మూలవాక్యము: “కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్ధానమును తండ్రివలన పొంది, మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించియున్నాడు” అపో.కార్య. 2:33.

గ్రంథకర్త: ఫాదర్ యం. దేవదాసు

ఆరోహణ పండుగ - గురువారము



కీర్తన 68:18; లూకా 24:50,51; అపో.కార్య. 1:8-11.

ధ్యాన ప్రార్ధన:- దయగల తండ్రీ! మహోన్నతుడవైన ఓ తండ్రీ! ఆకాశములు పట్టని తండ్రీ! అన్ని సింహాసనములకు పైనున్న సింహాసనము పైనున్న దయగల తండ్రీ! స్తోత్రము. ఇప్పుడు స్తోత్రము, ఎల్లప్పుడు స్తోత్రము. యుగయుగముల పొడవున నీకే స్తోత్రములు, ఆమేన్. దయగల ప్రభువా! మా జన్మమునుబట్టి, మా జీవితమునుబట్టి నీ కృపను పొందుటకు అయోగ్యులము. అయినను నీవు ద్వారము తెరచినందున కృప వెంబడి కృప పొందుచున్నాము. గనుక నీ కుమారునిబట్టి వేడుకొంటున్నాము. హల్లెలూయ. ఆకాశమందు మా తండ్రికి హల్లెలూయ, భూమియందంతటా హల్లెలూయా. ఆకాశవాసుల వల్ల నీకు స్తుతులు. దేవదూతల వల్ల నీకు స్తుతులు. భూమిమీద ఉన్న మావల్లను నీకు స్తుతులు కలుగును గాక! ఆమేన్.


వాక్యము కొరకైన ప్రార్ధన:- సృష్టిద్వారా బయలుపడిన ఓ దేవా! నీ కుమారునిద్వారా బయలుపడిన దేవా! త్రియేక దేవుడవైన దేవా! అనుదిన ప్రార్ధన, వాక్యపఠన, పాటలలో బయలుపడుచున్న దేవా! నీకు వందనములు. నిన్నుగూర్చి, పరలోకమును గూర్చి తెలుసుకొనేటందుకు వాక్యమిచ్చిన తండ్రీ! స్తోత్రములు. ఈ దినము నీ కుమారుని ఆరోహణము, మా కొరకు వ్రాయించిన తండ్రీ! వందనములు. మేము నీకు, నీవు మాకు కావలసి ఉన్నాము. నీ వాక్యము మాకు కావలసి యున్నది. నీకు వందనములు. పండుగలలోనే కాక, అనుదిన వాక్యపండుగలలోను మాకు బయలుపడుమని నీ కుమారునిద్వారా వేడుకొంటున్నాము ఆమేన్. యేసుప్రభువా! నీతిసూర్యుడవైన నీకు అనేక వందనములు. సూర్యునిలోనుండి వచ్చు కిరణములు అపవిత్రమైన స్థలములోకూడ ఎట్లు అనుదినము పడుచున్నవో, మంచి స్థలముమీద ఎట్లు పడుచున్నవో, వివక్షత లేకుండా ఎట్లు పడుచున్నవో, అట్లే కృపాక్షేమమైన నీ వాక్యవివరము ద్వారా నీవాక్య కిరణము మా మీద పడేటట్లు కృప దయచేయుము. అవిశ్వాసములో ఉన్నా దుఃఖస్థితిలో ఉన్నా పాపస్థితిలో ఉన్నా అట్టివారి హృదయములలోనే నీ వాక్యోపదేశ కిరణములు పడునట్లు చేయుము. నీ వాక్యసేవ కొరకై ఉంచిన హృదయములో ఆ కిరణములు పడునట్లు చేయుము. ఎవరి హృదయములో ఏమి పనిచేయవలసి ఉన్నదో, అట్లు పనిచేయునట్లు చేయుము. క్రిస్మసు, సిలువమరణ, పునరుత్థాన వర్తమానములు దయచేసినట్లును, నీ భూలోక జీవిత చరిత్ర వర్తమానము దయచేసినట్లును, నీ ఆరోహణ వర్తమానము దయచేయుము. కొండమీద ఆరోహణ వర్తమానము, ఆరోహణ ప్రదర్శన దయచేసినట్లు మాకును దయచేయుము. రావలసిన వారిని రప్పించి, రాకూడని వారిని అడ్డగించుము. రాదలచి ఆటంక పరచబడినవారిని దీవించుము. ఈ ఆరాధనలో ఉన్నవారికి నీ ఆరోహణ స్వరూపము చూపించుము. ఆలయములో ఉన్న అందరిని దీవించునట్లు వర్తమానము దయచేయుము. లోకములో ఉన్న అందరికి వర్తమానము పంపించుము. నిన్ను రమ్మన్నా, రమ్మనక పోయినా; నమ్మినా, నమ్మకపోయినా వర్తమానము అందించుము. అపవిత్ర స్థలములు సూర్యకిరణములను కోరవు. అయినను సూర్యుడు పంపుచున్నట్లు పంపుము. ఇక్కడున్న అందరికి మనోనిదానము దయచేయుము. నీవు వెళ్ళుచుండగా నీ శిష్యులు నీవైపు, ఆకాశమువైపు తేరిచూచినట్లు, మా హృదయములు నీవైపు త్రిప్పుము. మా మనస్సులను ఇంటివైపుగాని; కష్టములు, శోధనలు, చింతలవైపుగాని మరలనీయక, నీవైపు చూచునట్లు; మా విశ్వాసమును నీవైపే త్రిప్పివేయుమని ఆరోహణ రక్షకుడవైన నిన్ను వేడుకొంటున్నాము. ఆమెన్. తండ్రీ, కుమార, పరిశుద్ధాత్మ నామమందు మనము ఈ ఆరోహణ దినమందు ఆరాధన ఆరంభించుచున్నాము.


