(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
ప్రార్ధన నెరవేర్పు కలుగకుండుటకు గల కారణములు
- 1. ఏదో ఒక పాపము నీలో దాగియుండుట వలనను
- 2. అవిశ్వాసము లేక అపనమ్మిక కలిగియుండుటవలనను
- 3. దేవుడు క్షమించిన నీ పాపములను తలంచుకొనుట వలనను.
- 4. నీ అయోగ్యత స్థితిని తలంచుకొనుచు కృంగిపోవుట వలనను
- 5. ప్రార్ధనకు కొన్ని పర్యాయములు జవాబు ఆలస్యమగును.
ఎందుకనగా మనముచేయు ప్రార్ధనలు రెండవ ఆకాశము దాటి, మూడవ ఆకాశములోని దేవుని సింహాసనము చేరవలెను. అలాగే దేవుడు ఇచ్చు జవాబుకూడా మన దగ్గరకు రాకముందే సాతాను సమూహమందు రెండవ ఆకాశము ద్వారా రావలయును. ఇక్కడ నుండి ప్రపంచములోని విషయములు సాతాను, వాని సంబంధికులు తమ స్వాధీనమందుంచుకొని నడిపించుదురు. దానియేలు ప్రార్ధనకు జవాబు రాకుండ గబ్రియేలను మూడు వారములు ఆపగలిగెను. ఆకాశములో యుద్ధము జరిగెను. ఎఫెసీ. 2:2; 6:12. బహుపరాక్రమము గలిగిన పారసీక రాజ్యాధిపతి చేతిలోనుండి గబ్రియేలు దూతను విడిపించుటకై ప్రధాన దూతయైన మిఖాయేలు రావలసియుండెను. దాని. 10:13. అలాగైతే చెడు మార్గములను వదలి విశ్వాస ప్రార్ధనలతో మనము కనిపెట్టుదుము గాక!
ముగింపు:- ప్రతి ప్రార్ధనయొక్కచివర వాడవలసిన మాటలు.
- 1. త్వరలో వచ్చుచున్న యేసుప్రభువుద్వారా
- 2. త్వరలో వచ్చి విశ్వాసుల సంఘమనే పెండ్లికుమార్తెను కొంచుకొనిపోవనై యున్న యేసుద్వారా,
- 3. పూర్వము ఈ భూమిమీదికి వధకు తేబడిన గొర్రెపిల్లవలె వచ్చి, ఇప్పుడు పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుద్వారా,
- 4. పూర్వము భూరాజుల చేతిక్రింద ఉండి ఇప్పుడు యువరాజుగా వచ్చుచున్న యేసుద్వారా,
- 5. పూర్వము ఒక బీదవానివలె ఈ మట్టిమీద సంచరించి, ఇప్పుడు మహామహిమతో వచ్చుచున్న ప్రభుయేసుద్వారా,
- 6. పూర్వము గార్థభాసీనుడై భూలోక ప్రధాన పట్టణమునకు వెళ్ళి నేడు మేఘాసీనుడై వచ్చుచున్న యేసుద్వారా
- 7. పూర్వము బహిరంగ యూదుల నిమిత్తమై వచ్చి ఇప్పుడు క్రైస్తవులకొరకు, అన్యులకొరకు, అందరికొరకు వచ్చుచున్న యేసుద్వారా,
- 8. మృతులైన విశ్వాసులను బ్రతికించుటకు, బ్రతికియున్న విశ్వానులను రూపాంతర ధారులనుగా చేయుటకు వచ్చుచున్న క్రీస్తుద్వారా,
షరా:- పై మాటలలో మీ ఇష్టము వచ్చిన మాటలను వాడుకోవచ్చును.
స్తుతి ప్రార్ధనలో ఉపయోగించుకొనవలసిన మాటలు:
స్తోత్రం అనగా స్తుతి, వందనము, నమస్కారము, పూజ, ఆరాధన, గౌరవము, ఘనత, కీర్తి కృతజ్ఞతాస్తుతి, మహిమ ప్రభావము, ఆర్భాటము జయము ప్రక. 4:9-11; 7:12.
ఆమేన్ అనగా అలా జరుగును గాక! అని అర్ధము. ప్రక. 1:6-11; 2పేతురు. 3:18.
ప్రార్ధన:- దేవా! పరిశుద్ధగ్రంథములో వ్రాయించిన వాక్యములో ఉన్నట్లు నాకు విశ్వాసము కలిగించుము. నీవు చేసెదవని నమ్ముచున్నాను. దేవా! నీవు నా మనవి ఆలకించి వేసినావని ధృఢముగా నమ్ముచున్నాను. ఆమేన్.
స్తుతి ప్రార్ధన:- నిత్యుడవైన దేవా! నీకు స్తోత్రము. సత్య దేవుడవైన నిన్ను స్తుతించుచున్నాను. నీవు నీ గ్రంథములో వాయించిన వాగ్దానములను స్మరణకు తెచ్చుకొన్న నిన్ను ఘనపరచుచున్నాను. నీ వాగ్దానములను నెరవేర్పు చూపుటకు శక్తిమంతుడవైన దేవా! నీకు స్తోత్రములు. ఇచ్చుప్రేమ నీలో ఉన్నందున నీకు వందనములు. శక్తియు ప్రేమయున్నందుననే నీవు వ్రాయించిన నీ వాక్యగ్రంథమును నా చేతిలో పెట్టినావు నీకు స్తోత్రములు. అట్టి వాగ్దానములు నా నేత్రములకు చూపించినావు గనుక నీకు ఘనత కలుగును గాక! అట్టి వాగ్దానములు నా చెవులకు వినిపించినావు గనుక నీకు కీర్తి కలుగును గాక! అట్టి వాగ్దానముల నెరవేర్పు చూపించు నిమిత్తమై నీ సన్నిధిలోనికి నన్ను నడిపించినావు. దేవా! నీకు నిత్యమంగళ కృతజ్ఞతార్పణలు యేసుక్రీస్తుద్వారా చెల్లించుచున్నాను. ఆమేన్.
షరా:- బైబిలులోని స్తుతులు, నీ స్వంతమాటలు, పాటలు ఉపయోగించుకొనవచ్చును. స్తుతిమాటలే పాటలుగా కూడా పాడుకొనవచ్చును.
జన్మదినము మొదలు నేటివరకు శరీర సంబంధమైన మేళ్ళను గూర్తి స్తుతులు.
- 1. ఓ మహిమా స్వరూపివైన దేవా! నేను పుట్టకముందే అనగా తల్లిగర్భమందు నిరూపింపబడక ముందే, మా నిర్మాణ విషయములన్నియు నీ పుస్తకములో వ్రాసిపెట్టినావు. దీనినిబట్టి చూచి మా మీద నీకుగల ప్రేమ, జ్ఞాపకము, శ్రద్ధ అను వాటిని బట్టి నిన్ను స్తుతించుచున్నాను.
- 2. మేము జన్మించిన పిమ్మట మేము జీవము కలిగి యున్నప్పటికిని మమ్మును మేము కాపాడుకొనలేమని నీవు ఎరిగిన వాడవై ఆ పని మా తల్లిదండ్రులకు అప్పగించినావు. గనుక నీకు స్తోత్రములు. నీ కృపలో ఒక భాగమైయున్న నీ కాపుదలను స్మరించుచు నీకు వందనములు అర్పించుచున్నాము.
- 3. ఓ దేవా! మమ్మును పోషింపవలసినదని మేము నిన్ను అడుగలేదు. అయినను మమ్మును పాలు వలనను, ఆహారము వలనను పోషించుచున్నావు. నీ పోషణను నీ ప్రేమను తలంచుకొని నిన్ను ఘనపరచుచున్నాము.
- 4. ఓ దేవా! మాకు అనుదిన ఆహారముగాక పైగా తిను బండారములను దయచేయవలసినదని నేను నిన్ను అడుగకపోయినను అవికూడా దయచేయుచున్నావు గనుక కీర్తి కలుగునుగాక.
