గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు

ఆత్మ కుమ్మరింపు కూటములలోని ఆరవదినము - బుధవారము
పరిశుద్ధాత్మ వరములిచ్చుట, బోధించుట



1కొరింథి. 12:1-31.

సలహా:

మోకాళ్ళమీద నిలువబడవలెను, చేతులు కట్టుకొనవలెను, కండ్లు మూసికొనవలెను, ఇతర సంగతులు మనస్సులోనికి రానియ్యకూడదు. పరిశుద్ధాత్మను మాత్రమే తలంచుకొనవలెను. నీ బలహీనతలన్నీ ఆయన పాదముల యెదుట పడవేయవలెను. ఆ తర్వాత కనిపెట్టవలెను.

ప్రార్థన:- ప్రార్ధన చేయవలెననే తలంపు లేనప్పుడు, ఏ మంచి పనియైన చేయుటకు ఇష్టము లేనప్పుడు, ఇష్టము పుట్టించే తండ్రీ నీకు స్తోత్రములు. చెడుగు మానుటకు ఇష్టములేని సమయములో, పాపముమానే తలంపు పుట్టించే తండ్రీ! నీకు స్తోత్రములు. మేము పరలోకమునకు వచ్చిన తర్వాత నీ పని కెరటాల వలె కనబడును. గాన ఆశ్చర్యపడుదుము. పరిశుద్ధాత్మవగు దేవా! ఈ పేరు నీకు చాలదు. ఇంతకంటే ఎక్కువైన పేరు నీకులేదు. అందుచేత ఈ పేరే వాడుచున్నాము. నీ పనికి, నీ గుణానికి ఈ పేరు స్వల్పమని తోస్తున్నది. ఆత్మ అని చెప్పుచున్నారు అది గొప్ప పేరే. అయితే, ఇంకా గొప్ప పేరు కావలెను.


ఓ ప్రభువా! ఓ దేవా! నేను నిలిచి ఉన్నానని తలంచితే పడకుండా ఉండాలని నీ వాక్యములో వ్రాయించినావు. పరిశుద్ధాత్మ దేవా! నేను బైబిలును ప్రార్థనను సువార్త ప్రకటనను మోక్షలోక భాగ్యమును నీ కుమారుడైన యేసుక్రీస్తును, తండ్రిని, నిన్ను ఎరుగుదును. అయినప్పటికిని నీ సహవాసము లేకపోతే ఇపుడున్నవన్నీ శూన్యమగును. కాబట్టి నిత్యము మాలో ఉండి పనిచేయుము అని వేడుకొనుచున్నాము. ఏది సత్యమో, ఏది లోకరీతిగా ధన్యమో, భాగ్యమో (క్రీస్తుని ఎరుగనివారిలో ఉన్న మంచితనము), బైబిలులో ఉన్నదంతా సత్యమని నమ్ముచున్నాను గాని అవలంభించలేకపోవుచున్నాను. అనేకమైన కోరికలు కలిగి, "అది దయచేయుము, ఇది దయచేయుము" అని అడుగుచూ ప్రార్ధించుచున్నాను గాని కొన్ని పొందలేకపోవుచున్నాను. గనుక నిన్నే ఆశ్రయించుచున్నాను. మా ప్రార్ధనలకు జీవము కలిగించుమని వేడుకొంటున్నాము. నీ వాక్యము చదివేటప్పుడు గ్రహించుటకై ఏలాగు వెలిగింపు కలిగింంచుచున్నావో అట్లే పార్థించేటప్పుడు విశ్వాసము, విశ్వాన ఉద్రేకము కలిగించుమని వేదుకొంటున్నాము. మరియు చదివిన ప్రకారము ప్రార్ధించిన ప్రకారము జీవితమును సరిచేసుకొనలేక పోవుచున్నాను. సరి అనగా ఏది మంచియో తెలిసికొనక పోవుట, అనగా ఏమియో తెలిసికొనకపోవుట, అనగా ఏమి చేయవలెనో తెలుసును గాని అట్లు సరిపుచ్చుకొనలేక పోవుచున్నాము గనుక నీవనుగ్రహించే సమస్త తెలివి, సత్తువ, ప్రేరేపణ, ఉజ్జీవము, చురుకుదనము, ఉపాయము అనుగ్రహించుము. ఒకరు బాగా నడువగలిగి, కొంతదూరము నడిచి అలసి మందగాములు అయినప్పుడు ఒక స్నేహితుడు నడిపించును. ప్రభువా! అట్లే నీవు వచ్చి చెయ్యి పట్టుకొని కొత్తగా జీవము పుట్టించి నడిపింతువు. (అలసినవానికి నీళ్ళు పట్టించి నడిపించురీతిగా నన్నును నడిపించుము.) తండ్రీ! అట్లే చేయుము. ఆమెన్.


