(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

త్రియేకత్వము



త్రియేకత్వమును ప్రభువు మనకిచ్చెను ఆయనయొక్క లక్షణములలో ప్రతి లక్షణమును తీసికొని వాటితో మనిషిని చేసినాడు కాబట్టి ఆ గుణములే మనిషిలోనున్నవి; ఒకటి మాత్రము క్రొత్తది చేసినాడు. అదే శరీరము. దేవునికి లేనిది శరీరమును అన్ని గుణములు ఇచ్చినంత మాత్రమున మనిషి కాలేదు. గనుక శరీరము ఇచ్చినాడు. ఇప్పుడు మనిషి అయ్యెను. తన స్వరూపమందు మనిషిని చేసెనని మోషే వ్రాసెను. శరీరముతోను, దేవుని లక్షణములతో దేవుడు మనిషిని చేసెను. శరీరమును లక్షణములుగల గుత్తిని కాపాడేటందుకు దంపతులను కలుగజేసి దీవించెను. శరీరమును, దైవలక్షణములుగల గుత్తిని కలిపి మూడుగా చేరెను.

1థెస్స. 5:23. శరీరము, ప్రాణము, ఆత్మగలదే మనిషి. ఇదే త్రియేకత్వము. తండ్రి, కుమార, పరిశుద్దాత్మ ఎట్లు త్రియేకత్వమో అట్లే శరీరము, ప్రాణము, ఆత్మ కలిసి త్రియేకత్వమైనాము. ఇది ఒకరకము శరీరము లేనిది మరొక రకము అది దైవత్రిత్వము. శరీరము ఉన్న మనకు ఇదే ఒక త్రిత్వము. ఈ విషయములో మనము దేవుని కుమారులమై యున్నాము. తల్లిదండ్రుల లక్షణములు పాపము చేయకుండ ఉన్నట్లు మన లక్షణములుకూడ పాపము చేయకుండ ఉండవలెనుగానీ అట్లులేవు. అట్లు పాపము చేయకుండుట న్యాయము గానీ ఇది నెరవేరలేదు కానీ వెయ్యేండ్ల పరిపాలనలో నెరవేరును. నేను ఇచ్చిన లక్షణముల పని జరుగలేదు. ఎప్పటికయినా చేయుదునని దేవుడు ఆరవేల సంవత్సరములు ఊరుకొని ఏడవ వెయ్యిలో నెరవేర్చును. పాపముచేయు తలంపు ఉండదు. పాతదైన శరీరము పోయి కొత్త శరీరము వచ్చును. వృక్ష ఫలములకు ఆశపడినందున శరీరము చెడిపోయినది గాని వెయ్యిసంవత్సరములలో చెడిపోదు. దేవుని కోరిక ఎప్పటికైన నెరవేరకపోదు.


దేవుడు తానుద్దేశించినది ఏదియు నిష్పలము కానేరదు. యోబు. 42:2 ఎవరు దేవుని చిత్తమునకు లోబడుదురో వారికి నెరవేరును. ఎవరు ఈ బోధను నమ్ముదురో వారికి ఆ భాగ్యము కలుగును, గనుక మీరు నమ్మువారును, కోరువారునై యుండవలెను. మనలో త్రియేకత్వము దేవుని లక్షణము ఉన్నప్పుడు మనమే దేవుండ్లమైనామని ధర్మశాస్తములో నున్నదని ప్రభువు పలికెను. యోహాను. 10:34 కీర్తన. 8:6 మనము దైవముల మెట్లయినాము? త్రిత్వమున్నది గనుక దైవములమైనాము. మీరు దైవముల దేవునికుమారులు అని ప్రభువు పలికెను. ఎందువలన అనగా ఆ త్రిత్వము, దైవలక్షణములు ఉన్నందున దేవుళ్ళము. యెహోవా కుమారులము, కుమారునికి తండ్రియొక్క లక్షణములు, రూపము కలిగినట్లే మనమును దేవుని లక్షణములు రూపము గలవారము గనుక దేవుండ్లము దేవునికంటే గొప్పవారముకాము. తండ్రి లక్షణములుగల కుమారుడు ఉన్నాడు. తండ్రికంటే కుమారుడు తక్కువ. తండ్రి ముందు కుమారుడు వెనుక, తండ్రి ఎక్కువ. ఒక విధముగాచూస్తే దేవునివంటి వారము. దేవునికంటే తక్కువ దేవుని కుమారులము. ఆయన లక్షణములున్నవి గాన ధన్యులము. భాగ్యవంతులము పాపములో పడినందున దౌర్భాగ్యులమైనాము. వెయ్యి సంవత్సరముల పాలనలో ధన్యమైన స్థితి వచ్చును.


అనాది:- దైవ లక్షణములన్నీ అనాదిలో ఉన్నవి. అనంతములోను అన్నీ ఉన్నవి. న్యాయముగల తండ్రి గనుక న్యాయము ఏమిటంటే అన్నీ ఇవ్వవలెను. న్యాయములో శక్తి ఉన్నది తనకున్నవి ఇవ్వగల శక్తి ఇవ్వగలడనీ జ్ఞానవంతుడని గ్రహింపగల జ్ఞాన దానశక్తి.


ప్రేమ:- ఇది వివరించుట చాల కష్టము. ప్రేమ అంటే యోహాను. 3:16

ఇదే ప్రేమ మనకు కావలసినవి ఇచ్చెను. ఆకాశము, భూమి అన్నీ ఇచ్చెను. ఇవ్వడమేకాదు. ఆయన వచ్చి వేసెను. ఇచ్చుట+వచ్చుట. రెండు కలిపితే ప్రేమ. దేవుడు ఆదాము హవ్వలను కలుగజేయక ముందు భూమిని ఇల్లుగాను, సూర్యచంద్ర నక్షత్రము దీపములుగాను, అన్నీ ఇచ్చి ఆయన అక్కడ ఉండలేక వారివద్దకు వచ్చివేసినాడు. అనగా పాపము వచ్చిన తరువాత విచారించి నాలుగువేల సంవత్సరములు జరుగనిచ్చి శరీరమును ధరించుకొని కన్యకా గర్భమందు పుట్టెను. అన్నీ ఇచ్చివచ్చెను. పాడైతే వచ్చెను. రేపు సంఘము తీసికొని వెళ్లుటకు వచ్చును. పై లోకమునకు వెళ్లిన తరువాత పోగొట్టుకొన్నవన్నీ ఇచ్చును.

" అంతయు మనదే కదా - యేనుని కున్నదంతయు మనదే గదా- అంతయు మన వ్రభువు ఆర్జించి యున్నాడు. స్వంతమని అందుకొనుడి. మీ యాత్మకు శాంతి జెందనీయుడి"

సర్వత్ర అంటే అన్ని స్థలములలో వ్యాపించి యుండుట ఇది మనిషికి లేదు. మనిషి ఎక్కడ ఉంటే అక్కడే. అయితే దేవుడు ఈ లక్షణమును వెయ్యి ఏండ్ల పాలనతో మనకు ఇచ్చును. ఒకే సమయములో అమెరికాకు, పరలోకమునకు, ఇండియాకు ఎక్కడకైనా వెళ్ళుదుము. నిముషములో అరనిమిషములో కాదు. రెప్పపాటు కాలములో ఎక్కడకైనను వెళ్ళగలము. ఎక్కడకు బడితే అక్కడకు ఎప్పుడు బడితే అప్పుడు వెళ్ళగలము. దేవుడు సర్వవ్యాపి. అది దేవుడు మనకు ఇచ్చినాడు. అది మట్టిమీద నున్నప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలియును. యోహాను 14:20 తండ్రితో కుమారునితో మనము ఏకమైయున్నామని ఆ దినమున ఎరుగుదుము అక్కడ తెలియును. ఇక్కడ తెలియదు. క్రొత్త సంగతి చెప్పుదును చెప్పితే శత్రువులగుదురు. (ఇది అయ్యగారి అనుభవములోని సంగతి) “కునుకుపాట్లు వచ్చినవి ఆపుకున్నాను. ఎక్కువైనవి పండుకున్నాను. కట్టె మంచముమీద అట్లే ఉన్నదిగాని అప్పుడు దూతలు నా ఆత్మను తీసికొని వెళ్ళి కలకత్తాలో నిద్రలో ఉన్న ఒక ఆత్మకు నన్ను కనబరచెను” అని చెప్పిరి. అనేకమందికి అయ్యగారు కనబడుచున్నారు. శరీరము మంచముమీదనే ఉండును గాని ఆత్మ పరలోకమునకు అక్కడక్కడకు వెళ్ళును. ఇదే సర్వవ్యాపకత్వము ఒకచోట ప్రార్ధన కూటము జరుగుచుండెను. ఆ కూటములోనికి అయ్యగారి ఆత్మ వెళ్ళెను. కొలస్స. 2:5 ఇది సర్వవ్యాపకత్వము దేవుడు న్యాయస్థుడు ఇదికూడ మనకు ఇచ్చెను.


దేవుడు మనలను గొప్పగా ఎంచుకొనుచుండగా విచారము, దుఃఖము, నిరాశ, భయము ఎందుకు? దేవుడు అన్ని ఇచ్చినాడు గాన అన్నీ పుచ్చుకొని హాయిగా నుండండి. ఏదైనా పాపముంటే ఒప్పుకొని క్షమాపణ పొందుట న్యాయము. పాపము చేయుట ఒక పాపము. అయ్యో పాపము చేసినాను నేను నాశనమైనాను అనుట ఇంకొక పాపము. నన్నుక్షమించునా అనుట ఇంకొక పాపము ఇట్లని దిగులు పెట్టుకొనే వారున్నారు.


నిరాకారము:- సర్వవ్యాపకత్వమే నిరాకారము. దేవుడు నిరాకారము నిచ్చెను. చిన్న దృష్టాంతము ఎప్పుడైనా బల్లను చూచినారా? ఎప్పుడైనా బోర్డును చూచినారా? ఎప్పుడైనా మాటను చూచినారా? మాటను చూడలేదు ఇదే నిరాకారము దేవుడు మనలో పెట్టిన నిరాకార భాగము ఆత్మ నిరాకారము మాట ప్రాణము ఆత్మకు సంబంధించినది. అదే నిరాకారము ఇదే సంతోషము.


“సంతోషమంద రారె - మన దేవుని సంస్తుతి చేయరారే సంతోష బలముచే సర్వ కష్టములను - అంతరింపజేతుము - మన దేవుని సంతోషపరచెదము”. ॥ బహుగా ప్రార్ధన చేయుడి॥


ఎవ్వరు పేద అరుపులు అరచేటందుకు సందులేదు. దిగులుపడుటకు సందులేదు అందరిని రక్షణ మార్గములోనికి పిలుచుచున్నారు. నేను గొప్ప పాపిని అని తెలిసికొని ప్రభువునకు చెప్పుట మంచిదే మరియు నేను పాపినికాదు అనవచ్చును. మనలను బట్టి పాపులము ప్రభువునుబట్టి పరిశుద్ధులము. పాపాత్మురాలైన స్త్రీ, బొంకి నాయన (పేతురు) పౌలుగారు, సంఘమును తరిమి నాయన ఎక్కడ నుందురు? శుద్ధియైనారు గనుక ప్రభువు బల్లయొద్ద ఉందురు.


ఆలాగే భక్తులందరూ పాపులే, పరిశుద్దులే. క్రీస్తురక్తము వలన శుద్ది చేయబడినారు కనుక దేవుని సరసన కూర్చుందురు. మనము వెళ్ళిచూస్తే కనబడుదురు. పాపాత్మురాలు, దొంగ ఇక్కడ ఉన్నారని ఆశ్చర్యపడుదుము. గానీ అనము. అనే స్థలముకాదు. పాపముంటే దిద్దుకొనండి. దేవునిబట్టి? ఆయన లక్షణములనుబట్టి దిద్దుకొనవలెను. మనకు ఏ లక్షణము తక్కువగానుంటే ఆ లక్షణమునొద్దకు వెళ్ళి సహాయమడగవలెను. శక్తి తగ్గినందున పాపమును జయించలేకపోవు చున్నాము. గనుక దేవుని శక్తి దగ్గరకు రావలెను. జ్ఞానము లేనందున అన్నీ తెలివి తక్కువ పనులు చేయుచున్నాము. గనుక దేవుని జ్ఞానము దగ్గరకు రావలెను. చిక్కులు ఉన్నప్పుడు ఏమి చేయవలెనో తోచదు. నీకు తోచదుగానీ నీవు దేవునిమీద ఆనుకొనినయెడల నీకు తోచును. పాపము చేసినందున పరిశుద్ధత పోయినది గనుక పరిశుద్ధత వద్దకు వెళ్ళిన పరిశుద్ధత దొరుకును. ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఆయన పేరు బిల్లీ; చనిపోవుచున్నాడు. అప్పుడు ఒక స్నేహితులు వచ్చి బిల్లీ! చనిపోతున్నావా? అని అంటే లేదు.....లేదు.....నేను జీవించుటకు ప్రారంభించుచున్నాను అనెను. భూలోక జీవము గందరగోళ జీవము. పరలోక జీవము ప్రభువునుబట్టి సంతోషకరమైన నిత్యజీవము. దేవునిలోనుండి ఈ నిత్యజీవమునకు వచ్చాను గనుక పరలోకమును చూచి సంతోషించాము.


అనాది మనకున్నది. ఎట్లనగా అనాదియందే మనము దేవుని తలంపులో నున్నాము. అనాది అనగా ఆదికి ముందు నేను దేవదూతలను, ఆకాశమును, భూమిని తరువాత మనిషిని కలుగజేస్తాను. ఆ మనుష్యునిలోనుండి అనేకులను కలుగజేస్తాను అని ఆలోచించెను. గనుక దీనిని బట్టి అనాదిలో మనమును ఉన్నామని అర్థమగుచున్నది. దేవుని అనాదిని బట్టి అనంతము ఉన్నది. దేవుని అనంతమే నిత్యజీవము. మనిషి భూమిమీదనుండగా ఎన్నిసార్లు చనిపోవును? ఒక్కసారె చనిపోవును. కొందరైతే అనేకసార్లు చనిపోదురు. కష్టములు వచ్చినప్పుడెల్లా చావాలనుకొని, సుఖమున్నప్పుడు బాగా జీవించాలనుకొని ఇలా జీవితమంతా చావాలి, బ్రతకాలి అనుకొంటూ చివరకు చనిపోవుదురు (ప్రసంగి 7:14). దేవునిలోనుండి విశ్వాసులకు జీవమువస్తే ఆ జీవముతో దేవుని వద్దకు నిత్యజీవములోనికి వెళ్ళిపోవును. మనిషి ఇన్నాళ్లు నా మాటవిని ఇప్పుడు జీవములోనికి వెళ్ళినాడని మరణము నోరు ఆవలించును.


"ఏమాయెను ఏమాయెను అపవాది యత్నాలు ఏమాయెను"
సైతానును, కష్టములను, శరీరమును, మరణమును, సమాధినిచూచి నన్ను ఇన్ని శ్రమలు పెట్టినారు నన్ను ఏమిచేయగలిగినారు? ఇప్పుడు తుర్రున ఎగిరిపోవుచున్నానని హేళనచేసి గట్టెక్కినట్టు, పరలోమునకు వెళ్ళి శత్రువులను హేళనచేయును. 1కొరింథి. 15:55 అట్టి భాగ్యమున్నది గనుక ఎవరైన చాటున మాటున ఏడ్వవద్దు. ఏడ్పున్నయెడల సైతాను, పాపము, శాపము, వ్యాధులు, ఇబ్బందులు, మరణము, శవము ఇవన్నీ ఉన్నట్లే. ఇవి అన్నీ ఒక్క వరుసలోనిది. ఈ వరుసలో ఉంటే వచ్చేవి దుఃఖము, కన్నీరు. క్రీస్తున్నందున్న విశ్వాసికి ఆ జీవము భూమిమీద ప్రారంభించి మరణమప్పుడు సంపూర్తియగును. ఇక్కడ పొందనిదే అక్కడ ఏలాగు వచ్చును? దేవుడు మనలో జీవముపెట్టియున్నాడు. జీవముగలవారు ఏడ్వవచ్చునా? జీవము పోయిన తరువాత ఇంటిలోనివారు ఏడ్చెదరు. వెళ్ళిపోయిన జీవము ఏడ్చుచున్న వారినిచూచి, వీరు తెలివి తక్కువవల్ల ఏడ్చుచున్నారు. నాకు ఏమి? మునుపటికంటె ఎక్కువ జీవములోనుండి హాయిగా నున్నాననును. తల, మెడ, చేతులు, కాళ్లు, అవయములు, డబ్బు, మేడలు అన్నీ ఉన్నా ఆ జీవము లేకపోతే ఏమి లాభము? జీవము లేకపోతే శవమే. దేవుడు మనకు లెక్కపెట్టలేనన్ని ఈవులను ఇచ్చియున్నాడు. ఒక డాక్టర్ గారు ఒక పత్రికలో ఈ మాటలు వ్రాసిరి. కొందరు చదివి ఉంటారు. కొందరు చదివి మరచి ఉంటారు. దేవుడు లోకములో కలుగజేసినవి మనిషి అనుభవించలేక పోవుచున్నాడు. అన్నీ స్వీకరింపలేకపోవుచున్నాడు. అరణ్యములో లక్షల చెట్లు, కోట్ల పండ్లు ఉన్నవి. మనుష్యులు, పక్షులు, జంతువులు తినగా మిగిలినవి భూమి పాలగుచున్నవి. తిన్నా తినకపోయినా బల్లమీద పెట్టుట ఆయన పని. ఆలాగే ఆత్మ వరములు మనము పుచ్చుకొన్న పుచ్చకొనకపోయినా దేవుడు ఇచ్చుట నిజమే. ఆత్మ వరములు ఎన్నో ఉన్ననూ, మనము అందుకొనలేక పోవుచున్నాము. ఉన్నను స్వంత మేలుకొరకు ఇతరులు మెప్పుకొరకును వాడుచున్నాము గాని దేవుని మహిమ కొరకు వాడలేకపోవుచున్నాము. దేవుడు ఎందుకు ఊరుకొనుచున్నాడు? మనిషి పాపములోపడిన యెడల దయ్యాలు, మనుష్యులు, పురుగులు పీక్కొని తింటుంటే దేవుడు ఎందుకు ఊరుకొనుచున్నాడు.