(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

కొన్ని కారణములు



1) మనిషి Right about turn అవుటకు, మనిషి దేవునివైపు తిన్నగా తిరుగుటకు


2) మనిషి తాను నేర్చుకొనవలసిన నీతి పాఠములు నేర్చుకొనవలెను గాన కష్టములు రానిచ్చినందున నీతిపాఠములు నేర్చుకొనును. ఆ మనిషి తన తప్పు తాను తెలిసికొనును


౩) మరికొందరి విషయములో అతడు ఇంక బ్రతికి ఉండిన పాపములో నుండి మరియొక పెద్దపాపములో పడునుగాన ప్రభువు అతనిని తీసికొనును. ఒక్కొక్క రకమునకు కోటాను కోట్లు ఉందురు.


4) విశ్వాసులు ప్రార్ధన చేసిన నెరవేరదు. నిరాశలోనికి వెళ్ళుదురు. నిరాశలోనికి వెళ్ళిన దేవుడు ఆలకించడు. ఆలకించిన యెడల మనుష్యుడు దేవునికి దక్కడు గాన ఆలకించడు. వినకపోయిన అడిగినవికాక వేరే సదుపాయముచేసి కన్నీటిని తుడుచును.


5) మనిషి తాను వాడలేని వరములు కావలెనని అడిగినయెడల దేవుడు ఇచ్చిన యెడల మనిషి పాడుచేసికొనును. గాన ఇవ్వడు, వినడు.


6) మరియొకరికి తమకున్న వరమే ముఖ్యము గాని వరమిచ్చిన దాత ముఖ్యము కాదని వరముమీద ఆధారపడును. గనుక అడిగిన వరము ఇవ్వడు. కొందరు ప్రార్థించిన దేవుడు వెంటనే వినును. కొందరు ప్రార్ధించిన వెంటనే వినడు ఎందువల్ల?


7) ఓపిక ఎక్కువ చేయుటకు. గోజాడిన స్త్రీ అనేకసార్లు న్యాయాధికారివద్దకు వచ్చినది. ఆయనకేసు విచారణ చేయనందున అనేకసార్లు వచ్చినది. గనుక ఆమెలోని ఓపిక కనబడుచున్నది. అదే సహింపు వరము. ఇది దేవుని లక్షణములలో ఒకటి. ఇది అనేకమందికి ఉండదు. కొందరికి విసుగుదల ఉండును. జడ్జిగారు ఆలస్యము చేసినందున ఆమెకు ఓపిక వచ్చినది.


దేవుని లక్షణము దీర్ఘశాంతము 1పేతురు. 3:20. నోవహు కాలములోని ప్రజల విషయములో ఆ మాట వాడబడెను. ఆయన దీర్ఘశాంతము ఇంకా ఇంకా అని కనిపెట్టుచున్నది. మనకును అట్టి దీర్ఘశాంతము ఉండవలెను.


8) కొంతమంది భక్తులకు శ్రమ ఈ ప్రక్కనుండి ఆ ప్రక్కనుండి వచ్చి రెండు ప్రక్కల రెండు శ్రమలు నొక్కినప్పటికిని ఆయనకు తెలియదా! అని నిజభక్తుడు అనును. దేవా! దేవా! అని అంటావెందుకు? అని ఇతరులు అడిగితే నా సంగతి నా శ్రమనాయనకు తెలియదా! నన్ను ఎన్నడు చంపడు. నన్ను ఎన్నడు నాశనము చేయడు అని భక్తిగలవారు అన్నప్పుడు అందరు భక్తి నేర్చుకొందురు. భక్తిగలవారికి మెప్పు కలుగును. అట్టి భక్తినిచ్చిన దేవుని మెచ్చుకొందురు. ఇది కొందరికే.