తండ్రీ! బైబిలులో ఉన్నదంతయు, విశ్వాసులు అనుభవించేదంతయు, సత్య సంఘములో నీవు పెట్టినదంతయు మాకు తెలుసునుగాని ఏది ఎప్పుడు, ఏ రీతిగా, ఎంత అవలంభింపవలెనో, అది తెలియుటకై నీ జీవన ఉజ్జీవము అగత్యమైయున్నది.
కీర్తన: (నన్నును భక్తులను.... మాపి వేయుము దేవా!)
ఓ తండ్రీ! నీ మాట వినకుండా పూర్తిగా చెడిపోయే మనిషిని నీవు విడిచిపెట్టవు. బహుగా దుఃఖిస్తావు. అది అతనికి తెలియదు. ఓ పరిశుద్ధాత్మవైన దేవా! నా ప్రియుడవైన తండ్రీ! నేను జన్మించుటకు, బ్రతుకుటకు పరలోకము వెళ్ళే నిమిత్తమై చనిపోవుటకు నీవే కారణమైయున్నావు. నేను ఒకవేళ నిన్ను విడిచిపెట్టిననూ, నీవు నన్ను విడువవు. గనుక నిన్ను స్తుతించుచున్నాను. నా స్తుతిలో ఆమేన్ అనుచున్నాను. ఈ స్తుతి క్రొత్త రకపు పలుకైయున్నది. పరిశుద్ధాత్మ తండ్రీ! మనిషి మారుమనస్సు పొందువరకు నీవు కనిపెట్టుచుండగా, మేము నీ కొరకు కనిపెట్టే నైజము అనుగ్రహించుము. నీకు ఏమి కావలెనని ప్రభువును అడిగినపుడు అనగా పాడేవరము, బైబిలు చదివేవరము, ప్రార్ధనావరము మొదలైనవి, నేను అడిగేవిగాక, నాకు ఏమి కావలెనని లేదా నాకు ఏమి ఇయ్యవలెనని, నీ మనస్సులో ఉన్నదో, అది నాకు అనుగ్రహించుము. ఆమేన్.


షరా:- పాటిరేవులో ఇద్దరు వెళ్ళునప్పుడు వెనుక కుర్రవాడు ముందువెళ్ళు ఆయన చెయ్యి విడిచినయెడల, కొట్టుకొనిపోవును. ముందు వెళ్ళుచున్న ఆయన విడిచిననూ, కొట్టుకొని పోవును. అయితే, పరిశుద్ధాత్మ మాత్రము విడువడు. అరణ్యములో ఇద్దరు ప్రయాణము చేయుచూ ఒకడు అలసిపోయి పడిపోయెను. రెండవ వ్యక్తి వానిని లేవనెత్తలేక విడిచి వెళ్ళిపోయెను. అయితే పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను అట్లు విడువక దగ్గరనే నిలుచుండి కనిపెట్టుచుండును.


