(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
పాపక్షమాపణ పత్రము
- పరిశుద్ధులు
- 1. లేవి. 16:21 అరణ్యములోనికి మోసికొనుపోవును.
- 2. యెష. 38:17 వీపువెనుక పారవేసెను
- 3. మీకా. 7:19 సముద్రపు అగాధములలో పడవేసెను.
- 4. రోమా. 4:7 కప్పివేసెను
- 5. కొలస్స. 2:13-16 ఎత్తివేసెను
- 6. హెబ్రీ. 10:17 మరచిపోయెను.
కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను. 2కొరింథి. 5:17.
ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. 2కొరింథి. 5:21.
తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమముడైన దేవుడున్నాడా? మీక (7:18).
నేను నీకు శిక్షవిధింపను (యోహా. 8:11) అని యేసు చెప్పెను.
నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచి వేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను (యెష 43:25)
మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచి వేసియున్నాను (యెష 44:22).
మన పాపములు, మన వ్యాధులు, మన శిక్షలు క్రీస్తు తనమీద వేసికొని, మనకు బదులు ఆయనే శిలువపై రక్తము చిందించి మరణించెను. ఈ పనియంతయు చేసిన ప్రభువైన యేసును స్మరించి నా సమస్త పాపములు సిలువమీదనే తీరినవని సంతోషించుము, స్తుతించుము (యెష 53:5).
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును (సామె. 28:13)
మీ పాపములు రక్తమువలె ఎర్రనివైనను అవి హిమమువలె తెల్లబడును; కెంపువలె ఎర్రనివైనను, గొర్రెబొచ్చువలె తెల్లనివగును (యెష 1:18).
ఆయన కుమారుడైన యేసురక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును (1యోహా. 1:7).
మన పాపములను మనము ఒప్పుకొనినయెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి, సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును (1యోహా. 1:9).
దేవుని కృపా మహదైశ్వర్యమునుబట్టి, ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. (ఎఫెసీ 1:7)
మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించిన వానికి మహిమయు, ప్రభావమును, యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. (ప్రక. 1:6)
పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయవస్తువులచేత మీరు విమోచింపబడలేదు గాని, అమూల్యమైన రక్తముచేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్లవంటి క్రీస్తురక్తముచేత విమాచింపబడితిరని మీరెరుగుదురు (1పేతు. 1:18,19)
నేను వారిదోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసికొనను. మనస్సు క్రీస్తుని నమ్మ కలుగును, కీడు తొలగును, మేలు కలుగును, ఇట్టి నమ్మిక గలిగి కృతజ్ఞతానంద హృదయముతో పాపక్షమాపణ కర్తయగు తండ్రియైన దేవుని స్తుతించుము.
స్తుతి ప్రార్ధన:- పరిశుద్ధుడవైన దేవా! నీకు స్తోత్రములు. నా పాపముల జాబితాలు చూపించిన నీకు వందనములు, నా పాపము నిమిత్తమై పశ్చాత్తాప హృదయమును కలిగించిన పరిశుద్ధుడా! నీకు వందనములు, నా పాపముల నొప్పింపజేసిన పరిశుద్దాత్మ తండ్రి! ఘనత కలుగునుగాక! నా పాపమును మన్నించినావనే నమ్మకమును నీ వాక్యమునుబట్టి నాలో పుట్టించిన దేవా! నీకు మహిమ కలుగునుగాక! నీవు కొరతవేయబడిన చిందించిన నీ రక్తమువల్లనే పాపహృదయమును కడిగి, పవిత్రపరచిన పరిశుద్ధుడా! నీకు ఘనత కలుగునుగాక! హిమముకంటెను, గొర్రె బొచ్చుకంటెను తెల్లగా ఉండునట్లు నీ రక్తప్రభావము వలన నా యావత్తు పాపమును పరిహరించినందుకు నిన్ను సుతించు చున్నాను. నీ యందలి మనోనిబ్బరమును నాకు కలిగించి, నా హృదయమును నీ పరిశుద్ధ రక్తమువలన శుద్ధిచేసి మనశ్శాంతి అనుగ్రహించి ఆత్మకానందము ప్రసాదించిన నీకు నిత్య మంగళ స్తోత్రగీతములర్పించుచున్నాను. ఇట్టి నీ గొప్ప ప్రేమను నేను గుర్తెరిగి, ఎప్పటికిని నిన్ను ఘనపరచునట్టి భాగ్యమును అట్టి హృదయ వాంఛయు నీ ఆత్మవలన నాకు ప్రసాదించుమని, శక్తియు మహిమయు గల క్రీస్తు యేసు నామమున పరమతండ్రి, నిన్ను వినయ పూర్వకముగా వేడుకొనుచున్నాను ఆమేన్. ప్రభువును స్తుతించండి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ప్రక. 19:1.
క్షమాపణ గైకొను ప్రార్ధన:- మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక! అని వ్రాయబడిన మాటనుబట్టి మాకు నీ వలన ఎంత శుద్ధి కలుగునని మేము నమ్మగలమో, అంత శుద్ధికలుగును గనుక మేము నమ్ముటవలన అంతశుద్ధి పొందుదుమని క్షమాపణ అందుకొని క్రీస్తుప్రభువు నామమున తండ్రి నిన్ను కృతజ్ఞత హృదయముతో స్తుతించుచున్నాము. ఆమేన్.
