(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
పరలోక మహిమాంతస్థు
22. ఒకరు రహస్యమైన గదిలో ప్రార్ధన చేయకుండ ఉండెను. అతడు చేతులు నలుపుచూ ప్రభువా! నన్ను నీ సింహాసనమువద్ద మొదటి స్థానమందు ఉంచుము అని అడుగుచుండగా అయ్యగారు వెళ్ళిరి. అట్టి స్థానము కావలెననిన అధికమైన కష్టములు రానిచ్చును. అధికమైన కష్టములు రానియెడల అధికమైన స్థానమురాదు. అప్పుడు ఈ సామి మూలుగును; అప్పుడు ప్రభువుపై స్థానము కావలెనని నీవెకదా కోరినావు? పై స్థానము కావలెనంటే ఇచ్చెదను గానీ ఈ అధికమైన కష్టములు లేకుండ ఈ ఘనమైన స్థానము దొరకదనెను. ఈ సంవత్సరము మా పొలములో 10 బస్తాల ధాన్యము పండినది. ఇవి చాలవు వచ్చే సంవత్సరము 20 బస్తాలు కావలెననెను. ఈ భూస్వామికి ఎక్కువ కష్టమా? తక్కువ కష్టమా? నేను ఎక్కువ కష్టపడుచున్నానని మూలిగిన ఆ 10 బస్తాలు రావుకదా! నీవు కోరుకొన్నట్లు నెరవేరిపోవలెనంటే కష్టములు తప్పవు.
23. ఒక భక్తుడు ఇట్లనుచున్నాడు ప్రభువా! నాకు పై స్థానము వద్దు ఎక్కడయినా ఒక మూల ఉంచితే అక్కడ ఉండి నీ ముఖము చూచుచుందును. అది మోక్షమేకదా అనెను. ఎక్కువ స్థానము కోరుకొన్న ఎక్కువ కష్టములుగాన నేను సహించలేనని ప్రార్థన చేసెను. మీలో మోక్షములో ఒక మూల కావలెనని కోరుకొనువారున్నారా? మోక్షములో 7 అంతస్తులున్నవి ఎఫెసు నుండి లవాదికయ వరకు. ఈ 7 సంఘాంతస్తులు ఈ ఏడు సింహాసనము దగ్గరనే ఉన్నవి. గాని లవాదికయ దేవుని సింహాసనమునకు మిక్కిలి సమీపముగా ఉన్నది. దీనిని కోరుకొనుచున్నారు గాని కష్టములు వచ్చిన విసుగుకొందురు. నత్తవలె పడిపోవుచున్నారు. రెండు గజములు ఎక్కి 3 గజములు పడిపోవుచున్నారు. కొందరు గొప్ప స్థితిలోనికి వచ్చి తగ్గిపోవుచున్నారు. అట్టివారు ఉన్నారు మీకు ఏది కావలెనో కోరుకొనండి. అంతామోక్షమే అంతా మహిమేగాని అనుభవము తేడాగానుండును. మొదటి అనుభవముకంటే తక్కిన అంతస్థుగలవారి అనుభవాంతస్థు వేరుగా నుండును.
ప్రకటన. 2,3 అధ్యాయము ఈ 7 అంతస్థులుకాక ఇంకొక క్రొత్త అంతస్థు ప్రకటనలో ఉన్నది. ఆ ఏడేండ్ల శ్రమకాలములో రక్షింపబడినవారున్న అంతస్థు రక్షితుల మోక్షము కలదు. ఇది ఎనిమిదవ అంతస్థు. ఇదియుగాక ఇంకొక క్రొత్త అంతస్థు ప్రకటనలో ఉన్నది. అది ఎప్పుడు చెప్పలేదు. చెప్పినాను గానీ నంబరు వేయలేదు. అది ఏమనగా వెయ్యి సంవత్సరముల పాలన జరిగిపోయిన తర్వాత చివర అంత్యతీర్పు అయిన తరువాత, ఈ భూలోకముకూడా మోక్ష లోములో ఒక భాగమగును. ఈ భూలోకము మొదట కలుగజేసిన భూలోకమువంటితగును. ఏ బేధములేదు. పాపములేదు. ఆదాము, హవ్వలకు పాపమంటే ఏమిటో తెలియనట్లు వీరికికూడా పాపమంటే ఏమిటో తెలియదు. గనుక మోక్షములో ఒక భాగమగును. ఇది తొమ్మిదవ అంతస్థు. తొమ్మిది అంతస్థులలోను క్రీస్తుప్రభువు ఉండును. ఈ అంతస్థులలో ఉన్న కోటాను కోట్లు ప్రజలవద్ద వారి వారి అంతస్థునుబట్టి ఒక్కొక్కరితోను ప్రభువు ఉండును. వారివారి అంతస్థు స్థితిని బట్టి ప్రభువుయొక్కమహిమ వారికి కనబడును - 1కొరింధి. 15. వారెంత మహిమ సంపాదించుకొన్నారో అంత మహిమతో ప్రభువు వారివద్ద ఉండును. ఎఫెసు సంఘములోని మహిమ వేరు, మిగత సంఘముల అంతస్థులవారి మహిమ వేరు 1కొరింథి. 15:38-41.
ఈ నక్షత్రమహిమ వేరు ఆ నక్షత్ర మహిమ వేరు. (క్రొత్త శరీరము) మాంసము అంత ఒకటికాదు వేరువేరు. ఆకాశ వస్తు రూపములు వేరు, భూవస్తురూపములువేరు. సూర్యుని మహిమ వేరు. చంద్రుని మహిమవేరు, నక్షత్ర మహిమ వేరు. ఇక్కడ ఎంత మహిమ సంపాదించుకొనిన అక్కడ అంత మహిమ ఉండును. ప్రతివారు తమతమ వరునలో ఉందురు. పరమందు బేధములేదుగానీ బేధము కనబడుచున్నది. ఈ లోక బేధమువంటి తగాదా బేధము అక్కడలేదు. ప్రభువా! నన్ను ఇక్కడ కూర్చుండబెట్టినావు? ఇంటిలో పనిచేసిన మనిషిని ఎందుకు అక్కడ కూర్చుండబెట్టినావు అని అనరు. ఇక్కడ ఈ బేధము ఉన్నది. గనుక ఆ మాట అందురుగానీ పరమందు అనరు. యోసేపు సహోదరులు తమ్మునిమీద అసూయవ పడి కలలుకనువాడు వచ్చుచున్నాపని పట్టుకొని గోతిలో పడవేసి విచారము లేకుండ అన్నము తినుచుండిరి. ఈ కథ ఇక్కడ మారినది. యోసేపు విందుచేసినప్పుడు పదిమందికి ఒక్కొక్క వంతుచొప్పున వడ్డింపజేసి బెన్యామోనుకు 5 అంతలు వడ్డించినట్లుగా చేసియున్నాడు.
అప్పుడు అన్నలు అసూయపడలేదుగానీ సంతోషించిరి. అట్లే పరలోకములో అంతస్థుల బేధమునుబట్టి అసూయపడరు. గాని సంతోషింతురు. అంతగోప ప్పస్ధి స్టితి అక్కడ వచ్చును. పై అంతస్థులో ఏదో ఒకటి కోరుకొనండి. బల్లమీద ఉన్నవన్ని తినేవే గనుక మాకు ఇష్టము ఉన్నవి తీసికొని తినండి. ఏదైనా అక్కరలేదనిన అక్కడనుండి తీసివేయును. పై అంతస్థునకు సరిపడునట్టి కష్టములయొక్క అంతస్థు ఏదో ఆయనకు తెలియును గనుక ఆయా కష్టములు వచ్చినప్పుడు ఆయన ఊరుకొనును.
24. ఒక స్నేహితుడు ఒకనికి అన్నము వడ్దించుచుండగా ఎక్కువ వడ్దించవద్దు తినలేడు, పడవేయకూడదు. ఇది కష్టకాలము గనుక ఎక్కువ వడ్దించవద్దనెను. వద్దన్నను రెండు గరిటెల అన్నము వేసెను. అన్నమంత అతడు తినివేసెను. భుజించే స్నేహితుడు వద్దన్నను వడ్డించిన దంతయు తినెను. వడ్డించువారికి తెలిసి వడ్డించెను. అట్లే విశ్వాసి వద్దన్నను తీరా ప్రభువు తీసికొని వెళ్ళిన నాకు అక్కరలేదనడు. గాని ఆనందించును ఈ మహిమకు తగిన కష్టము ఇచ్చినప్పుడు ఈ శ్రమ వద్దు తీసివేయుము ప్రభువా! అన్నావు. తీసివేసిన ఇట్టి మహిమ దొరుకునా? అని ప్రభువు పలుకును. కొందరి విషయములో ప్రభువు ఇట్లు అనును. ఇక్కడ శ్రమవద్దు అనే విశ్వాసి పరలోకమునకు వెళ్ళినది. దీనికి బైబిలులో ఒక కథ ఉన్నది గాని అది సరిపోదుగాని సరిపోయేటట్టు నేను పొదుపుగా వాడుకొందును. మత్తయి 25 అధ్యాయము. అవును ప్రభువా! నీవు ఎప్పుడు జబ్బుగానున్నావు? నేను ఎప్పుడు చూడవచ్చితిని. నీవు ఎప్పుడు ఆకలిగొన్నావు? ఎప్పుడు అన్నము పెట్టితిని? అని విశ్వాసి అనును. ఈ కథను ఇది సరిపోవును ఇంతగొప్ప అంతస్థు ఎందుకిచ్చినావంటే దీనికి తగిన రీతిని భూమిపై నడచినావు గాన ఇంతగొప్ప అంతస్థును ఇచ్చితిని అనును.
ప్రశ్న:- దొంగ ప్రభువు కొరకు ఏమి శ్రమపడెను. అయినను రక్షణ వచ్చినది. దొంగను నిలువున సిలువవేసిరి దొంగయొక్క పాపమునకు శిక్ష సిలువ మరణము. ప్రభువును మెచ్చుకొన్నందున రక్షణ వచ్చినది.
- 1) ప్రభువును తెలిసికొనలేదు
- 2) వాక్యమును పఠించలేదు
- 3) నమ్మలేదు
- 4) అంగీకరించలేదు
- 5) ప్రకటించలేదు
- 6) కష్టములు అనుభవించను లేదు
- 7) గొప్ప అంతస్థును కోరుకొనలేదు గనుకనే ప్రభువు పరదైసులో ఉందువనెను. లూకా 23. దొంగ మరణ సమయమప్పుడు మారినందున ఎక్కువ అంతస్థును సంపాదించుకొనుటకు వీలులేకపోయినది.
ప్రకటనలో 2వ అధ్యాయములో ఉన్న మొదటి అంతస్థయిన పరదైసు అంతస్థు మాత్రమే వచ్చినది. పరదైసులో ఉన్నవారు మొదటి అంతస్తు. ఇక్కడ ఎన్ని విన్న ఎన్ని చదివిన, ఎన్ని వ్రాసికొన్న జ్ఞానము, మనస్సాక్షి ఆత్మ చెప్పినను నచ్చనివారుందురు. అట్టివారు మరణ సమయములో మారి పరదైసుకు వెళ్ళుదురు. ముందే మారితే గొప్ప అంతస్థు ఉండును వారు మారలేదు గనుక గొప్ప అంతస్థుకు చేరలేదు. ఈవేళ సంపాదించుకొంటే ఎక్కువ మహిమ దొరుకును రేపు అయితే పరదైసు అంతస్తే దొరుకును.
ప్రార్ధన:- త్రియేక దేవుడవైన తండ్రీ! ఆకాశములోని జ్యోతులను, భూమిని, మేము అడుగకుండగానే ప్రతిదినము ఎట్లు చూపించుచున్నావో, అలాగే మోక్షములోని సమస్తము నీవాక్యముద్వారా చూపించుచున్నావు గనుక నీకు స్తోత్రములు. మోక్షములోనున్న సంగతులు మాకు పటము ద్వారా చూపినట్టు అక్కడ ఎవరున్నారో ఏమి మాట్లాడుచున్నారో అక్కడ దీపములేమిటో నీ గ్రంథములో వ్రాసిపెట్టి అన్ని మాకు చూపించుచున్న తండ్రీ నీకు స్తోత్రములు. జ్ఞాన నేత్రమునకు తెలియచేసిన తండ్రీ! స్తోత్రములు. మోక్షలోక పటము మాత్రమేగాక మేము అక్కడికి ఎట్లు సిద్ధపడవలెనో చూపించుచున్న నీకు వందనములు. ఇక్కడున్న అందరు వాక్యాహారము మిగిలేటట్టు వడ్డించుమని యేసునామమున వేడుకొను చున్నాము ఆమేన్.