గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు
ఆత్మ కుమ్మరింపు కూటములలోని పదియవ దినము - ఆదివారము
పెంతెకొస్తు పండుగ
లూకా 24, 24:49.
ప్రార్ధన:- పెంతెకొస్తు పండుగను అనుగ్రహించిన తండ్రీ! నీకు మా వందనములు. క్రిస్మస్ వండుగలో నీ కృప తెలునుకొన్నాము. మంచిశుక్రవారము మేము సంతోషింపవలసిన విషయమైయున్నది. ఎందుకంటే సిలువ, మరణము, సమాధిపై మేము కూడా నీ జయము పొందినాము. ఈ దినమున ఎవరు నీ శ్రమ, మరణ, పునరుత్థానము, ఆరోహణము, పెంతెకొస్తు, రాకడ విషయములు తలంచుదురో వారిపై నీ ఆత్మ కుమ్మరించుము. ఈ దినమునకు మేము ఏమి నేర్చుకొనవలెనో అట్టిది అందించుము. ఆమేన్.
కీర్తన: పండుగ పెంతెకొస్తు పండుగ. పాడిన సభ్యులారా! నేడు మాట్లాడే విషయములు పెంతెకొస్తునాడు జరిగిన అన్నీ విషయములుకాదు. క్రిస్మసు 7 దినములు, మంచిశుక్రవారము 7 దినములు, పెంతెకొస్తు 7 దినములుకాక, 10 దినములు పండుగ చేయవలెను. ఎందుకంటే ఈ పండుగ ఒక్క దినమునే చేయవీలులేదు. నిజవిశ్వాసులు మొదటినుండి చివరివరకు చేయగలరు. అప్పుడు సంతోషముతో నిజమైన పండుగ చేయగలరు.
ఈవేళ మొదట జ్ఞాపకము చేసే విషయము:-
1. పై నుండి:- పైనుండి పరిశుద్ధాత్మ రావలెను. మన అనుభవములలో ఈ సంగతి తెలుసు. పైనుండి అనగా
- (1) జ్యోతులనుండి వెలుగు వచ్చును,
- (2) పైనున్న మేఘములోనుండి వర్షము వచ్చును,
- (3) పరిశుద్ధాత్మ అంతకంటే పైనుండి అనగా నీళ్ళపైనుండి, గాలి పైనుండి వచ్చును.
ఎక్కడనుండి వచ్చునో, ఎక్కడికి పోవునో తెలియదు. ఆ విధముగా పరిశుద్ధాత్మ పైనుండి వచ్చును. ఇది ఒక అనుభవము. బోధకులు సంఘమును దీవించునప్పుడు చేతులెత్తి దీవించెదరు. గనుక దీవెనయు పైనుండే వచ్చును. బాప్తిస్మమిచ్చేటప్పుడు బోధకుడు నీళ్ళు పైనుండే పోస్తారు. ఇవన్నియు మనకు పైనుండే వస్తున్నవి. భూమి అనుభవించేవన్నియు పైనుండే వచ్చును. పైనుండి వస్తేనేగాని ఇవన్ని మనకు లేవు, అలాగే భూమికి లేవు (హోషెయ 2:21,22).
నేడు పంటలకు, సరియైన ఫలితములు లేవుగాన ఇవన్ని తలంచి తండ్రిని స్తుతించాలి. మన రెండు చేతులెత్తి పైనున్న తండ్రిని స్తుతించాలి. చేతులు, కన్నులు ఎత్తి అందరు స్తుతించాలి. స్తుతి ఎప్పుడు పైకే వెళ్ళును. సుంకరి ఒప్పుదలలో ఉన్నాడు గాన తలవాల్చి స్తుతించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను. కీర్తన 107:20. ఆ వాక్కు బైబిలులో ఉన్నది. గాన బైబిలుకూడ పైనుండే వచ్చెను. వెలుగు కలుగునుగాక! అని పైనుండి వాక్కు వచ్చి, ఆ వాక్కులోనుండి, వెలుగు కలిగెను. వీటన్నిటిలో ముఖ్యమైనది పరిశుద్ధాత్మ గనుక ఆయనకొరకు వేడుకొనండి.
2. మీదికి వ్రాలుట:- అనగా క్రుమ్మరించుట. "మీ మీదికి నా ఆత్మను పంపుదును, నేను పంపిస్తాను" అని ఆయన చెప్పెను. పైనుండి వచ్చేదిగాన "మీదికి" అని ప్రభువు అన్నారు.
- 1. ప్రభువు తన ఆత్మను మీదికి పంపెను.
- 2. ఆ ఆత్మ వ్రాలెను అనగా పైనుండి వచ్చి వ్రాలెను. పక్షి వ్రాలెననగా పైనుండి వ్రాలెను అని అర్ధము.
- 3. కుమ్మరింపు: పేతురు ప్రసంగములో ఈ చిన్నమాట దొరికెను. దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించెను. బిందెతో
పైనుండి క్రిందికి నీళ్ళను దిమ్మరించినట్లు, పైనుండి దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించెను. ఈ మూడు మాటలు, "ఆత్మ"
"పైనుండి" వచ్చెనను వృత్తాంతమును తెలుపుచున్నవి. పైనుండి అనగా గౌరవము ఎక్కువ.
ఉదా:- అమెరికానుండి ఏదైనా వస్తువువస్తే, దానిని గొప్పగా చూస్తారుగదా! అయితే అమెరికా నుండి వచ్చిన వస్తువుకంటే, ఆత్మకు ఎక్కువ గౌరవము అని జ్ఞాపకము ఉంచుకొనండి. - 4. ఆ మూడు మాటలు కలిపితే ఎంతో, 120మందిపైకి వ్రాలుట మరియు కుమ్మరింపబడుట అంత. ఐతే ఏమిపని జరిగినది? బిందెతో నీళ్ళు క్రుమ్మరించగా కుండ నిండును. అట్లే ప్రభువు, తన ఆత్మను క్రుమ్మరిస్తేనేగాని హృదయము నిండదు. అ.కా. 2వ అధ్యా॥లో వారి హృదయములనిండా ఆత్మ నిండెను అని వ్రాయబడినది. ఈ మూడు కార్యాలవల్ల నిండుటతో సమానమైన మాటగా, "ఇల్లంతయు నిండెను" అని ఉన్నది. ఇది ఆత్మయొక్క పరివూర్ణతకు, నివాసమునకు గుర్తు. హృదయమంతా, ఇల్లంతా, జీవితకాలమంతా నిండెను. ఇవి తలంచి దేవుని స్తుతించండి.
3. వ్యాపించుట: ఈ పరిశుద్ధ చరిత్రలో ఉన్న మూడవ అంశము: వ్యాపించుట. మనము మన పట్టణములో, ఈ ఆవరణమంత బావి త్రవ్వితే, అందులో నీళ్ళు ఊరును. మన కంటికి కనబడేవరకు, మన్ను కనబడేవరకు త్రవ్వి, మైదానము కనబడేవరకు తవ్వితే ఎన్ని లక్షలైనా ఖర్చుపెట్టి బహు లోతుకు త్రవ్వితే, త్రవ్వేవారికి ఆహారముకూడ పంపితే, చివరకు ఆ గొయ్యి నిండి గాలి లోపల ఉండును. ఆ నీళ్ళు తోడితే చివరకు వచ్చేది మన్నే. అయితే, గాలి మాత్రము మనిషికూడ వెళ్ళును. గాలియొక్క పని వ్యాపించుటే చెప్పుట. ఈ మూడవ భాగము. నదిలోనికి వెళ్ళుదుము, దానిలో నీళ్ళున్నవి. అవితీస్తే మధ్య ఖాళీస్థలములో గాలి ఉన్నది. అడుగున గాలి లేనియెడల చేపలేలాగు బ్రతుకును? ఆ గాలి చాలక కొన్ని చేపలు కొన్నిసార్లు బైటికి వచ్చి గాలిపీల్చి, మరలా లోనికి వెళ్ళును. కత్తితో సగము చెట్టును నరకగా, ఆ గాటులో గాలియే ఉండును. భోజనం చేసేటప్పుడు మెతుకుమెతుకు మధ్యను గాలే. గాలి అనేది ఎక్కడబడితే అక్కడేయుండును. నీళ్ళు, ఆహారము లేనియెడల కొంతకాలము ఉంటాముగాని గాలిలేనిదే ఒకు నిమిషమైనా ఉండలేము. అథోలోకములోను, చెట్లలోను, ఆహారములోను, నీళ్ళలోను ఉండే గాలియొక్క వురవడి కొన్నిసార్లు చిన్నగాను, పెద్దగాను, ఎక్కువగాను, తక్కువగాను ఉండును. గాని తుఫానులోని గాలివేగము, బలము, వురవడి వేరుగాయుండును. అలాగే పరిశుద్ధాత్మ లేని స్థలములేదు. గాని శిష్యులున్న గదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగగా ఓరు వినబడెను. వెలుపల ఉన్న అవిశ్వాసులు, ఆ ఓరునుబట్టి మామూలు గాలే వచ్చినదనుకున్నారు. గాలియొక్కపని ఓరుపెట్టుట. అనగా గాలి వేరు, గాలియొక్క పనివేరు. నేను వేరు, నేను వ్రాసిన పుస్తకము పనివేరు. అలాగే ఆయన పనిని నరులు అడుగరు. “పరిశుద్ధాత్మ తండ్రీ! నీ పనికాదు, నీవే మాకు కావాలి. చిన్నతనమునుండి నీ పనిమాకు తెలుసు. అయితే, ఇపుడు మాకు నీవే కావాలి” అని ఆయనను అడుగవలెను.
చిన్నపుడు బడిలోనున్నప్పుడు పాఠములపై ఏమి శ్రద్ధలేదు. అయితే వయసు పెరిగినపుడు, చదువులపై శ్రద్ధ అధికమగును. అలాగే, ఈ బైబిలు చదువుట, సంగతి నేర్చుకొనుట పరిశుద్ధాత్మ పని. ఒక యౌనస్థుని అబ్బాయీ! ఈ ఊరు వచ్చి బోధిస్తున్నావు. నీవే వచ్చావా? లేక పరిశుద్ధాత్మ నడిపింపా? అని అంటే "లేదు, నేనే వచ్చితిని" అంటాడు. ఇంకొకరిని అడిగితే, “ప్రార్ధనలో ఉండగా పరిశుద్ధాత్మ నడుపుదల ఇచ్చెను” అంటారు. అనగా సేవలో ముందుకు వెళ్ళుకొలది ఆత్మపై శ్రద్ధ అధికమగును. మంచి ప్రసంగము పరిశుద్ధాత్మ పనే. కష్టము, కీడు, ఆపద పై ఆపద మొదలైన ఈ కుమ్మరాలను వెళ్ళగొట్టుటకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు అవసరము గాన ఆ కుమ్మరింపే మనకు అవసరము. వాక్యము చదువగా అర్థమగును. అది పరిశుద్ధాత్మ వెలిగింపు. మంచిపని పరిశుద్ధాత్మ పని. ఊరు వెళ్ళుట పరిశుద్ధాత్మ నడిపింపు. మీరు పరలోకపు తండ్రిని ప్రార్ధించిన యెడల "ఆయన పరిశుద్ధాత్మనే ఇస్తారు కాని నడిపింపు, వెలుగింపు, ఉద్రేకము కాదు" మీరు అడిగితే కొలతలేకుండా ఆత్మను ఇస్తారు. పరిశుద్ధాత్మకు ఆది, అంతములేదు. తీసికొంటూ, వాడుకుంటూ ఉండాలి. పరలోకము వెళ్ళిన పిదప అంతములేని బ్రతుకు బ్రతుకుదుము. భూలోకములో ఆత్మజీవనము, పరలోకములో అంతములేని మహిమ జీవనములో యుగయుగములు జీవింతుము.
అట్టి జీవభాగ్యము పెండ్లికుమారుడు నేడు మీకు దయచేయునుగాక. ఆమేన్.
1.6.1952వ సం॥లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము.