వల, గాలము, పాఠము
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
యెషయా 55:8-13; మత్త 4: 18-22; అపో.కార్య. 26:25-29; రోమా. 10:4
సువార్త సత్యములను వినుటకు వచ్చిన ప్రియులారా! సువార్తలోని శుభములు మీకు అందునుగాక! నేటి దినమున ధర్మశాస్త్రము చేసేపని, సువార్త చేసేపని మీకు వివరించుదును. మీరు ఎరిగిన రెండు మాటలు జ్ఞాపకము చేయుదును. అవి
- 1. వల.
- 2. గాలము.
సువార్త వలవంటిదైతే, ధర్మశాస్తములో ఏమున్నదనగా, ధర్మశాస్తములో బోధనాప్రమాణమున్నది. అందులో
- ఎ) ఆజ్ఞ
- బి) ఆచారము ఉన్నవి.
- ఎ) 1) ఫలానిపని చేయరాదు.
- 2) చేసినయెడల శిక్ష
- 3) ఆ శాపము సంతతిమీదకి వెళ్లును.
- 4) దేవునికోపాగ్ని రగులుకొనును.
ఇప్పుడు సువార్తికుడు చేయవలసిన పని ఏదనగా,
- 1. ఎ) శిక్ష పరిహారము చేయుట, బి) మేలుచేయుట నేర్చుకొనుడి అని బోధించుట;
- 2. విశ్రాంతి కలుగజేయుట,
- 3. కీడు తీసివేయుట,
- 4. ఆదరించుట, క్షమించుట.
బైబిలులోని ఈ రెండు చెప్పవలయును కేవలము ధర్మశాస్త్రముచెప్పితే ప్రజలు గందర గోళ పడుదురు. (2) అయితే సువార్తచెప్పుటలోనే ఆదరణ కలుగును గనుక ప్రభువు శిక్ష తీసివేయును అనగా క్షమించును గనుక ఆయనను నమ్మవలెను అను ఈ రెండు చెప్పవలయును. వట్టి ధర్మశాస్త్రమునే చెప్పితే చెదరిపోవుదురు. ధర్మశాస్త్రము గాలము వంటిది గనుక గాయపరచును. సువార్త వల వంటిది. గాలములో పడిన చేప బాధపడుతుంది, చివరకు చనిపోతుంది. వలలో పడిన చేప పారిపోవ తలంచినను, పారిపోలేదు. చేప ఎందుకు వలలోనుండి పారిపోవుటకు ప్రయత్నించును? హాని కలుగునని తలంచునుగాని నిజముగా హాని లేదని తరువాత గ్రహించును.
అపోస్తలులను చేపలు పట్టువారిని ప్రభువు పిలిచెను. వారు వలవేయగా మొదట చేపలు పడలేదు. ప్రభువు వలవేయుమని చెప్పగా చేపలు పడెను, వల పిగిలిపోవునన్ని పడెను. అలాగుననే
- (1) మొదట సువార్త చెప్పగా, వెంటనే చేపలు పడవు, అనగా సువార్తను అంగీకరింపవు.
- (2) అయినను చెప్పగా చెప్పగా, వల పిగిలిపోవునంతగా చేపలు పడినట్లు, గుడి నిండునట్లుగా వత్తురు. అప్పుడు అనేకమంది విరోధులు సువార్తకు విరుద్ధముగా చెప్పుదురు. ఆ సమయములోకూడ వల పిగిలిపోవునట్లు కనబడును.
- (3) కాని ఎప్పుడైతే పాలివారు వచ్చి సహాయము చేయుదురురో, అప్పుడు సువార్త పిగిలిపోదు అందరు చివరకు రక్షింపబడుదురు.
ఈ లోకములో రక్షించబడక హేడెస్సులోనికి వెళ్ళువారు ఎవరనగా,
- 1) సువార్త విననివారు,
- 2) సువార్తవినియు, మారుమనస్సు పొందనివారు,
- 3) ధర్మశాస్త్రము విని నిరాశ చెందినవారు,
- 4) పాపము వదలిపెట్టలయునని ఆశ ఉన్నను, వదిలించుకొనే శక్తిలేనటువంటివారు.
