క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
2. దైవలక్షణముల స్తుతి
( సంఘారాధనలోని స్తుతులు )
అనాది:- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు, గనుక నీవు ముందే ఉండి, మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు, గనుక నీకు మా వందనములు.
అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుట నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు.
ప్రేమ:- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన, మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజేసిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు, శిక్షించుచు, క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు.
పరిశుద్ధత:- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని, మానవుని, పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను, నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరిశుద్ధత దయచేయుచునే యున్నావు. "నీవు పరిశుద్ధుడవుగాన దేవదూతలచేత నిత్యము పరిశుద్ధుడవని స్తుతి నొందుచున్నావు, గనుక మమ్మును కూడా పరిశుద్ధపరచి, పరిశుద్ధులుగా నిత్యము నీ సన్నిధిలో నుంచుదువు గాన నీకు మా స్తుతులు.
సర్వశక్తి:- సర్వశక్తిగల తండ్రీ! నీవు సమస్తము చేయగలవు గాని పాపము చేయలేవు. మా విషయములో కష్టమైన పనియైనను, అసాధ్యమైన పనియైనను చేయగలవు. మా కోరికలను నెరవేర్చగల శక్తిగలవాడవు. మేము పడిపోయి మమ్మును లేవుమని అడిగిన యెడల లేవనెత్తగల శక్తిమంతుడవైన నీకు వందనములు.
సర్వజ్ఞాని:- జ్ఞానివైన తండ్రీ! నీ జ్ఞానము దేవదూతలకు, మనుష్యులకు, జీవరాసులకు ఇచ్చినావు. ఆ జ్ఞానము వలననే మానవులు సృష్టిలోని అనేక మర్మములు తెలిసికొనుచున్నారు. నేననుకొన్నది నెరవేర లేదని నోరు నెత్తి కొట్టుకొన్నా, నాయిష్టము నెరవేర్చవు. కారణము నా జ్ఞానమునకు తెలియదు గాని, నీ జ్ఞానమునకు తెలియును. అది నెరవేర్చిన నాకు హాని అని నీ సర్వజ్ఞానమునకు తెలియును. బైబిలులోని సంగతులు తెలియనప్పుడు అనేక ప్రశ్నలు వేసికొని మనస్సు చెడగొట్టుకొందుము. అప్పుడు మా జ్ఞానము మీద ఆనుకొనక, నిన్ను అడిగిన తప్పక వివరింతువు గనుక వందనములు.
ఉదా:- ప్రభువా! నిన్ను ఎరుగనివారు అంతకు ముందే అనేకులు చనిపోయిరి. వారి సంగతి యేమి? అని నీ సేవకుడు (దేవదాసు అయ్యగారు) అడుగగా "హేడెస్ లో నేను బైబిలు క్లాసు పెట్టినాను, బోధించుచున్నాను" అని చెప్పినపుడు నీ దాసుడు "Now it is clear Father" (తండ్రీ ఇప్పుడు స్పష్టముగా అర్థమైనది) అని సంతోషించి, స్తుతించిరి.
జీవము:- జీవమైయున్న ప్రభువా! నీవు జీవమైయున్నావు. గాన యెప్పుడును పనిచేయుచునే ఉన్నావు. మాలోని జీవము నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు మాలో నూతన జీవము ధారపోయుదువు. గనుక నేనును, నా ప్రార్ధనయు జీవము కలిగియుండును. మరణము వచ్చినను "ఇది మరణముకాదు, సరికొత్త జీవనమనగలము" వందనములు.
దైవలక్షణముల స్తుతి
English- 1) దేవా! నీవు అనాది వ్యక్తివైయున్నావు. నిన్ను ఎవ్వరు కలుగజేయలేదు. నీయంతట నీవే ఉన్నావు. గనుక నీకు వందనములు.
- 2) దేవా! నీవు వెలుగై యున్నావు. అందుచేతనే సూర్య, చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగు నిచ్చినావు. గనుక నీకు స్తోత్రములు.
- 3) దేవా! నీవు జ్ఞానమై యున్నావు. అందుచేత దేవదూతలకు, మనుష్యులకు, జీవరాసులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియుచున్నవి. మా జ్ఞానమునకు నీవు బైలుపడినావు గనుక నీకు స్తుతులు.
- 4) దేవా! నీవు ప్రేమయైయున్నావు. గనుక జీవరాసులు ఒక దానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుష్యులుకూడ ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు. గనుక నీకు స్తుతులు.
- 5) దేవా! నీవు న్యాయమై యున్నావు. గనుక నీవు క్షమించే వాడవు. అయినప్పటికిని తప్పుచేసినవారిని శిక్షించి, క్షమించే వాడవు గనుక నీకు ప్రణుతులు.
- 6) దేవా! నీవు పరిశుద్ధుడవైయున్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికిని పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జలములలో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపమున్నప్పటికిని పరిశుద్ధత కూడ ఉన్నది. గనుక నీకు నమస్కారములు.
- 7) దేవా! నీవు శక్తివై యున్నావు. కాబట్టి మానవులకు, జీవరాసులకు శక్తియిచ్చినావు. గనుక వారు నడువగలరు, పనిచేయగలరు, గనుక నీకు మంగళస్తోత్రములు.
- 8) దేవా! నీవు సర్వవ్యాపివైయున్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ స్వభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నవి. గనుక నీకు నిత్యమంగళ స్తుతులు.
- 9) దేవా! నీవు నిరాకారుడవైయున్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి. అయినప్పటికిని దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు. గనుక నీకు హృదయపూర్వక వందనములు.
- 10) దేవా! నీవు స్వతంత్రుడవై యున్నావు. స్వేచ్చాపరుడవై యున్నావు. నీకు ఎవ్వరును సలహానియ్యనక్కరలేదు. అన్నియు నీ యిష్ట ప్రకారమే చేయగలవు. గనుక నీకు హృదయపూర్వక వందనములు.
దేవా! నీయొక్క దివ్యలక్షణములు దేవదూతలకు, మనుష్యులకు ఇచ్చినావు. గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ
సద్గుణములు లేకుండ చేసికొన్నది. అలాగే మనుష్యులు పాపములో పడి నీ గుణములు చాలావరకు పోగొట్టుకొనుచున్నారు. అయినను నీవు
వారియెడల
దీర్ఘశాంతము కలిగియున్నావు. గనుక నీకు వందనములు.
మరియు ఓ దేవా! నిన్ను అడిగే వారికి నీ శక్తులు దయ చేయుదువు.
గనుక
నమస్కారములు.
దేవా! నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలు పర్చినావు. గనుక
నీకు అనేక
స్తుతులు.
మరియు దేవా! సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో ఉన్నవి గనుక స్తుతులు.
మరియు
దేవా!
నమ్మినవారిలో నున్న దుర్గుణములు దూరముగా తీసివేసి, మోక్షమునకు చేర్చుకొనుచున్నావు. అక్కడ వారు శాశ్వతముగా నీ
దివ్యలక్షణములు
అనుభవిస్తున్నారు. గనుక నీకు మంగళస్తోత్రములు.