ధ్యానవాక్యము: విశ్వాసులైన, ప్రియులైన వారలారా! ఈ రోజు పండుగలో పండుగ; ఆరోహణములో ఆరోహణము; ఆరాధనలో ఆరాధన; సేవలో సేవ; చందాలో చందా; అలాగే దేవుని వాక్యమంతా మనము అనుభవించవలసినదే. ఆ వరుసలోనివే ఈరోజు వివరించెదను.


1) ప్రార్ధనలో ప్రార్ధన: బోధకుడు ఇక్కడ ప్రార్ధన చేయుచుండగా నీవు అక్కడ ప్రార్ధన ఆలకిస్తుండగా, నీ మనస్సులో ప్రార్ధన ఊరుచుండును. బోధకుడు మా దేశమును కాపాడుమనగా, "మా దేశమునే కాదు, అన్ని దేశములను కాపాడుమని" నీకు ప్రార్ధన వచ్చునుగదా! అదే ప్రార్ధనలో ప్రార్ధన. జబ్బు మనిషినిగూర్చి బోధకుడు ప్రార్ధిస్తుండగా ఇంకొక రోగిని గూర్చి నీ మనస్సులోనికి రావడము పరిశుద్ధాత్ముని పని. ఇదికూడ ప్రార్ధనలో ప్రార్థనే. నీ ప్రార్ధన బోధకునికి తెలియదు గాని ఆయన ప్రార్ధన నీకు తెలుసు. అదే ప్రార్ధనలో ప్రార్ధన. బోధకుని ప్రార్ధనలో ఏకీభవించి, అప్పుడప్పుడు నీ మనస్సులోనికి వచ్చేది చేయుటే ప్రార్ధనలో ప్రార్ధన.


2) బైబిలులో బైబిలు: నీవు బైబిలు చదువుచుండగా లేదా వినుచుండగా ఇంకొక సంబంధ వాక్యము జ్ఞాపకమునకు వచ్చుచుండును. ఒక వాక్యము చదువుచుండగా, మనోనిదానము చెడకుండా దాని అన్వయ వాక్యము వచ్చుచుండును.
ఉదా: "ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందురో, అక్కడ నేను ఉన్నాను" అని ప్రభువు చెప్పినది బోధకుడు చదువుచుండగా, అదే సమయమందు యోహాను 14:14లోని వాక్యము, బోధకుడు కాదుగాని ఆత్మతండ్రి నీకు జ్ఞాపకము చేయును. అదే బైబిలులో బైబిలు.