- 5. సమస్త వస్తువులు నా ఉపయోగ నిమిత్తమై కలుగజేసి ఇచ్చిన నీ కృపనిమిత్తమై నీ ధర్మ ఉపయోగనిమిత్తమై నీకు ప్రభావము కలుగును గాక!
- 6. ఓ దేవా! వస్త్రములు దయచేయుమని మేము నిన్ను అడుగకపోయినను అవికూడ దయచేసిన నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. కష్టపడి సంపాదించిన వాటినికూడా అనుగ్రహించుచున్నావు. ఈ నీ సంపాదన ప్రేమ నిమిత్తమై నిన్ను ఘనపరచుచున్నాము.
- 7. ఓ దేవా! మమ్మును బడికి పంపించి అందుకు అవసరమైన వస్తువులు పుస్తకములు ఇప్పించి విద్య నేర్పించిన ఉపాధ్యాయ ప్రేమనిమిత్తమై నీకు చాలా వందనములు చెల్లించుచున్నాము.
- 8. నాకు చదువుచెప్పు ఉపాధ్యాయులను, విద్యలోను, ఆటలలోను, సహకారులుగా ఉండవలసిన తోటిపిల్లలను అనుగ్రహించినావు. గనుక నీకు స్తోత్రములు. నీ సహాయ ప్రేమ నిమిత్తమై నీకు అనేక నమస్కారములు.
- 9. ఓ దేవా! మేము చదువు ముగించిన తరువాత ఏదో ఒక పనిలో ప్రవేశపెట్టినందుకు నీకు ప్రభావములు కలుగును గాక, మా పనిలో నీ తోడు సహాయము అనుగ్రహించుచున్న ప్రేమ స్తుతి కలుగునుగాక.
- 10. మా దేశమును న్యాయముగా చక్కగాను పరిపాలించే అధికారులను అనుగ్రహించినావు. వారు మమ్మును కాపాడే విషయములోను సహాయముచేసే విషయములోను పూచీదారులై యుండునట్లు చేసినావు. గనుక స్తోత్రములు, మరియు ఆ అధికారము నీవలననే కలిగినది. అందువలన నీవు అందరికి పై అధికారివై యున్నావు గనుక నీకు కృతజ్ఞతార్పణలు చెల్లించుచున్నాము.
- 11. దేశములో మాత్రవేగాక ఇంటిలోకూడా అధికారులను బోలిన తల్లిదండ్రులను మాకంటె పెద్దవారైన సోదర సోదరీలను మా మేలుకోరిన వారినిగా ఏర్పాటుచేసిన నీకు వేలాది నమస్కారములు.
- 12. ఓ దేవా! మా సంతోషాభివృద్ది నిమిత్తమై స్నేహితులను బంధువులను అనుగ్రహించియున్నావు స్తోత్రములు. వీరికంటె గొప్ప స్నేహితుడవు బంధువుడనైయున్నావు, అందుకు నిన్ను పూజించుచున్నాము. మనుష్యులద్వారా నీవు మాకు చేయుచున్న సమస్త ఉపకారముల నిమిత్తమై నీకు స్తోత్రములు.
- 13. మత భక్తి నిమిత్తము మమ్మును కాపాడుటకు ఇవాంజలిస్టులను, పాదరీలను, మిషనెరీలను అనుగ్రహించిన నీకు ఘనత కలుగునుగాక! అందరికంటె నీవు గొప్ప గురువైయున్నావు. గనుక నీకు పూజార్పణలు యేసునామమున అర్పించుచున్నాము. ఆమేన్. నెహెమ్యా. 9:4-6.
స్తుతిప్రార్ధన:- ఓ దేవా! నీవు ప్రేమవైయున్నావు. కనుక నేనెంత పాపినైనను నన్ను ప్రేమించుచున్న నీకు స్తోత్రములు.
ఓ దేవా! నీవు శక్తిమంతుడవై యున్నందున నాకు అన్నిటిలో సహాయము చేయగలవు అందుచేత నీకు వందనములు చెల్లించుచున్నాను.
ఓ దేవా! నీవు పరిశుద్ధుడవై యున్నందువలన సృష్టిని, మానవుని పరిశుద్ధముగా కలుగజేసియున్నావు. మానవుడు పాపము చేయుటద్వారా పరిశుద్ధతను కోల్పోయినను తిరిగి పరిశుద్దులనుగా చేయుట నీవే ఈ లోకమునకు బలియైతివి ఇందుకు నీకు స్తోత్రములు.
జీవమైయున్న ఓ దేవా! మట్టిఘటమైన మానవునిలోనికి నీ జీవాత్మనుపంపి జీవింపచేయు చున్నందుకు స్తోత్రము.
ఓ దేవా! నీవు సర్వవ్యాపివి గనుక నేను ఎక్కడవుంటే నీవు అక్కడుందువు
ఓ దేవా! నీవు ఆది అంతములేని దేవుడవు గనుక నాతో ఎల్లప్పుడు ఉందువు కనుక నీకు మహిమ కలుగునుగాక.
కనిపెట్టుట:- (దావీదు కీర్తన. 37:7) యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము.
ఇంతసేపు మాట్లాడిన నీవు నీ ప్రార్ధనలన్నియు కనిపెట్టి పట్టుమీదకు ప్రవేశించిన నీవు మౌనముగా నుండుము. ఈ కనిపెట్టు పనిని ఎప్పుడుబడితే అప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి చేయవచ్చును గాని మరిముఖ్యముగా తెల్లవారకమునుపే లేచి కాళ్ళు, చేతులు మొదలైనవి శుద్దీకరించుకొని దినమునకు అధమ పక్షము ఒక గంటయైనను చేసిచూడుము. ఇష్టము లేకపోయినను కష్టముగా ఉన్నను బద్దకముగా ఉన్నను తప్పనిసరిగా బలవంతముగానైనను లేని మనుస్సు కుదుర్చుకొని చేసిచూడుము, అప్పుడు నీవు గొప్ప అనుభవమును పొందగలవు.
సహోదరులారా! మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక! ఆమేన్. (గలతీ. 6:18; రోమా. 16:25-27; 2కొరింథి. 13:14).
ఇతరులనుగూర్చిన ప్రార్ధన:- సర్వజనులకు తండ్రివైన దేవా! నీ సృష్టికార్యముల నిమిత్తమై నీకనేక స్తోత్రములు, మానవులందరును నిన్ను ఆరాధింపవలెనను ఉద్దేశ్యముతో అందరు అన్ని మతములను స్థాపించుకొన్నారు. గాని ఒకరికొకరికి మా మతము దైవ మతమని చెప్పుకొను గుణమున్నది. కొన్ని విషయములలో భేదములున్నను అన్ని మతములు ఒకటే అని కొందరనుచున్నారు. అట్లనరాదని కొందరనుచున్నారు. తండ్రి నీవు అందరికిని సత్యమును బైలుపరచమని యేసునామమున వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఓ దేవా! తండ్రి నీ మహిమను అనుభవించుటకై నన్ను కలుగజేసిన నీకు అనేక స్తోత్రములు. నీ అనుగ్రహ దానములగు భూమి యాకాశముల నిమిత్తమై నీకనేక వందనములు. నీ విషయము పూర్తిగా తెలిసికొనగల బైబిలు గ్రంథమును దయచేసినందులకు నీకనేక స్తుతులు. అది గ్రహించుటకు నీ ఆత్మ సహాయమునిమ్ము. నన్ను అనుదినము పవిత్రపరచు చుండుము. నీ చిత్తానముసారముగా నన్ను నడిపించుము. నాకు ఏమి ఇవ్వవలెనని నీకున్నదో అదే ఇమ్ము. నాతో ఏమి చేయింపవలెనని ఉన్నదో అది చేయించుము. తుదకు నన్ను నీయొద్దకు తీసికొనివెళ్ళుము. నీవే అన్ని విషయములలో నాకాధారమైయున్నావు, నీకే మహిమ కలుగునుగాక! క్రీస్తు యేసు నామున అంగీకరించుము. ఆమేన్.
