(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
దేవుడు ఎందుకు ఊరుకొనుచున్నాడు?
దేవునియొక్క మంచితనము మనకు తెలియదు గనుక దేవుని గూర్చి తప్పుగా భావించుటకు మనకు సందులేదు. ఆయన గుణములు అనాది గుణములు అవి ఎవరికి తెలియవు. దేవదూతలకును తెలియవు. ఆ గుణముల ప్రకారముగా ఆయన కొన్ని పనులు చేసియున్నారు. దేవదూతలను, ఆకాశమును, భూమిని, ఏదేనుతోటను, ఆది దంపతులను మొదలగు వానిని కలుగజేసియున్నారు.
ఆయన పరిశుద్దుడు గనుక ఆయన చేసిన సమస్తమును పరిశుద్ధములైనవి ఆయన పరిశుద్ధుడు ఆయన కార్యములు పరిశుద్ధములైనవి. అని ఎరిగి మనము పాపపతనము తరువాత కలిగిన చెడుగునుబట్టి ఆయనయుందున్న మంచి అభిప్రాయమును చెడగొట్టుకొనకూడదు. ఆయన లక్షణములు చెప్పుటలో తెలియవుకాని ఆయన చేసిన కార్యములనుబట్టి తెలిసికొనగలము. పాపము ప్రవేశించి నేటికి ఆరువేల సంవత్సరములు అయినది. అప్పటినుండి పాపకార్యములు జరుగుచున్నవి. అయినప్పటికిని దేవుని మంచి కార్యములు జరుగుట ఆగలేదు. పాపకార్యములు జరుగుచుండగా దేవుని మంచి కార్యములు ఆయన మంచిగుణములు, ఆ తరువాత వచ్చిన మంచి కార్యములు మనకు తప్పుగా కనబడును.
ఎందుకంటే మన పాపకార్యములు వాటికి అడ్డుగా నున్నవి. పాపకార్యములు, దేవుని మంచి కార్యములు ఈ రెండు ప్రవాహములుగా వచ్చుచున్నవి. ఆయన మంచికార్యములు, మంచి గుణములు ఎప్పటివి. అనాదివి మనము తప్పుగా భావించుచున్నాము. ఆయన చేసిన పనిలో పాపము ప్రవేశింపగా ఆయన ఎందుకు ఊరుకొనుచున్నారు? అది బాగుగాలేదు అనుచున్నారు. అట్లనుటనుబట్టి ఆయనను, ఆయన మంచి కార్యములను, ఇప్పటి మంచి కార్యములను కొట్టివేయుచున్నారు. ఎందుకు ఊరుకొనుచున్నాడు అంటే ఆయనకు తెలియక ఊరుకొనుచున్నాడు అని అనుచున్నారు. ఇంత కుమ్మరము వచ్చునని తెలిసి ఉంటే ఆ చెట్టునే వేయకుండును అని ఒక వేదాంతి అన్నాడు మనమునూ అట్లే అనుచున్నాముగాని బహిరంగమునకు అనుటలేదు మనము ఆవిధముగా అనుటకు సందులేదు. దూతలు, ఆకాశము, భూమి, దంపతులను చేయుట గొప్పపనులేగాని పాపము ప్రవేశించిన తరువాత నేటివరకుకూడా గొప్ప కార్యములు జరుగుచునేయున్నవి.
ఆకాశము ఒక విందు భూమి ఒక విందు. ఆది తల్లిదండ్రులు ఒక విందు. మనకు ఇట్టి గొప్ప విందులుండగా తప్పు అర్ధము చేసికొనుటకు వీలులేదు. పాప పతనము తరువాత రక్షణ విందు ఏర్పరచెను, పైవాటికంటే మించిన విందు రక్షణవిందు కనుక ప్రభువునుగూర్చి అపార్ధము చేసికొనరాదు. మనుష్యులు చేసిన విందుకు వంక ఉన్నది, గాని తండ్రిచేసిన విందుకు వంక శంకలేదు. వడ్రంగి కుర్చీచేసి, ఎవరూ చూడకముందే బాగుగా కుదిరినదని తనకు తాను మెచ్చుకొని తరువాత అమ్మును. అట్లే ప్రభువు కూడా భూమ్యాకాశములను సమస్తమును కలుగజేసి ఆయన చేసిన పనిని ఆయనే చూచి ఇది చాలా బాగున్నదని మెచ్చుకొనెను. ఆయన పనిని పాపము ప్రవేశించిన తరువాత ఆయన నియమించిన రక్షణ కార్యము నెరవేరుచుండగా ఆ రక్షణను గ్రహించి అనుభవించుట మనిషి వంతు. కుర్చీ బాగున్నదని మెచ్చుకొనుట వండ్రంగి వంతు. అది కొన్నవాడు వాడుకొని బాగున్నదని మెచ్చుకొనుట వారి వంతు. ఆలాగే మనము రక్షణ పొందిన తరువాత ప్రభువు పని బాగున్నదని మెచ్చుకొందుము.
ఆయన సృష్టిని మెచ్చుకొన్నట్లు మనము రక్షణ కార్యకార్యక్రమమును మెచ్చుకొనవలెను పాపము ఒకదరినుండి వెళ్లుచుండగా రక్షణ కార్యక్రమము మరొక దరినుండి వెళ్లుచుండగా అది మెచ్చుకొన్న మనము ఇదెందుకు మెచ్చుకొనకూడదు? పాపము జరుగుటచూచి మనమెందుకు దేవుని మెచ్చుకొనకూడదు? భూమ్యాకాశములను రక్షణను ఇచ్చినందున దేవునిని మెచ్చుకొన్న మనము పావము జరుగుటచూచి ఊరుకున్న దేవుని మనమెందుకు మెచ్చుకొనకూడదు? ఎందుచేత ఊరుకొనుచున్నాడు? ఏమి చేయవలెనో తెలియకనా? లేక తోచకనా? ఏమిటి? ఎందుకో ఊరుకొనుచున్నాడు. ఊరుకొని, ఊరుకొని, అడ్డుపెట్టవలసి వచ్చినప్పుడు అడ్డుపెట్టును.