గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు

ఆత్మ కుమ్మరింపు కూటములలోని మూడవ దినము - ఆదివారము
పరిశుద్ధాత్మ క్రియ



మత్తయి 18:18-20.

ప్రార్ధన:- తండ్రీ! నీవు మాకొరకు చేసినవి, అమర్చిపెట్టినవి తెలిసికొనుటకు, అనుభవించుటకు మా జ్ఞానముచాలదు, వయస్సు సరిపోదు గనుక నీవే మా ఆత్మను, నీ ఆత్మతో ఏకీభవింపజేసి, నీ ఆత్మక్రియను మాలో పూర్ణముగా జరిగించి, ఆత్మ పూర్ణులనుగా మార్చుకొని మహిమకు ఆయత్తపర్చుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


కీర్తన: “తెలివిని గలిగించు నన్ను దివ్వెగ వెలిగించు.”


దేవుడు మన కొరకు అమర్చి ఉంచినవన్నియు మనకు తెలియవు. పెండ్లికుమార్తెకు పరిశుద్ధాత్మ తండ్రి, ఈ మూడు లోకములలో ఉన్నవన్నీ చూపించుచున్నాడు. గాని ఇంకా అవి ముగింపుకాలేదు. అక్కడకు వెళ్ళిన పిదప అన్నింటిని చూపించును. దేవుడు మనకొరకు అమర్చినవన్నీ చూపించును. ఇవన్నీ దేవుడు నీ కొరకు గడించి పెట్టినాడు. అవన్నీ నీకు అందించి పెట్టుదునని పరిశుద్ధాత్మ తండ్రి అనును. పరలోకవు తండ్రి అన్నీ చేసి పెట్టినాడు. ప్రభువు అన్నీ సంపాదించిపెట్టినాడు. పరిశుద్ధాత్మ తండ్రి మనకు కావలసినవన్నియు వడ్డించును. ఆదికాండములో ఆకాశము, భూమియొక్క సృష్టి ఆదాముయొక్క సృష్టి ఉన్నది. ఈ సృష్టి అంతటిలో ముగ్గురు ఉన్నారు. తండ్రి సృష్టించినాడు. తన కుమారుని ఎదురుగా పెట్టుకొని చేసినాడు. పరిశుద్ధాత్మ నెరవేర్చినాడు. తండ్రి తలంచెను. కుమారుడు పలికెను. పరిశుద్ధాత్మ చేసెను. ఈలాగు త్రిత్వము ఆదామును కలుగజేసెను. అలాగే మనిషిలో ఒక మనిషిని పరిశుద్ధాత్మ కలిగించెను. "సాధారణముగా కలుగుతుంది" అని అందరూ అంటున్నారు. గాని పరిశుద్ధాత్మ సహాయము బహిరంగముగా కలుగుటలేదు. అయితే, మరియమ్మ విషయములో పైకి కనబడినది. గనుక మనుష్యులను కలిగించుట పరిశుద్ధాత్మపని అని కనబడుచున్నది. సహజముగా మనుష్యులను కలిగించుట సామాన్య పద్ధతి. సామాన్యమైన పద్ధతిని తీసికొనక ఏదేను తోటలో ఆదాము హవ్వలను ఎట్లు కలిగించినాడో, ఆ పద్ధతి తీసికొని మరియమ్మకు ఈ కార్యము కలిగించెను. సృష్టిలో ఏ సాధనమును బట్టికాక ఆయనే స్వయముగా చేసెను. అలాగే మరియమ్మ విషయములో స్వయముగా చేసెను. దేవుడు మనిషై పుట్టవలసినది గాని ఆయనే స్వయముగా చేసెను. నైజప్రకారముకాక స్వయముగా తానే చేసెను. ఆదాము హవ్వలు పాపములో పడకపోతే ఈ పద్ధతే కనబడును. మరియమ్మ వరుసలోని పద్ధతే వాడియుండును. దేవుడు మనిషి అయినాడంటే అది ఆయనను అవమానపరచినట్లు అని తురకలు అందరు. కైరో పట్టణములో క్రైస్తవులు సువార్త ప్రకటిస్తూ ఉంటే తురకలందరు వింటున్నారు. మత్తయిలోని కథ విడ్డూర కథ. నైజ పద్దతిని విడిచి ఆయనే స్వయముగా చేయుట. వెయ్యేండ్లలో అట్లు జరుగును. మరియమ్మలో జరిగినపని ఏమనగా పరిశుద్ధాత్మ చేసినపని. కుమారుడు పలికిన పని. తండ్రి తలంచిన పని.


ముఖ్య విషయము:- ఆయనే సంకల్పించిన నైజ పద్ధతిని విడిచిపెట్టి, ఆయనే స్వయముగా మరియమ్మ విషయములో నెరవేర్చినారు.


ఉదా: ఒక మనిషి రోగమునుండి బాగయినాడు అనగా తండ్రి ఆ వ్యక్తి స్వస్థత కోరెను. కుమారుడు తన రక్తముతో శుద్ధి పరచెను. పరిశుద్ధాత్ముడు బాగుచేసెను. ప్రధానితో నీ కుమారుడు బ్రతికియున్నాడు అని ప్రభువు చెప్పినప్పుడు, తండ్రియొక్క తలంపు ప్రకారము కుమారుడు పలికెను. పరిశుద్ధాత్మ బాగుచేసెను. కొందరికి బిడ్డలు కలుగుటలేదు. అది తండ్రి తలంపులో లేదు. పాపస్థితి అడ్డముగా ఉన్నది. అది వారి పాపముకాకపోయినను, వారి పితరుల పాపములు అడ్డముగా ఉన్నవి. అన్యుని ఇంటిలోకూడా కార్యము జరుగుటకు తండ్రి తలంచెను. కుమారుడు పలికెను. పరిశుద్ధాత్మ చేసెను. బిడ్డలు పుట్టేటందుకు శరీరములో ఆటంకములేదు. గనుక మనుష్యులు చెడ్డవారు అయినను బిడ్డలు పుట్టుచున్నారు. ఒక మనిషికి జబ్బు పోకపోవడానికి ఏదో ఒక కారణము ఉండును. అడ్డు ఉండును. ఎంతో భక్తిగా ఉండవచ్చు, అయినను బిడ్డలు లేకపోవచ్చు. అందుకు కారణము ఉండును. ఆ కారణము అడిగితే తండ్రి తప్పక చెప్పును. అప్పుడు చేస్తే అన్నీ జరుగును. ఎవరైనాసరే బోధ పూర్తిగా విని, నమ్మకము ఉంచినట్లయితే తప్పక నెరవేరును. సందేహము చెడగొట్టును.

సైతానువల్ల పని జరుగదు. సందేహము తొలగించుమని ప్రార్ధించిన, ప్రభువు అన్నీ తొలగించును.


ప్రార్ధన:- ఓ పరిశుద్ధాత్ముడవైన తండ్రీ! అమెరికా, ఇండియా, యూరప్ , ఆస్ట్రేలియా దేశములందు అనేకమంది విశ్వాసులు కూడుకొని ఆలోచించుకొనుచుండగా మేముకూడా ఆలోచించుచున్నాము. నీ పని ఎంతో గొప్ప పని. అన్నీ వివరించుకోలేము.

ప్రభువు రావలసిన దినములలో (రాకడ దినములలో) నైజ పద్ధతి విడిచిపెట్టవలెను. గనుక నిచ్చెన వేసికొని ఆకాశము వరకు వెళ్ళుట కొరకు, సంఘానికి ఈ నైజ పద్ధతిగాక, నీ నైజ పద్ధతిని జరిగించుము. మాకు నైజ పద్ధతివద్దు. నీ పద్ధతి ప్రకారముగా జబ్బు బాగుచేయుము. నీ పద్ధతులే వాడుము, నా పద్ధతి వద్దు. యేసుప్రభువా! నీవు సువార్తలలో నీ పద్ధతులే వాడినావు. ఆ మాట ప్రకారముగానే క్రియ జరిగించుము. నీవలన మేలుపొందునట్లుగా ఆ ప్రకారము క్రియ జరిగించుము. నీ భక్తులైనవారు దేవాలయములో నీ వాక్య ప్రకారము చదువుకొని, మాట్లాడుకొని, మా ఇష్టప్రకారము పొందుపరచుకొనినట్లు, మేము ఈ వాక్యము చదువుకొని, మాట్లాడుకొని మా ఇష్ట ప్రకారము జరిగించు కృప దయచేయుము. తండ్రి తలంచుట, కుమారుడు పలుకుట, పరిశుద్ధాత్మ పని జరిగించుట, మాకు నేర్పినావు. అక్కడ విత్తనములు వేయుట తండ్రీ అది నీ తలంపు, పిమ్మట కుమారుడు పలికెను. పరిశుద్ధాత్మ మొలిపించెను గనుక తండ్రికి ఇప్పుడు మహిమ. కుమారునికి ఇపుడు మహిమ. పరిశుద్ధాత్మకు ఇపుడు మహిమ కలుగునుగాక. ఆలాగే తండ్రికి ఎల్లపుడు మహిమ, కుమారునికి ఎల్లప్పుడు మహిమ. పరిశుద్ధాత్మకు ఎల్లప్పుడు మహిమ చెల్లించుచున్నాము. త్రియేక తండ్రికి యుగయుగముల పొడవునా మహిమ, కుమారునికి యుగయుగముల పొడవునా మహిమ, పరిశుద్ధాత్మకు యుగయుగముల పొడవునా మహిమ చెల్లునుగాక. త్రియేక దేవునికి ఇప్పుడు, ఎల్లప్పుడు కీర్తి ఘనత, ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగముల పొడవునా మహిమ కలుగును గాక. నీ సృష్టిద్వారా, నీ వాక్యముద్వారా మాకు నీ మహిమ అందించుము, క్రియ జరిగించుమని వేడుకొంటున్నాము. నీ కుమారునిద్వారా అనేకములు బయలుపరచినావు. పరిశుద్ధాత్మవల్ల కూడా బయలుపరచినావు. నేడును బయలుపరచిన నీ సర్వ సంగతుల నిమిత్తమై యేసునామమున వందించుచున్నాము తండ్రీ! ఆమేన్.



20.5.1955వ సం॥లో దేవదాసు అయ్యగారు బేతేలు గృహములో చేసిన ప్రసంగము.