గెదరేనీయుల దేశపు మిషనెరీ
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
మార్కు 5:7; లూకా 8:28.
వాక్యాసక్తికలిగిన విశ్వాసులారా! నేటి వర్తమానముద్వారా ప్రభువు మీకు తన స్వస్థత దీవెనలు ఇచ్చునుగాక! ఆమేన్.
సేన దయ్యము పట్టిన వ్యక్తి దూరమున ఉండి, యేసుని చూచెను. అతడు గోరీలలో తన నివాసస్థలమువద్ద నుండెను అతడు చేసిన పనులు
- (1) యేసు సముద్రమునుండి వచ్చుచుండగా దూరమునుండి చూచుట ఒకకార్యము.
- (2) రెండవ కార్యము యేసునొద్దకు వచ్చుచుండెను.
- (3) నమస్కరించెను. ఈ మూడు ముఖ్యకార్యములేకాక సాగిలపడుట నాల్గవపని.
ఇవి పిచ్చివాడు చేసే, పిచ్చిచేష్టలుకావు, మంచిచేష్టలే. యేసురాకముందు చేసేవి పిచ్చిపనులు.
- (1) మనుష్యుల మీద పడుట, వారికి హానిచేయుట, వెర్రికేకలు వేయుట. ఇవి పిచ్చిచేష్టలు.
- (2) ఇప్పుడు మంచిచేష్టలు చేస్తున్నాడు. అనగా చూచుట, పరుగెత్తుట, నమస్కరించుట, సాగిలపడుట, అంతేకాక పూజించుట మరియొక క్రియ.
ఇవి పిచ్చివాని చేష్టలు, మాటలు కావు. దయ్యము అతనిలోనుండి మాట్లాడుచున్నది. పరుగెత్తు, నమస్కరించుట, చూచుట, దయ్యమే. బైబిలులో “వాడు” అని వ్రాయబడియున్నది. దయ్యము అతనిని తోలుకొని వచ్చెను. అనగా దయ్యము, అతడు కలిసి వచ్చుట నమస్కరించుట జరిగెను. భూతపీడితుని ఎవరు తీసికొని వచ్చిరి. వ్రాతచూడగా ఇద్దరు కలుసుకొని వచ్చినట్లున్నది. అతడు ఆ దయ్యమును చూచెను. ఇద్దరు రెండు పనులమీద వచ్చిరి. ఇద్దరికి స్ధలము ఒక్కటే. అతడు స్వస్థతకు వచ్చెను. దయ్యము - "మా కాలమింకనురాలేదు, బాధపెట్టవద్దు, తీర్పు ఇంకను రాలేదు. ఇప్పుడే ఎందుకు వచ్చినావు? ఇంకొక జీవిలోనికి వెళ్లుటకు సెలవు ఇమ్ము, మరియొక స్థలమునకు సెలవిమ్ము” అని అడుగుటకు వచ్చెను. కాని అతని హృదయములో కోరిక ఉన్నది: “రక్షించు అనే కోరిక.” గాని దయ్యములో ఆ కోరిక లేదు. ముందు యేసుప్రభువు దయ్యమును పోగొట్టవలెను. అతడు పై మూడు పనులు చేసినాడు. నమస్కరించుట, పరుగెత్తుట, చూచుట. దూరమునుండి చూచుటలో ఏమున్నది? యేసుని చూచుట ఉన్నది. యేసు దగ్గరకు వెళ్లుట, యేసుకు నమస్కరించుట ఉన్నది. లోపట స్వస్థపర్చు అనే కోరిక ఉన్నది. అతని తల్లిదండ్రులు, స్నేహితులు, బాటసారులు అతని కూడా వెళ్ళలేదు. అనగా వీరెవరూ అతనిని ప్రభువు దగ్గరకు తీసికొని రాలేదుగాని దయ్యము తీసికొని వెళ్లినది. యేసుప్రభువు దగ్గరకు దయ్యము తన పనిమీద, అతడు తన పనిమీద వెళ్లినారు. ఈ స్వస్థిశాలకు రోగులను ఎవరు తీసికొని వచ్చినారు? అనారోగ్యము, జబ్బులే యేసునొద్ధకు మనుష్యులను నడిపించును. జబ్బు దయ్యమువలన, పాపముచేత వచ్చెను. పాపమే జబ్బు తీసికొనివచ్చెను. మనిషి