పరిశుద్ధ జీవితము కొరకు ప్రార్ధన:- నాలో నేరమున్నదని మీలో ఎవడు రుజువు పరచగలడు! అని చెప్పిన ఓ పరిశుద్దుడా! నీకు
మహిమ
కలుగునుగాక! మేము కూడ అట్లు చెప్పగల పవిత్ర జీవనము దయచేయుము.
నోవహు:- నీతిమంతుడనియు,
యోబు:- యధార్థపరుడనియు,
యోహాను:-
గొప్పవాడనియు, నీవు సాక్ష్యమిచ్చితివి.
మేముకూడ నీవల్ల ఇట్టి సాక్ష్యము పొందే జీవితమనుగ్రహించుము. నన్ను పోలి
నడుచుకొనుడని,
పౌలు చెప్పినట్లు మేమును చెప్పగల మాదిరి జీవితమును దయచేయుము. మా జీవితమనేది నిన్ను లోకమునకు చూపించే సాధనమై యుండునట్లు
నీ
దీవెన ప్రసాదించుమని యేసువారి పరిశుద్ధ నామమున తండ్రీ! నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.
ఫరో తనమీదకు, తన ప్రజలమీదకు వచ్చిన శ్రమలను చూచి మారుమనసు పొందియు, శ్రమతీరిన వెనుక తన మనస్సును కఠినపరచుకొనెను. యూదా ఇస్కరియోతు తన తప్పును తెలిసికొని ఒప్పుకొనినను తాను ప్రభువును ఆశ్రయింపక నాశనమాయెను. మరియు పేతురు తన తప్పిదమును క్షమాపణ కర్తయగు, ప్రభు క్రీస్తు సముఖమందు ఒప్పుకొని, క్షమకలిగిన మారుమనస్సును పొందెను. ఫరో క్షణమాత్రపు మారుమనస్సు, యూదా క్షమాపణ పొందని మారుమనస్సును, పేతురు క్షమాపణ కలిగిన సరియైన మారుమనస్సును పొందెను. ఓ విశ్వాసీ! పై ఉదహరింపబడిన మూడింటిలో ఏ ఏ రకపు మారుమనస్సు నీవు కలిగియున్నావో పరీక్షించుము.
దైవచిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును 2కొరింథి. 7:10 మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను.
తీర్మానము:- నిర్ధోషమార్గమున వివేకముతో ప్రవర్తించెదను; నా ఇంట యదార్ధ హృదయముతో నడచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనియ్యను మూర్ఖచిత్తుడు నాయొద్దనుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నే ననుసరింపను. దా॥కీ॥ 101:2-4
ప్రార్ధన:- సకల పరిశుద్దేచ్చలు. అన్ని మంచి ఆలోచనలు సర్వన్యాయ కార్యములు కలిగించెడు ఓ దేవా! ఈ దినము ఈ గడియనుండి నేను చెడుగుమాని మంచి చేయుటకును, నా కష్టనష్టములయందు సహితము నిన్ను దూషింపక, నా ప్రార్ధనలు నెరవేరని సమయమందు నిన్ను అపార్ధము చేసికొనక, నీ వాక్యము నేర్చుకొనుటయందును, నిన్ను ధ్యానించుటయందును, అశ్రద్ధగా నుండక, దశమభాగము కృతజ్ఞతార్పణలు చెల్లించుటయందు ముందంజవేయుచు, లేనిపోని కోరికలు కోరక, మనుష్యుల దయయందును, ఆశీర్వాదమునకు కర్తవైన నీ దయయందును, వర్ధిల్లునట్లు కృపచూపుము. మరియు ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇంకను పాపముచేయకుము అని చెప్పిన నీ వాక్కును మరువక, నా తీర్మానమంతటియందు నిలకడగానుండి నీకు కీర్తి కలిగించునట్లు, నా తీర్మానమంతటిని క్రీస్తు రక్తముతో ముద్రించుము తండ్రీ! నీ సన్నిధిలో స్థిరపరచుమని రక్షకుడైన క్రీస్తు నామమున వినయముతో వేడుకొనుచున్నాను. ఆమేన్.
వ్రతము:- నీ శాసనములు నాకు హృదయానందములు, అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచికొనియున్నాను ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. దా॥కీర్తన. 119:112.
ప్రార్ధన:- నా భక్తికిని, ముక్తికిని ఆధారమైనయున్న ఓ దేవా! ఎన్ని శోధనలు నన్ను చుట్టుకొనునప్పటికిని, ఎట్టి కష్టములు నన్ను బాధించినను, ఎన్ని సందేహములు నా హృదయమును ఆవరించినను, ఎన్ని ఆటంకములు నన్ను అడ్డగించినను, ఎన్ని ఇబ్బందులు నన్ను ఇరికించినను, ఎన్ని నష్టములు వచ్చినను, నలిపివేసినను, ఎన్ని క్రీస్తు విరోధ బాధలు ఉన్నను నిన్ను విడువను ఇదే నా వ్రతము. నీ మహాశక్తిని బట్టి ఈ నా వ్రతమును నిలువబెట్టుదువని నమ్ముచు యేసు క్రీస్తు వారిద్వారా తండ్రీ, నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్.