- 1) “మీరు సమస్త రాష్ట్రములకు వెళ్ళి సువార్త ప్రకటించుడి, భూమిమీద నాకు సర్వాధికారము ఇవ్వబడినది అని ప్రభువు చెప్పెను.
- 2) మీరు లోతుగా వెళ్లి వలవేయుడి అనగా పాతాళ లోకములోనికి అనగా భూమిమీదనుండగా నిరాశ స్థితిలోనున్న వారికి, పాతాళలోక లోతుననున్న హేడెస్సులోనున్నవారికి
"ఉదా:- తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టెను. దూర దేశమునకు వెళ్లెను, అక్కడ పందులతో సమానుడాయెను అనగా హేడెస్సులోనికి దిగిపోయి, అక్కడి వారితో సమానుడాయెను. అక్కడ మారుమనస్సుపొంది, తండ్రి జ్ఞాపకమువచ్చుట సువార్తపనియైయున్నది. గాన లోతుగా వెళ్లినను రక్షింపబడుదురు. గనుకనే ప్రభువు - 'లోతునకు వెళ్ళి వలవేయుమని' పేతురుతో చెప్పెను. పేతురు లోతుగా వెళ్లెనా? నావ లోతుగా వెళ్లెనా? ఎవరూ లోతుగా వెళ్ళలేదు. కాని వల వెళ్లెను. ఆ రీతినే సువార్త హేడెస్సుకుకూడా వెళ్లెను.
పేతురు, యోహానులు వేసిన వల ఎంత పెద్దది. పేతురు వేసిన రెండవ వల ఎంత దూరము వెళ్లెను? 3వేల మందికేకాదు తరువాత సర్వరాష్ట్రములకు వెళ్లెను. వారువేసిన వల తీసివేయబడలేదు. ఈ దినములయందుకూడ ఆ వల పనిచేయుచున్నది. ప్రభువు చేపలు పట్టుమనగా పేతురు ఆ వలను పట్టెను కాని ప్రభువు మనుష్యులను పట్టు వానిగా చేయుదుననగా ఆ వలను వదలిపెట్టెను. మొదటి వల లాభము లేదు. కాని రెండవ వల పనిచేయుచున్నది. మొదటి వల వేసినపుడు పేతురు సముద్ర చేపలను తిననే తినలేదు. గాని రక్షణ వలవేసి రక్షణఫలము అనుభవించెను. రక్షణలో నిరాశ చెందినవారికి కూడ సువార్త అందును. వలవేసినపుడు ఏదో ఒకప్పుడు రక్షణ తప్పదు.
కొలస్స. 2:16 వల, గాలము కథ:- ప్రభువు నావను లోతునకు నడిపించవలెనని చెప్పెనుగదా! అప్పుడు చేపలు ఉపరి భాగమున లేవు. ఉపరిభాగము దాటి, మధ్యజల భాగము దాటి, అడుగున ఇసుక భాగములోనికి వెళ్లి అక్కడ ఉన్నవి. వల వేయుటతోనే వలలోనికివచ్చి వేసెను. ఈ సంగతి ఒక సంగతిని జ్ఞాపకము చేయుచున్నది. పాపులు నిరాశలోనికి వెళ్తుచున్నారు. ఎందుకనగా, “తమ పాప క్షమాపణ కొరకు ప్రార్ధించవలెనను నిశ్చయత తెలియక" నిరాశలోనికి వెళ్లుచున్నారు. పాపమును జయించే శక్తి కొరకు ప్రార్థించి దొరకక, ప్రార్ధన, బైబిలు చదువుట, సువార్త పని, చందావేయుట మాని చతికిల పడుచున్నారు. అట్టివారిని ఆ చివర పట్టుకొనుటకు ప్రభువు వెళ్లగలరు. గనుకనే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈలోకమునకు వచ్చెనని ప్రభువు చెప్పెను భూమియొక్క అంత్య భాగములోనికి మీరు వెళ్లిన నేను మిమ్మును అక్కడనుండి తీసికొని వచ్చెదను అని యెహోవా సెలవిచ్చెను.
తప్పిపోయిన గొర్రె మంద విడచి, ఊరు విడిచి ఎక్కడికో పోయెను. కాపరి అక్కడకు వెళ్లి తీసికొని వచ్చినారు. తప్పిపోయిన కుమారుడు ఇల్లు వదలి వేరే దేశము పోయినాడు. దుష్ట సహవాసము వలన ఇబ్బంది పడినాడు, పనిలేక విచారించినాడు, ఆ తరువాత పందుల పొట్టు దగ్గరకు వెళ్లినాడు. చివరకు తండ్రి ప్రేమ జ్ఞప్తి వలన తండ్రి యొద్దకు వచ్చినాడు. అట్లే పాపులు ఈ లోకములో అనేకమైన గడువులను అంగీకరించక మరణములోనికి వెళ్లుచున్నారు. తుదకు హేడెస్సుకు వెళ్లుచున్నారు. నావను "లోతునకు నడిపించండి” అని శిష్యులకు చెప్పిన ప్రభువు లోతులోనికి పోయిన హేడెస్సు వాస్తవ్యుల దగ్గరకు వెళ్లి, అనగా భూమ్యాంత లోకమునకు వెళ్లి, అక్కడున్నవారిని ఉన్నతమైన పరదైసుకు కొనిపోవుచున్నాడు. గాలము వల్ల చేపకు గాయము కలిగి బాధపడును. అట్లే మోషే ధర్మశాస్త్రములోని ఆజ్ఞల ప్రకారము నడువని పాపులకు భీతి, గాయము కలుగును. అయితే, వల వలన చేపలకు హాని కలుగదు, అట్లే సువార్త బోధవల్ల ప్రజలకు హాని కలుగదు. మరియు ధర్మశాస్త్రము వల్ల బెదిరింపులు, శిక్షలు, శాపములు, తీర్పులు వినబడును. అయితే, సువార్త బోధవల్ల ఆదరణ, సంతోషము, విశ్రాంతి, ఉపదేశము, రక్షణ భాగ్యము, పాపక్షమాపణ, జీవనశక్తి, మోక్షలోక ప్రవేశము కలిగి, ఈ మొ॥వి అన్నియు మారుమనస్సు పొందువారికి కలవని బోధించుచున్నది.
షరా:- బోధన ప్రమాణములో అనగా ధర్మశాస్త్ర బోధలలో రక్షణ మార్గము లేకపోలేదు. అందులో ఎక్కువ భాగము పాప విసర్జన కలదు. సువార్తలలో పాప విసర్జన బోధ లేకపోలేదుగాని ఎక్కువ ఆదరణ కలదు. బోధన ప్రమాణము గాలము వంటిదైతే, సువార్త వల వంటిదైయుండును. పాతవల పారవేసి, రక్షణార్ధమై మనుష్యులను పట్టవలసిన క్రొత్తవల - పేతురు, మొ||నవారు ఉపయోగించి అనేకులను ప్రభువు తట్టుకు త్రిప్పిరి. అదే సువార్తవల. ఆ వల వలననే నేటివరకు అన్ని జనాంగములకు రక్షణవార్త అలుముకొనుచున్నది, పాపులనుచేర్చుకొనుచున్నది. నిరాశ పడేవారిని లోతుకు పారిపోయిన వారిని ఆ వల చేపట్టును. ఆ వల హేడెస్సు వరకు అలుముకొని అక్కడకూడ అదేపని చేయుచున్నది. అట్టి పనిలో పాలుపొందుటకు ప్రభువు తన వాక్యముద్వారా మిమ్ములను సిద్ధపర్చుకొనునుగాక. ఆమేన్.