వచ్చినమాట నిజమే. మనిషిని జబ్బు తెచ్చినది నిజమే. పాపం జబ్బును తీనికొని వచ్చెను. పాపం సైతానువల్ల వచ్చెను, సైతాను-పాపం-రోగం అప్పుడు యేసునొద్దకు వచ్చుట జరిగినది. అనగా రోగియొక్కరాక. ఆ రోగివచ్చినట్టే, ఇప్పుడుకూడ యేసునొద్దకు రోగి, రోగము, పాపము, సైతానుకూడా రావలెను. ఎవరికొరకు వస్తారు? రోగం కుదుర్చుకొనుట కొరకు వస్తారు! యేసుప్రభువు వచ్చినప్పుడు సైతాను చాటున నున్నది. పైకి రోగం, రోగి కనబడుచున్నాడు. కనబడని సైతాను, బాగా కనబడే రోగము, రోగి యేసునొద్దకు రావలెను. రాకపోతే సృష్టికర్తయైన దేవుడు నీ దగ్గరకు ఎలాగు రాగలడు? సైతానువలన పాపము వచ్చినది ఆ పాపమును బట్టి మనుష్యులందరూ పాపులయ్యారు. గనుక దేవుడు ఎవరికొరకు వస్తారు? ఆయన ఎవరికొరకు వచ్చారో, సువార్తికులందరు సంపూర్తిగా వ్రాసిరి. మాకు జబ్బు ఉన్నట్టు మాకు తెలుసు అలాగే పాపము, సైతాను ఉన్నదనికూడ మీరు తెలుసుకొనవలెను. అతనిలో పాపము ఉన్నది. దారినిపోయే వారిని హింసించుట. అది పాపక్రియ. రోగి స్మసానములలో నివాసము ఉన్నాడు. యేసుదూరమున ఉన్నాడు. రోగి దూరమునుండి చూడగలిగినాడు, పరుగెత్తగలిగినాడు, నమస్కరింపగలిగినాడు. ఎందుచేత? అపవిత్రాత్మ బయటకు రా! అని ఆయన చెప్పుచున్నాడు. గనుక రోగి పై మూడు పనులు చేయకలిగినాడు. దయ్యము ఇప్పుడు కదిలింది. ఇదివరకు స్థానముగా నున్నది. యేసుప్రభువు రాలేదు గనుక వదలలేదు. ఇపుడు పై మూడు పనులకు సందు దొరికింది. నాల్లవ కార్యము లోపల ఉన్నది. అది “ప్రభువా! నన్ను రక్షించు అనే ప్రార్ధన. అతని నమస్కారములలో ఏమి అర్థమున్నది? ఏమి అభిప్రాయమున్నది.
ఉదా:- భిక్షకుడు వెళ్లుచుండగా, బాటసారి భిక్షకునికి నమస్కారము చేయునా? బాటసారి గవర్నమెంటు ఉద్యోగస్తునికి నమస్కారము చేయునా? చేయును. అలాగే భూతపీడితుడు యేసుని చూడగానే ఎవరో ఒక మహానుభావుడు, ఘనుడు వచ్చినాడు అని నమస్కరించెను. ఇదివరకు అదిలేదు మార్గస్తులను హింసించేవాడు. ఇప్పుడు ఎవరో గొప్పవారు అని గౌరవముగా ఉండెను. నమస్కారము వల్ల గౌరవించే లక్షణము అతనిలో కనబడుచున్నది.
రోగులారా! యేసుప్రభువు ఇక్కడున్నాడని తలంచుకొనండి, ఇద్దరు ముగ్గురున్నచోట యేసుప్రభువు ఉన్నారు అనేదే వాగ్ధానము గనుక ఇక్కడున్న యేసుప్రభువుకు నమస్కరించండి. ఆ రోగి ఎవరో మహానుభావుడని ప్రభువుకు నమస్కరించెను. అది గౌరవించే లక్షణము. నమస్కారము ఎప్పుడు చేస్తారు? గొప్పవారివల్ల ఉపకారము కలుగునని తలంచినప్పుడు, క్రిస్మసు బహుమానం కొరకు, క్రిస్మసుకేక్ కొరకు పిల్లవాడు నమస్కారము చేసెను. రోగి ఉపకార నిరీక్షణతో నమస్కారము చేసెను. అందు ఇంకా అర్ధమున్నది.
ఉదా:- బాలుడు కుక్కను చూచి భయపడి ఎదుట వారివైపు చూచుట ఎందుకనగా, కుక్కనుండి తప్పించుమని. అలాగే ఇతను నమస్కరించుటలో - “ఈ దయ్యముచాలా కాలమునుండి ఉన్నది. నన్ను విమోచించండి, రక్షించండి" అనే అర్ధమున్నది. బిక్షకుడు ఎందుకు సలాము చేయును? బహుమానము కొరకు; కుర్రవాడు కుక్కనుండి కాపాడండి అన్నట్లు చూచెను. అట్లే 'ఈ దయ్యమునుండి నన్ను విమోచించండి' అన్నట్లు ప్రభువుకు నమస్కరించెను. గనుక ఇతనిలో విమోచన కొరకై నిరీక్షించే గుణమున్నది. ఇతని నమస్కారములో నిరీక్షించే లక్షణమున్నది. గనుక మీరు ఏమని యేసునొద్దకు వచ్చారు. నా పాపమును, జబ్బును, సైతానును, తీసివేయుము అని నిరీక్షించండి. మిలో గౌరవించే గుణము, నమ్మే గుణం ఉన్నది. అదే ప్రభువును గౌరవించేది మీ మేలుకై నిరీక్షించేదై యున్నది. ఆ భూతపీడుతుని దగ్గర నేనుంటే 'నీవేయని నమ్మిక' అని పాడుదును. ఆ భూతపీడితుడు యేసుప్రభువా! నీవేయని అని పాడినట్లు నేను చెప్పుచున్నాను. నేటి రోగులు నమ్మవలసినది ఈ కీర్తనలో నున్నది.
యేసుప్రభువు నొద్దకతడు పరుగెత్తుకొని వెళ్ళినట్టున్నది. యేసుప్రభువు బాగుచేస్తారని రోగులు అనేకులు వస్తున్నారు. అతడు గోరీలలోలేడు అక్కడనుండి పరుగెత్తి లేచినాడు. అతను పరుగెత్తుట వల్ల అతనిలోని ఆతురత, ఆశ కనబడుచున్నది. మనస్సులో గౌరవము, నమ్మకము; మనస్సులో పరుగెత్తుట, క్రియలోను ఉన్నది. మనస్సులో నమ్ముట, గౌరవము అవి చాలవు. ఆయనను ఆశ్రయించవలెను. ఆయన యొద్దకు పోవలెను. లేచి ఆయన దగ్గరకు రావలెను.
- (1) గౌరవించే గుణము
- (2) నమ్మే గుణము,
- (3) పరుగెత్తే గుణము,
యేసుప్రభువు అంటే ఈ మూడు మనలో ఉన్నవా? అని పరీక్షించుకొనవలెను. గౌరవింపవలెను, నమ్మవలెను, ఆయన యొద్దకు రావలెను. ప్రభువు రోగి దగ్గరకు వచ్చుట ముఖ్యమా? ప్రభువు దగ్గరకు రోగి వచ్చుట ముఖ్యమా? రోగి వైద్యుడున్న స్థలమునకు వచ్చినపుడు జబ్బుపోవునా? లేక రోగి రోగి లాగుంటే జబ్బుపోవునా? యేసుప్రభువు నొద్దకు వచ్చిన యెడల బాగు. ఆయన ఏలాగైనా వచ్చినాడు. ఎందుచే? సర్వవ్యాపి గనుక. ప్రభువు అక్కడున్నాడు గనుక రోగికూడా రావలెను. “నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను” ఇది ప్రభువు స్వరమై ఉన్నది గనుక ఇతడు వెళ్లెను. ఈ మూడు ముఖ్య గుణములు రోగిలో ఉండవలెను. అప్పుడు ఎవరూ తప్పిపోరు. బోధ, ప్రార్ధన, తైలాభిషేకము, ఈ మూడునూ ఉండవలెను. అప్పుడు తప్పక స్వస్థత, మేలు, వృద్ధి కలుగును.
