దేవుడు నరులందరితో మాట్లాడుట
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
అది. 17:22; 18:23; నిర్గ 33:11.
దైవాశక్తిపరులైన విశ్వాసులారా! నేటికాల వాక్యధ్యాన మూలముగా సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పిన ప్రభువు మీకు కనబడి, మీతో మాట్లాడునుగాక! ఆమేన్.
దేవుడు, మనిషితో మాట్లాడేవాడైయున్నాడు. అయితే మనిషి పాపము చేసి దేవునికి దూరమైనందున దేవుడు స్వయమముగా మనిషితో మాట్లాడుటకు సందులేదు. గనుక దేవుడు
- 1. మొదట సృష్టిద్వారా మనిషితో మాట్లాడుచున్నాడు, అనగా ఆకాశముద్వారా, భూమిద్వారా మాట్లాడుచున్నాడు.
- 2. బైబిలుద్వారా మాట్లాడుచున్నాడు. దేవునిమాటలు బైబిలుగంథములో వ్రాయబడియున్నవి. బైబిలు పుట్టకముందు దేవుడు పైరెండు సాధనముల ద్వారా మనిషితో మాట్లాడుచుండెను.
- 3. అంతేకాక జ్ఞానముద్వారా మాట్లాడుచున్నాడు.
- 4. మనస్సాక్షిద్వారా మాట్లాడుచున్నాడు.
ఈ లోకములో “ఏది మంచిదో ఏది చెడ్డదో మీకు తెలియదు. సృష్టిని కలుగజేసిన వాడను నేనే అని దేవుడు ప్రతి మనిషితో మాట్లాడుచున్నాడు. గనుక మీలోని జ్ఞానమునుబట్టి తెలుసుకొనండి, ఏది సబబుగా ఉన్నదో! మంచి చేసేటప్పుడు మనసుకు బాగుండును. చెడుగు చేయునపుడు మాత్రము మనసు కొట్టుకొనిపోవును. దేవుడు యంత్రములద్వారా (శబ్ద తరంగాలైన మైక్, రేడియో, టెలివిజన్ల ద్వారా ప్రకటింపబడే సువార్త) మాట్లాడుచున్నాడు. ఈ యంత్రములుద్వారా అనేకమందితో మాట్లాడు చుండగా, నా యంత్రములద్వారా (బూరలతో) 'మాట్లాడకూడదా? మీరు ఈ బూరద్వారా వినుచున్నారు. నా స్వరము విన్నారా? విన్నారు. అయితే, మనిషే దేనిని లెక్కచేయుటలేదు అని దేవుడు "నా ఆజ్ఞలు వ్రాస్తాను” అని వ్రాసి ఇచ్చెను. అన్ని సంగతులు చెప్పుచున్నను, బైబిలు ఇచ్చెను. ఈ బైబిలు చదువుకొంటే పై నాలుగును అందులో కలవు. ఇవి అన్నియు ఇచ్చినను మనిషి దేవుని లెక్కచేయలేదు. బైబిలు రాకముందు దేవునిని గ్రహించలేక పోయినందున మనిషికి అన్ని నష్టములు కలిగెను. అజాగ్రత్తవల్ల రెంటికి మనిషి మనస్సాక్షి నష్టమే! పాపముచేసినందున మానవుని మనస్సాక్షి సరిగా చెప్పుటలేదు. పాపము లేకపోతే సూర్యునిచూచి ఎంత మంచి వెలుగు దేవుడు ఇచ్చెను అనునుగాని ఇప్పుడు పాపము వచ్చినందున దేవుడు ఎంత ఎండ ఇచ్చెను! అని మనిషి దేవుని చెడుగా తలంచుచున్నాడు. పాపమువల్ల మనిషి హృదయము అంతయుచెడుగు అయిపోయెను. గనుక మోషే అనే దైవజనుడు పుట్టువరకు దేవుడు ఊరుకొని, ఆయనకు విద్యనేర్పి, పారిపోయిన వానికి మరలా కనబడి, "మోషే! నీతో చెప్పినది 70మందికి చెప్పు, వారు అందరితో చెప్పుదురు” అని మోషేతో సృష్ట్యాది మొదలుకొని, ఏర్పాటు జనాంగముయొక్క వాగ్దానదేశ ప్రవేశము వరకు జరిగిన సంగతులున్నియు విపులముగా వ్రాయించెను. ఈలాగున మోషే తన వ్రాతను 70మందికి, వారు తర్వాత పుట్టినవారికి ఆ వ్రాతలు అందించిరి. అదియే బైబిలులోని ఒక భాగమైన పాతనిబంధన గ్రంథములోని ప్రాముఖ్య భాగము.
గనుక మనస్సాక్షి తప్పని చెప్పితే బైబిలు చూడవలెను. ఇది వ్రాయబడినది గనుక ఇందులో తప్పు ఉండదు. యేసు జన్మించినపుడు చూడవచ్చిన జ్ఞానులు, యూదులు రాజు ఎక్కడ అన్నారు. జ్ఞానులు పండితులుద్వారా తెలుసుకొనిరి. వారు బైబిలుద్వారా ఆ సంగతి తెలుసుకొనిరి. అలాగే బైబిలులోనున్న సంగతులను, బైబిలు ఎరిగిన వారే పరీక్షించవలెను. ఒకవేళ బైబిలులోనున్నది నచ్చకపోతే, దేవుడు సృష్టిలో ఉంచిన ఈ అయిదు సాధనములు నమ్మనివారిని ఏమి చేయగలము. దేవుడు ఇంకొక ఉపాయము చేసెను. ఆయన లోకమునకు అన్ని ఇచ్చెను అప్పుడుకూడా నరుడు దేవుని మరచెను. ఆకాశమువైపుచూచి, చుట్టు చూచి, 'వర్షము కురిసినందున మొక్కలు మొలిసినవి' అని తలంచి దేవుని కార్యమును విస్మరించెను. అంతేకాక ఈ మనసుకు ఏమి పనిలేదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, రేపులేడు అనును. జ్ఞానము అంతే, బైబిలు అంతే. బోధకులు అంతే. "నేను ఏది వినను, నాకు సుఖమే నా దేవుడు. దేవుడు, సుఖముద్వారా మాట్లాడుచున్నాడు” అని మనిషి, మనస్సాక్షి స్వరమును, దేవుని సాధనములను తేలికచేసి, దేవునినిగుర్తించక ఉండును. అయితే దేవుడు మానవునకు అనేక విధములుగా తెలియజేసికొనుచున్నాడు. ఎండలో కాళ్లుకాల్తే పరమాత్మా! రక్షించు అని పిలుస్తాము. వర్షములో తడిసినందున పడిసెము పట్టును. ఈ విధమైన శ్రమలుద్వారా దేవుడు మనిషితో మాట్లాడును. సుఖములు అనగా విద్య, బట్టలు, గాలి, నీరు, పండ్డు, తిండి, నిద్రవల్ల, అన్నిటివల్ల సుఖము. వీటిద్వారాను దేవుడు మాట్లాడును. అప్పుడైన దేవుడు మనిషికి నచ్చలేదు గనుక శ్రమలను రానిచ్చును. ఈ శ్రమలు మనిషికి ఉపకారం దేవుడు దేవుడు మనకు శ్రమ ఉంటేనేగాని దైవభక్తిరాదు. కొంతమంది సుఖములో కూడా దేవా! అందురు. ఈ ఏడు సాధనములుద్వారా దేవుడు లోకమంతటితో మాట్లాడుచున్నాడు. ఇంకను నరుడు వినుటలేదు. దేవుడు ఇంకొక ఉపాయం కనిపెట్టెను. బైబిలు ప్రకారం మతములను పంపి యూదులుచేతులలో బైబిలు నుంచెను. పాపము లోకములోనికి వచ్చిన తర్వాత జనులు విస్తరించిరి. ఇన్ని జనాంగములలో కాస్త మెరుగు అందుచేత యూదులను ఏర్పరచెను. వారిని 400 ఏండ్లు ఐగుప్తులో 40సం॥లు అడవిలో తర్వాత పాలెస్తీనాలో స్థిరపరచెను. యూదుల మతముద్వారా దేవుడు వారితో మాట్లాడెను. యూదులకు బైబిలు ఉన్నది. ఇతరులకు అదిలేదు. ఇతరులు బైబిలు తీసికొనుటకు సిద్ధముగాలేరు. దేవుడు యూదులకు బైబిలునేర్పి మీరు అందులోని సంగతులు వారికి చెప్పండి అన్నది, ఇతరులను గూర్చిన దేవుని ఉద్దేశము. అయితే, ఇదే యూదులు దేవునిని సిలువ వేసిరి. ఇతరులకంటె భక్తులు చేసినదే గొప్ప పాపము. అందుకు యేసుప్రభువు 12మందిని ఏర్పర్చుకొని, భక్తులకు, ఇతరులకు సరిపడునట్లుగా పాతనిబంధన, క్రొత్తనిబంధన అను రెండు భాగములను ఇచ్చెను. దానిని ఆది సంఘమునకు ఇచ్చెను గనుక దేవుడు అన్యమతముద్వారా భక్తులకు (యూదులకు) బోధచేసెను. ఇతరులు నన్ను విడచి సృష్టిని పూజించుచున్నారు అని యూదులద్వారా వారితోకూడా మాట్లాడెను. మీరు అందరికి చెప్పండి అని క్రైస్తవులకు బోధచేసెను. అన్యమతము, యూదులమతము, క్రైస్తవమతము ఇప్పుడు అన్నిమతములుద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. హెబ్రీ. 1:1లో ఉన్నట్లు, దేవుడు లోకమును కలుగజేసినది మొదలు, ఇప్పటివరకు ఏదో ఒకవిధముగా మాట్లాడుచునేయున్నాడు.
ఆయన శాశ్వతముగాయుండే దేవుడు. అనగా శాశ్వతుడైన తండ్రిగా నున్నాడు. ఈ నిరుత్సాహ లోకములో, ఉత్సాహపడు ఆత్మను; ఈ అజ్ఞాన లోకములో అనగా జ్ఞానోదయము, మంచి చెడులను ఎరుగని ఈ లోకములో వాక్యానుసారముగా నడుచుకొన జ్ఞానోపాయమును దేవుడు ఏర్పరచియుంచినాడు. "గనుక ఆయన మాట్లాడే దేవుడైయున్నాడు". భూలోకంలో మొదటి మతము పేరు విగ్రహారాధన మతము. పాపప్రవేశమునుబట్టి మతములు అనేకములుగా పుట్టుకొచ్చినవి. వాటిలో కొన్నిటిని వివరించుదును.
1. సృష్టిని పూజించువారు, సృష్టిమతము. దానిని దేవుడు ఎందుకు రానిచ్చినాడు? వారి తర్వాత ఎన్నికజన మతము, యూదుల మతము రావలసియున్నది గనుక. వీరు ధర్మశాస్త్రము గలిగి దేవుని స్వరము వినుచున్నారు. ఈ యూదుల మతము దేవుని ఆజ్ఞలు, ఆచారములు, లోకమునకు రక్షకుకుని పంపెదనని దేవుడు వాగ్ధానమిచ్చిన మతమైయున్నది.
- (1) సృష్టి మతము: - దేవుడు కనబడనందున ఈ మతము కలిగెను. వస్తువులు కనబడుచున్నందున సృష్టే మతముగా ఇది ప్రారంభమయ్యెను.
- (2) ఎన్నికమతము:- ఇది రక్షకుడు రానైయున్న మతము. సర్వలోక రక్షకుడు ఉద్భవించు మతము ఉండగా, ఇంకా సృష్టి మతము ఎందుకు? ఈ వరుసలోనిదే యూదుల మతము. ఇండియాలోని హిందుమతము, పాలెస్తీనాలోని ఇస్లాంమతము, ఈలాగు ప్రపంచమంతా ధర్మములు అనేకములున్నవి. హిందువులకు, బౌద్దులకు గ్రంథములున్నవి. సృష్టిమతము వారికి గ్రంథములేదు.
