గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు

ఆత్మ కుమ్మరింపు కూటములలోని రెండవ దినము - శనివారము
పరిశుద్ధాత్మ నిండి ఉండుట



అపో.కార్య. 2:1-36.

ప్రార్ధన:- మా ప్రియుడవైన తండ్రీ, ఆత్మ తండ్రీ! మాకు వందనములు. మీరులేని స్థలము లేదు, మీ జీవము లేని మనిషిలేడు. ఈలాగు సృష్టిని, మమ్ములను అవరించుకొన్న తండ్రీ! వందనములు. మీరు మాలో ఏ స్థితిలో ఉన్నారో, మా అనుభవమునకు స్పష్టముగా తెలియునట్టు, నేటిదిన నీ వర్తమానమిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


"పెంతెకొస్తు" అనుమాటకు అర్ధమేమనగా 50 దినములు లేక 7 వారముల పండుగ. 7 వారములు అనగా పండుగ దినముతో కలుపుకొని 50 దినములు. యూదుల పెంతెకొస్తు పండుగ అనగా వారు దేవునికి ఇచ్చుట. మన పెంతెకొస్తు పండుగ అనగా మనము పుచ్చుకొనుట అనగా ఆత్మను పొందుట.

ఆయన ఎల్లప్పుడు ఇచ్చేవాడైయున్నాడు. ఈ దినము మనము పరిశుద్ధాత్మను పొందవలెను. అప్పుడు ఈ దినము పండుగ అవుతుంది. పరిశుద్ధాత్మను పొందితే దేవునిని పొందినట్టె.


పెంతెకొస్తు పండుగ అనగా పరిశుద్ధాత్మ పండుగ, పరిశుద్ధాత్మ పండుగ, పరిశుద్ధాత్మ పండుగ. అనగా తండ్రి పరిశుద్ధాత్ముడే, కుమారుడు పరిశుద్ధాత్ముడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడే. త్రియేక దేవుడు పరిశుద్ధాత్ముడే గనుక ప్రతి ఆదివారము మనకు పరిశుద్ధాత్మ పండుగే. క్రిస్మస్ పండుగ రోజున పరిశుద్ధాత్ముడైన తండ్రి పండుగ. మంచి శుక్రవారమున పరిశుద్ధాత్ముడైన కుమారుని పండుగ. ఈవేళ పరిశుద్ధాత్మ పండుగ. వచ్చే ఆదివారము త్రిత్వపండుగ అనగా పరిశుద్ధాత్ముడైన తండ్రియొక్కయు, పరిశుద్ధాత్ముడైన కుమారునియొక్కయు, పరిశుద్ధాత్ముడైన పరిశుద్ధాత్మయొక్కయు పండుగ. అక్కడనుండి క్రిస్మస్ వరకు 27 ఆదివారములు ఉన్నవి. అడ్వెంటువరకు ప్రతి సం.ము 27 ఆదివారములు రావు. ఎందుకంటే చంద్రబింబమునుబట్టి (పౌర్ణమి) అవి తక్కువ కావచ్చునుగాని 27కంటె ఎక్కువ రాలేవు.


ఈవేళ పరిశుద్ధాత్మ తండ్రియొక్క పండుగ. అయితే అపో. కార్యములలో నేటి పండుగ వివరముగా (2వ అధ్యా॥లో) వ్యాఖ్యానముకాక మిక్కిలి స్పష్టముగా యున్నది. పాతనిబంధనలోని ప్రవక్తలయొక్క గ్రంథములు ఇంత స్పష్టముగాలేవు. నాలుగు సువార్తలలో క్రీస్తు చరిత్ర ఎంత స్పష్టముగా ఉన్నదో, ఈ 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ పండుగ అంత స్పష్టముగా ఉన్నది. ఈ రెండవ అధ్యాయమంతయు తేటగా ఉన్నది. అపో.కార్య 2వ అధ్యాయము దాటితే, బైబిలు చివరి గ్రంథములో కేవలము మర్మములే ఉన్నవి. అందులోనైతే కష్టము ఉన్నదిగాని సువార్తలయొక్కయు, అపోస్తలుల కార్యములయొక్కయు వివరము చిన్నపిల్లలకు కూడా తెలియును. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి కొన్ని సంగతులు వినండి. ఈ పరిశుద్ధాత్మను గురించి కొన్ని సంగతులు విమలాత్మ ప్రోక్షణలో వ్రాసితిని. అపో.కార్య. 2వ అధ్యాయములో వేగముగా వీచుగాలి ఆ ఇల్లంతయు నిండెను అని వ్రాయబడినది. ఇల్లంతా నిండితే ఇంట్లోని మనుష్యులలో నిండదా? అయితే కొంతమంది పరిశుద్ధాత్మ పొందుటకు ప్రయాసపడుదురు. ముఖ్యముగా పెంతెకొస్తు వారు కష్టపడతారు. రేపు అందరును దగ్గరికి రండి. అందరము నింపబడుదుము. తెల్లనిబట్టలు కట్టుకొని దీక్షగా చేస్తారు. మోకాళ్ళమీద ఉంటారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు అందరు పరిశుద్ధాత్మా! దిగిరా! అని కేకలు వేస్తారు. నీ వశము చేసికో! అంటారు. అల్లరిగా ఉండును. క్రమముగా ఉండదు. కార్యముల గ్రంథములో ఏ అల్లరిలేదు. అందరూ నిశ్శబ్ధముగా ఉన్నారు. అప్పుడు ఆత్మ వచ్చి వారిలో ప్రవేశించింది. కేకలు వేయలేదు. బలవంతముగా పిలువలేదు. అది అజ్ఞానము. అయినప్పటికిని వారి అజ్ఞానమును కనికరించి, ఆశను మెచ్చుకొని, పద్దతి బాగా లేకపోయినను, కుమ్మరింపు ఇచ్చుచున్నారు. అందులో