వృద్దికోరుచున్న విశ్వానులారా! వ్రతివారు వృద్ది కోరుచున్నారు. పోయిన సం॥ ఆత్మీయ జీవితములో ఎక్కడ ఉన్నారో, అక్కడే ఉండక ఒక మెట్టు పైకి ఎక్కవలెను. వచ్చే సం॥ము మరొక మెట్టు ఎక్కవలెను. దేవుడు తన వాక్యమును ఇట్టి వృద్దిలోనికి వచ్చే నిమిత్తము మనకు ఇచ్చెను. దయ్యము పట్టినవాడు మొదట
- 1) ఎక్కడున్నాడు;
- 2) ఎక్కడి వాడు,
- 3) ఏమి పనిచేయుచున్నాడు.
అతని కథనుబట్టి చూస్తే దేవుడు మనలనుకూడా మార్చునని తెలియును. మన దుస్థితినికూడ తీసివేయును. అతను అధోలోకములో, స్మశాన స్థలంలో దుస్థితిలోయున్నాడు. యేసుప్రభువు అతనికి తగిన ఏర్పాట్లు చేసియున్నారు.
- (1) అతనికి ఆజ్ఞఇచ్చెను.
- (2) ఉద్యోగస్తుడైనాడు.
- (3) ఆ పని ఫలితము కనపర్చినాడు.
స్మశానభూమి నుండి విడిపించిన అతనికి క్రీస్తుప్రభువు ఒకపని నియమించెను. గనుక అతను యేసుప్రభువుయొక్క ఉద్యోగస్తుడు. ఆఫీసులో గవర్నమెంటు ఉద్యోగముకాదు. యేసుప్రభువు అతని బయటకు లాగిపెట్టిన పని. ఏమనగా, నీవు, నీయింటి వారికి ప్రభువు చేసిన మేళ్లు చెప్పుచు సువార్త ఉద్యోగము చేయవలెను. ప్రతివారును మన ఇంటివారే. ప్రభువుయొక్క ఉపకారములను బోధించే ఉద్యోగమున్నది. దేవుని సంగతులు బోధించు ఉద్యోగముకంటె గొప్ప ఉద్యోగములేదు. ఇది అన్నిటిని మించిన పని, ఉద్యోగము. అన్ని దయ్యములనుబట్టిన వానిని బాగుచేసిన దేవుడు మనలను బాగుచేయలేడా! దేవుని వాక్యం ఎరుగని అతనిని మార్చిన దేవుడు మనలను మార్చడా? కాబట్టి ప్రియులారా! మీలో ఎవరూ నిరాశపడక దేవునివైపు చూడండి. ఇంత మంచిస్థితికి ఇతనితెచ్చిననట్లు నేడును ఆయన మనలను తేగలడు. మనలో ఉన్న దుర్గుణము మార్చును, మనలో ఎంత దిగులున్ననూ అది ఆయన తీసివేయగలడు. అదివరకు పంతులు పనిచేసినవానిని అదివరకు వర్తకం చేసినవానిని పిలిచి, మిషనువారు పాదిరి ఉద్యోగం ఇచ్చినట్లు (ఆర్డినేషన్), ఆ ప్రకారముగానే ఆ రేవులో ఆయన ఆ పిచ్చివానికి ఆర్డినేషన్ ఇచ్చెను. ప్రభువు ఏమి పని ఇచ్చెను? బోధ పని. అయితే అతనిని ఎరిగిన వారు ఏమందురు. పిచ్చివాడుకాడా? దుస్థితిలోనివాడుకాడా? స్మశానవాసి కాడా? అందురు. అయితే ప్రభువు అతనిని మార్చి ఉద్యోగం ఇవ్వడం వట్టిదా? ప్రియులారా! ఎందరు ప్రభువువల్ల బాగైనారో వారందరు ఈలాగు చెప్పగలరు:
- (1) నేను రోగియైయుండగా ప్రభువు నన్ను బాగుచేసినాడు.
- (2) యేసుప్రభువు నన్ను బాగుచేసెను, గనుక మమ్మును కూడా బాగుచేస్తాడు.
- (3) నేను ఇదివరకు ప్రసంగము విన్నాను. అది మీకు చెప్పుచున్నాను అని మీరు చెప్పలేరా? ఆలాగుచేస్తే సువార్తికులు, బోధకులు, ప్రసంగీకులు, యేసుప్రభువు యొక్క సేవకులు మీరే అవుతారు. ఈ రెండు ప్రసంగాలు, మీ ఇంటిలో, మీ గ్రామములో, మీ పట్టణములో చేయండి.
మీరు ఇన్ని బోధలు ఎందుకు విన్నారనగా మీరునూ వెళ్లిచెప్పుటకే. రక్షింపబడిన ప్రతివారు ఇతరులనుకూడా రక్షించవలెను. ప్రభువుచేసిన మొదటి పని అతని బోధకునిగా నియమించెను.
- (1) నీవు వెళ్ళి,
- (2) నీ యింటివారికి చెప్పవలెను అని ఆజ్ఞాపించెను. (ఏమి చెప్పవలెను).
క్రీస్తుప్రభువు నీకు చేసిన దానిని వెళ్లి చెప్పవలెను. యేసుప్రభువుయొక్క ఆజ్ఞ ఎందరి చెవులలో వినబడవలెను? ప్రభువునకు 12మంది శిష్యులున్నారు. ఆయన వరలోకానికి వెళ్లుతూ, వారికి ఒక ఉద్యోగం ఏర్పర్చెను. 'భూదిగంతములవరకు వెళ్ళి సువార్త చెప్పుడి, నేను మిమ్మును ఏర్పాటు చేసికొనియున్నాను' అనెను. 12మందిని, 70మందిని ఎట్లు ఏర్పర్చెనో అలాగే ఇతనికూడా ఏర్పర్చెను. అట్టి ఏర్పాటులోనికి ఇతనిని తెచ్చెను. ఎంత ధన్యత! మీరు సర్వరాష్టములకు వెళ్లండి! అన్యజనులయొద్దకు వెళ్లండి అని ఎట్లు ఆజ్ఞ ఇచ్చెనో, ఈ పిచ్చివానికిని అట్టి ఆధిక్యత ఇచ్చెను. ప్రసంగవాక్యం ఏదనగా, దేవుడు నీకు చేసిన ఉపకారం. ఆయన తాను పంపిన ఆ వ్యక్తికి
- (1) ప్రసంగ స్థలము ఇచ్చెను. అదే తన సొంత సొమ్ము
- (2) ప్రసంగ జనము ఎవరనగా ఆ వ్యక్తి ఇంటివారు.
- (3) ప్రసంగ ఉద్యోగం
సువార్తపని. ప్రభువు
- 1) బోధపని (ఉద్యోగం),
- 2) ఆజ్ఞ
- 3) ప్రసంగ అంశం,
- 4) స్థలము,
- 5) జనము ఇచ్చెను.
ఈ దినములలోను మనకుకూడా ఈలాగు ఇచ్చుచున్నారు. మొదట స్మశానములలోనున్న పిచ్చివానికి ఇచ్చెను. ఇప్పుడు మనము బాగుపడితే మనకును ఇచ్చును. పై వానికి ఇచ్చినట్లు మనకును అన్నియును ఇచ్చును.
- (1) కథ:- గోరిలలో ఉన్నవానిని తెచ్చి బాగుచేసెను.
- (2) కథ:- ఉద్యోగం, ఆజ్ఞ ప్రసంగ అంశము, స్థలము, జనము, ఇచ్చినట్లు మనయెడలను ఈ రెండు పనులను చేయగలడు.
కొత్త పాఠము ఇందులో దాగియున్నది. పై రెండు పనులు ప్రభువు అతనికి చేసిన పనులు. అయితే, అతడు చేసిన పనులున్నవి. శిష్యులకు లోకమంత అప్పగించెను. స్మశాన వాసికి తన ఇల్లే అప్పగించెను. అతడు - "దేవుడు నన్ను బాగుచేసెను. నన్ను స్వస్థపరచెను" అను సువార్త చెప్పెను. సువార్తికులు ఆ సంగతులు చక్కగా వ్రాసిరి. ఏ ప్రాంతమునకు వెళ్ళినను దెకపోలి ప్రాంతములకు మొత్తము వెళ్ళి, దేవుడు నీకు చేసిన మేళ్లన్నియు చెప్పుము. లూకా 8. నీవు నీ యింటికి తిరిగివెళ్లి, నీ దేవుడు నీకెంత గొప్ప కార్యములు చేసెననో చెప్పుమనెను.
దెకపోలి:- అనగా అపరిశుద్ధ స్థలము. అక్కడ దేవుడు అతనికి చేసినవన్నియు ఈ వ్యక్తి చెప్పియుండెను. అతని దుస్థితి చరిత్ర అంతయు చెప్పియుండును. ఇది పెద్ద ప్రసంగము కాకుండ యుండునా? ఇతని పాఠము 5 వారములు చెప్పియుంటిని ఎంత చరిత్రయైనది! ఈ వివరము అంతయు కొందరు 1గంటలో ముగిస్తారు. అయితే, స్వదేశీ మిషనెరీ చరిత్ర వినిన కొందరు “నాకేమి తెలుసునని బోధకు వెళ్లను!” అంటున్నారు. కొందరు “నాకు చదువులేదు ఏలాగు బోధకు వెళ్లమంటారు! అని అంటున్నారు. ఒక వృద్ధిరాలు నాయొద్ద బోధవిని వెళ్ళి, “ఏమిటి! ప్రభువు వస్తున్నారు సిద్ధపడండి అని చెప్పనా? అని చెప్పెను. 1గం॥ నేను చెప్పితిని, ఆమె ఒకమాట చెప్పెను. అంతే చెప్పండి, అదేచాలును. మారందరు ఆలాగు కొద్దోగొప్పో చేయగలరా? ప్రభువు అతనికి గొప్పకార్యములు, ఉపకారకార్యములన్నియు చేసెను. అతనికి చాలా ఉపకారములు చేసెను.
- (1) “ఇంతకు ముందు ఇతర ఇండ్లకు వెళ్ళేవాడనుకాను” అని ఇపుడు అన్ని ఇండ్లకు వెళ్లేవాడు.
- (2) ఇతర దేశము వెళ్లేవాడనుకాను. అన్ని దేశములు వెళ్ళినాడు.
- (3) దిగంబరిని - వస్త్రములు ధరించియున్నాను.
- (4) దయ్యము పట్టినవాడను - దయ్యములను వెళ్లగొట్టుతున్నాను.
- (5) మునుపు భయంకరుడను, ఇపుడు ఇతరుల ఉపకారి; “ప్రభువు కొంచెము చెప్పితే ఎక్కువ చేసెను”.
అతడు పనిచేసినందుకు ఫలితము ఏమనగా అందరు ఆశ్చర్యపడిరి. వారి హృదయములోపల ఆశ్చర్యము పుట్టెను. ఈ కథలో ప్రభువు నేర్పిన దివ్యోపదేశములన్నియు నేర్చుకొని, మీరును ఆలాగు చేయండి. ఆ పిచ్చివాడు బోధకుడు, ఇంటి బోధకుడు, టూరింగు ఇవాంజిలిస్టు. ఆయన మిషనెరీ సేవవల్ల అందరికి ఆశ్చర్యము కలిగినది. మీరు ఆలాగు చేయగలరా? ప్రజలందరూ ఇప్పుడే ఆశ్చర్యపడిరా? లేక ప్రభువు విషయములో ఎప్పుడైన ఆశ్చర్యపడినారా? మత్తయి 7వ అధ్యాయము చివరిలో ఆ సంగతి ఉన్నది. యేసు ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపడిరి. వారు
- (1) ప్రభువు మాటలకు ఆశ్చర్యపడిరి.
- (2) స్మశానవాసి మాటలకు ఆశ్చర్యపడిరి.
మంచి సమరయుని కథలో ఎక్కువ ఖర్చుచేస్తే ఇస్తాను అని ఉన్నదికదా! గనుక ప్రభువు వాక్యంద్వారా చెప్పినదానికంటె నేను ఎక్కువ చేసి తీరుదును అని ప్రతి ఒక్క సువార్తికుడు తీర్మానించుకొనవలెను.
- 1) ఇది నా మతము
- 2) ఇది నా వ్రతము
- 3) ఇది నా హితము ఇవి సువార్తికుని తీర్మానములు.
గనుక చేసి తీరుదును. ఇతనికి ప్రభువు చెప్పనివి అనేకములు, అయిననూ ఇతడు తన ఇంటివారికిని దేశస్థులకును చెప్పియున్నాడు.
పార్ణన:- ఓ యేసువ్రభువా! ఈవేళ ఎందరు రోగులున్నారో, వారికి ఈ వర్తమానము వల్ల స్వస్థత ఇమ్ము. అతనికి శరీరాత్మల స్వస్థత ఇచ్చి, అతని సేవను దీవించినట్లు, వీరిని దీవించుమని త్వరగా వస్తున్న యేసుప్రభువుద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.