రాకడ ప్రార్ధన:- ఓ ప్రభువా! దివ్యరక్షకా! త్వరగా వచ్చుచున్న లోక నామధారివైన ఓ క్రీస్తుయేసు ప్రభువా! నీకు స్తోత్రములు. నీవు త్వరగా వచ్చుచుండగా మేము మెల్లగా మూలను మెదలకుండా ఉన్నాము, మా తలంపంతా రెండవ రాకడతో నింపుము. ఎల్లప్పుడు చింతయే, ఎల్లప్పుడు విచారమె, మా బలహీనతలకు నీ సన్నిధియే విరుగుడని గ్రహించి, నీ సన్నిధిలో మా సమయమును గడుపుచు వాటికి సెలవిచ్చెడి భాగ్యము పొంద గలుగునట్టి కృపను చూపుమని వేడుకొనుచున్నాము. నీ సన్నిధిలో ఉండుట వలననే నీ రాకడకు సిద్ధపడ కలుగునట్టి భాగ్యము పొందగలమని నమ్ముచున్నాను. అట్టి ఖాగ్యమే నాకు ప్రసాదింపుమని మా పరమతండ్రీ! ఈ ప్రార్ధన మమ్మును నూతన యెరూషలేమునకు మహిమ మేఘముమీద తీసుకొని వెళ్ళుటకై వచ్చుచున్న యేసుక్రీస్తువారిద్వారా అంగీకరించుమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.
పరిశుద్ధాత్మ బాప్తిస్మము:- యోవే. 2:28,29 యోహా. 1:33; అపో.కార్య. 2అధ్యాయము అంతా.
రోగులకు:- నిర్గమ. 15:26; కీర్తన. 10:8; 107:20; యాకో. 5:14-16.
దయ్యములకు:- 1సమూ. 16:14-23; మార్కు 1:5-20; మార్కు 16:20; అపో.కార్య. 16:16,18; యాకో. 4:7; 1యోహా. 3:8; ప్రక. 4:5 అంతా.
జ్ఞానము కావలసినప్పుడు:- యాకో. 1:5; 1రాజు. 3:9-12; సామె. 2:6.
బీదలకు:- మత్త. 6:31.
ఆపదలో నున్నవారికి:- కీర్తన. 3:4-19; 50:15.
శోధన కాలమందు ఇది శోధనకాలమని గ్రహించి పడేకాలము గదా! అని తెలిసికొని స్థిరముగా నిలువబడవలెను.
- 1. మీరు గొర్రెలవలె చెదిరిపోదురు అని ప్రభువు తన శిష్యులతో ముందే చెప్పెను. ప్రభువు పట్టబడినప్పుడు ఇది నిజముగా నెరవేరినది. ప్రభువు మాట జ్ఞాపకము తెచ్చుకొని, వారు బలము నిమిత్తమై ప్రార్థించి చెదరకుండ నుండవలసినది. ప్రభువు ముందెందుకు తెలియజేసెను? జాగ్రత్తగా నుండుటకే గదా! మనకు కష్టములు తెలిసినప్పుడు మనము వెంటనే మోకరించి బలహీనతలు ఒప్పుకొని నివారణ ప్రార్ధనచేసి, స్తుతించి కష్టమును తొలగింపజేసి కొనవలెను.
- 2. పేతురు తప్పిపోవునని ప్రభువు ముందే తెలియజేసెను అప్పుడు పేతురు ఏమిచేయవలసియుండును. ప్రార్ధన చేయవలసినదే మరియు కోర్టు గుమ్మమువద్ద ప్రభువుయొక్క మాట జ్ఞాపకము చేసికొంటే ఎంత బాగుండును. ఒక భక్తుడిట్లు చెప్పెను - మొదటిమారు కోడికూసేటప్పుడు కూత పేతురుకు వినబడకుండా దయ్యాలు డప్పులు వాయించినవి, ఎంత పరధ్యానము. ఇవన్నియు మనబోధ నిమిత్తమై వ్రాయబడియున్నవి. పూర్వీకులకంటే మనము ఎంత జాగ్రత్తగా నుండవలెను. మీరు శోధనలో పడకుండునట్లు మెళుకువబడి జాగ్రత్తగా నుండండి.