3) బోధలో బోధ: బోధకుడు నిలువబడి ప్రసంగించుచుండగా, అనగా పరలోకము వెళ్ళిన పిదప పాపములవల్ల, రోగములవల్ల బాధలేదని బోధించుచుండగా; నీ మనస్సులోనికి “అక్కడే కాదు ఇక్కడకూడా నీకును, వాటికిని సంబంధము లేకుండా యేసుప్రభువు చేయునని” ఆత్మ అందించును. నీకును, బోధకునికి ఆత్మ అందించుచుండును. ఒకరికి అందనివి మరొకరికి అందించును. ఇది నేను చెప్పిన బోధలో బోధ. ప్రార్ధనలో ప్రార్ధన; పఠనములో పఠనము. ఈలాగు క్రొత్త విషయములు ఊరుచుండును.


4) చందాలో చందా: గుడిలో చందా వేసేటప్పుడు, తన మనస్సులో ఎవరు క్రొత్తగా ఎక్కువగా చందా వేసిరో, వారినిగూర్చి బోధకుడు వినిపించుచుండగా; నీ మనస్సులో- “సొమ్ము ఉంటే ఆమెవలె నేనును వేసేదానినిగదా! ప్రభువా నాకెక్కువ సొమ్ము ఇమ్ము ఇంతకంటే ఎక్కువ ఇస్తాను, అని అనుకొనుటలేదా! సంఘములో వచ్చిన చందా విషయములో, మీ ఆత్మలోనికి వచ్చినదే చందాలో చందా.


5) ఉపన్యాసములో ఉపన్యాసము: మీరు వీధిలోనికి వెళ్ళి బోధిస్తుండగా, అందరూ వింటూ ప్రశ్నలు వేస్తుండగా, దానికి జవాబు మీరు ఇచ్చుచుండగా, 'ఆ జవాబుకాదు, ఇంకొక జవాబు అని మనసులోనికి వచ్చును. ఇంకొకరు మోటు ప్రశ్న వేయగా అయ్యో! అది ఎవరు చెప్పగలరు అని అందరూ అనుకొనుచుండగా, నీ మనసులో "నన్ను చెప్పమంటే చెప్పుతాను" అనుకుంటావు. అదే ఉపన్యాసములో ఉపన్యాసము.


6) సేవలో సేవ: నాకే ధనము ఉంటే లోకమంతా తిరిగి అందరికి ప్రకటిస్తానని నీ మనసులోనికి రావడమే సేవలో సేవ. ఈ ప్రకారముగా క్రైస్తవుని జీవితములో అనేక అంశములు ఉన్నవి. అంశములలో అంశములు చాలా ఉన్నవి.


7) ఆరోహణములో ఆరోహణము: యేసుప్రభువు ఆరోహణమాయెను. రేపు సంఘము ఆరోహణమగును. నేను ఆ రాకడలో పాల్గొని, నేనును ఆరోహణమగుదును. గుర్తులు జరుగుచున్నవి. బోధకులు సిద్ధపడమంటున్నారు. అలాగే నీ మనసులో రాకడ జ్ఞాపకము వస్తున్నది. ఇదే ఆరోహణములో ఆరోహణము. ఆరోహణ కథలో ఈ సంగతి ఉన్నది. ఇద్దరు వ్యక్తులు నిలువబడి, 11 మంది శిష్యులతో ఆయన తిరిగి సంఘాన్ని తీసికొని వెళ్ళుటకు వస్తాడని చెప్పిరి. అదే ప్రభువుకూడ చెప్పెను. ఇదే ఆరోహణములో ఆరోహణము.


8) రాకడలో రాకడ: యేసుప్రభువు ప్రాణముతో వెళ్ళినట్లు, మరణముతో సంబంధము లేకుండా వెళ్ళినట్లు మనమును వెళ్ళతాము. ఎంత ధన్యత! అలాగే ఆయన ఆరోహణములో మన ఆరోహణమును; ఆయన రాకడలో మన పోకడ; ఆయన పునరుత్థానములో మన పునరుత్థానమును ఇమిడియున్నవి.


9) పునరుత్ధానములో పునరుత్ధానము: మీరు చనిపోయినవారై ఉన్నారు. అయినను ప్రభువుతో లేచినవారై ఉన్నారని పౌలు వ్రాసెను. మనము చనిపోయినవారమై ఉండగా, క్రీస్తు పునరుత్ధానమువలన లేచినవారము. పునరుత్ధానానికి ఆరోహణానికి సంబంధము ఉన్నది. వునరుత్ధానము అనగా సమాధిలోనుండి లేచుట. ఆరోహణము అనగా భూమిమీద ఉన్న సర్వ కష్టాలలో నుండి లేచుట. “అనుదినము పాపములలో నుండి వునరుత్థానమగుచుంటే ఎప్పుడో ఒకప్పుడు ఆరోహణమగుదుము”. ఈలాగు మనము ఆరోహణమునకు సిద్ధపడుదుము. అట్టి శిష్యుల మనోనిదానము మనకును ఉండునుగాక. శిష్యులు, ఆయన సిలువ మరణములో ఏడ్చిరి. అయితే, పునరుత్ధానమప్పుడు, ఆరోహణమప్పుడు ఏడువక, మేడగదిలో సంతోషముతో ఆత్మకొరకు కని పెట్టుచుండిరి. మనమును ఏడువక, సంతోషించే ఒక గడియ వస్తున్నది. సిద్ధముగా ఉన్నప్పుడు మన ఆరోహణము వచ్చును.


10) గొలుసులో గొలుసు: క్రిస్మస్ కు మనము రంగు కాగితములు అతికించునపుడు, మెరుపు తీగెలు అల్లునపుడును, ఒక దానిలో ఒకటి అతికించినట్లు, మనము ప్రభువును తెలుసుకొన్న నిమిషము మొదలు, పరలోకము వెళ్ళే నిమిషము వరకు ఒక గొలుసు. ప్రార్ధన, బైబిలు చదువుట మరొక గొలుసు. సేవా పరిచర్య ఇంకొక గొలుసు. ఇదే గొలుసులో గొలుసు.


11) అనుభవములో అనుభవము:- ఇదికూడ ఒక గొలుసే. ఆలాగే బ్రతుకంతా గొలుసే. ఆయన నిర్విచారముగా బ్రతికి జయశీలుడై పరలోకము వెళ్ళినట్లు మనమును వెళ్ళుదుము. కొందరు మృతులై పరలోకము వెళ్ళతారు. కొందరు సజీవులై వెళ్ళతారు. అయ్యో వారికి మృతులగుంపు ఎందుకు? వీరికి ఇది ఎందుకు! అనకూడదు. అందరము ఒక్క వరుసలోనే ఉంటాము. ఆయన మన కన్నీళ్ళు తుడుచుననేది ఎంతగొప్ప ధన్యతగును!!

