గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు
ఆత్మ కుమ్మరింపు కూటములలోని ఎనిమిదవ దినము-శుక్రవారము
పరిశుద్ధాత్మ త్రిత్వము - మూడు ఆఫీసులు
అపో.కార్య. 2:39.
ప్రార్ధన:- దయగల తండ్రీ! మేము కొద్దిగా మాట్లాడుకొనినను, ఆ సంగతులను గ్రహించే శక్తి దయచేయుము. దయ్యములు రాకుండా కాపాడుము. నీ ఆత్మ వశములో మమ్మునుంచుకొని నేటిదిన నీ వర్తమానమిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.
“దేవుడు” అనుమాట లోకమంతటికి అక్కరకు వచ్చే మాట. “యెహోవా” అనుమాట యూదులకు అక్కరకు వచ్చేమాట. “క్రీస్తు అనుమాట క్రైస్తవులకు అక్కరకు వచ్చేమాట. ఈ మూడును తెలిసికొనేటందుకు అవసరమైన మాట “పరిశుద్ధాత్మ” ఆయన మీ వాడే. ఆయన మనలో లేకపోతే, దేవుడు అని అనలేము, యెహోవా అని అనలేము, క్రీస్తు అని అనలేము. ప్రాణములేని శవము ఏలాగు ఏమి చేయలేదో, అలాగే ఆత్మలేకపోతే మనమును వట్టి శవముతో సమానము. పరిశుద్ధాత్మ నిశ్చబ్ధముగా ఎవరికి తెలియకుండా పనిచేయును. నాస్థికులలోకూడ పరిశుద్ధాత్మపని జరుగుచున్నది గాని అది వారికి తెలియదు. అపోకార్య. 2:39లో ఉన్న ఈ వాగ్ధానముమీద కీర్తనలు వ్రాయవలెనని చాలాకాలమునుండి ఉన్నది. పరిశుద్ధాత్ముని యొక్క నిశ్చబ్ధకార్యమైనను లేని మనుష్యుడు ఇంకా పుట్టలేదు, పుట్టబోడు. అతనికి ఆ పని తెలియకపోవచ్చును. అప్పుడే పుట్టినబిడ్డ మంచముమీద పరుండి నిద్రమీదే ఉండగా, తల్లి ప్రక్కనే కూర్చున్న సంగతి తెలియునా? తెలియకపోయినంత మాత్రమున తల్లి అక్కడ లేనట్లేనా? అలాగే పరిశుద్ధాత్మపని తెలియకపోయినంత మాత్రమున పరిశుద్ధాత్మ తండ్రి లేడని చెప్పగలమా? చెప్పలేము.
ఇక్కడ పేతురు మనస్సులో దేవుడు, యెహోవా, క్రీస్తు, పరిశుద్ధాత్మ ఉన్నారు.
గనుకనే యోవేలు ప్రవచనము ఎత్తెను. పేతురు వారితో ఏ నామమున నిలువబడి మాట్లాడుచున్నాడనగా దేవుడు, యెహోవా, క్రీస్తు నామములో బోధించెను. ఆలాగున మనమును కాలమునకు తగినట్లు బోధచేయవలెను. దేవునిమతము అందరిది. యెహోవా మతము యూదులది. క్రీస్తుమతము క్రైస్తవులది. ఇది అంతా తెలియజేసినవారు పరిశుద్ధాత్మ తండ్రి. యోహాను 14:1. గనుక దేవుడు, క్రీస్తు సమానమన్నమాట.
లోకస్తులందరు దేవునిప్రక్క ఉన్నారు. క్రైస్తవులు క్రీస్తుప్రక్కన ఉన్నారు. ఆ దేవుడే క్రీస్తుగా వెలసిన సంగతి వారికి తెలియదుగాన వారు దేవుని ప్రక్కనే ఉన్నారు. క్రీస్తును తెలిసికొంటే, వారు క్రీస్తు ప్రక్కకు వత్తురు. అపో.కార్య. 2:36. గనుక క్రైస్తవబోధకుడు బైబిలు విషయములన్నియు, సందేహములేనంత రూఢిగా తెలిసికొనవలెను. అతడే గొప్ప బోధకుడు. అతడే సువార్త ప్రతినిధి.
- 1) సంగతులు తెలిసికొనుట వేరు,
- 2) వివరించుట వేరు.
- 3) రూఢిగా తెల్సుకొనుట వేరు.
బైబిలుమిషను వారందరు ఆ రూఢి అనే సంగతి తెలిసికొనవలెను. బైబిలంతా చదువవచ్చును, కానీ రూఢీ తెలిసికొనలేము.
ఉదా: ఒక ముసలమ్మ ఉన్నది. ఆమెను ఒకాయన ఇలాగు అడిగెను. అమ్మా! నీకెంతమంది బిడ్డలు? అప్పుడామె నర్శమ్మ,
నుబ్బమ్మ, వెంకమ్మ, గంగమ్మ అని చెప్పి, ఇంకా జ్ఞాపకములేదు. మా పెద్దమ్మను అడిగి వచ్చెదననెను. నేడు క్రైస్తవ బోధకుల
సంగతి ఇట్లే ఉన్నది. రాజమండ్రిలో మద్దా శాంతమ్మ ఉన్నది. ఆమె కుమారుడు మొదటి ఫారమ్ చదువుచున్నాడు. సండేస్కూలు
జరుపుచున్నాడు. ఆ కానుక, అయ్యగారికి తొమ్మిదణాలు తెచ్చి ఇచ్చెను. బండిలో ఆర్య సమాజ బోధకుడు కనబడెను. ఆ బోధకుడు
కుర్రవానిని ఒక ప్రశ్న వేసెను. ప్రశ్నవేయగా జవాబు చెప్పలేక యేడుస్తూ అయ్యగారి దగ్గరకు వచ్చెను. దానికి అయ్యగారు
జవాబు చెప్పెను.
అపో.కార్య. 2:40. మనము (బైబిలుమిషనువారు)
- 1) రక్షణ సంకల్పన,
- 2) ప్రార్ధన మెట్లు చెప్పుచున్నాము.
- 3) బైబిలు గొప్పతనము,
- 4) క్రీస్తు చరిత్ర చెప్పవలెను.
- 5) సంఘ చరిత్ర,
- 6) రెండవరాకడ చెప్పవలెను.
అందరు వీటిని చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా చెప్పిన వారికే సందేహము వచ్చును. పూర్తిగా చెప్పిన తరువాత, "ఇంత కాలమైనది ఇంకా రాలేదేమని" విన్నవారు అందురు. సంఘ చరిత్ర అనగా ప్రభువు మూడున్నర సం॥లు ఏమి చేసినారో, శిష్యులు వాటిని అభ్యాసములో పెట్టిరి, అనగా ప్రాక్టీస్ చేసిరి. అదే అపోస్తలుల కార్యములు. ఆత్మను పొందకముందు చేసిరి, పొందిన తరువాత చేసిరి. అపో.కార్య. 2వ అధ్యాయములో చెప్పినవి కాక అనేకములు పేతురు చెప్పెనుగాని లూకా వాటిని వ్రాయలేదు. అనేకవిధములుగా, వారికి సాక్ష్యములు ఇచ్చిరి. అపో.కార్య. 2:1-39. పేతురు ఈ పెంతెకొస్తు ప్రసంగము చేసి, అలసిపోయి, “మూర్ఖులగు ఈ తరమువారినుండి వేరైయుండుడి” అని చెప్పెను. చెప్పవలసినవి చెప్పి వేరు కావలెనని పేతురు అనుచున్నారు. "పెంతెకొస్తు ప్రసంగము" మరియు అనేకమైన ఇతర సంగతులు చెప్పితిని గాని వినక, అనేకమంది ఎదురాడుచున్నారు. "ఎంత చెప్పినా విననివారు మూర్ఖులనెను”. ఆత్మను పొందిన ఆయన అంత మాట అనకూడదు. మూర్ఖులెవరనగా ఈ తరమువారు. గనుక వారికి వేరై రక్షణ పొందండి. వేరుకాకపోతే రక్షణ పొందలేరు. ఇప్పడు పెంతెకొస్తువారు, సెవెంత్-డే వారు, భక్తసింగ్ గారు మొ॥వారు చెప్పేది ఏమనగా “రక్షణ పొందండి” అనుచున్నారు. గాని వారు లోకమునుండి వేరయ్యే బోధ చేయుటలేదు.
మూడు ఆఫీసులు:-
- 1. ప్రశ్న- బైబిలులో సృష్టి ఆరంభమునుండి మలాకీ ఆఖరివరకు ఏమున్నది? జవాబు:- ఒక ఆఫీసు ఉన్నది. అందులో తండ్రి కూర్చున్నాడు.
- 2. ప్రభువు జన్మ:- తన ఇహలోక జన్మ బైబిలులో మొదట ఆరోహణమువరకు తన ఆఫీసులో కుమారుడు కూర్చున్నాడు.
- 3. సంఘస్థాపన మొదలు రేప్చర్ వరకు పరిశుద్ధాత్మ తండ్రి తన ఆఫీసులో కూర్చున్నారు. ముగ్గురు కూర్చున్నారు.
మొదటి ఆఫీసులో:- మనకు దొరికేవి ఏవనగా, పండ్లు, నీరు, గాలి, మనిషి తినుటకు, త్రాగుటకు కావలసినవి. అవన్నీ అన్యులు, క్రైస్తవులు అను వివక్షత లేకుండా అందరకును ఇవ్వబడుచున్నవి. అలాగే వనమూలికలు అందరకును పనిచేయుచున్నవి. ఈలాగు తండ్రి ప్రేమ మొదటి ఆఫీసులో అందరకును ఇవ్వబడెను అన్యులకెందుకు ఆయన ప్రేమను ఇయ్యవలెనంటే "తండ్రి నీ కొరకును, అందరికొరకును" అని తండ్రి ఆఫీసునుండి స్వరం వచ్చును.
- 1. ఆహారము,
- 2. నీరు,
- 3. మూలికలు,
- 4. వెలుగు,
- 5. భూమి.
ఇవన్నియు మొదటి ఆఫీసులో అనగా తండ్రి దగ్గర దొరుకును.
రెండవ ఆఫీసులో:- క్రీస్తు మనకొరకు చూపిన రక్తధార, ఇందులో తండ్రియొక్క ప్రేమ ఉన్నది. ఆయన జాలి, సంస్కారము, బాప్తిస్మము, బోధ, అద్భుతములు ఉన్నవి.
మూడవ ఆఫీసులో:- అనగా పరిశుద్ధాత్మ తండ్రి ఆఫీసులో అన్నీ ఉన్నవి. యోహానువలెను ఆత్మావేశులై యుండుటయు, ఆత్మవశులై ఉండుటయు; ఇవన్నీ ఆత్మ తండ్రి ఇస్తారు. మొదటి రెండు ఆఫీసు లోనివన్నియు, అవేకాకుండా తన ఆఫీసులో ఉన్న అన్నియు పరిశుద్ధాత్మ తండ్రి ఇస్తారు. ఎప్పుడు? ఆయన వశమైపోయినప్పుడు అనగా ఆత్మ వశమైపోయినప్పుడు. అవి, ఇవి అనే వివక్షతలేకుండా ఏది ఇవ్వమంటే అది ఇస్తారు. ఆత్మతండ్రి ఇవ్వకుండా ఉండరు.
- 1) పాతనిబంధన తండ్రి కాలము (ఆహారము),
- 2) క్రొత్త నిబంధన క్రీస్తులో తండ్రియొద్దకు వెళ్ళు మార్గము,
- 3) సంఘ కాలములో ఆత్మవశమై పోవడము.
వీటిలో ఏది కావలెను? తండ్రీ! జబ్బుతీసివేయుమని ప్రార్ధించకూడదు. అది వధువుకు సరిపోయిన స్థితికాదు. అయితే, తండ్రి దగ్గర అందరకు తెలిసినది తీసికోవడమే. ఇశ్రాయేలీయులకు ఆహారము ఇచ్చిన తండ్రీ! ఏలీయా, ఎలీషాలకు ఆహారము ఇచ్చిన తండ్రీ! అని తండ్రి ఆఫీసుకు అందరు వెళ్ళుదురు. ఎందుకనగా ఆయన సృష్టించినారు గనుక వెళ్ళవచ్చును. గాని మనకు తెలియక వెళ్ళము.
- 1. అదే మొదటి ఆఫీసులో అందరకు హక్కు ఉన్నది.
- 2. క్రీస్తును నమ్మితేనే రెండవ ఆఫీసులో హక్కు
- 3. అయితే, ఆత్మ ఆఫీసులో అన్నియు దొరుకును.
ఈలోకములోనుండేవి, పరలోకములో నుండేవి దొరుకును.
- (ఎ) తండ్రి దగ్గర అన్నీ బొంకే వారు పరలోకములోనికి వెళ్ళలేరు.
- (బి) కుమారుని విశ్వసిస్తేనే పరలోకములోనికి వెళ్ళెదరు.
- (సి) ఆత్మ వశమైయుంటే అన్ని దొరుకును.
'తండ్రి, కుమారుడు ఉంటే చాలు. ఆత్మ అక్కరలేదనే' వారు ఉంటారు. 'తండ్రి చాలు; కుమారుడు, ఆత్మలు అక్కరలేదనే' వారుకూడ ఉంటారు. ఆలాగే వద్దంటే వారికేదియు లేదు. మీరు ఆత్మను ఎదిరిస్తే ఈ యుగమందుగాని, రాబోవు యుగమందుగాని క్షమాపణలేదు. పరిశుద్ధాత్మ అక్కరలేదని లూధరన్ పాదిరిగారు పత్రిక అచ్చువేసిరి. అయితే, మనము మూడు ఆఫీసులను కలుపవలయును.
పరలోకములో చేర్చే మెట్లు:- బైబిలు ఏ ఆఫీసులో దొరుకును? ఆత్మ తండ్రి ఆఫీసులో. రేప్చర్ రోజున మేఘములోనికి ఆత్మతండ్రి తీసికొని వెళ్ళును. ఆత్మతండ్రి పెండ్లికుమార్తెను సిద్ధపర్చుచున్నారు. తండ్రి ఆత్మనుగూర్చి, అలాగే కుమారుడు ఆత్మనుగూర్చి చెప్పిన ఒకే మాటలున్నవి.
- 1) తండ్రి - కుమారుడు, ఆత్మ మీకేమి చెప్పునో అది చేయండి.
- 2) కుమారుడు- "ఆయన మీకు చెప్పునది చేయండి"
- 3) “ఆత్మ మీతో చెప్పునది మీరు చేయండి”.
ఒక్కొక్కరు, వారివారి పని వేరు. కలిపితే ముగ్గురు పని ఒకటే.
- (1) ఆది 27:8 అధ్యా॥లో రాహేలు "ఆయన (తాను) ఏమి చెప్పునో, అది చేయుడి" అనెను.
- (2) యోహాను 2:5లో ఆయన మీతో చెప్పునది చేయుడి అని ఉన్నది.
- (3) ఆత్మ ప్రకటన 1వ అధ్యా॥ మొదలు 3వ అధ్యా॥ వరకు ఆత్మ చెప్పునది చేయుడి అని వ్రాయబడినది.
- 1) తండ్రిని బైలుపర్చినది సృష్టి,
- 2) తండ్రిని, కుమారుని బైలుపర్చినది ఆత్మ తండ్రి.
“వరాత్మపితా పుత్ర.....వాస స్తోత్రము” తండ్రి ఇచ్చేవి, కుమారుడిచ్చేవి, ఆత్మతండ్రి ఇచ్చేవి; అన్నియు ఆత్మ తండ్రియే ఇచ్చును, అందించును.
పరిశుద్ధాత్మ ఫలములు ఏవనగా
- 1. వెలుగు, సంతోషము.
- 2. కీడు అంటే లెక్కలేని తనము.
- 3. భాషావరము; ఇది అవసరమునుబట్టి వచ్చును.
వరము ఉంటే ఎప్పుడు బడితే అప్పుడే భాషవచ్చును. కాని వేరే దేశము వెళ్ళినప్పుడు ఆ భాష మనకు రాకపోతే, "ఆ భాష నాకు వస్తే బాగుండును, బోధింతును" అని నీవు అనుకుంటే, అప్పుడు అవసరమునుబట్టి పరిశుద్ధాత్మ నీతో ఆ భాషలో బోధ చెప్పించును. ఆ తరువాత ఆ భాష నీకురాదు. ఒక్కవరము మాత్రము మీలో స్థిరముగా నుండును అదేమనగా, "పరిశుద్ధాత్మ అవేశము కలిగి బోధించేవరము" ఇది అందరికి ఆయన ఇస్తారు. వాడుకోవాలి లేకపోతే తగ్గిపోతుంది.
ఆలాగు పరిశుద్ధాత్మ వరములను పొంది, ఆయన వార్తను అందరకు అందించు ధన్యత పెండ్లికుమారుడు మీకు మెండుగా దయచేయునుగాక. ఆమేన్.
30.5.1955 సం॥లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము.