లూకా వ్రాసిన ప్రభువు చరిత్ర
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
లూకా. 1:1-5.
పూర్ణ రక్షకుని చరిత్ర ఆలకించుటకు వచ్చిన ప్రియులారా! నేటిదిన వాక్యధ్యానముద్వారా దేవనరుడైన ఆ దేవలోక రక్షకుని దీవెనలు మీకు అందునుగాక! ఆమేన్.
ప్రార్థన:- మా ప్రియుడవైన త్రియేక జనకా! మేము మరొకమారు పరిశుద్ధ వారమున సమావేశమైతిమి, స్తోత్రము. ప్రభువు జీవిత చరిత్రను నేర్చుకొనుచున్నాము. మాకు సహాయము దయచేయుము. మాతో మాట్లాడుము, క్రొత్త వారితో మాట్లాడుము. యేసుప్రభువు చరిత్రకు మించిన చరిత్రగాని, ఘనమైన చరిత్రగాని ఇంకొకటిలేదు. మాకును లోకజ్ఞానము మరియు ఆత్మజ్ఞానము నుండి నేర్చుకొనుచున్నాము. ఎక్కువగాను, క్రమముగా నేర్చుకొననైయున్నాము గనుక ప్రతి ఆదివారమున నేర్పించుము. దూతలను కావలియుంచి దయ్యములను వెళ్ళగొట్టుము. నీవు ఒకసారి - "నేను లోకమునకు వెలుగైయున్నాను” అన్నావు. వెలుగువల్ల చీకటి ఎట్లు తెలియునో మంచి, చెడ్డ వస్తువులుకూడా అట్లే తెలియును గనుక నీ వెలుగువల్ల ఏది మంచిదో ఏది చెడ్డదో నేర్పించుము. నీ వెలుగువల్ల జ్ఞాననేత్రము వెలిగించుము. అప్పుడు ఈ కంటికి వెలుగు కనిపించును.
మానవుడు తన జ్ఞానమువలన ఎన్నో పనులు కనిపెట్టినాడు. నీవు నీ వెలుగువల్ల నీ చరిత్రలోని దివ్యాంశములను నేర్పించుము. ఈ నేత్రములు బైబిలును చూచునట్టు, నీ వెలుగువల్ల మహిమ సంగతులు చూపించుము. నీకు తెలిసిన సంగతులెత్తి ఎమ్మాయి శిష్యులతో మాట్లాడగా, వారి మనస్సాక్షి కదిలి అజ్ఞాన భీతి, అవమానము కదిలింపబడి వారి హృదయములలో మంటమండెను. నీ గద్దింపువల్ల హృదయము కరిగిపోవుటనుబట్టి వారి హృదయములో మంట పుట్టెను. నీ చరిత్రవల్ల మా మనస్సాక్షి కదిలింపబడునట్లు వర్తమానము అందించుము, పేతురు మూడువేలమందికి బోధించగా, వారి మనస్సాక్షిని నీ చరిత్ర వృత్తాంతము కదిపివేసినది. గనుక వారు హృదయములో నొచ్చుకొన్నారు. అలాగే మా మనస్సాక్షినికూడా కదిలింపుము. ఎండలో ఉంచిన జ్ఞానము, మా మనస్సాక్షి కఠినము గనుక మా మనస్సాక్షిని కదిలింపుము. కొందరు అపోస్తలులు మాట్లాడునపుడు మందమతులారా! అని గద్దించి మనసును కదిపినట్లు నీ చరిత్ర సందేశములోని గద్దింపువలన అజ్ఞానముపోయి తగిన జ్ఞానము
- 1) వచ్చును.
- 2) మనస్సాక్షి మరియు మనస్సు మారును.
- 3) విశ్వాసమునకు వృద్ధికలుగును.
గలిలయపై నీవు నడుచునపుడు, నీ శిష్యులు నిన్ను భూతమనుకొన్నారు. దేవుని, ప్రభువును, గురువును, అద్భుతకరుని, భూతమనుకొన్నారు. అయ్యో! ఎంత విచారము! అట్లే కొందరు తప్పుడు దర్శనముల ద్వారా మంచివారిని చెడ్డవారని, మంచి విషయములను చెడ్డ విషయములని, సత్య విషయములను అసత్య విషయములని; విశ్వాసులను, అవిశ్వాసులని అనుకొనేవారుకూడా కలరు. మాలో ఎవరునూ అట్టి తప్పుడు దర్శనమువల్ల మోసపోకుండా చేయుము. దూతలను దయ్యములని, నిన్ను భూతమని, పరలోక పరిశుద్దులను దయ్యాలనుకొనే దర్శనము రాకుండా చేయము. నీ ప్రత్యక్షతను, విశ్వాసమును వెలిగించుము.
యేసుప్రభువా! నీవు పరలోకమునకు వెళ్లిన పిదప, నీ భక్తులు కొందరు నీ చరిత్ర వ్రాసిరి. వాటిలో కొన్ని లోపములున్నవి. లూకా సత్యము వ్రాసెను. సువార్తికులు సత్యము వ్రాసిరి. ఇతర పుస్తకములతో మాకు పనిలేదు. సువార్తికులు వ్రాసిన సత్యవార్తను చదివి, నీ రాకకు సిద్ధపడు కృప ఇమ్ము.
ఒకప్పుడు జమ్ము మొలిచిన స్థలములలోను, అడవిలోను నివాసమున్న మనుష్యులు వచ్చి, తమ్మును పంపిన తమ గురువైన యోహాను గారికి ఏమి చెప్పవలెనని అడుగగా; మీరు ఏవి కండ్లతో చూచి, చెవులతో విన్నారో అది చెప్పమన్నావు. అలాగే మా పూర్వికులు చెప్పినవి మేము విన్నాము. స్వయముగా ఆ వాక్యము చదువుచున్నాము. జ్ఞానముద్వారా విశ్వాసము కలిగి, ప్రత్యక్షతద్వారా ఏమిచూచుచున్నామో, అదే నమ్ము కృప ఇమ్ము. మేము ముందు నీ వాక్యములోనుండి బయలుదేరు వర్తమాన స్వరాలు చూచితిమి. గనుక ఆ నీ మాటలను ఇతరులకు అందించగలము. అట్టి కృప మాకు అందరికి అనుగ్రహించుము. నీ దివ్యచరిత్ర ప్రారంభాంశములయందు నీ కృప అనుగ్రహించుము.
నీవు బేత్లెహేములో పుట్టినప్పుడు మేము పుట్టలేదు. కొండ ప్రసంగములో మేము లేము. నీవు మృతులను బ్రతికించినపుడు మేము లేము. సిలువ చరిత్ర, మరణ చరిత్ర, పునరుత్థానములో మేము లేము. ఆరోహణమప్పుడు మేము లేము గాని పూర్వికులకు మాకు తగివచ్చే మాట ఒకటి అన్నారు. అదేమనగా “చూచి నమ్మిన వారికంటె చూడక నమ్మినవారు ధన్యులు” దీనినిబట్టి మేము సిద్ధపడే కృప దయచేయుము. ఒక రాజుగారి గృహమునకు వెళ్ళుటకు; తెలిసిన వారు ఎవరైనా ఒకరు తీసికొనివెళ్లితే వెళ్లగలము. అట్లే నీ ఆత్మద్వారా నీవు మమ్మును నడిపించుము. శాంతి, కాంతి, ధర్మము, మర్మములు మాకు తెలియపర్చి నడిపించుమని వేడుకొనుచున్నాము ఆమేన్.
ఈ దినము దేవుడుగాయున్న ప్రభువు కథ కాదుగాని, మనిషిగా వచ్చిన మనిషిగూర్చి వివరించుదును.
- 1. ప్రభువును దేవుడెయున్న కథ,
- 2. ప్రభువు మనిషై పుట్టిన కథ,
- 3. ప్రభువు బోధించిన కథ,
- 4. ప్రభువు రోగులను బాగుచేసి దయ్యములను వెళ్లగొట్టినకథ,
- 5. చనిపోయినకథ,
- 6. తిరిగిలేచినకథ
- 7. పరలోకమునకు వెళ్ళిన కథ,
- 8. తిరిగివచ్చే కథ.
- 1) ఆయన మనిషి గనుక చావగలిగినాడు.
- 2) ఆయన దేవుడు గనుక లేవగలిగినాడు. ఇవి ఆయనలోని రెండు రూపములు.
- 1. దేవుడై యుండుట,
- 2. మనిషైయుండుట, దేవుడు మనిషైయున్నాడు గనుక మనలను రక్షించెను.
పాట:- యేసుని ప్రేమనే నెంత వర్ణింప ఆయన ప్రేమను!
ముప్పది మూడున్నర సం॥లు ఉన్న ఆయన ప్రేమను వర్ణింపలేము. చాలామంది ఆయనను చూచిరి. ఆయన మాట వినిరి. ఆయన వెళ్ళిపోయిన తరువాత పరమభక్తుడైన లూకా క్రీస్తువారి కథ అంతా ఎరిగినాడు. ఈ లూకా లోకమునకు అవసరమైనవి దేవుని ఆత్మ ప్రేరేపణద్వారా పుట్టుకనుండి ఆరంభించి చివరివరకు వ్రాసెను. ఎవరైనా ఒక పుస్తకము వ్రాస్తే ఎక్కడో మద్రాసులో ఉండేవారి పేరుమీద అంకితము చేస్తారు. లూకాయు తన స్నేహితులపేరున అంకితము చేసెను. ఆయన పేరు థియోఫిలా. ఇది గ్రీకు భాష తెలుగులో "దేవ ప్రియుడు” లేక దేవునికిష్టుడు, గొప్పవాడు అని అర్ధము.
ఉదా:- కాకానిలో జరిగే పని నిజమని ఎవరు వ్రాస్తే బాగుండును? చూచి నమ్మువారైతే బాగుండును. చెప్పే వారు కొన్ని వట్టివి చెప్పుదురు గాని అక్కడపని చేయువారు ఉన్నది ఉన్నట్టు వ్రాయుదురు. అలాగే లూకా క్రీస్తు సువార్తను బహిరంగపరచియున్నాడు. అంకితము థియోఫిలాకని, సువార్తయైతే అందరికని వ్రాసెను. ఇంకొకమాట వ్రాసినాడు. తరచినానని వ్రాసినాడు. వరుసగా వ్రాసినాడు. ప్రభువు చరిత్ర వ్రాసిన గొప్ప భక్తుడు. లూకాతో సమానమైన భక్తులెవరనగా మత్తయి, మార్కు యోహాను. ఈ నలుగురును ప్రభువుకు దగ్గరగాయుండి ఎరిగినవారు గాన ప్రభువు చరిత్ర వ్రాసినారు. ఈ నలుగురు వ్రాసిన వ్రాతలకు సువార్తలని పేరు. ఇవి బైబిలులోనే యున్నవి. ఇవి క్రీస్తువారి పూర్ణచరిత్రను క్లుప్తముగా బైలుపర్చుచున్నవి. వీరు అందరూ దైవప్రేరేపణతోనే వ్రాసిరి.
ఉదా:- వ్రాయుటకు లూకా యున్నాడు. అతడు వ్రాయుటకు ఆరంభించెను. ఒక సంగతి జ్ఞాపకము వచ్చివాటిని వ్రాసెను. వ్రాయుటకు కలము సాగలేదు. కొంత సమయం తరువాత ఇంకొకటి జ్ఞాపకమునకు వచ్చెను, అపుడు వాటిని వ్రాసెను. అలాగే తన సువార్త అంతా వ్రాసెను. మధ్యలో ఆపుదల ఎందుకనగా మంచి సంగతేగాని అది లోకమునకు అవసరమైనదికాదు. ఆ నలుగురు వ్రాసినది చరిత్ర వంటిది. ఎవరైనా వ్రాయవలెనన్న అంతకన్న ఎక్కువైనది వ్రాయలేరు. అంతకన్న తక్కువైనది వ్రాయలేరు. ఆయన బ్రతుకులో జరిగినది జరిగినట్లు లూకా వ్రాసెను. గనుక ఆయన దేవప్రియుడని అర్ధము చేసుకున్నారు. డిక్షనరీలను బట్టి పేరుల అర్ధము తెలిసికొనగలముగాని చరిత్ర వ్రాయలేము. అయ్యగారు ప్రభువు ఎక్కడ పుట్టినాడని ప్రశ్నించగా పైకిచూచిరి. గనుక బెత్లేహేము పైనున్నదని కొందరనుకొందురు.
లూకా 1:1. లూకా పరిష్కారముగా తెలుసుకొని యున్నాడు. కన్నులారా చూచి తెలుసుకొన్నాడు. ప్రభువు మరణము 30సం॥ లకు జరిగినది. అప్పుడు లూకా లేడు. లూకా చిన్నవాడు. మరి పరిష్కారముగా ఎట్లు తెలుసుకొన్నాడు. తల్లినడిగి తెలుసుకున్నాడు. ప్రతి చిన్న సంగతికూడా అడిగి తెలుసుకొనెను. మరియమ్మ ఎవరు? దూత ఎట్లు వచ్చెను? ఎలీజబెత్తు సంగతులు ఇవన్నీ తెలుసుకొని వ్రాసెను. తల్లినేకాదు. ఇంకా బాగా తెలిసినవారినికూడా అడిగి తెలుసుకొని వ్రాసెను. ఈలాగు తరచి, తరచి వ్రాసినవి మొత్తం 24 అధ్యాయములు ఉన్నవి. లూకా 24:15, 16:20 ప్రభువు తోడుగా ఉన్నాడు. ఎమ్మాయు ఇద్దరి శిష్యులలో లూకా యున్నాడు. ప్రభువు మాటలాడిన విషయములకు అతని హృదయము మండెను.