ఆరోహణ చరిత్ర

ఆయన

1. ప్రత్యేకింపబడుట:- యేసుప్రభువు ఆరోహణ చరిత్రలో 5 మెట్లు గలవు. భూమిమీద ఉన్న సంఘమునుండి ఆయన ప్రత్యేకింపబడెను. 11మంది శిష్యులనుండి, ఆయనను ఎరిగినవారి దగ్గరనుండి, ఆయన విశ్వాసుల దగ్గరనుండి, ఆయన ప్రత్యేకింపబడెను. మనుష్యులను రక్షించుటకు ఆయన ఏయే పనులు చేయనిశ్చయించుకొన్నాడో, ఆ పనులలో ఇది ఒక ముఖ్యమైన పని. రక్షించేవాడు, ఎక్కడనుండవలెను? వారి దగ్గరనే ఉండవలెను. గాని ఈ చరిత్రలో ఆయన దూరముగా ఉండుట అవసరము. రక్షణ చరిత్రలో ఆయన దూరమవుట, ప్రత్యేకింపబడుట అవసరము. ఎమ్మాయి శిష్యులతో వారి దగ్గర ఆయన రొట్టె విరుచుచుండగా, శిష్యులు ఆయనను యేసుప్రభువని గ్రహించిరి గాని అప్పుడు ప్రభువు వారి ఎదుట ఉండలేదు. ఆయన అదృశ్యుడయ్యెను. మనము ప్రార్ధనలో ఉన్నప్పుడు ప్రభువు దర్శనములో కనబడి మాయమైపోతే మనకెంతో విచారము. ప్రభువు రక్షణ చరిత్రలో ఇట్టిపనులుకూడ చేస్తారు. ఈలాగు ప్రత్యేకింపబడుట అనునది, క్రైస్తవ అనుభవములో అనగా రక్షణ చరిత్రలో ఒక ముఖ్య విషయము. దేవుడెప్పుడును కనబడకూడదు. అప్పుడప్పుడు కనబడవలెను. ఎందుకనగా, ఆత్మలో పని చేయుటకు గాని చోద్యమునకు కాదు. మనము ప్రార్ధనలో ఉండగా ఆయన మనకు సంతోషము కలిగించును. అదికూడ ఆయన ప్రత్యక్షతయే. ఆయన కొందరిని ఒక రీతిగా, మరికొందరిని ఇంకొక రీతిగా నడిపించును. ఇట్టివాటినిచూచి మనము ఆశ్చర్యపడకూడదు. విశ్వాసము కుదరకపోయినా, గందరగోళమువలన కుదరక పోయిననూ, ప్రార్ధన కుదరకపోయిననూ, ప్రభువు కనబడకపోయిననూ, సంతోషించండి అని పౌలు వ్రాయుచున్నాడు. గనుక మీకు కలుగుచున్న శ్రమను చూచి ఆశ్చర్యపడవద్దు. యేసుప్రభువు ప్రత్యేకింపబడినప్పుడు శిష్యులు మహానందముతో వెళ్ళిరి. విశ్వాసులు విచారపడరు. దుఃఖించరు. ఒక్కొక్కప్పుడు ప్రభువు పిశాచి పనులు జరగనిచ్చును. చివరకు ఆయన ఇవ్వవలసిన మహిమ ఇచ్చును. యేసుప్రభువు చేతులెత్తి శిష్యులను దీవించెను. దీవించి, దీవించి, వారికి ఎడమైపోయెను. ఆరోహణమంటే వారిలోనుండి ప్రత్యేకింపబడి పైకి వెళ్ళిపోయెను.


2. ఆరోహణము:- 11మందే యేసుప్రభువు ఆరోహణమైనప్పుడు చూచినారు. ఆరోహణమనగా ఈలోకములో ఉండే ఆయన పరలోకమునకు ప్రయాణమగుట. ఆయన భూమిమీద ఉన్నప్పటికిని, ఆయన ప్రత్యేకముగానే ఉండెను. పాపులతో కలసి ఆయన ఉన్నను, ఆయన పాపిగా ఉండలేదు. పరిశుద్దుడుగానే ఉండెను. ఆయన శరీరముతో ఉండి, భూమిమీద చేయవలసిన పనియంతయు పూర్తిచేసెను. భూలోకమును విడిచిపెట్టుట, పరలోకమునకు వెళ్ళుట ఆరోహణమనబడును. ఆయన జన్మచరిత్ర మొదలు, పునరుత్ధానమువరకు ఆయన ప్రత్యేకముగానే ఉన్నాడు గాని ఇప్పుడు ఆయన తన్నుతాను ప్రత్యేకించుకొనెను గనుక వేరుగానుండవలెను. ఆయన పునరుత్థానమై ఏమిచేసెను? 40 దినములు ఆయన గలిలయ దెకపొలి మొ॥లగు ప్రదేశమందలి విశ్వాసులను దర్శించుచుండెను. వీరందరిని ఎట్లు దర్శించెను? ఆరోహణమై దర్శించెను. ఈ 40 దినములు ఆయన ఆరోహణమగుచూనే వచ్చెను. ఆరోహణము ప్రతి దినము జరుగవలెను. మనము అన్ని స్థితులలోనుండి ఆరోహణము కావలెను. ఇది భూలోక ఆరోహణము. గోతిలోకి దిగి పైకి ఎక్కుట. ఇది అవరారోహణము. ఇదియు మనము కలిగియుండవలెను. పడిన వెంటనే లేవలెను.

పండితులు ఈ రెండు భాగములుగా ఆయన చరిత్రను భాగించిరి.

1) దీనస్థితి:- ఆకలికి, నిద్రకు, తల్లికి, శత్రువులకు, మరణమునకు మొ॥లగు పరిస్థితులన్నిటికిని లోబడినాడు.


2) మహిమస్థితి:- దేనికిని లోబడడు. సృష్టిలో ఎండకుగాని, గాలికిగాని మొ॥లగు వాటికి లోబడనట్టి స్ధితి, దేవుడు మనకును ఇచ్చును. ఇక ఎప్పటికిని పడడమనేది ఉండదు. సంఘముకూడా యేసుప్రభువువలె ప్రత్యేకింపబడవలెను, ఆరోహణము కావలెను.


3) కొనిపోబడుట:- యేసుప్రభువు నరలోకము విడచి పరలోకమునకు వెళ్ళిపోవలెను. గనుక ఆయనను ఎదుర్కొనుటకు పరలోక వాస్తవ్యులు రావలెను. మొదట మేఘము వచ్చెను. ఏలీయా వెళ్ళినప్పుడు అగ్ని రధములువచ్చెను. ప్రభువును తీసికొని వెళ్ళుటకు మహిమ మేఘము వచ్చెను. మనము రేపు పరలోకమునకు వెళ్ళునప్పుడు మనలను తీసికొని వెళ్ళుటకు మహిమ మేఘము వచ్చును. ప్రత్యేకింపబడుట అనగా ఒకరివల్ల ప్రత్యేకింపబడుట కాదు. విశ్వాసులు, అవిశ్వాసుల నుండి ప్రత్యేకింపబడవలెను. అంతమాత్రమేకాదుగాని విశ్వాసులు, విశ్వాసులనుండికూడ ప్రత్యేకింపబడవలెను.


4) చేర్చుకొనబడుట: - ఆకాశమును, మేఘమండలమును, సూర్య చంద్ర నక్షత్రములును దాటి, ఎన్నోకోట్ల మైళ్ళుదాటి, దూతలలోకమును దాటి, పరలోకమునకు వెళ్ళుట. పరలోకములో చేర్చుకొనబడుట.

అనగా Welcome & Receive.
సందేహము చాలా చెడ్డది. “నేను ప్రభువు బిడ్డను, ఆయన నన్ను రక్షించినాడు” అని ఎప్పుడునూ సంతోషించవలెను గాని "నేను పాపిని" అనకూడదు. "ప్రయాసపడి భారము ....... నాయొద్దకు రండి" అని యేసుప్రభువు చెప్పినప్పుడే మోక్షద్వారము తెరువబడెను.


5) దేవుని కుడిపార్శ్వమున, సింహాసనమున కూర్చుండుట:- మనము ఇక్కడే ప్రత్యేకింపబడుట, ఆరోహణమగుట, కొనిపోబడుట, చేర్చుకొనబడుట జరుగవలెను. ఇక్కడే మనము ఆ అలవాటు చేసికొంటే, మనము తప్పక సింహాసనము ఎక్కుదుము. తప్పకుండా ఇవన్ని అనుభవించగలము. ప్రభువు ఇవన్ని చేసినాడు గనుక ఇవన్ని చేయుట మనకు చాలా సుళువు. ఆ మహా గొప్పభాగ్యము విశ్వాసులు అందరికిని కలుగునుగాక! ఆమేన్.



19.5.1955వ సం॥లో దేవదాసు అయ్యగారు బేతేలుగృహములో చేసిన ప్రసంగము.
2.5.1946వ సం॥లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము.