(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

సమర్పణ



కీర్తన:- నా ఇష్టమిదిగో యిది - నీ ఇష్టముగచేయ - నా ఇష్టమిక కాదది - నా ఇచ్చయున్నట్టి - నా హృదయమిదిగో నీ - కే యియ్యదిరాజ - కీయ సింహాసనమౌ.


అవును తండ్రీ! ఈలాగుచేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. మత్త. 11:26; రోమా. 12:1; 6:13; 2తిమో. 1:12; 1పేతు. 4:19.


ప్రార్ధన:- ఓ తండ్రీ! నీవు నన్ను కలుగజేసినందున నీ ఇష్టప్రకారము చేయపూనుకొనుచున్నావను నా ఇష్టము నీ ఇష్టమునకు సరిపడియుంటే సరి, లేకపోయిన నా ఇష్టమును పూర్తిగా త్రోసివేసి నీ ఇష్టమును నెరవేర్చెదను. నీ ఇష్టము నాకు బయలుపరచబడినప్పుడు అది నాకు ఇష్టము లేకపోయినను సరే, కష్టముగా కనబడినను సరే, ఇష్టపరచుకొని చేసి తీరెదను. నేను పనిచేయు కాలమందు విశ్రాంతి కాలమందును, మెళుకువ సమయమందు, ప్రయాణపు వేళయందును భోజన సమయమందును, చదువుచున్న సమయమందును, విచార పరిస్థితులయందును, జబ్బుగా ఉన్న స్థితియందును, అన్ని స్థలములయందును, అన్నివేళల నీ తలంపుతోనే యుండుటకు అలవాటు చేసికొందును, అనుదినము నీ చిత్తము తెలిసికొనుటకై నీ వాక్య గ్రంథమును పఠించుటకు సహాయము లేకపోయినను సమయము కల్పించుకొని, ఇష్టము కలిగించుకొని, కొద్దికొద్దిగా క్రమము ననుసరించి చదివి తీరెదను. అధమపక్షము దినమునకు ఒక్కసారియైనను నీ సన్నిధిలో నా మనవులు గలిగిన ప్రార్ధనలు చేసితీరెదను. ఆ విధముగానే రోజునకు ఒక గంట నీ సన్నిధిలో మౌనముగా కనిపెట్టుకొనియుండెదను. నా కంటబడే క్రొత్తవానిని గూర్చి వానిని రక్షించుమని ఒక నిమిషము ప్రార్థనచేయ ప్రయత్నించెదను. అజాగ్రత్త, అనాచారము, అపవిత్రత, అజ్ఞానము, అసంతృప్తి, అనాగరికత, అశుభ్రత ఈ మొదలైనవి లేకుండ చూచుకొనెదను. ఈ నా సమర్పణతో కూడిన ప్రార్థన క్రీస్తు యేసు రక్తముతో ముద్రించుమని తండ్రి నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్.


లుబెక్ అనే ఒక పట్టణములో ఒకరాయి దొరికెను. దానిమీద ప్రభువు చెప్పినమాటలు ఉన్నవి. ఏమనగా: నేను బోధకుడనని చెప్పుచున్నారు. సంతోషమే కాని నేను చెప్పినట్లు చేయకపోతే నా తీర్పులు పంపినపుడు నన్నేమియు అనవద్దు సుమా!


ప్రార్థించిన తర్వాత దైవచిత్త ప్రకారము చేయనియెడల నీ సమర్పణకు విలువయుండదు. దిగువ కనుపరచిన అంశముల మీద గాని ఇంకా నీ ఇష్టమువచ్చిన ఏ చిన్న విషయమును గూర్చియైనను ప్రార్ధింపవచ్చును.