9) అన్ని రకములైన శ్రమలు ఉన్నవి అవి ఎప్పటికిని పోవుటలేదు. నాలుగు కష్టములు తీసివేయమంటే ఐదవది కూడా వచ్చినది. ప్రార్ధన చేసినకొలది కష్టములు ఎక్కువగుచున్నవి. ప్రార్ధన చేయనంటే నీవు ప్రార్ధన చేసిన దేవుడు నీకు బహుమానము ఇవ్వనైయున్నాడు. ఓపిక పట్టమని పాదిరిగారు చెప్పిన అప్పుడు ఊరుకొనును. ఓర్చుకొన్న తరువాత భూమి మీదనే ఆ బహుమానము నిచ్చును. బహుమానము నిచ్చినప్పుడు ఇన్ని శ్రమలు అనుభవించబట్టే యోబునకు వలె ఇట్టి బహుమానము వచ్చెనని అనుకొనును. ఆయుష్కాలము ఎక్కువ, ఆస్తి, పిల్లలు ఎక్కువ. మెప్పు ఎక్కువ ఇవి ఇచ్చుటకే దేవుడు శ్రమలను రానిచ్చును.


10) సైతాను సిగ్గుపడుటకు ఓ సాతానా! నా బిడ్డను నీవు ఎన్ని శ్రమలు పెట్టినను నేను ఊరుకొన్నాను. అయిననూ నా కుమారుడు విసుగుకొనలేదు. ఇక నీకు సిగ్గు అని సైతానుతో దేవుడు చెప్పును. అట్టిది అందరికి కాదు కొందరికే రానిచ్చును, చివరికి సాతాను అపలేడు.


11) శ్రమవల్ల భూలోక బహుమానము వేరుగాను, పరలోకములో మహిమ కిరీటము వేరుగాను ఉండును. స్తెఫనును హింసకులు రాళ్ళతో కొట్టినప్పుడు సైఫను ఆ హింసకులను శపించలేదు గాని, క్షమించు ప్రభువా! అని పలికి చనిపోయి పరలోకమునకు వెళ్ళెను. వెంటనే మహిమ కిరీటమును ధరించుకొనెను. స్తెఫను అను మాటకు కిరీటము అని అర్ధము. మీకందరకూ శ్రమలు రావలెనని నేను అనను, శ్రమరావద్ధని అనను. ఒకవేళ వచ్చిన యోబువలె, స్తెఫనువలె, అపోస్తలులు పండ్రెండు మందివలె సహించిన యెడల ఈలోకములోను, పరలోకములోను బహుమానము వచ్చును.


12) రక్షణ పొందిన మనము పరలోకమునకు వెళ్ళిన తరువాత ప్రభువు మనలను కౌగిలించుకొని మహిమలోనున్న తండ్రి వద్దకు, దేవదూతలవద్దకు తీసికొనివెళ్ళి ఈ మనుష్యుడు దొరకలేదు. చివరికి దొరికెను. భూమిపై గొప్పపని చెసెనని తండ్రి ఎదుట, దూతల ఎదుటను ఒప్పుకొనును (లూకా. 15:10). అప్పుడు ఎప్పుడు వినని అల్లరి వినబడును. దేవదూతలందరూ తమరెక్కల రెపరెపలాడించి సంతోషముతో స్తుతిచేయుదురు ఇది జరిగించుటకే శ్రమ రానిచ్చును.


ప్రార్ధన:- దయగల తండ్రీ! శ్రమలు లేనివారు భూలోకములో లేరు. శ్రమలద్వారా మహిమోపకారముచేయు దేవుడవు. ఇట్టి శ్రమలను చూచి నీ నామధారులైనవారు ఎప్పుడైన, ఎక్కడైన ఎందుకైనా విసుగుకొంటే ఆ విసుగుదలను తీసివేసి, అట్టివారికి నీ కృపను, నీ శక్తిని, నీ సహింపును, నీ మహిమను చూపుమని యేసు నామములో వేడుకొనుచున్నాము. ఆమేన్.