వరములనుగూర్చి:-


వరము కావలెను అంటే మోకాళ్ళమీద ఉండి ప్రభువును అడగాలి. తర్వాత వెంటనే పని ఆరంభించవలెను. పని వేరు. వరము వేరు. ఇక్కడ పని జరుగుచున్నది గాని వరములేదు. వరము అనగా మాట చెప్పగానే పని జరుగుట. వరము రావలెను అంటే పనిచేయవలెను. పనిచేయగా చేయగా, చేయగా వరము వచ్చును. మంగలి, రోడ్డుమీద నడుస్తూ మగవారి గడ్డాలవైపు చూస్తు ఉండెను. ఆలాగే వరము కలవారు జబ్బుకలవారిని చూస్తూ వారిని బాగుచేయవలెను. వారికి స్వస్థత ప్రతి దినము చేయవలెను. "అభ్యానము చేస్తే తుదకు వరము అగును. ఒక దరినుండి పని జరుగుచుంటే తుదకు వరము అగును".


ప్రార్ధన:- పరిశుద్ధాత్మ తండ్రీ! ఎవరెవరికి ఏ వరము కావలెనో, ఆ వరములు ఇచ్చి వాడుకొనే కృప దయచేయుము. ఈ వరండామీద ఉన్నవారి హృదయములో ఏయే వరములు ఉన్నవో, వాటిని నెరవేర్చుమని వేడుకొంటున్నాము. ఆమేన్.


మార్కు 13:11. ఇప్పుడు ఈ వాక్యములో ఉన్న పద్ధతి ప్రకారముగా నేను ఈ వృద్ధాప్యములో ఉపన్యాసము ఇస్తున్నాను. నేను చెప్పునది అందుకొని ఒకరు ఎదుట ఉన్నవారికి చెప్పడము ఎట్లో, అట్లే అధికారులు శిష్యులను ప్రశ్నించుటకు పిలిచినప్పుడు పరిశుద్ధాత్మ శిష్యులకు చెప్పును. వారికి చెప్పవలసిన దానిని చెప్పును. శిష్యులు ఎదుటి వారికి అనగా ప్రశ్నించుచున్న అధికారులకు ఆ సంగతులు చెప్పుదురు గాన ఏమి చెప్పవలెనను దానినిగూర్చి ముందుగా వారు ఆలోచించనక్కరలేదు. విమర్శకులు ఏమి అడుగుదురో అది శిష్యులకు తెలియదు గాన, జవాబు సిద్ధపరచుట ఎట్లు? అందుచే వారు అడుగునది పరిశుద్ధాత్మకు ముందే తెలియును గాన ఆయన వారికి అందించును. కాబట్టి వారు చింతించి భయపడనక్కరలేదు. వారు స్వయముగా జవాబు చెప్పితే అవతలవారికి నచ్చక కలహింపవచ్చును. ఆత్మ చెప్పును గాన అవతల వారి నోళ్ళు కట్టివేయబడును. ముందుకు విమర్శకులు శిష్యులను పిలుతురనియు, వారిని ప్రశ్నింతురు అనియు ఆత్మకు తెలియును. ఇది ఎందుకు అనగా యేసు ప్రభువుతో మూడు సం॥లు ఉండి, ఆయన బోధలు, అద్భుతములు వారు అనుభవించిరి. అది యేసుప్రభువు భూలోకములో ఉన్నపుడు చేసిన పని. గనుక ఆయన వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ విరోధులలో ప్రవేశించి, హింసించును గాన ఆత్మ శిష్యులకు జరుగబోవు సంగతులు తెలియజేయును. నేడునూ అట్లేయున్నది.


మనము మంచి మీటింగులుపెట్టి, మంచి బోధలు వినిపించిన పిదప, దురాత్మ ఏ గుమ్మములో నుండియో, ఏ కిటికీ పెంకులలో నుండియో ప్రవేశించి, కలత పెట్టును. మనము మీటింగులలో బలము, జ్ఞానము పొందిన పిదప బయటకు పోయి సేవచేస్తుండగా, వినువారిలో దురాత్మ దూరి అనేక ప్రశ్నలు, మొండి ప్రశ్నలు వేయించును. అప్పుడు మీటింగు సంతోషముపోయి మనస్సు కలత పడును. గాన ఇతరులకు సమాధానము చెప్పవలసిన భారము మనమీద వేసికొనక పరిశుద్దాత్మమీద వేయవలెనని ప్రభువుయొక్క తలంవు. ఇందులో ఒక విచిత్రము ఉన్నది. ఇదిగో నేను వెళ్ళుచున్నాను గాని సదాకాలము మీతో ఉన్నాను అని చెప్పిన ప్రభువు "విమర్శన శాలలోనికి వచ్చి మీకు మాటలు అందిస్తాను" అని అనక "పరిశుద్ధాత్మ అందించును" అని చెప్పెను. ఆయన ఎందుకు అందించడు? ఆయన ఉన్నాడుగదామరి! ఆత్మ ఎందుకు అందించవలెను? ఎందుకనగా, ఇదివరకు చెప్పినట్లు త్రిత్వములోని ముగ్గురు వారివారి పనులు పంచుకున్నారని కనబడుచున్నది. ఇప్పుడే ఇక్కడే అపో.కార్య 1:6లో ఉన్న వాక్యమును తలంచుకొనండి.

"నేను సదాకాలము మీతోకూడా యున్నాను" అని ప్రభువు చెప్పారు గనుక విమర్శకుల ఎదుట మనమున్నప్పుడు మన దగ్గర నిలువబడుట క్రీస్తు ప్రభువు ప్రోగ్రాం. పని ఒకరిదైనను ముగ్గురు ఉందురు. అయ్యా! మీరు ఇంకా పండుగకు వెళ్ళరా? అని ఒకరు ప్రభువును అడిగినప్పుడు ఆయన వారికి నా సమయము ఇంకా రాలేదని జవాబు చెప్పెను. ఆయన సమయము అనగా పండుగ సమయము. అది క్రీస్తు ప్రోగ్రాములో ఉన్నది. ద్రాక్షారసము చేయవలసి వచ్చినప్పుడు నా సమయము ఇంకా రాలేదని చెప్పెను, ఆ సమయము కుమారుని ప్రోగ్రాంలో ఉన్నది. ప్రకటన 4:5లో 7 ఆత్మలున్నవి అని ఉన్నది. ఇవి దేవుని ఆత్మలు. దేవుడే ఆత్మ అయినను ఆయా పనులకు అవసరమైన ఆత్మపని జరుగవలసియున్నది.


ఉదా: మనము ఒక్కరమే అయినను,

అలాగే దేవుని ఆత్మ ఏడు రకములుగా పనిచేయును. దేవునికి ఏడు ఆత్మలు ఉన్ననూ, ఆత్మ ఒక్కడే. అయితే అ ఆత్మ పని ఒక్కొక్క మనిషిలో ఏడు విధములుగానున్నది. యెషయా 11:2లో దేవుని శక్తులున్నవి.

ఉదా: నేను కూర్చున్నప్పుడు నాలోని శక్తులు బయటకు వచ్చి పనిచేయుటలేదు. అయినను అవి నాలో ఉన్నవని నాకు తెలియును. అవసరము వచ్చినప్పుడు నా శక్తులు కనబడును. అట్లే దేవుడు అనాదియందు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఆకాశము చేయలేదు, ఏదీచేయలేదు. కాని సృష్టియొక్క ఆరంభములో ఆకాశమును ఒకసారి, భూమిని ఒకసారి, వాటిలోనున్న సమస్తమును కొన్నిసార్లు; తుదకు మనిషిని ఒకసారి చేసినట్టు కనబడుచున్నవి. చేయబడిన వస్తువులు ఎన్ని ఉన్నవో అన్ని శక్తులు దేవునిలో ఉన్నవి. గాని అవి క్రమముగా బైలుపడినవి. ఏడు మాత్రమేకాదు ఇంకా అనేకములు దేవునిలో ఉన్నవి. గనుకనే మనము ఆయన పనులలో ఇంకా అనేకము చూస్తున్నాము. నా చేతితో అనేక పనులు చేయగలను. నోటితో అనేక పనులు చేయగలను. అలాగే ఇతర శక్తులతో అనేక పనులు చేయగలను. అవి శక్తులు, నేను వ్యక్తిని. అట్లే సృష్టిపనులన్నియు ఆయన శక్తులు. అనగా ఆయన ఆత్మలు. ఆయన వ్యక్తి ప్రకటన 1వ అధ్యాయములో ప్రభువు 7రకములుగా ప్రత్యక్షపరచుకొనెను. ఏడు ప్రత్యక్షతలు ఇవే. ఏడు సంఘములలో ఏడు రకములైన పనులు గలవాడుగా కనపర్చుకొనెను. అనగా ఏడు నక్షత్రములు, ఏడు పట్టణములు, ఏడు సంఘములు, ఏడు ప్రత్యక్షతలు ఏ సంఘముయొక్క ఆత్మ స్ధితి ఏలాగున్నదో, ఆ సంఘముయొక్క ఆదరణకు ఏ ప్రత్యక్షత అవసరమో, ఆ రీతిగా తన ప్రత్యక్షత అనుగ్రహించెను. యోహానుయొక్క ప్రత్యేక వరము ఏదనగా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము స్థాపింపబడకముందే, యోహోను ఆత్మతో నింపబడెను. నీటి బాప్తిస్మము స్థాపింపకముందే యోహాను ఆత్మ బాప్తిస్మము పొందెను. అపో. కార్య. 2:38లో విశ్వాసులు మారుమనస్సుపొంది బాప్తిస్మము పొందిరి.


