పాపశోధన - జయించు సాధన
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
అది. 31-24; యోహా. 1:29; 1యోహా. 1:7.
దీవెన:- వాక్యాశక్త ప్రియులారా! ఈ దిన వాక్యధ్యానము ద్వారా సుళువుగా చిక్కులపెట్టు పాపమును జయించు వివేచనా సాధనములను ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.
- 1. కుమారీ ఆలకించుము. పాపమునుగూర్చి వివరింతును. శోధన ఫలము అది భయంకరమైనది. అగ్నిహోత్రములో నిప్పు రవ్వలకు కాపురము దానికి ఆశక్తిగలదు, అంటితే అంటుకొనును. విదిలించినను కొంచమైన వదిలించకుండ, తగిలించకుండ పగవగ రాకుండా సగమైన బాధపడకుండ తొలిగిపోదు. అనగా అగ్నిలోని ఒక్కనిప్పురవ్వ, మాత్రమే అంటుకొనినయెడల అది మనము విదిలించలేము అనగా పగతీర్చుకోలేము, సరికదా అది కొంచెమైనను ఏడిపించకమానదు.
- 2. అమాయకులు, అజ్ఞానులు, బలహీనులు, మోమోటము గలవారు, పెద్దవారని భయపడువారు అజాగ్రత్తగా నున్నవారు చెడుగు నాలకించువారు తప్పక శోధనకు లోబడుదురు. అంతరంగమందు పాపమునకు ఆశపడి, దానిని మురిసికొని అది వీలుగాక ఉన్నవారు పది సంవత్సరములు గడిచినను, భక్తిలోనున్నను ఆ ప్రలోభము పుట్టించిన పాపములో తప్పక పడిపోదురు.
- 3. అమాయకులగు ఆది తల్లిదండ్రులు, ఆదాము అవ్వలు పడిపోయిరి. దాని భయంకర బారినుండి తప్పుకొనజాలకపోయిరి. నిలువబడి సర్పముయొక్క మాట వినుటవలన చెడిపోయిరి, ఎన్నడెరుగని వానిమాట నమ్మిరి. అసలు పాపములేని రోజులలో - అసలు పాపములేనివారు ఆ చెడుగు మాటలు నమ్మి చెడిపోయిరి. దేవునిమాటను హెచ్చరికను నిర్లక్ష్యము చేసిరి. మానవులకు శత్రువును కీడుచేయు సాతాను మాటలు లక్ష్యముంచి నమ్మిచెడిపోయిరి.
- 4. దేవునికి అవిధేయత చూపినందువలన వచ్చిన ఈ భయంకర పాపమునకు శక్తిగలదు. ఆ శక్తి “శోధన” దానినుండి తప్పించుకొనలేము. ఈ పాపమునుండి బయటపడుదారి తెన్ను మనకు మనమే ఏదైనా చూచుకోగలమని ఈ జీవితములో తలంచరాదు; అవి అధిక ప్రయాసములు, హృదయ ఆయాసములు, ఫలితము బహుస్వల్పము.
- 5. మనము భక్తులము సాతాను శోధనలనుండి ఆవల పడితిమి. ఆలాటి శక్తికి ఆవలనుంటిమి మన ప్రాణములు ఈ శక్తినుండి విమోచింపబడెను అని చాలామంది భక్తులు తలంచు చున్నారుగాని అప్పుడప్పుడు వారి కథలు పరిశీలించిన అవి చాలా ఘోరముగా నున్నవి. వారి పరిస్థితులు చాలా భిన్నముగా నున్నవి. వారి విశ్వాస ఫలితము చాలా విచారకరముగానున్నవి. అయ్యో! ఈలాగు మారిపోతిని. అయ్యో! ఎందుకు పొరపడితిని. అయ్యో ఎందుకు పడితిని. ఈసారి క్షమించు ప్రభువా! ఈసారి రక్షించు ప్రభువా! ఈ సారి స్వస్థపరచు ప్రభువా! ఇంక బుద్ధివచ్చినది ముట్టుకొనను అని ఎన్నిసార్లు భక్తులు ఏడ్చుచు ఉన్నారు?