- 3. ఇంగ్లాడులో నొక మహాగొప్ప దైవభక్తుడు తన ప్రసంగమువల్ల అనేకులైన పాపులను ప్రభువుతట్టు త్రిప్పెను గాని తుదకు ఏదో ఒక విషయములో నిరాశపడి బాత్రూములోనికి వెళ్ళి తలుపు వేసికొని స్వహత్య చేసికొనెను అనే కథ విని నీవు జాగ్రత్తపడుము. "ఓ భక్తగ్రేసరా, మెళుకువగా నుండుము, నీవు మరుపు కలిగియుంటే అజాగ్రత్తగా నుంటే, సోమరిపోతువైయుంటే, నిద్రపోతువైయుంటే" పిశాచి నీమీద పడదా!
- 4. క్రీస్తుప్రభువు పరిశుద్దాత్మను పొందిన తర్వాత వెంటనే సైతాను, శోధన ఆరంభమాయెను. గొప్పస్థితిలోనికి వెళ్ళిన తర్వాత శోధించుట అవసరమైయున్నది. ఎందుకంటే నీ గొప్పతనము ఒంటరిగా నుంటేనే గొప్పతనము. శోధన వచ్చేటప్పుడు ఉండేదో, ఊడేదో తెలియును. ఉదా:- క్షయరోగులకు జ్వరము పూర్తిగా పోగానే నడచుటకు సెలవిచ్చెదరు. రెండురోజులు నడచిన తర్వాత జ్వరము వచ్చిన యెడల ఆరోగ్యము స్థిరమైనదికాదని గ్రహించుకొనవలెను.
-
5. సూదంటురాయికి సమీపములో సూదిగాని, ఇనుప ముక్కగాని ఉన్న యెడల లాగబడును. ఎందుకంటే దానిలో ఇనుమును ఆకర్షించే
నైజమున్నది.
మన
హృదయములో నున్న చెడునైజము పిశాచియొక్క శోధనకు త్వరగా లోబడిపోవును. అందుచేతనే మనము క్రీస్తునందు నూతన
సృష్టియైయుండవలయును.
ప్రపంచమంతటన్ గ్రమ్ముపిశాచులేమి చేయున్
మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భీతివేయు
ఈలోకాధిపుడుగ్రుడైనన్ తానేమిచేయు
ఇట్లు లూథరు పాడెను. ఇట్లు శోధనకాలమందు ప్రతి విశ్వాసి పాడవలెను. - 6. యోసేపు శోధనయొద్దకు వచ్చినప్పుడు తాను ఆ శోధన యొద్దకు రాలేదు. కాని ఆ శోధనయొద్దనుండి పారిపోయెను. ఇట్లే అందరు చేయవలెను. దావీదువలె గొప్ప ఆత్మీయులైన అనుభవము లేకపోయినప్పటికి చిన్నప్పుడు నేర్చుకొన్న సంగతులను బట్టి యోసేపు బలముగలవాడై శోధనను జయించెను. యుద్ధములో ఒక దేశమును జయించిన రాజుకంటె యోసేపువంటివాడే గొప్ప జయశాలి, విశ్వాసీ! నీ నైజమును జయించుము. అప్పుడు నీవు యోసేపువలె సింహాసనాసీనుడవైయుందువు.
-
7. యోసేపు పారిపోయెను గాని క్రీస్తుప్రభువు శోధన స్థలములకు ఒంటరిగా వెళ్ళెను, జయించెను. ఇది మరి విచిత్రమైన కార్యము.
ప్రభువు
విషయములో ఒకటి జ్ఞాపకముంచుకొనవలెను. ఆయన శోధన స్థలమునకు దైవాత్మవలన నడిపింపబడెను. ఆయన నైజములో సూదంటిరాయి ఎదుటనున్న
వస్తువుయొక్క స్వభావము వంటి స్వభావములేదు గనుక జయించెను. ముందు మన నైజమును మార్చుకొనవలెను. అలాగే మనలను ఆత్మ
నడిపించుకొని
వెళ్ళితే వెళ్ళవచ్చును. ఒక నిచ్చెనకలదు. దానికి ఏడుమెట్లు, చివరి మెట్టుకు వెళ్ళిపడితే. దెబ్బతగలదా? ఎక్కువ
స్థితిలోనికి
వెళ్ళువారు పడకుండ జాగ్రత్తపడవలెను.
- శోధనలు:- 1. పాపములో పడవేసె శోధనలు,
- 2. నిందల శోధనలు,
- 3. వ్యాధి శోధనలు,
- 4. భీతి శోధనలు,
- 5. చింత శోధనలు ఈ మొదలగు శోధనలు వచ్చేటప్పుడు వాటినన్నిటిని జయించుటకు స్థిరముగా నిలువబడవలెను, గాని వాటిని చూచి బెదరకూడదు, ఇవి వచ్చునని ముందుగానే మనకు తెలియునుగదా! పరలోకము నుండి ఒక దరినుండి శక్తినిపొందుచు, ఒక దరినుండి శోధనలు జయించుచుండవలెను.
- 8. దావీదు దైవజనుడై యుండెను. అయినను ఆయన శోధన కాలమందు పాపముయొక్క సంగతి మరచిపోయి యుండెను. నాతాను ప్రవక్తవచ్చి ఉపమానములుగా దావీదునకు పాపము జ్ఞాపకము చేసినప్పుడు అది జ్ఞాపకము వచ్చెను. అలాగుననే శోధనయందును కొందరు గొప్ప పాపములను గురించి కూడ తలంపక ఏమియు లేనట్లుగా యుందురు. విశ్వాసీ! జాగ్రత్తగ నుండుము. మంచి మనస్సాక్షి కలిగియుండుము. అనగా తప్పుఏదో నీకు తేటగా చెప్పగలిగే మనస్సాక్షిని కలిగియుండుము. పాపమువల్ల మనస్సాక్షి కప్పబడియుండును, అప్పుడు మంచిచెడ్డలు చెప్పుటకు దానికి శక్తియుండదు.
- 9. సొలోమోను దేవుని ధర్మశాస్త్రము తెలిసినవాడైనను అన్యస్త్రీలను వివాహ మాడెను. స్త్రీలయొక్క ప్రేరేవణచేత విగ్రహారాధన పాపములోపడెను. కాబట్టి ఇతరులయొక్క ప్రేరేపణలకు మనము ఒప్పుకొనకూడదు. ఎంతటివారైనను అనగా దావీదు, సొలోమోనులవంటి సజ్జనులైనను పడిపోవుటకలదని జాగ్రత్తపడవలెను, ఈ దిగువ వాక్యములను బాగుగా చదువుకొనుము. 1కొరింథి. 16:13; 1తిమో. 2:15; 3:13, 1కొరింథి. 11:14; 1పేతురు 6:9; 1యోహా. 5:4; ఎఫెసీ. 6:1; కీర్తన. 46:12-52; యాకో. 1:5; 2:12.
-
10. షడ్రకు, మేషకు, అబెద్నెగోలు ఏమి చెప్పియున్నారు, రెండు సంగతులు చెప్పియున్నారు.
- 1. మా దేవుడు అగ్నిగుండము నుండి తప్పించుటకు సమర్దుడైయున్నాడు.
