(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
స్వతంత్రత
4. స్వతంత్రత: దేవుడు అన్ని గుణములు ఇచ్చినట్లు స్వతంత్రతను కూడా ఇచ్చినాడు. దేవునిలో స్వతంత్రత ఉన్నది. మనిషిలోను స్వతంత్రత ఉన్నది. దేవుడు స్వతంత్రత కలిగి ఎట్లు మెలగుచున్నాడో అట్లే మనిషి మెలగవలెను. మనిషిలో స్వతంత్రత, పవిత్రత ఉన్నవి. త్రియేకత్వము, అనాది, అనంతము, నిరాకారము, జీవము, పరిశుద్ధత, ప్రేమ, శక్తి, న్యాయము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము దేవునిలోనున్న ఈ గుణము లన్నియు మనిషిలోను ఉన్నవి. స్వతంత్రత అనే లక్షణము మనిషిలో లేకపోతే మిగిలినవన్నియు ఉన్ననూ ఒక్కటే లేకపోయినను ఒకటే, స్వతంత్రత లేకపోతే దేవుని లక్షణములు అందుకొనలేము. అందుకొనలేకపోతే మెల్లగా కూర్చుండవలసినదే. బల్లమీద అన్ని రకములైన పండ్లు, మిఠాయిలు పెట్టి ఒకరిని పిలిచి, పిలిచిన ఆయన ఊరకుంటే వచ్చినవ్యక్తి ఊరకనే ఉండును. విందు యజమాని వచ్చి నీకు కావలసినవి తీసుకొనుమనగా తీసికొనును దానిపేరే స్వతంత్రత. దేవుడు ఆదాము అవ్వలను పిలిచి ఈ పండ్లు నిరభ్యంతరముగా తినండి ఆటంకము చేయననెను ఇదే స్వతంత్రత. విశ్వాసులతోను, అవిశ్వాసులతోను అన్యులతోను జ్ఞానము, మనస్సాక్షిద్వారా దేవుడు చెప్పినను అవి చాలుటలేదని జ్ఞానము, మనస్సాక్షి చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్పుటకును కంటికి కనబడుటకును దేవుడు ఒక ఉపాయము పన్ని వాటన్నింటిని ఒక పుస్తకములో వ్రాయించెను అదే బైబిలు వివరించుచున్నది. ఇది రెండు భాగములు.
- 1) చేయుము
- 2) చేయవద్దు.
మంచి కార్యములు చేయుము అవి బైబిలులో నున్నవి. దుష్టకార్యములు చేయవద్దు అది బైబిలులోనే ఉన్నవి. ఆ చండాలపు మాటలన్నియు బైబిలులోనేయున్నవి. మంచివి వ్రాసినారు సరేగాని చెడ్దకార్యములెందుకు వ్రాయించెను? అని విద్యార్థులనుచున్నారు. చెడ్డవి వ్రాయించకపోతే అవి తెలియవుగాన వ్రాయించెను అతడు చెడ్డపాపమున్నదని తెలుపుటకు వ్రాయించెను. ఇవి తినండి. ఇవి తినవద్దు అన్నచోటే బైబిలంతా ఉన్నది. చేయుమన్నది చెప్పి, చేయవద్దన్నది చెప్పకపోతే మనిషి బేలా (దుష్టుడు/చెడ్డవాడు) అయిపోతాడు. అందుకే దేవుడు జ్ఞానముద్వారా, మనస్సాక్షిద్వారా, బోధకులద్వారా చెప్పించుచున్నాడు. మనిషి తన ఇష్టప్రకారము చేయవచ్చును. ఇది స్వతంత్రత. మనిషి మంచిపండ్లు యొద్దనుండి చెడ్డపండ్లయొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు ఆపుచేసిన యెడల మనిషియొక్క స్వతంత్రత ఆగిపోవును. అంటే అంతా ఆపుచేసినట్లే. తీగెలాగితే డొంకంత కదులును.
మెయిన్ స్విచ్ నొక్కితే అన్ని దీపాలు ఆరిపోవును. అట్లే స్వతంత్రతను ఆపితే అన్ని లక్షణములు ఆగిపోవును గాన అడ్డము పెట్టడు అడ్డము పెట్టిన యెడల మనిషి నశించును. దేవుడే అడ్డము పెట్టిన యెడల తానే స్వయముగా మనిషిని చంపిన వాడగును. అందుకనే దేవుడు ఊరుకొనెను. మనిషి పాపములో పడి ఆ తరువాత ప్రభువా! అంటే ఆ మనిషిని లేవనెత్తుకొనునుగానీ పాపముచేయకుండ అడ్డుపెట్టడు పాపములో పడనిచ్చును. తప్పిపోయిన కుమారుడు పందులవద్ద పశ్చాత్తాపపడెను. తండ్రి మేడమీదనుండి చూచి ఎందుకు పడ్డావని అనలేదు, గానీ ఆ పందిలాంటి వానిని ముద్దుపెట్టుకున్నాడు సబ్బుతో స్నానముచేయించి, పౌడరురాసి, శుభ్రమైన బట్టలువేసి, నున్నగా తల దువ్వించి ఆ తరువాత ముద్దుపెట్టుకొనవలసినది. గానీ అట్లు చేయక ముందే ముద్దుపెట్టుకొనెను. అట్లే "ప్రభువా!" అంటే ముద్దు పెట్టుకొని, ఎత్తుకొని తీసికొనివెళ్లును. మనిషిపైకి గత్తరగా నున్నను లోపల బాగుగా నున్నాడు. అందుకు తండ్రివైపు తిరిగినందున ముద్దు పెట్టుకొనెను. పైకి బాగుగా లేకపోయినను లోపల బాగున్నాడు. పైకి చింపీరి గుడ్డలు, చింపిరి తల అయినను తండ్రి చేర్చుకొన్నాడు. నన్ను నీ సేవకునిగా చేర్చుకొనుమనెను. ఇదే మంచి బుద్ధి ఎంత గొప్ప బుద్ది?
ఇట్టి మంచిబుద్ది. గొప్ప శుద్ధిగలిగినవారిని రేపు ప్రభువు ముద్దుకొనును.