- 6. పాపమనునది మనము లోబడిన శోధనల ఫలితమే. ఎన్ని శోధనలు వచ్చినను సాతాను దయ్యములు ఇవి దూరిన మనుష్యులు, అక్రమకారులుగాను, టక్కరివారిగాను మారిపోవుదురు. మరి ఎవ్వరైనను ఎప్పుడైనను ఎక్కడైనను ఎంత శోధించినను అది శోధనయేగాని పాపముగాదు. అయితే మనము ఎక్కడ ఎప్పుడు పాపమునకు లోబడెదమో, చేసెదమో, అప్పుడది పాపము అగును.
- 7. ప్రతివాడు తన స్వంత దురాశచేత ఈడ్వబడును. వానిలోని పాపనైజము, వాని స్వంత చెడ్డ ఆశ వానిని ఆకర్షించును. యాకోబు 1:14
- 8. సూదంటురాయి - ఇనుపముక్కలు, సూదులు పిన్నులకు వెండి బంగారు ముక్కలను ఒకచోట కుప్పపోసిన, ఈ కుప్ప దాపునకు సూదంటురాయి రాగా, దాని ఆకర్షణ శక్తి ఏ ముక్కలందుగలదో ఆ ముక్కలే పరుగిడి దానినంటుకొనును. తుప్పుపట్టు మష్టుగల ఇనుప ముక్కలు అంటుకొనునుగాని, బంగారు ముక్కలు అంటుకొనునా? ఆలాగుననే మష్టుగల హృదయముగలవారు సాతాను శోధన దగ్గరకు రాగా పరిగిడి అంటుకొని హత్తుకొందురుగాని పరిశుద్ధులగు బంగారు ముక్కలవంటివారు ఈడ్వబడుదురా?
- 9. రేడియో పెట్టెలోనికి ఒక తీగె, బ్యాటరీ లేక కరెంటుకు తగిలింతురు. రెండవతీగెను ఎక్కడ పెట్టుదురో తెలియునా? రెండవ దానిని భూమిలో నాటుదురు, అప్పుడు కరెంటు పాసై రేడియోపని చేయును. భూసంబంధము లేకుండ ఒక తీగెతో పనులు జరుగవు. ఆలాగే సాతాను కరెంటు తీగె ఒకటిసాగివచ్చినను మనము మన తీగెను కలుపనిదే అతడుగాని మరెవ్వరుగాని ఏ పని జరిగింపనేరరు. ఇది మన స్వంత ఇష్టమే, మన స్వంత కోరికయే, మనస్వంత దురాశయే మన తీగె. మన తీగెను మాత్రము సాతాను తీగెలతో కలుపకుండ జాగ్రత్తపడినచో మనము పాపము చేయకుండ ఉండగలము. మనము కలిపినచో బలహీనులమై మరులు కొల్పబడుదుము ఈడ్వబడుదుము.
- 10. ప్రతివాడు తన స్వంత దురాశచేత మరులు గొల్పబడును, అనగా “చింతపండును చూడగానే నీ నోటిలో నీరు ఊరును. ఎందుకు నీ నోటిలో నీరు ఊరవలెను? ఆ చింతపండు ఏమి చేసినది దాని నైజము పులుపుగదా! దానిని చూచి నీవెందుకు నోరూరుచుందువు. ఆలాగే ఒక చెడుగును చూచి నీనోరూరి నీవు చెడిపోవుచున్నావు.
- 11. బాగుగా పండిన మామిడి పండునుచూచి నీవు ఆశపడుచున్నావుగదా! అది ఊరకనే తయారైకూర్చున్నదే గాని అది నిన్నేమి చేసినది, ఆలాగే తయారైనవారిని, వాటిని (అనగా పాపములో పడిపోయిన పండిపోయినవారిని, నేత్రములకు అందముగా కనబడినవాటిని, వారిని మోసనకరముగా) చూచి మతిబ్రమ చెందినదెవరు? నీ దూరాశచేత నీవు మరలు గొల్పబడుచుందువుగదా!
- 12. ప్రతివాడు తన స్వంత దురాశవలన ఈడ్వబడును మరులు గొల్పబడును శోధింపబడునుగదా!
- 13. గనుక ఎవరైనను నేను దేవునిచేత శోధింపబడు చున్నానని అనగూడదు దేవుడెప్పుడైన శోధించువాడుకాదు. సహాయముచేసి సంరక్షించువాడు గాన ఏ శోధనగాని ఏ కష్టముగాని వచ్చినపుడు దేవుడే దీనిని పెట్టినాడని అనకూడదు సుమా. యాకోబు 11:13-18.
- 14. మరియు కొందరు ఇలాగు చెపుతారు. నన్ను వారు వీరు మోసపుచ్చినారు, పాపములో పడవేసినారు అని అందురు. అది శుద్ధతప్పు. నాకిష్టము లేకుండా, నాకు అంగీకారములేకుండా, నాకు తెలియకుండ, ఎవరునన్ను పాపములో పడవేయజాలరు. లోపల అసలు ఇష్టమును దాచుకొని అది తీర్చుకొన సంకల్పించుకొనియుండి అదికప్పిపుచ్చి పైకి వద్దువద్దు అని నటనచేయుచు మెల్లమెల్లగా చల్లచల్లగా వెంటాడి, వారెవరో బలవంతము చేసినట్లు, పైకికనబడుచు పాపము చేయుదురుగాని అది పరుల బలవంతముగాదు. ఆలాగైతే ఇంతకుముందు అనేకులు నిన్నడిగి బలవంతము చేసినారుగదా! వారందరికి లోబడినావా?
- 15. దయ్యములుగాని సాతానుగాని నీ ఇష్టములేకుండా నేమియు చేయజాలవు నీవువాటికి ఆ శోధనకెంత స్థలమిచ్చెదవో అంతపని అవి జరిగించును. మనమిచ్చు దానినిబట్టియేగాని దయ్యములు మనలను బలవంతపరచి పని చేయజాలవు. దేవుడు మనలను అన్యాయము చేయలేదు. మరియు ఈ సంగతి సృష్టికర్తకు తెలియును, గనుకనే అపవాదికి చోటివ్వకుడి అని వ్రాయించినాడు. ఎఫెసీ. 4:27.
- 16. దేవునికైనను మనము చోటివ్వకపోతే ఆయన బలవంతముగా మనలో తనమంచి పనినైననుచేయడు. మనమెంత అంగీకరించితే ఎంత స్థలమిచ్చితే దేవుడు అంతపని జరిగించును; మీద స్వేచ్చను చెడగొట్టడు. మార్కు 6:1-5. “ఆశీర్వదించుట - నీ శక్తి యిష్టము ఆశీస్సుపొందుట - నాశక్తి యిష్టము” ॥యేసుప్రభువా॥
- 17. దేవునికి చోటిచ్చిన దేవుని బలము పొందుదుము. ఆ బలముతో సాతానును ఎదిరించినవాడు పారిపోవునని గలదు. వానిని ఎదిరించక వానిచేతులందు నిదురించినవాడెక్కడకో ఎత్తికొనిపోయి పాతాళములోపడవేయును సుమా! యాకోబు 4:7; ఎఫెసీ. 6:10-11.
- 18. దురాశ గర్భము ధరించి పాపము కనును అది పరిపక్వమై మరణమగును గనుక పాపము విషయము చాలా జాగ్రత్తగా నుండవలెను. యాకోబు. 1:15.
- 19. పాపమునకు మనమీద వాంచగలదు అది వాకిట పొంచియుండును ఎప్పుడు దొరికెదమా ఎప్పుడు దూరెదనా అని ప్రతి నిమిషము కనిపెట్టుచుండును సత్క్రియచేయని వానిపైకి దూకుటకు అది వాకిట పొంచియుండును. ఆది. 4:7.
- 20. పాపము సుళువుగా చిక్కుల పెట్టునది ఆరంభములో నది మధురము అంతమున నది విడ్డూరము. మొదట పాపమును సంతోషముగా ఎత్తుకొందురు. గాని అన్ని చిక్కులే మొలచును. తుమ్మ 'విత్తనములు బాగుగానే యుండును, ఆడుకోవచ్చును, విత్తుకొనవచ్చును. దానికొమ్మలు దాని వృక్షములు ముండ్లకంపలే, ముండ్లకొంపలే సుమా! హెబ్రీ. 12:22.
