బైబిలు, క్రీస్తు, క్రైస్తవత్వములోని సర్వవ్యాపకత్వము
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
దా॥కీర్తనలు 139:8; మత్త. 18:20; ప్రక. 1:8.
ప్రార్ధన:- అందరు ప్రభువును తలంచుకొనండి. యేసు ప్రభువా! లోకములో నీ మాట ప్రకారము నడిచిన భక్తులు చాలామంది ఉన్నారు. నావ కట్టిన నోవహును గురించి ఏమి వ్రాయబడినది? దేవుడు ఆజ్ఞాపించిన అన్ని పనులు చేసినాడు అని వ్రాయబడియున్నది. యెహోషువాను గురించి ఆ మాటే అనగా దేవుడు ఆజ్ఞాపించినవి అన్నియుచేసినాడు అని ఉన్నది అయితే బైబిలు మిషను బైలుపడిన తరువాత “నీ మాట ప్రకారము చేస్తున్నాను” అని నీ సేవకునికి నీవు చెప్పినావు. దానియొక్క అర్ధము యుక్తకాలమందు తెలియపర్చుము. అనేకమంది ఉండగా, "నేను నీ మాట ప్రకారము చేస్తున్నాను” అని నీవు చెప్పిన నీ మాటను నీ సేవకుడు ఇతరులకు చెప్పితే, వారు ఇతర భక్తుల యొక్క తీరు ఎరిగినవారై ఎట్లు నమ్మగలరు? నా తీరు ఎరిగినవారు ఎట్లు నమ్మగలరు? ఈ నీ మాటయొక్క అర్ధము నీ సన్నిధాన వర్తులకు తెలియపర్చుము. ఇప్పుడు మేము కొన్ని మాటలు చెప్పుకొనబోవుచున్నాము గనుక సహాయము చేయుము ఆమేన్.
నేటి సాయంకాల వర్తమానము దేవుడు సర్వవ్యాపి. దేవుని యొక్క లక్షణములలో ఇది ఒకటి. దేవుడు సర్వవ్యాపి. తక్కిన లక్షణముల గురించి ఇప్పుడు మాట్లాడను. ఈ కాలములో, మన దేశములో మనలను ఇతరులు మూడు విషయములలో నిందించుచున్నారు.
- 1. బైబిలు తప్పు,
- 2. క్రీస్తు తప్పు,
- 3. క్రైస్తవ మతము తప్పు.
ఈ మూడు తప్పులలో మీరు చిక్కుకొన్నారు అని వారు అంటున్నారు. ఎందుకనగా
- (1) బైబిలులో అసహ్యమైన సంగతులు వ్రాయబడియున్నవి గనుక అది దైవగ్రంథముకాదు.
- (2) ప్రభువులో అనేకమైన లోపములు ఉన్నవి గనుక ఆయన రక్షకుడు కాదు.
- (3) క్రైస్తవులలో అనేక పాపములు ఉన్నవి గనుక అది దైవమతము కాదు, వీరు కల్పించుకొన్న మతము అని అంటున్నారు.
ఈ మూడు తప్పులు చెప్పుటయేకాక రుజువు పర్చుచున్నారు. పత్రికలు, పుస్తకాలు అచ్చువేసి చల్లివేస్తున్నారు. అవి చదువుకొని కొంతమంది క్రైస్తవులు మతములోనుండి వెళ్లి పోవుచున్నారు. మన ప్రాంతములో 80మంది, మన దేశమంతటిలో 1500మంది (1957వ సం॥నకు మాత్రమే 1500మంది. ఇప్పటివరకు ఎంతమంది వెళ్ళిపోయిరో! ఎన్ని వేలమంది తిరిగిపోయిరో!) వెళ్లిపోయిరి. ఇంతమంది మతములో నుండి వెళ్ళిపోయినను మనకు నొప్పిలేదు.
ఇప్పుడు నా అంశమేమనగా "దేవుడు సర్వవ్యాపి". దానికిని, ఇతరులుచూపు పై మూడు తప్పులకు ఏమి సంబంధము?
I. దేవుడు బైబిలు గ్రంథమును ఎప్పుడు వ్రాయించెనో, అది మనము చూడలేదు. కొన్ని వందల సం॥ల క్రిందట వ్రాయబడినది. అయితే అది మనచేతులలోకి వచ్చినది కదా! అక్కడ మోషేచేత, యెహోషువా, సమూయేలుచేత, ప్రవక్తలచేత, సువార్తికులచేత, పత్రికాధిపతులచేత, ప్రకటన గ్రంథకర్తచేత వ్రాయించిన ఆ బైబిలు మన చేతులలోనికి వచ్చినది కదా! గనుక ఈ గ్రంథముయొక్క బుజువు దేవుడు ఉన్నాడనియేకదా! దేవుడు లేకపోతే ఈ గ్రంథమెట్లు మన చేతులలోనికిని వచ్చినది.
క్రీస్తు జన్మించిన 1500సం॥ల తరువాత వ్రాతలో ఉన్న గ్రంథమును లూథరుచేతిలో పెట్టితే ఆయన అచ్చు ఆఫీసులోపెట్టెను. అప్పటినుండి కోటానుకోట్ల బైబిళ్లు అచ్చుపడినవి. అయ్యగారి చిన్నతనములోనే 'కోటానుకోట్లు బైబిళ్ళు అచ్చువేసిరి' అని పత్రికలలో చదివెను. అప్పటినుండి ఇప్పటికి ఎన్ని కోట్లు అచ్చు వేసేయుందురోకదా! "బైబిలు మొదటి రైటరు మోషే చివరి రైటరు యోహాను. 66 పుస్తకములుగల గ్రంథము మన చేతికి వచ్చెను. మోషేవద్దనుండి లూథరువరకు వ్రాతరూపము వచ్చెను. లూథరు తరువాత అచ్చులోనికి వచ్చినది.
మోషేనీవు వ్రాయి, యోహానూ! నీవు ముగించు, లూథరూ! నీవు అచ్చువేయించు, బైబిలు సొసైటీవారలారా! 2000 పైగా భాషలలో అచ్చువేసి పంచిపెట్టండి. కొన్ని అమ్మండి అని దేవుడు ఎలా చెప్పినాడో! ఎక్కడ మోషే ఎక్కడ యోహాను, ఎక్కడ లూథరు, ఎక్కడ బైబిలు సొసైటీ, ఎక్కడ మనము! గనుక అక్కడనుండి ఇక్కడవరకు, దేవుడు వారితో ఉండి ఈ పనులన్ని చేయించుకొంటూ వచ్చాడు గనుక ఆయన మోషే దగ్గర ఉన్నాడు, యోహాను దగ్గర ఉన్నాడు, లూథరు దగ్గర ఉన్నాడు, బైబిలు సొసైటీవారివద్ద ఉన్నాడు. ఇన్ని స్థలములలో, ఇంత సమయము ఎలా ఉన్నారు గనుక ఆయన సర్వవ్యాపి ఆయన సర్వవ్యాపి. అయితే బైబిలుకూడా ఆయన సర్వవ్యాపకత్వము కలిగినదే. ఎందుకంటే ఈ బైబిలు ఎల్లప్పుడు ఉండేది.
మోషేవద్ద, యోహానువద్ద, లూథరువద్ద బైబిలుసొసైటీవద్ద మనవద్ద ఉండేది ఈ బైబిలు గ్రంథము గనుక దానికికూడ దేవుని సర్వవ్యాపక లక్షణము ఉన్నది. అంతేకాక, బైబిలు అన్ని దేశములలోనికి వెళ్లిపోయినది గనుకనే దానికి సర్వవ్యాపకత్వము ఉన్నది. ఇన్ని దేశములలోనికి ఏలాగు వ్యాపించినదో, అలాగే అన్ని భాషలలోనూ వ్యాపించినది. అలాగే అన్ని జనాంగములలో, అన్ని మతములలో వ్యాపించినది. అన్ని కాలములలో, అన్ని దేశములలో, అన్ని భాషలలో, అన్ని జనాంగములలో, అన్ని మతములలో వ్యాపించినది. ఈ బైబిలును హిందువులు కొనుచున్నారు, మహమ్మదీయులు, బౌద్దులు, యూదులు, పారసీకులు, నాస్తికులును కొనుచున్నారు. గనుక అన్ని మతములలోనికిని ఈ గ్రంథము వచ్చినది. ఆ లక్షణము దైవలక్షణము గనుక ఇది దైవగ్రంథము. ఈ గ్రంథము చదివి అనేకమంది బాగుపడుచున్నారు. ఇది ఉపయోగకరమైనది. ఇందులో అనాదినుండి అనంతకాలము వరకు ఉన్నది గనుక దేవునివలె సర్వవ్యాపకత్వముగల గ్రంథము. దేవునివలె అన్ని దేశములలో వ్యాపించుటవల్ల సర్వవ్యాపకత్వ గ్రంథము గనుకనే అన్ని భాషలలో వ్యాపించినది.
ఈ గ్రంథము సర్వవ్యాపకత్వముగలది గనుకనే “అన్ని మతములలో" ఒక్క మతమైన మిగిలిపోక, అన్ని మతములలో ఇష్టములేకపోయిననూ కొని చదువుచున్నారు. క్రీస్తుపభువు ప్రయాణము చేసినప్పుడు దోనెలో శిష్యులు ఉండిరి. అలాగే ఈ దోనెలో అనగా బైబిలు అనే దోనెలో దేవుడున్నాడు. అనగా సర్వవ్యాపియైన దేవుడు. దేవుడే ఒకచోట ఉండడు. ఆ దేవుడే అంతటా తిరుగును. అలాగే బైబిలు లోకమంతటా తిరుగుచుండెను. అందులో (బైబిలులో) దేవుడున్నాడు గనుక తిరుగుచుండెను.
భూలోక, పరలోక భక్తులందరి హృదయములలో వ్యాపించిన గ్రంథము గాన సర్వ వ్యాపకత్వగ్రంథము. వాక్యమును మనస్సులో ఉంచుకోనందున అపార్థము చేసికొనుచున్నారు. గాని హృదయములోనికి దిగనిస్తే అర్ధమగును. అప్పుడు అపార్థము చేసికొనుటకు వీలుండదు. దేవుడు చెప్పినది చేసిన నోవహు, విశ్వాసులందరికి తండ్రి అని పేరుపొందిన అబ్రాహాము, దేవుని సన్నిధిలో నుండి గ్రంథకర్తయై, దేవుని ముఖాముఖిగా చూచిన మోషే రాబోవు ప్రభువు రాజ్యమునకు సూచనగా నున్న రాజ్యపాలకుడైన దావీదు, సజీవముగా పరలోకమునకు వెళ్ళిన హానోకు, ఏలీయా, ఈలాటి పరిశుద్ధుల చరిత్రలు కలిగిన గ్రంథము దైవగ్రంథముకాకపోతే మరి ఏ గ్రంథము దైవ గ్రంథము కాగలదు? బ్రతుకులో రవంతయైన కళంకములేని యోసేపు చరిత్రగల గ్రంథము దైవగ్రంథము కాకపోతే మరి ఏది దైవగ్రంథము?
జపానులో బైబిలున్నది. కొరియా, చైనా, మంగోలియా, బర్మా, స్పెయిన్, ఇండోచైనా, ఇండియాలోని అనేక భాషలలో బైబిలు ఉన్నది. కాశ్మీరు, పంజాబు, ఒరిస్సా, బెంగాల్, ఇటలీ, గ్రీకు, రొమేనియా, ఆసియా, హంగరి, పోలెండు, జర్మనీ, హాలండు, డెన్మార్కు బెల్లియము, ఫ్రాన్సు, స్పెయిన్ దేశాలు. ఇంగ్లాండు, పోర్చుగల్, ఫిన్లాండ్, రష్యా, నార్వే, స్వీడన్, ఇంగ్లాండు, స్కాట్లాండ్, నెదర్లాండు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మెక్సికో, కాలిఫోర్నియా, కెనడా, టండ్రా ప్రదేశము గ్రీన్లాండ్, అలస్కా బ్రెజిల్, కొలంబియా, ఆఫ్రికా, అల్జీరియా, లిబియా, ఈజిప్టు, సూడన్, లైబిరియా, మెడగాస్కరు, ఆస్ట్రేలియా. మొ.న అన్ని దేశములలో బైబిలు ఉన్నది.
అలాగే గుంటూరులో జరిగే మీటింగులో బైబిలు ఉన్నది గనుక దైవగ్రంధము సర్వవ్యాపి. అన్ని చరిత్రలను, అందరిని మించిన క్రీస్తుచరిత్రగల గ్రంథము దైవగ్రంథము కాకపోతే మరి ఏ గ్రంథము దైవగ్రంథము ఏ దైవగ్రంథము ఇట్లు బైబిలువలె సర్వవ్యాపియైనట్లు ఉన్నది? మనకు చెప్పకుండ బైబిలు వచ్చెను. అలాగే ఆయనకూడ చెప్పకుండా వస్తాడు. ఆయన సర్వవ్యాపి గనుక ఆయన పుస్తకములు సర్వవ్యాపి. సర్వవ్యాపియైన దేవుని ఎవరు. తుడుపుపెట్టగలరు? సర్వవ్యాపి గ్రంథమును ఎవరు తుడుపు పెట్టగలరు? అట్లుచేయుటకు ప్రయత్నిస్తే వారిని వారే తుడుపుపెట్టుకొందురు.
ఉదా:- ఒక అగ్ని గంండమును తుడువు పెట్టవలెనని యత్నిస్తే వారే తుడుపుపెట్టబడుదురు. దేవుడు, తన్ను ఎదిరించువారికి అగ్నిజ్వాల; ఎదిరించనివారికి దీపకాంతి, వారి మార్గమునకు వెలుగై ఉన్నాడు.
II. క్రీస్తు దైవావతారము:- బైబిలులో మొదటిమాటగా దేవుని పేరు ఉన్నది. గాన అది దైవగ్రంథము. క్రీస్తు అవతార పురుషుడు గాన దేవుడు. అనగా దేవునియొక్క అవతార పురుషుడు గాన దేవుడు. ఎంత దేవుడైననూ మనకొరకు మనిషి అయినాడు గనుక ఆయనలో దైవత్వము పోలేదు. ఉదా:- ఒక కాలేజి ప్రొఫెసర్ తన డ్రస్ మార్చి సామాన్య డ్రస్సువేసికొని మనతోపాటు నేలపై కూర్చుంటే, ఆయన గొప్ప తనము పోవునా? పోదు. అలాగే దేవుడు ఎంత మనిషియైన దేవుడు కాకపోయినాడా?
బైబిలు గ్రంథము ఎంత మన కాగితమైననూ, మన సువార్తమయైననూ, మన మనుష్యులే వ్రాసిననూ, మనచేతిలో ఉన్ననూ, మనము క్రిందపడవేసిననూ, ఎక్కడ ఉన్ననూ, బల్లపై పెట్టిననూ, అక్కడ ఉన్నపెట్టెలో పెట్టిననూ, దానిలోని కొన్ని కాగితములు చినిగిపోయిననూ; దాని గౌరవము ఎక్కడికి పోతుంది! దైవగ్రంథము కాకపోతుందా! అలాగే దేవుడు మనిషైతే మాత్రము; ఆయన మనుష్యులలో ఉన్ననూ, ప్రయాణముచేసిననూ, మనిషివలె ప్రవర్తించిననూ, దేవుడు కాకపోయినాడా! పరలోకములో ఎక్కడో ఉండే దేవుడు, మన లోకమనే ఇంటికి వచ్చినాడు గనుక ఆయన దేవుడు కాకపోతాడా? రూపానికి మనిషి స్థితి, పనికి దేవుడు అయిన ఆయనను మనము మొక్కిన యెడల ఆయన కళ మనకు వచ్చును. బైబిలుకు దైవ వ్యాపకత్వము వచ్చినదా? రాలేదా? ఆలాగే మనకును ఆయన దైవవ్యాపకత్వము, వచ్చును.
III. క్రైస్తవమతము:- బైబిలు వ్రాయించినదేవుడు స్థాపించిన మతమే క్రైస్తవ మతము. పరలోకమునుండి భూలోకమునకు నరుడుగా వచ్చిన క్రీస్తుప్రభువు తన ప్రాణము ధారపోసిన మతము గనుక అది ఎంత పాపాత్ముల మధ్యలో ఉన్నప్పటికిని దైవమతము కాకపోతున్నదా? క్రీస్తు ప్రభువు మనిషిఅయినా దేవుడు కాకపోవునా? అలాగే దైవమతము పాపులమధ్య ఉంటే మాత్రము దైవమతముకాదా?
బయట ఉన్న గత్తరమీద, బండమీద, అసహ్య స్థలముమీద ఎండపడిన ఆ ఎండ ఎండకాకపోయినదా? అలాగే పాపాత్ములమధ్య క్రైస్తవ మతమున్న మాత్రమున అది పాపమతమై పోతుందా? దైవమతముకాదా! దైవమతమే. గనుక అందరు దానిలోనికి రావలెను. నరసంకల్పన మతము అయిన అందిరికి నమ్మకము ఉండదు. బైబిలు దైవసంకల్పన, క్రీస్తు దైవావతారము, క్రైస్తవమతము దైవస్థాపన మతము గనుక బైబిలు చదువుకొనవలెను, క్రీస్తు ప్రభువు రక్షకుడని నమ్మవలెను, ఈ క్రైస్తవ మతము ఈయన మతము అని అనుకోకుండ ఇందులోకి రావలెను ఈ మూడిటిలో ఎక్కడ ఏ దోషములేదు. వ్రాత చింపినంత మాత్రమున అది 'కాదు' అనగలరా?
క్రీస్తుప్రభువు సిలువమీద పాపులచేతిలో పడి, చనిపోయినంతమాత్రము దేవుడు కాకపోయినాడా! అలాగే క్రీస్తు మతస్థులలో కొందరిలో దోషములున్న మాత్రమున అది దైవమతము కాకపోయినదా? పెద్ద ఆసుపత్రిలో 150మంది రోగులు ఉందురు. కొత్తవారు లోపలకు వెళ్లిన ముక్కుమూసికొంటారు అందుచేత అది చెడ్డదా? మంచిదికాదా? మంచిదేకదా! ఎవరో ఇద్దరు ముగ్గురు రోగులు, డాక్టర్లు చెప్పినట్లు మందు తీసికొని నోటిలో పోసికొనక, చెప్పినట్లు చేయక బక్కెట్టులో పోసినందువలన చనిపోయిరి. అంతమాత్రమున ఆసుపత్రి చెడ్డది కాదుకదా! క్రీస్తు మతములో ఎవరో ఇద్దరు ముగ్గురు చెడిన యెడల అది దైవమతము కాదు అంటారా? చెడగొట్టినది అని అంటారా? గనుక న్యాయమాలోచించి “బైబిలులోగాని, క్రీస్తులోగాని క్రైస్తవ మతములోగాని ఏ లోపములేదు, ఏ దోషములేదు” అని గ్రహించవలెను. గనుక వాటిలో దోషమున్నదనే వారిదే దోషము. ఒక్క బైబిలును గురించి రోజంతా చెప్పుటకు సరిపడిన సంగతులున్నవి. క్రీస్తుప్రభువు వారినిగూర్చి వారమంతా చెప్పుటకు సంగతులున్నవి. మతమును గురించి నెలంతా చెప్పు సమయమున్నది.
మీకు తెలిసినట్లు నాకును ప్రభువును గూర్చిన సంగతులు తెలుసు. మూడు దినములు సాక్ష్యములు చెప్పిన తరుగలేదు. లోకములో ఉన్న క్రైస్తవులను చెప్పమంటే లోకాంతము వరకు ఉండును. అంతమంది చెప్పలేరు. సమయములేదు. బైబిలుకు, క్రీస్తునకు, మతమునకు అంతములేదు. “ఏమి బాబు మీ అబ్బాయి వచ్చి నెల అయినది, వచ్చి ఇప్పటికి బాగుపడలేదు" అని డాక్టరును అన్నది. "మరి ఏమంటావు!” అని డాక్టరుగారు అంటే తల్లి ఇంటికి తీసికొని వెళ్తాను అన్నది. ఆసుపత్రిలో ఉన్నవారు బాగుపడకపోతే, ఇంటివద్ద బాగుపడునా? గోతికి బాగుపడును ఇక్కడ బాగుపడని వాడు ఇంటిలో బాగుపడునా? ఇప్పుడు బాగుపడకపోతే, ఇంటివద్ద బాగుపడునా? సమాధికి బాగుపడును.
క్రీస్తుమతములోకి వచ్చినవాడు ఎప్పటికైనా బాగుపడును. మతములో ఉన్నాడు అనగా ఆసుపత్రిలో ఉన్నాడు గాన ఇంకొక నెలకైన బాగుపడును. మతములో ఉన్నాడు గాన బాగుపడును. మతము విడిచిన అతని గతి ఏమగునో అతనికే తెలుసును. ఈ మూడు (బైబిలు, క్రీస్తు క్రైస్తవమతము), శత్రువులు ఎత్తిచూపించిరి గనుక చెప్పుకొనవలసి వచ్చినది. వారు ఎంత మేలు చేసినారో, అన్ని దేశములలోని మతములను గూర్చి అడగవలెను. వారికే జవాబు ఉండునో! ఎవరైతే గ్రంథములో, క్రీస్తులో, మతములో దోషములేదు అని వచ్చి బాప్తిస్మము పొంది, బైబిలులో ప్రవేశించి, క్రీస్తు చెంత చేరి, క్రీస్తు సంఘములో ప్రవేశించుదురో వారు, చనిపోయిన తరువాత మోక్షములో ప్రవేశిస్తారు. రాకడవరకు ఉగ్గబెట్టుకొని ఉంటే, రాకడ మేఘములో నూతన యెరూషలేము విందులో ప్రవేశిస్తారు. వెయ్యి సం॥లలో అన్ని స్థలములకువచ్చి సువార్త ప్రకటిస్తారు. బంగారు శరీరముతో బోధిస్తారు. వారికి ఎండ, చలి, ముండ్లు, బంద, గత్తర, చెదర, తూలుడు, చెమట, పురుగులు, మొరిగే కుక్కలు ఉండవు, కరిసే పాములుండవు. భూలోకమంత రాజరఠీవితో తిరుగుదురు. అప్పుడు వారికి సముద్రము, నది, కొండలు, దయ్యములు అడ్డు రావు. దయ్యాలు బంధకములలో ఉండును. అటువంటి రాజ్యసహవాస భాగ్యము కావలిస్తే ఇపుడే క్రైస్తవ సంఘములోనికి వచ్చుటకు సిద్ధపడండి.
