకను క్రొత్తవి యిచ్చుచునే యున్నావు. నీ దాన స్వభావమును ఎవరు వర్ణింపగలరు?. మా తెలివి తక్కువ తనము వల్ల మేము వాటిని పూర్తిగా వాడలేకపోవుచున్నాము. నీ దానములు అందుకొను శక్తి నరులకందరకు ఉన్నయెడల అందరును ధనికులే. ఒక్కరైనను బీదవారుండరు. నీవు కలుగజేసిన వాటిలో ఉపయోగము లేనిది యేదియులేదు. నా విషయమై నీకు ప్రతిదినము ఎంతో ఖర్చు ఉన్నది. నీవు బిల్లువేసిన యెడల నేను యివ్వగలనా? ప్రతి నిమిష దానములను బట్టి నీకనేక వందనములు.
5. ఓ తండ్రీ! నీవిచ్చిన అన్ని దానములకంటే నీ కుమారుని పంపిన దానము గొప్పది. అనంతమైనది. అందుకు నిన్ను నేను స్తుతింపవలెను. నీవు కోరిన యెడల ప్రతి రెప్పపాటున నిన్ను స్తుతింపవలెను. నీ కుమారుని అవతార దానమునకు మించిన దానము లేనేలేదు. ఆ దానమును బట్టి నీకు స్తోత్రములు. నేను పాప విసర్జన చేయవలెననియు, బాప్తిస్మము పొందవలెననియు, రక్షణ అందుకొనవలెననియు, సంస్కార భోజనము భుజింపవలెననియు, ఇతరుల రక్షణార్ధమై సేవ చేయవలెననియు, నీ వాక్య గ్రంథమును మా హృదయములో అచ్చువేయించుకొనవలెననియు, జీవాంతమందు నీ సన్నిధికి వచ్చివేయవలెననియు, నీవు కోరుచున్న కోరికకు యేమి చెప్పగలను! నీ దానములు లెక్క పెట్టుటకు కూర్చున్న యెడల మా దీర్ఘ జీవిత కాలము చాలదు. మా విశ్వాసము, మా గ్రహింపు, మా స్తుతి నీ దృష్టి యిదుట మిగుల స్వల్పమైనను నీవు అంగీకరించుట ఆశ్చర్యముగా వున్నది. ఏమి చెప్పగలను! ఏమి వివరించగలను! ఎంత జాగ్రత్తగా స్తుతి చేసినను యెప్పుడు పూర్తిగా కుదరదు. అయినను నీవు ఆనందించుచున్నావు. నీకు స్తోత్రములు. నీ కుమారుని దానమునకు వెలుపల ఏ దానములు లేవు. నీవు చూపుచున్న కృప వెలుపల ఏ కృపయు లేదు. సంఘము యొక్క వెలుపల రక్షణలేదు. నీ మహత్తు విషయమై నీకు లెక్కకు మించిన స్తోత్రములు.
6. నా జన్మము, నా బ్రతుకు ఎంత పవిత్రముగా నున్నను మరణ సమయమందు పరలోకమునకు నేను సిద్దముకానియెడల మా దీర్ఘాయుస్సు అంతయు వ్యర్ధమే. ఒకవేళ నేను మరణ సమయమునందు సిద్దముగా నున్నయెడల మోక్ష ప్రవేశము కలిగించుకొనుటకు ధన్యత కలదు. అంతకన్న మించిన అంతస్తుగల మరియొక ధన్యకాలము కలదు. ఆ కాలమునకు మా ప్రభువుయొక్క రెండవ రాకడకు నేను సిద్ధపడని యెడల భూమిమీద శ్రమలు అనుభవించుటకు మిగిలిపోదును. నేను అంతకాలము భక్తిగా బ్రతికి, అన్నియు నమ్మి రెండవ రాకడ నమ్మకయు, నమ్మినను సిద్ధపడకయు నున్న యెడల నాకు యెంత దౌర్భాగ్యత దాపరించును. భక్తిగల జీవనము, భక్తిగల మరణము, సజీవుల గుంపులో చేరవలసిన ఆరోహణము మా యెదుట పెట్టియున్నావు. గనుక నీకు స్తోత్రములు. లేనియెడల మా బ్రతుకు వలన ప్రయోజనమేమి? ఇట్టి ప్రయోజనములేని స్ధితి నాకు రాకుండ చేయగల తండ్రీ! నీకు స్తోత్రము.