(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
దేవుడు మన ప్రార్ధనలు వినుటకు గల కారణములు
- (1) ఆయన మన తండ్రి గనుక
- (2) ఆయన వాగ్ధానములు వ్రాయబడియున్నందువలనను
- (3) తోటలోని చెట్టుపోతే తోట మాలికి నష్టము కాదా! ఆ విధముగానే లోకమనే తోటలో చెట్టువలె ఉన్న మన విషయములో తోటమాలివలె ఉన్న దేవునకు నష్టముకాదా! ఆ మనిషికి నష్టముకాదా!
- (4) పలానివారి ప్రార్ధన వినలేదు మన ప్రార్ధన మాత్రము వినునా అందరికి దిగులుకాదా!
- (5) దేవదూతలు కూడా మన పక్షముగా అడుగుదురు కనుక విసుగవద్దు, ఈ కారణములను ఎత్తి దేవునిని ప్రార్థించుము.
బైబిలు వాక్యములు
నీ కోరికను సిద్ధింపజేసి, నీ ఆలోచన యావత్తును సఫల పరచునుగాక! కీర్తన. 20:4.
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును యోవో. 14:14.
అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును మత్త. 7:7.
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు! రోమా. 8:32.
నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును యోహా. 15:7.
మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని యోహాను 15:16.
ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి సమస్తమును సాధ్యము మత్త. 19:26.
నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా? యిర్మి 32:27; ఆది. 18:14.
దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతివిషయములోను ప్రార్ధన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఫిలిప్పీ. 4:6.
దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును లూకా. 18:7,6.
మనలో కార్యసాధకమైన తనశక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటెను, ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయశక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు, సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎఫెసీ. 3:21
భూమిమీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమిమీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్త. 18:18.
మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన యెడల, మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము 1యోహా. 5:5.
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమా. 8:28.
నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్పలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని (యోబు. 42:2).
మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మత్త. 9:29.
నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. మత్త. 8:13.
సమస్తమును మీవి. 1కొరింథి. 8:21.
అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనుష్యుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు 1:6,8.
అందుచేత ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు 11:24
మనలో విశ్వాసమును బట్టి క్రీస్తుప్రభువు నెరవేర్చును గాని మనము కాదు నెరవేర్చువారము. అబ్రాహాము నిరీక్షణకు ఆధారము లేకపోయినను నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా. 4:18.
దేవుడు లోకమునకు ధర్మముచేసిన బైబిలు గ్రంథములోని వాగ్ధానములు చూడుము. శ్రమలనుకాదు. సృష్టికర్త నీకిచ్చిన దానములను అనగా భూమ్యాకాశములను వాటిలోని స్పష్టమును చూడుము, శ్రమలనుకాదు. గతకాలము విశ్వాసుల ప్రార్ధనలు నెరవేర్పులను చూడుము, శ్రమలనుకాదు. క్రీస్తుప్రభువు అవతార కాలమున విషయమై చేసిన సర్వకార్యములను చూడుము శ్రమలను కాదు, నీ ప్రార్థన నెరవేర్పులను చూడుము. శ్రమలనుకాదు. ఒక యూరపియనుడు అధికమైన వడగండ్ల వర్షము కురియుచు మనుష్యులకు హానిచేయుచుండుట చూచి తండ్రీ! ఆపుచేయుము, అని ప్రార్థించెను. వెంటనే వర్షము ఆగెను. ఎంత గొప్ప నమ్మిక.
విశ్వానమనగా నేమి?
- 1. వాక్యములో ఉన్నది. అర్ధమైనను కాకపోయినను నమ్ముట.
- 2. నమ్ముటకు లేనప్పుడు అబ్రాహామువలె నమ్ముట.
- 3. ఎవరాక్షేపించినను తుదివరకు నమ్ముట.
- 4. లక్షప్రశ్నలు మనస్సులో ఉన్నను నమ్ముట.
- 5. నెరవేరకపోయినను నమ్ముచునే యుండుట.
- 6. అడిగినదే అడగడము కాదుగాని దొరికినదని ఆనందించుటయే నమ్మికయైయున్నది.
తెలిసికొనవలసిన ప్రశ్నలు ఉన్నను, సందేహించే ప్రశ్నలు ఉండకూడదు. విశ్వాసముయొక్క చట్టమును బట్టిచూస్తే ఏ ప్రశ్నలును ఉండకూడదు.
ఇట్టి విశ్వాస హృదయముతో దేవుని స్తుతించుట వలన సంతోషించుము. అందువలన ముఖము ఎల్లప్పుడు కళగా ఉండును. సంగతి జరగకుండుటచూచి ఇదియే సమయమని ఎంచి బైబిలులోని విశ్వాసులైనవారు ఏ రీతిని నమ్మిరో అది జ్ఞాపకము తెచ్చుకొనుచు నవీనకాల భక్తులు ఎట్లు అద్భుతకరమైన విశ్వాసము కలిగియున్నారో అది యావత్తు జ్ఞప్తికి తెచ్చుకొనుటవల్ల, తిరిగి నెమరువేయుచు విశ్వానమును పెంచుకొనుచు, మరింత బలపడుటయు, స్థిరవిశ్వాసము కలిగి కార్యసిద్ధి పొందు భాగ్యమును కన్నులార చూడగలరు.