పారసీక మతము:- ఇది అగ్నిపూజ చేయు మతమైయున్నది. ఆ తర్వాత వచ్చిన మతము, క్రైస్తవమతము. మామిడికాయ పండిన తరువాత మామిడిపండు అనిపించుకొనును. క్రీస్తువచ్చినాడనే చెప్పేదే క్రైస్తవమతము అయినది. ఆ తర్వాత వచ్చినది ఇస్లాం మతము. వీరికి గొప్పగ్రంథము కలదు. ఇంకొకమతమున్నది. అది ఇకా పురాతనమైనది. అన్నిటికన్న పురాతనమైనది నాస్తికమతము (దేవుడులేడు అనుమతము). "ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపములో పడినారో, దేవుడు తీర్పు ఎప్పుడు వినిపించి పైకి వెళ్లినాడో, అప్పటినుండి దేవుడు లేడనే మతము ఆరంభమైనది. మిగిలినవారు అనగా ఆదాము, అవ్వల వరుసలోనివారు దేవుడు ఉన్నాడు. పరలోకములో ఉన్నాడు అన్నారు. కనబడని దేవుడు, మాట్లాడని దేవుడు, 'లేడు' అని నాస్తికులు అన్నారు. వారు దేవుని ఒప్పుకొనలేదు. తక్కినమతములవారు దేవుడు ఉన్నాడు అన్నారు. వీరు ఆస్తికమతస్తులు. నాస్తికులు దేవుడు ఏడి చూపండి! అన్నారు. వారిలో ఇదొక గడుచుతనము ఉన్నది. అన్నిమతస్తులలో గొప్ప పండితులు గలరు. అందరికన్న ఎక్కువ పండితులు (క్రైస్తవులు) మతములో కలరు. అయితే అన్ని మతములు ఒక్కటే అగునా? అన్ని మిషనులు ఎపుడు ఒకటి అగునో, అపుడే అన్ని మతములు ఒకటి అగును. అపుడు వాటిమీద వ్రాయబడియున్న ప్రశ్నలు గాలిలో అంతర్థానమగును. యేసుప్రభువు - ఇవి కాని వేరే గొర్రెలున్నవి, వాటిని చేరుస్తాను. అప్పుడు మంద ఒకటి కాపరి కూడ ఒకడగును అని చెప్పెను. దేవుడు రెండు మందల గురించి, అవి ఏకమైన స్థితిగురించి పై వాక్యములో చెప్పెను.
దేవుడు మాట్లాడు విధము:-
- (1) సృష్టిద్వారా మాట్లాడుట,
-
(2) దేవుడే స్వయముగా మాట్లాడుట.
మనిషి రెండవ దానికి సిద్ధముగా లేడు గనుక మొదటి దానిద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. తనకుమారునిద్వారా నేటివరకు, అంత్యతీర్పు వరకు దేవుడు మాట్లాడుచూనే ఉండును. దేవుడు యూదులతో మాట్లాడినాడు. అలాగే ఇతర మతముల ద్వారా మాట్లాడుచున్నాడు. నాస్తిక మతముద్వారా కూడ మాట్లాడుచున్నాడు. ఇవన్ని మనిషి అంగీకరించినయెడల దేవుడే స్వయముగా మాట్లాడును. యూదులు - నీవు వస్తావని ఎంతకాలము మమ్మును సందేహ "పెట్టెదవు” ఇంతవరకు నేను చెప్పినవి నేను చెప్పాను. అలాగే ఇప్పుడు చెప్పుచున్నాను “అన్ని మతములుద్వారా మాట్లాడుచున్నాడుగాని" అన్ని మతములలోని సత్యాంశసారము వేరువేరు.
- (3) ఇంకొకమతమున్నది. అది శక్తిపూజ చేసే మతము. వారికి కనబడును, మాట్లాడును దేవుడు కాదుగాని దయ్యము గనుక అది దయ్యముల మతము.
- (4) షింటో మతము (జపాను). దీని భావము, నా మతము నాకు తోచినమతము. అన్నిమతములుద్వారా ఆయన మాట్లాడవలెననుకొన్నాడు గనుక అన్నిటిని ఆయన రానిచ్చెను. దేవుడు స్వయముగా అందరితో మాట్లాడునుగాని గ్రంథ ఆచారములు మొదలైన వాటిద్వారా తెలియపర్చుకొనెను.
మతముల మొదటి ఉద్దేశము ఏదనగా, దేవుని పూజించుటకు మనము సృష్టిని పూజించుచుండవలెను. ఆ దేవునికే చెందును. ఈ సృష్టి ఆరాధికుల మతము తర్వాత వచ్చిన యూదుల మతముద్వారా, హిందు మతముద్వారా ఆయన ఏమి మాట్లాడుచున్నాడు! ప్రతి మతము ద్వారా లోకమునకు దేవుడు ఒక వర్తమానము పంపిచుచున్నాడు. ఆ వర్తమానములు వారు వారి గ్రంథములో వ్రాసిపెట్టినారు. దేవుడు ఎందుచేత ఈ మతములను రానిచ్చినాడు అనగా, మనుష్యులు మతములను ఏర్పాటు చేసుకొన్నప్పుడు ఆయన వాటిద్వారా మాట్లాడుటకు పూనుకొనెను. అయితే దేవుడు స్వయముగా అన్నిమతములవారితో మాట్లాడుటకు సిద్ధముగానేయున్నాడు. త్వరలో ఆ కాలము రానైయున్నది.