మీకు ఏ ఆత్మ కావాలి? తెలిసేటట్టుగా ఉండేది కావాలా? లేక తెలియకుండా ఉండేది కావాలా? కొంత మందికి ఉన్నను, ఉన్నట్టు తెలియదు. విశ్వాసమునుబట్టి తెలియును. నమ్ముము; మన అందరిలో ప్రాణమున్నదా? ఉన్నది. మనలో ప్రాణమున్నట్టు తట్టుచున్నదా? ఇప్పుడు అన్నము తిని నీళ్ళు త్రాగుచున్నాము. ఆ అన్నము కడుపులో ఉన్నట్టు తెలియును. అది ఉన్నట్టు తెలియును. ఆ అన్నము ఉదరములో ఉన్నట్టు స్పర్శ తెలుసును. అలాగే కొంతమందికి పరిశుద్ధాత్మ ఉన్నట్టు తట్టును, తెలియును. మనలో ప్రాణము ఉన్నదిగాని తట్టదు. అన్నము తట్టినట్టు ప్రాణముతట్టదు. అనగా అన్నమంత స్పష్టముగా తెలియదు. అయితే, అన్నము ఉన్నట్టు చెప్పగలము, ప్రాణము ఉన్నట్టు చెప్పగలము గనుక పరిశుద్ధాత్మ మనలో ఉన్నదని చెప్పగలము. అట్లు చెప్పగలిగితే అది గొప్ప ధన్యత!


మన శరీరములో ప్రాణమున్నది. అలాగే ఎముకలున్నవి. ఆ ఎముకలను పట్టుకొన్నప్పుడు అవి తెలియును. ఇదివరకే మనకు జ్ఞానమున్నది. గనుక తెలియును. కండ ఉన్నట్టు మనకు తట్టుచున్నదా? అయితే అది మాత్రమేకాక శిరస్సు మొదలు అరికాలు వరకు రక్తము ప్రవహించుచున్నది. అది ఏలాగు జరుగునో తెలియదు. ప్రవహించుచున్నదని తెలుసుగాని తట్టదు. ప్రాణము, ఎముకలు, కండరములు, రక్తము ఇవి తప్పక ఉన్నవి. ఉన్నవిగాని మనమనుకొన్నంతగా అన్నమువలె తట్టవు. గనుక “పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు” అని ఎవరనుకొందురో వారిలో ఆయన తప్పకుండా ఉన్నాడు. నీ విశ్వాసమునకు ఉన్నట్టు తెలుసును. గాని నీ జ్ఞానమునకు తెలియదు. నీ జ్ఞానముకంటే విశ్వాసము గొప్పది. మనము రంగులేని నీళ్ళు, తెల్లని పాలు త్రాగుచున్నాము. అయితే అవి రక్తముగా మారుచున్నవి. రక్తము ఏలాగుండును. ఎర్రగా ఉండును. అలాగే పరిశుద్ధాత్మ ఉన్నట్టు మనలో ఏలాగు చెప్పుదుము? మనలో ఎర్రని రక్తమున్నట్టు చెప్పగలము. ఆ రక్తము ఏలాగు ఎర్రగా అయినదో చెప్పలేము. ఆలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని నమ్మాలి. నమ్మకపోతే లేడు. నమ్మడము ఇష్టమా? కాదా? పరిశుద్ధాత్మ నీలోకాకుండా ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి లోకమంతట ఉన్నది. ఒక చెట్టున్నది ఆ చెట్టులో జీవమున్నదా? లేదా? ఆ జీవము పరిశుద్ధాత్మ దగ్గరనుండి వచ్చిన ఒక శక్తి. జీవముంటే అది పరిశుద్ధాత్మ శక్తియే. సూర్య, చంద్రులలో జీవమున్నదా? లేదా పిల్లలనడిగితే చటుక్కున లేదంటారు. వాటికే జీవము లేకపోతే అవి గాలిలో క్రిందపడకుండ ఏలాగున్నవి? క్రిందకి పడిపోవా? మనము నివసించు భూమి గుండ్రముగా ఉన్నది. పైన గాలి ఉన్నది. అడుగునకూడా గాలి ఉన్నది. అది కోట్లమైళ్ళ వరకున్నది. ఆకాశములో (శూన్యంలో) గోళములు, భూమి వ్రేలాడుచున్నవి. అవి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము తిరుగుచున్నవి. వాటిలో జీవమున్నది గనుక అవి తిరుగుచున్నవి. ఆ జీవమే పరిశుద్ధాత్మ శక్తి అపో.కార్య. 2వ అధ్యా॥లో గాలి ఇల్లంతా వ్యాపించెను అని వ్రాయబడియున్నది. అనగా పరిశుద్ధాత్మ తన శక్తిని, ఆ గది అంతయు వ్యాపింపజేసెను. పరిశుద్ధాత్మ శక్తి ఐదు ఖండములలో సూర్యచంద్రుల దగ్గర వ్యాపించియున్నందున అవి పడడములేదు. గనుకనే ఆయన ఆ ఇల్లంతయూ వ్యాపించి ఉన్నారు. దేవాలయమంతయూ వ్యాపించియున్నారు. గనుక ఇల్లంతా పరిశుద్ధాత్మ శక్తి వ్యాపించును. ఈ లోకమంతా వ్యాపించకపోతే ఎప్పుడో అవి నశించియుండును. కాబట్టి నాలో పరిశుద్ధాత్మ లేదు అనవద్దు. ఉద్రేకము లేకపోవచ్చు. ప్రాణమున్నదిగాని “ఉసూరుమంటు ఉంటావు” అని కొందరినిచూచి అంటారు. ఉసూరుమంటు ఉన్నవానిలో ప్రాణమున్నదిగాని ఉద్రేకములేదు. అలాగే కొంతమందిలో పరిశుద్ధాత్మ ఉన్నది గాని ఉద్రేకములేదు. అయితే ప్రపంచములో అటువంటి చరిత్ర జరిగినదో లేదో తెలియదు.


రాత్రి ఒక రెప్పపాటులో పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి ఈ సంగతి చెప్పివెళ్ళిపోయారు. సాధు సుందర్ సింగు క్రీస్తుప్రభువు మత విరోధి. ఆకాశమును, భూమిని ఎవడు చేసాడో, వాడేవచ్చి నాకు కనబడాలి. కనబడకపోతే మా ఇంటి ప్రక్కనుండి వెళ్ళే బండి క్రిందబడి చచ్చిపోయి ఆయనను చూస్తాననుకొన్నారు. కొంతసేపటికి వెలుగు కనబడి, క్రీస్తు ప్రభువు కనబడ్డారు. క్రీస్తుప్రభువు వచ్చి కనబడితే నేను నిన్ను పిలువలేదు. నీవు బొమ్మలలో చూచిన, నీ సృష్టికర్తను నీ దేవుడను నేనే అన్నారు. నీవు నన్నే పిలిచావని ఆయన అన్నారు. నేను కొలిచే దేవుడు కనబడక శని దేవుడవు నీవు కనబడ్డావు అని సాధుగారు అనుకొన్నారు. ఆకాశము, భూమి చేసినవాడను నేనే అని ప్రభువు అనగానే సాష్టాంగ నమస్కారముచేసాడు. వెంటనే ప్రభువు ఆయనలోకి ఒదిగిపోయాడు. మనము మంచినీళ్ళు త్రాగినప్పుడు ఏలాగు తెలియునో అలాగే క్రీస్తుప్రభువు తనలోనికి వెళ్ళుట సాధు గ్రహించినాడు. నీళ్ళలోపల ఉన్నట్టు ఏలాగు తెలియునో ఆలాగే ఆయనకు తెలిసింది. రాజమండ్రి, గుంటూరు, మద్రాసు, బరంపురం ఆయన తిరిగినప్పుడు ఈ సంగతులే చెప్పారు. ఆయన నాలో ఉన్నట్టు నాకు తెలుస్తుంది. ఇలాటి గొప్ప అనుభవము ఇతర మతములలో ఎవరికిలేదు. ఇండియా భక్తుడైన సింగుగారికి తెలియును. భక్తులు అడిగితే ఇదిగో చూడండి అనేవాడు. ఈ అనుభవము ఇంకెవరికి లేదు. అలాగే పరిశుద్ధాత్మ ఉన్నట్టు మాకు తెలియకపోయినా నమ్మండి. నమ్మిక విడువవద్దు. ప్రయత్నము చెయ్యండి. వస్తాడేమో!


ఈ కొద్ది మాటలు మీ హృదయములో ఫలించునుగాక!



17.5.1959వ సం॥లో దేవదాసు అయ్యగారు కాకానిలో చేసిన ప్రసంగము.