షరా:- బాప్తిస్మములో, నీళ్ళుతెచ్చి మనిషికి బాప్తిస్మము నివ్వవలెనుగాని మనిషిని తీసికొనివెళ్ళి నీళ్ళలో ముంచడము, నీళ్ళకు బాప్తిస్మమైనట్లు ఉన్నది. నీళ్ళకు బాప్తిస్మము ఇవ్వటమేమిటి? మనిషికి ఇవ్వవలెనుగాని.


బాప్తిస్మ వివరము:-


మత్తయి 3:11. ఈ వచనములో నీళ్ళతో ఇచ్చు బాప్తిస్మము కలదు. మరియు పరిశుద్ధాత్మతో ఇచ్చు బాప్తిస్మము కూడా కలదు. రొట్టె ద్రాక్షారసములతో పాటు ప్రభువుయొక్క శరీర రక్తములుకూడ ఇవ్వబడినట్టు, నీళ్ళ స్నానముతో పాటు పరిశుద్ధాత్మ బాప్తిస్మముకూడా ఇయ్యబడెను. మారుమనస్సు పొందుటకు యోహాను బాప్తిస్మము ఇచ్చెను. ఇది క్రైస్తవ బాప్తిస్మము కాదు. క్రీస్తు వచ్చినాడని తెలుసుకొని, మారుమనస్సు పొందవలెనని యోహాను ఆ బాప్తిస్మమును యూదులకిచ్చెను. అప్పటికి క్రైస్తవ బాప్తిస్మము పుట్టలేదు. క్రైస్తవ బాప్తిస్మము యేసుప్రభువుయొక్క కడవరి ఆజ్ఞలో ఉన్నది. మత్తయి 28:19 మార్కు 16:16. యేసుప్రభువు నీళ్ళతో బాప్తిస్మము పొందినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందెను. మనమును అట్లే పొందుట ధర్మమైయున్నది. గాని బాప్తిస్మము పొందిన కొన్ని ఏండ్లకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుచున్నాము.


ఎఫెసీ పట్టణస్తులు పరిశుద్ధాత్మ సంగతి ఎరుగకుండా యోహాను బాప్తిస్మము పొందిరి. అది రెండవ బాప్తిస్మము కాదు. యోహాను ఇచ్చిన బాప్తిస్మము యూదుల బాప్తిస్మము. అది క్రైస్తవ బాప్తిస్మముకాదు. మొదటి బాప్తిస్మము గాని రెండవ బాప్తిస్మముగాని కాదు. నీటియొక్క మొత్తము ముఖ్యముకాదు గాని దాని ఉపయోగము ముఖ్యము. వాక్యములో

ప్రభురాత్రి భోజనము ఇచ్చేటప్పుడు చిన్న రొట్టె ఇస్తున్నారా? పెద్ద రొట్టె ఇస్తున్నారా? చిన్నదే. చిన్నది ఇచ్చినను దానిని భోజనము అంటున్నారా? లేదా? అంటున్నారు. సాధారణముగా అన్నము, కూరలు, పండ్లు మొదలైనవాటినన్నిటిని కలిపి భోజనము అంటున్నారు. కూరలు మొదలైనవి లేకుండా వట్టి అన్నమునే భోజనము అంటామా? అనము. అన్నీ కలిస్తేనే భోజనము అవుతుంది. అయితే సంస్కార సమయములో చిన్న రొట్టెను భోజనమే అన్నారుగదా! అట్లే చిలకరింపునకు ఉపయోగించేవి కొంచెము నీళ్ళు అయినను, అది బాప్తిస్మమే. పరిశుద్ధాత్మ పైనుండి వచ్చేది గాన నీళ్ళు పైనుండి పోయవలెను. నీళ్ళకు ఎవరైనా ఆటంకము చేయగలరా? గనుక ఇక్కడ నీళ్ళు మనిషి దగ్గరకు రావడము అని అర్ధము. ముంచడములో మనిషి నీళ్ళ దగ్గరకు రావడమని అర్ధము. నీళ్ళ దగ్గరకు మనిషి వెళ్ళటమే ఉంటే, మనిషిని ఎవరైనా ఆటంకము చేయగలరా? అని ఉండును. అయితే, ఇందులో మనిషి దగరకు నీళ్ళే రావడమై ఉన్నందున, లేక నీళ్ళు తేవడమై ఉన్నందున నీళ్ళకు ఎవడైన ఆటంకము చేయగలదా? అని పేతురు అనెను. దయగల ప్రభువని వ్రాయబడి ఉన్నది గనుక నీటి పరిమాణము కన్నా విశ్వాసము, రక్షణ ముఖ్యము. ఆచారమువల్ల గాని, మిషనువల్లగాని రక్షణరాదు. అయితే, మనిషి దగ్గరకు తీసికొని రావలసినందున నీళ్లకు ఎవరైనా ఆటంకము చేయగలరా? నీళ్ళు ఎప్పుడైతే పైనుండి వచ్చునో అప్పుడే పరిశుద్ధాత్మకూడా మనపైకి వచ్చుచున్నాడు. బాప్తిస్మమునకు

అప్పుడు బాప్తిస్మము ఇయ్యవలెను. ఈ పై మూడు మన బాప్తిస్మములో కలవు గాని చిన్నపిల్లల బాప్తిస్మములో పై మూడు లేవుగాన నిర్ధారణ కాలమందు పై మూడు వారియందు స్థిరపరచబడుచున్నవి. దేవుని వాగ్ధానములు ఎన్నో వేలు ఉండగా, ఏ కారణము చేతనైనను, దిలుగుపడుట దేవుని దూషించినట్లే అగును. “నీవు హత్య చేయబడుదువు” అను స్వరము వినబడినపుడు ఏ మాత్రము భయపడవద్దు. ఏది తింటున్నా ఏమిచేస్తున్నా “యేసూ! నీ తలపే నాకు ఎంతోహాయి” అని తలంచుకొనండి.

ప్రార్ధన:- ఓ పరిశుద్ధాత్మవైన తండ్రీ! అన్ని వాక్యాలలో, అన్ని కాలాలలో, ఇదే మా ప్రార్థన. సృష్టి చేయబడినప్పుడు కోడిపెట్ట గ్రుడ్డుపై పొదుగుచున్నట్లుగా, పిల్లలు వచ్చిన పిదప గ్రద్ద వాటి దగ్గరకు రాకుండా నీ రెక్కలు మా మీద ఉంచుము. నీళ్ళచేతకాదు, రాళ్ళచేతకాదు గాని నీ ఆత్మతో నా హృదయమును నింపుము. అదే మా చివరి ప్రార్ధన. ఆమేన్.



25.5.1955వ సం॥లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము.