దైవసంబంధి అనుభవములు
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
అది. 18:1-14 లూకా 2:25-39; అపో. 9:1-6.
దీవెన:- దైవలక్షణానుభవ ప్రియులారా! నేటిదిన వాక్య వర్తమానముద్వారా ఇందులోని అనుభవములన్నీ మీ అంతరంగములో ముద్రించునుగాక! ఆమేన్.
అనుభవము:- అనుభవము అనగా ఊహవల్లను, విశ్వాసము వల్లను క్రీస్తుప్రభువుని తెలిసికొన్న రీతిగానే అనుభవమును తెలుసుకొనవలెను. ఇది మొదటి రెంటికంటె ముఖ్యమైనది అనుభవ పూర్వకముగాను క్రీస్తుప్రభువు వల్ల మనము ఎట్లు తెలుసుకొనగలము.
- 1. సంతోష అనుభవము:- అన్న వస్త్రాదులవల్లను కావలసిన సర్వవస్తువులవల్లను కలిగే సంతోషము వేరు. విద్యవల్లను కలిగే సంతోషము వేరు విద్యవల్లను, ఘనతవల్లను, ఆరోగ్యమువల్లను, స్వజనులవల్లను కలిగే సంతోషము వేరు (వట్టి సంతోషములువేరు) ఊహ సంతోషమువేరు. ఇది చాలా మందికి ఉన్నది అయితే ఈ లోకములో ఉండి ఈ లోకములో ఉన్న సంతోషముగాక లోకము ఇయ్యనేరని సంతోషములో ఉంటే అది ప్రభుయేసువల్ల కలిగిన సంతోషమని యేసుప్రభువు ఇచ్చే సంతోషమని తెలిసికొనవలెను. ఇది అది రెండూ ఉంటే కలిగే సంతోషము కాదు యేసుప్రభువుంటేనే సంతోషము.
- 2. జ్ఞాన అనుభవము:- అనగా అంతా తెలిసినట్లు ఉండడము. మంచి, చెడ్డ, లోకము, పరలోకము, నరకము, సాతాను, నరుడు, దూతలు, బైబిలు, సర్వశాస్త్రములు, గడిచిన సంగతులు, నేటి సంగతులు రాబోయే సంగతులు. ఇవి అన్నియు తెలిసినవాడు నాకు 1 సమస్తము తెలుసును అని అనును. అట్టి స్థితి మనకు కలిగి యుండును. దీపము వెలిగింపగా చీకటిలో ఉన్న వస్తువులును అవి ఎక్కడెక్కడ ఉన్నవో వాటి స్థానములును, వాటి వాటి స్థితియు మనకు స్పష్టముగా కనబడును. ఆ విధముగానే మనకు మనస్సులో ఉండును. ఎందుకనగా యేసుప్రభువు మనతో ఉన్నాడు గనుక.
-
3. స్వానుభవము:- అనగా కష్టములను సంతోషముతో సహించుట, నిందలు, శోధనలు, ప్రార్ధనకు జవాబు లేకపోవుట. పడిపోవుట ఎండ, వాన,
అపజయము,
కరువు, వ్యాధి, దయ్యపు కళలు ఈ మొదలైనవి మన జీవితకాలములో జరుగునప్పుడు లెక్కచేయకూడదు (లక్ష యాభైవేలు వచ్చును).
పాట:- యెహోవా మా తండ్రి గాడా! లక్షపెట్ట మిహ బాధలకు. - 4. స్థానానుభవము:- మనము ఎక్కడ ఉన్నను దేవునియొద్ద ఉన్నట్లు దేవుడు మనతోనే ఉన్నట్లు భావించుకొందాము. బురదలో ఉన్నను, నీళ్లలో ఉన్నను, ఇసుకలో ఉన్నను, నెబుకద్నెజరు యొక్క అగ్నిగుండములో ఉన్నను, గలిలయ సరస్సులో ఉన్నను గాలి తుపానులో, ఉన్నను సుందర్ సింగువలె పాడునూతిలో నున్నను, దేవుని ఒడిలో ఉన్నట్లుగానే ఉండును. ఇది మహా గొప్ప అనుభవము. శ్రమ, విపత్తుగల దేశములోనున్నను, గాలిలో ఉన్నను, నిద్ర అవస్థలోనున్నను నేను నా తండ్రి యొద్దనే ఉన్నాను, అని తలంచుకొనవలెను.
- 5. ఐక్యానుభవము: - ఒంటరిగా ఉన్నప్పుఢు సహితము నేను ఒంటరిగాలేను. తండ్రి నేను ఉన్నామని తలంచుచుందును. ఏ పని చేసినప్పుడైనను నేను ఒక్కడనే చేస్తూ ఉన్నాను అని అనుకొనను, తండ్రి నేను కలిసి పని చేస్తున్నాను అనుకొందును. నేను ఒక్కడనే శ్రమ అనుభవించుటలేదు. తండ్రికూడా పాలుపొందుచున్నాడని నాతోకూడా కాడిని మోయుచున్నాడని తలంచుచుందును.
- 6. సమృద్ధానుభవము: - ఏమియు లేకపోయినను అంతయు కలిగియున్నాను అని పౌలువలె ఆనందింపగలను. తండ్రి కలుగజేసిన దంతయు నాదే అని ఉత్సాహపడుదును. తండ్రి పెద్ద కుమారునితో అన్న మాటలు జ్ఞాపకము తెచ్చుకొనండి (నాకు కలిగిన అంతయు నీదే) కీర్తన 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి అని దావీదు పాడినట్లు మనమును పాడుదుము.
- 7. జనకానుభవము:- మనము పైనున్న ఆరు విషయములు కలిగియుండుటచూచి తండ్రి ఎంతో ముచ్చటపడును. అనగా నా బిడ్డలు లోకము ఇయ్యనేరని సంతోషము అనుభవించుచున్నారనియు అంతయు తెలిసిన జ్ఞానులవలెయున్నారనియు కష్టములమీద నడుచునట్టి జయశాలురైయున్నారనియు నన్నే నివాసస్థానముగా చేసికొన్నారనియు నాలో ఐకమత్యము కలిగియున్నారనియు సర్వమును తమదేయని ఉత్సాహపడుచున్నారనియు చూచి తండ్రి ఎంతో ముచ్చటపడును.
“అంతయు మనదేగదా యేసునికున్నదంతయు మనదెగదా!” ॥ బహుగా॥
పరమతండ్రీ! ఈ అనుభవ అంతస్థులన్నీ మన ప్రతిదిన అనుభవములో ఉంచునుగాక! ఆమేన్.