ఫోటో తీయు ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి, ఆరువేల కాపీలు తీయించగా మొదటిదానివలె అన్ని కాపీలుండును. అట్లే లూకా ఉన్నది ఉన్నట్లు వ్రాసెను. ఏమియు మార్చలేదు. తక్కువయుంటే ఎక్కువ చెప్పలేదు. ఎక్కువ ఉంటే తక్కువ చెప్పలేదు. ప్రభువును నలుగురు సువార్తికులు ఉన్నది ఉన్నట్టు ఫోటో తీసివ్రాసిరి. వ్రాసిన నలుగురు సువార్తికులు చనిపోయిరి గాని, వారు వ్రాసిన పుస్తకములున్నవి. అవి చెరిగిపోతూ ఉంటే, ఆ తరువాత వచ్చిన భక్తులు వ్రాస్తూ వచ్చిరి. (అది అయ్యగారు చూచిరట).
1805వ సం॥లో బైబిలు సొసైటీలో భక్తులులేచి 3000 పత్రికలు దొరకగా వాటిని బైబిలుగా సరిచేసి అచ్చువేసిరి. నలుగురు సువార్తికులు పరమభక్తులేగాని వారిలో ఒక ఆందోళన కలిగినది. మనము అనకూడదుగాని దేవుడే కలిగించినాడు? మనముపోతే ఈ సంగతులను ఎత్తి వ్రాసే వారెవరు? అందుకనే 'మనముండగానే వ్రాస్తాము' అని వ్రాసిరి. మొదట కాగితములులేవు గనుక చర్మములపై వ్రాసిరి.
వీరు వ్రాసిన కథ-
- 1. జరిగిన కథ
- 2. నిరుకైన కథ,
- 3. తరచిన కథ,
- 4. దేవుడప్పగించిన కథ.
వారు వ్రాసిన ఈ వివరములను అప్పటి భక్తులందరు చదివి తమ ఇండ్లలో ఉండే పుస్తకముపై వ్రాసిరి.
మత్తయి, మార్కు, లూకా బాగున్నవేగాని చిన్నవాడైన యోహాను వ్రాసినది వేదాంతముగా యున్నది. ఇంటిలోను, గుడిలోను ఈ ప్రకారము ప్రభువు చరిత్ర బైలుపడినది. ఆయన చరిత్ర ఉపకార చరిత్రే గాని క్రీస్తుప్రభువు చరిత్ర పూర్తిగా నేర్చుకొంటే మన కథ మారును. అనగా మన బ్రతుకంతయు మారిపోవును.
ఉదా:- పీర్లు పండుగరోజున డప్పులు వాయించుచుండగా, కుర్రవాడు నిప్పులపై నడుచుచుండగా, ఈ డప్పు హుషారువల్ల పిల్లవాడు మరి హుషారుగా నడుచుచున్నాడు గనుక నడక మారినది. పైగా డాన్స్ చేయుచుండెను. ఒడ్డున పడిపోవునేమో అని చూచువారనుకొనిరి. తానెక్కడ ఉన్నాడో డప్పుల శబ్ధమువల్ల ఆ పిల్లవాడు మరచెను. అట్లే క్రీస్తు ప్రభువు చరిత్రవల్ల మన చరిత్ర మారెను. అట్టి మార్పు నేటిదిన వాక్యముద్వారా ప్రభువు మీకు కలిగించునుగాక. ఆమేన్.
ప్రార్ధన:- ఓ కనికరముగల మా తండ్రీ! నీ కథ మహా గొప్ప కథ. నీ కథవల్ల మా బ్రతుకు, మా తలంపు, మా చూపు, మా రూపు మారును. మా తలపే మారిపోవును. నీ దివ్య చరిత్రవల్ల కలిగే మార్పు మా బ్రతుకులో ప్రవేశపెట్టుము. నీ చరిత్రలో సముద్రము దగ్గర నీ శిష్యులను పిలువగా, నీ మాటవల్ల అంతా వదలుకొని వచ్చిరి. అట్టి నీ చరిత్రవల్ల మేముకూడా అంతా మార్చుకొనునట్లు చేయుము. మమ్మును, మా కూటమును, మా గ్రామాన్ని కాపాడుము. రాత్రివేళ ఎప్పుడు మెళకువ వచ్చినను నిన్నే తలంచుకొనే కృప దయచేయుము. సర్వగండములనుండి తప్పించుమని త్వరగా రానైయున్న యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.