సంగతి గ్రహించకపోవుట, ఆలోచించకపోవుట, సరిగా మాటలాడకపోవుట, తిట్టుట, కొట్టుట, చంపుట, అసూయపడుట, ఒకరిని అల్లరిచేయుట, దొంగతనములు, అబద్ధములు; ఇవన్నియు దుర్భుద్దులు. బైబిలు చదువకపోవుట ఒక దుర్భుద్ధి. బైబిలు సరిగా పూర్తిగా చదువకపోవుట మరొక దుర్భుద్ధి. నీకొరకు ప్రార్ధించి ఇతరుల కొరకు ప్రార్థించకపోతే, అది ఇంకొక దుర్భుద్ధి. నీ నోట్సులోవి ఇతరులకు చెప్పకపోతే అది గొప్పు దుర్భుద్ధి, దైవ ఉపకారము తలంచుకొని స్తుతించకపోవుట మరొక దుర్భుద్ధి. ఇన్ని దుర్భుద్ధులు పెట్టుకొని రాకడకు సిద్ధపడుట ఎట్లు? దయ్యములు దూరముగా ఉన్ననూ, ఇవి దయ్యములువేసే బాణములు. పిట్ట చెట్టుపైనున్ననూ, మనిషి క్రింద ఉండి బాణముతో కొట్టును. అట్లే దయ్యములు క్రింద ఉండి బాణములు వేయును దూరముగా ఉండివేయును అప్పుడు రాకడకు ఎట్లు సిద్ధపడగలరు? పెండ్లి చేసికొనే పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తె పెండ్లికి ఒకరినొకరు ప్రేమించుకొంటారా? పెండ్లికూతురు తలవంచుకొంటే అది ప్రేమ. అలాగునకాకుండా లోకమునుబట్టి నడిచిన యెడల అనగా లోకమును అనుసరించిన ఆ ధన్యత పోవును. తల్లిమీద పిల్లకు ప్రేమ ఉండునా? అట్లు ఉంటే రాకడకు సిద్ధపడగలము. మీరు ఎన్ని జయించిననూ, తండ్రియెడల ప్రేమలేకపోతే రాకడకు వెళ్లలేరు.
ప్రభువు చెప్పినది: "దేవుని ప్రేమించండి. పొరుగువారిని ప్రేమించండి" అన్నారు. ఈ క్రమమే లేకపోతే ఎన్ని పాపాలు జయించినా, బైబిలు కంటతచేసినా, భాషలు మాటలాడినా, దర్శనములు ఎన్ని వచ్చినా, ప్రేమ లేకపోతే లాభములేదు. గణగణ మ్రోగు తాళమువలెనుందుము, అని 1కొరింధి. 13లో పౌలు వ్రాసెను.
ప్రార్ధన:- యేసుప్రభువా! బాప్తిస్మము పొందవలెనని నీవు చెప్పినావు. బాప్తిస్మము ఇచ్చే అధికారము నీ శిష్యులకు ఇచ్చావు గనుక ఇప్పుడు కొందరికి ఇస్తున్నాము. వారు 'ఇప్పుడు నమ్ముచున్నాము' అంటున్నారు. ప్రభువా! అది నీకే తెలుసు. మేము ఇస్తుంటే, నీవు ఇచ్చినట్లే అని నమ్మే కృప దయచేయుము. వారు బాప్తిస్మమునకు సిద్ధమైనట్లు, రాకడకుకూడా సిద్ధమగునట్లు కృప దయచేయుము. కడవరకు స్థిరముగా వెనుకకు తిరిగిపోకుండా స్థిరముగా ఉండేట్లు దీవించుమని వేడుకొంటున్నాము ఆమేన్.