(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

దేవుడు ఊరుకొనుటకు గల కారణములు



1. మనిషిని కలుగజేసి, మనిషికి చెప్పవలసినవన్నీ చెప్పినందున ఊరుకొనెను. ఆ చెట్టు పండును తినవద్దని దేవుడు మనిషికి చెప్పిన తరువాత మనిషి దానిని తిన్నాడు. గనుక మనిషిదే నేరము. ముందు ఆ మాట వారికి చెప్పని యెడల ఆయనదే నేరమైయుండును, చెప్పినందున దేవుడు నేరన్ధుడుకాడు గనుక మనిషి తనలోనికి పాపమును రానివ్వకూడదు జలప్రళభయమునుగూర్చి దేవుడు నోవహుచేత ప్రజలకు చెప్పించెను. అయిననూ ప్రజలు వినలేదు, ఓడలోనికి రాలేదు. చెప్పించిన దేవునిదా? చెప్పిన నోవహుదా? చేర్చుకొనని నావదా? రాని ప్రజలదా తప్పు! రాని ప్రజలదే తప్పు. ప్రజలు నోవహు చెప్పిన సంగతి విననందున వాన చెప్పవలసినది చెప్పెను. చెప్పినను మనిషి వినుటలేదు గాన దేవుడు చెప్పుట మానివేయును.


2. దేవుడు మనిషిని కలుగజేసినప్పుడే ఆయనయొక్క లక్షణములను మనిషిలో ఉంచివేసెను. అట్టి దేవుని లక్షణములు గల మనిషి పాపమును రానివ్వకూడదు. పాపము దేవునిలోనికి వెళ్ళబోతే ఆయన రానియ్యడు దేవుని గుణములు ఆ పాపమును దేవునిలోనికి రానియ్యవు. ఇతనిలో (మనిషిలో) దేవుని గుణములు ఉన్నవి గాన పాపమును రానియ్యకూడదు గనుక మనిషి దేవునిని తప్పు అర్ధము చేసికొనుటకు సందులేదు.


3. మనిషిలో దేవుని లక్షణములున్నవి. తెలుసుకునే జ్ఞానమున్నది. విడిచిపెట్టుటకు మనస్సాక్షి ఉన్నది. మనిషి ఎప్పుడూ పాపము చేయకుండ పై మూడు స్వరములు ఏకముగా పనిచేయుచునే ఉండును. ఈ మూడు చెప్పిననూ మనిషి వినలేదు గాన మనిషి తనను తానే నిందించుకొనవలెను. గాని దేవుని నిందించరాదు. దేవుడు పెట్టిన వీటిని దేవుడు తీసివేయడు ఇవి అన్యులలోను, నామకార్దపు క్రైస్తవులలోను, విశ్వాసులలోను ఉన్నవి. వీనినిబట్టి పాపము నెదిరించి పాపము చేయకుండ ఉండగల స్థితిని దేవుడు మనిషిలో ఉంచినాడు.