- 21. ఈ భయంకర పాపము పరిహారమగుటకు శ్రీ యేసుక్రీస్తు ప్రభువు నిత్యపరిహార రక్తమును చిందించినాడు గాన ఈ పనులు చేయుము. క్షణక్షణము ఆయన పున్యరక్తమునందు నమ్మికయుంచుము. తల్లిగర్భములో తన రక్తమందు బుట్టిన బిడ్డ తన బిడ్డయేకదా! ఆ బిడ్డ చెడిపోయి దూరమైనను తన రక్తమందు పుట్టిన సంగతి నిజమేగదా! గనుక నిన్ను నీ పాపమును పరిహరించిన యేసు రక్తములో బుట్టిన నీవును ఆయన బిడ్డవే అని నమ్మికయుంచుము ఆయన బిడ్డవే గనుక తిరిగిరమ్ము.
- 22. సంపూర్ణ విధేయుడవుకమ్ము, ఆయన చిత్తమునకు సంపూర్ణ విధేయులము కావలెను. అప్పుడు పాపములు తప్పించుకొందుము. ఎఫెసీ. 4:22-24.
- 23. క్రీస్తుపైనానుకొనుము. బిడ్డ తల్లిపై ఆనుకొన్నట్లు మనపూచీ లేకుండా అంత తన పూచీ అనుకొన్న పాపము తప్పించుకొందుము.
- 24. నిజముగా పాపము తటస్థించినపుడు దానిని దూరముగా పారవేసిన యెడల అప్పుడు మనము చచ్చినవారముగా మనలను మనమెంచుకొనినయెడల, పాపము తప్పించుకొందుము. యోబు. 11:13-19; రోమా. 6:11 తప్పక చదువుము.
- 25. మన నిమిత్తము చనిపోయి బ్రతికిన క్రీస్తు ప్రతి నిమిషము తలంచుకొనవలెను. దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించువారు ధన్యులు దైవధ్యానమువలన తప్పించుకొందురు.
- 26. ఈలాగు పై ఐదు విషయములు పట్టుదలతో ధ్యానించి అనుభవములో పెట్టుకొన్నవారు భయంకర పాపబంధములనుండి తప్పించుకొందుము.
- 27. భూలోకములో ఆదాము, హవ్వలు మొదటి పాపమును చేసిరి ఆ పాపముద్వారా ప్రపంచమంతా పాపసంకులమై పోయెను.
- 28. మొదటి పాపములో వెలుపటినుండియు లోపటనుండియు శోధనగలదు. గనుక ప్రతి పాపమునందును లోపట, వెలుపట పరిశోధనలుండును.
- 29. కనబడని శక్తి - ప్రతి పాపములో కనబడని శక్తియొకటి యుండును. అది బయటకు కనబడదుగాని పనులు జరుగుచుండును. కరెంటు తీగెలందు బయటకు తీగెలు కనిపించునేగాని ఆ తీగెలలో ప్రవహించుచున్న కరెంటు కనబడదు. కరెంటులో కనబడనిశక్తి ఉన్నది.
- 30. పాపములో కనబడని శక్తి దాగియుండి కనబడుచున్న వాటిద్వారా పని జరిగించును, శోధనతెచ్చును. ఈలాటి శోధన మానవ జాతినంతటిని నాశనము చేసెను. ఎఫెసీ. 2:2.
- 31. చెడుగుయొక్క కనబడని శక్తులు మనకు ముఖాముఖిగా దాపరింపవచ్చును. అవి కనబడకయుండునుగాని కొన్ని సలహాలు. ఆశలుచూపును. పాపము చేయుటకు శోధించును ఈ కనబడని శక్తిని గ్రహించుట కష్టము. అందువలన నరుడు సులువుగా లొంగుట. అపార్ధము పెడార్ధము చేయుట, అనుమానించుట తన ఇష్టప్రకారమే తీర్మానించి అబద్ధముగా నిందలు మోపుట జరుగుచున్నవి.
ప్రార్ధన:- పరలోకపు తండ్రీ! ఈ దిన వర్తమానముకై నీకే స్తోత్రములు. శరీరము, లోకము, సాతాను వీని తంత్రములను మేము ఎరుగుటకై మా అంతరంగములో నీ పరిశుద్ధ వాక్యవివేచనాశక్తి నొసంగుమని, మరియు నీ పరిశుద్ధాత్మతో మమ్ములను నింపుమని క్రీస్తు యేసునామములో అడుగుచున్నాము తండ్రీ! ఆమేన్.