నేడు ప్రపంచములో ఉన్న మానవులందరును బ్రతుకుదెరువు నిమిత్తము ఒక పని చేస్తున్నారు. అది జ్ఞానమునకు సంబంధించిన పని.
- (1) విద్య నేర్చుకొనుచున్నారు.
- (2) చేతి వనులు నేర్చుకొనుచున్నారు.
వీటివల్ల, జ్ఞానబలము, వృద్ధి కలుగును. నరుని బ్రతుకులోని చెడుగుకు విశ్రాంతిలేనందున జబ్బులు, అందునుబట్టి వైద్యశాఖ అవసరమైనది. ఈ మూడు మానవులు స్వయముగా ఏర్పాటుచేసికొనిరి. మానవులు ఈలాగు ఏర్పాటుచేసికొనిన దేవుడు ఊరుకొనెను. ఆ అన్నిటిద్వారా మాట్లాడుటకే ఇవి ఏర్పాటుచేసెను. విద్యశాఖద్వారా, అలాగే అన్నిశాఖలద్వారా దేవుడు ఏమి వర్తమానమిస్తున్నారు. తన కుమారుని గూర్చిన వార్తను వినిపించుచున్నారు. దేవుడు చేసిన అన్యాయమేమి? ఆయన అన్నిటిద్వారా మాట్లాడుచున్నారుగాని మానవులే ఆయనమాట వినుటలేదు.
(1) సృష్టిద్వారా, జ్ఞానముద్వారా, మనస్సాక్షిద్వారా, బైబిలుద్వారా, మనుష్యులు ద్వారా, దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ ఐదును పై మూడుకు సమానము. ఇవిగాక ఆయనే స్వయముగా మాట్లాడుచున్నాడు. పై సాధనముల ద్వారా దేవుడు మాట్లాడినపుడు వినకపోతే, రేపు ఆయన మాట్లాడితే ఏలాగు వినగలరు? మరి దేని ద్వారా ఆయన మాట్లాడిననూ, తెలిసికొనకపోతే, మానవుడు ఆయన స్వరమును వినుట ఏలాగు? ఈ విషయములు అన్ని బైబిలులోగలవు గనుక ఇది చదువుట ముఖ్యము. బైబిలు పఠన మహాముఖ్యము. ఇపుడన్నియు గూడార్ధమే! ఇవి అయిన తర్వాత స్వయముగా మాట్లాడును. తర్వాత రెండు విధములుగా మాట్లాడును. దేవుడు అందరితో స్పష్టముగా మాట్లాడే రోజు వచ్చుచున్నది. మనము కనిపెట్టుకొనినప్పుడు దేవుడు స్వయముగా మాట్లాడును. అన్ని మెట్లు ఎక్కువలెను. అప్పుడు పైకెక్కవచ్చును అనగా చిట్ట చివరకు చేరుకొనగలము. మెట్లు ఎక్కినపుడు మరలా జారిపోవుటకూడా గలదు. కనుక ఇంకను పైకెక్కవలెను. అన్ని మెట్లమీద మనోనిదానము ఉండవలెను. పైనుండిపడిన వారలు మొదట మెట్టుకు వస్తారు. అలాగే విశ్వాసులు అన్ని మెట్లుమీద ఉన్నారు. మనోనిదానము కుదరకపోతే ఏ మెట్టు కుదరదు. సృష్టిలోని సాధనములద్వారా దేవుడు పంపిన వర్తమానము మానవుడు వినకపోతే, ప్రార్ధన మెట్లుద్వారా మనిషి దేవునితో మాట్లాడే అవకాశము కల్పిస్తున్నాడు. అక్కడ దేవుడు మనిషితో, ఇక్కడ మనిషి దేవునితో మాట్లాడుట జరుగుచున్నది. దేవుడు నిత్యము మనిషితో తన సాధనములద్వారా మాట్లాడుచున్నాడు గాని మనిషి ఆ నత్తవలె