- 2. రక్షింపకపోయినను మేము విగ్రహారాధన చేయము,
- 11. బెల్జియం దేశములో గొప్ప యుద్ధకాలమందు ఒక భక్తిగల స్త్రీ గాయపడినవారికి సహాయము చేయుచుండెను. ఆమెను తుపాకీతో కాల్చివేయుటకు శత్రువులు నిశ్చయించిరి. ప్రభువు భోజనము పుచ్చుకొనేవరకు ఉండుమని చెప్పెను. తరువాత ఆమె ధైర్యముగా వారి ఎదుట నిలువబడెను. వారామెను కాల్చివేసిరి. ఆమె భయపడలేదు. ప్రభువునందు ఆమెకుగల విశ్వాసము ఎంత గొప్పది. అట్టి శ్రమలు మనకు లేకపోయిన థైర్యములేదు, విశ్వాసము లేదు శ్రమలమధ్య విశ్వాసము స్థిరత కలిగియుండుము.
- 12. ఒక మిషనరీ శరాయి గుండా పాముదూరగా ఆయన మనసు చలింపలేదు. వెంటనే కాగితములబుట్ట దగ్గరపెట్టి ఆడించెను. అప్పుడు అది బైటకువచ్చి పడెను. ఆపత్కాలమందు మనోస్థిరత కలిగియుండుట ఎంత ఆశ్చర్యము. హాని కలుగజేసే పామువంటి ఆపదమీద పడినప్పుడు ఓ విశ్వాసీ! నీ విశ్వాసము చంచలములేనిదై యుండగలదా?
- 13. రంగూన్ ట్రెయిన్ బద్దిమీద పిల్లనక్క ట్రైయిన్ దగ్గరకు వచ్చేవరకుండి చప్పున తప్పించుకొనెను. ఓ విశ్వాసీ! తీరా, ఆపద దగ్గర పడేటప్పుడు తప్పించుకొనే చాకచక్యము ఉన్నదా?
- 14. ప్లీడరుగారి ఇంటిలో పన్నెండుమంది దొంగలు పడగా నెమ్మదిగా వారికి తాళపుచెవులు ఇచ్చివేసి మారువేషముతో వారితో కలిసి స్టేషనుకువెళ్ళి స్టేషన్ మాష్టరుతో మాట్లాడి వారు ఎక్కినబండినే ఎక్కి వారిని పోలీసుల కప్పగించెను. ఓ విశ్వాసీ! నీ విశ్వాసము చలనము లేకుండ యుండగలదా?
- 15. బట్లర్ అనేదొర పరమభక్తుడు. క్రీస్తు దేవుడని బుజువుపరచే గ్రంథములనేకములు వ్రాసెను. తుదకు మరణ సమయమున విశ్వాసముపోయెను. సామాన్యమైన పాదిరివచ్చి గద్దించినపుడు మనసు మారెను. శోధన ఎంతటివారినైనను గజగజ లాడించెను.
- 16. సౌలు నిరాశపడి చెడగొట్టుకొనెను. ఆత్మహత్య చేసికొనెను. ఆయన అభిషేకింపబడినవాడే, నలుబది సంవత్సరములు రాజ్యమేలినవాడే దేవుని వలన ఏర్పాటైనవాడే ఆత్మపొందినవాడే. శోధన కాలమందు పడిపోయెను. విశ్వాసీ నీవు ఎంత జాగ్రత్తగా నుండవలెను. నిమిష నిమిషమునకు గండములు గలవు.
- 17. యోనాను చూడుడి. దేవుని పిలుపు పొందినవాడే, నినెవె పట్టణము మారుమనస్సు పొందుటకు మూలకర్తయైన ప్రసంగి. కాని చెట్టునీడ పోయినందున చింతాక్రాంతుడయ్యెను. పరమభక్తుడైనను పడిపోవుట సుళువు. విశ్వాసీ! నీ మాట ఏమి? ఇందులో చెప్పబడిన వారికంటె గొప్పవాడవా?
షరా:- నీవు అనే బోధ నీకు కలదు. ఎంతగొప్పవారు పడిపోయినను నరే నేను పడిపోను అని నిశ్చయించుకొనును. విశ్వాసీ పోరాటమునకు ముందే సైతానుతోటి యుద్ధము చేయకముందే దేవుని వాక్యము బాగుగా నేర్చుకొని ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడుము. తీరా పాపశోధన వచ్చేటప్పుడు సిద్ధపడలేవు.