అప్పుడప్పుడు జారిపడుచున్నాడు గాని దేవుని సత్యము కొండమీద మెట్లవలె తిన్నగా ఉన్నది. ఆ ప్రయాణములో ఇంకొకరువచ్చి 'ఏమయ్యా! ఇంకా ఇక్కడే ఉన్నావని' అడిగి, నేను పోతున్నాను అని ఏలాగు పైకి పోవునో అలాగే కొందరు విశ్వాసులు దేవునితో మాట్లాడి, ఆయనతో నిత్యము ఉండుటకు వెళ్ళిపోవుదురు. వారు మెట్లమీద పరుగెత్తినారు గనుక దేవునితో వెళ్ళిపోయినారు. కొందరు దేవుడు మాట్లాడే మెట్టులేదని అనుచున్నారు, లేదనుచున్నారు. “దేవుడు ఎట్లు మాట్లాడును? బైబిలు అంతా దేవుని ప్రత్యక్షత ఉన్నది. దేవుడు మాట్లాడిన పుస్తకము బైబిలు ఒక్కటే, అన్ని ప్రత్యక్షతలు అందులోనే ఉన్నవి. ప్రకటనలో ముఖ్యముగా దేవుడు మాట్లాడెను. యోహానుతో స్పష్టముగా మాట్లాడెను” అని అందురు. ఎస్తేరు గ్రంథములో దేవుడు గూఢార్థముగా తప్పించెనని గలదు అని వారందురు. అయితే నేడును దేవుడు కనబడును.
దైవప్రత్యక్షత పొందుటకు మనము ప్రత్యక్షపు గుడారము లోనికి వెళ్లవలెను. మోషే
- (1) ఆవరణము,
- (2) పరిశుద్ధ స్థలము,
- (3) అతిపరిశుద్ధ స్థలముగల గుడారమును ఏర్పాటు చేసెను.
ఆ మూడవ దానిలోనికి ప్రధాన యాజకుడు సం॥మునకు ఒకసారి వెళ్లవలెను. మహాభయముతో వెళ్ళవలెను. అన్ని ఉతుకుకొనవలెను. ఇదే దర్శన లేదా ప్రత్యక్షత పొందే మెట్టు. ప్రార్ధనమెట్లలోని మొదటి ఆరు మెట్లు ఆవరణము పరిశుద్ధ స్థలమువంటివి. చివరమెట్టు అతిపరిశుద్ధ స్థలము వంటిది. అలాగే ఇప్పుడు ఎవరైనా అట్టి ప్రత్యక్షతా స్ధలము కట్టిస్తే, ఇప్పుడును ప్రభువు దిగివచ్చును. ఈ లోకములో ఆవరణ, పరిశుద్ధ, అతిపరిశుద్ధ స్థలములు ఉన్నట్టు, ఈలాగే పరలోకములో ఉన్నవి. పెండ్లికుమార్తె నూతన యెరూషలేములో ఉండును. ప్రత్యక్షపు గుడారములోని తరగతులు, ప్రార్ధన మెట్లులోని తరగతులు, దేవాలయములోని తరగతులు గ్రహిస్తే మోక్షములో భాగములుండును అని గ్రహిస్తారు. ప్రభువు ఎందుచేత మనకు కనబడడు? మాట్లాడడు?
జవాబు:
- 1. ఆయనకు మనకు ఏదో తగాదా ఉండబట్టి.
- 2. పాపము లేకపోయినా ఆయనతో స్నేహము కుదురుటలేదన్నమాట.
- 3. ఆయనతో పరిచయము
లేదన్నమాట.
- (ఎ) పాపము లేకపోవచ్చును
- (బి) కలహము లేకపోవచ్చును
- (సి) పరిచయము లేకపోవచ్చును
- (డి) కాని విసుగుదల, కష్టము ఉండవచ్చు; ఇట్టివి ఉంటే ప్రభువు కనబడుట, మాట్లాడుట అనేది ఉండకపోవచ్చును.
ఆలాగు నూతన యెరూషలేములో చేరు తరగతిలో ప్రభువు మిమ్ములను చేర్చుకొనునుగాక. ఆమేన్.