(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
ఉపవాస ప్రార్ధనా దీక్ష
ఓ విశ్వాసీ! ఎవరులేని నిశబ్ద స్థలమును, మంచి సమయమును ఏర్పరచుకొనుము. మొదటగా నీవు ఏర్పరచుకొన్న స్థలమునకు వచ్చి నీ గది తలుపులు వేసికొని పరిశుద్ధ గ్రంథములోని క్రొత్త నిబంధనయను భాగములో మొదటి పుస్తకమగు మత్తయి సువార్తలోని 5,6,7 అధ్యాయములు చదువుము.
మానవకోటిని రక్షించుటకై సృష్టికర్తయైన దేవుడు పాపలోకమున, జనన విధానమునకు విరుద్ధముగా నొక కన్యక గర్భమున జన్మించి, రక్షకుడను అర్ధమిచ్చునట్టి యేసు అను బిరుదాంకితుడై, తనయొద్దకు వచ్చిన అనేక వేలమందికి ఒక కొండమీద కూర్చుండి బోధించిన నీతి సూత్రములు ఇందు కలవు.
పై అధ్యాయములలోని విషయములు మన దేశము కొరకు పాటుపడిన గాంధి మహాత్మునికి మిక్కిలి ప్రీతికరము. “నాయొద్దకు వచ్చువానిని నేను ఎంతమాత్రమును బైటికి తోసివేయను” అని యేసుప్రభువు చెప్పెను (యోహాను 6:37).
దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా! (హెబ్రీ. 11:6) ఇట్టి నమ్మిక కలిగిన నీవు మోకరించుము. చేతులు జోడించి కన్నులు మూసికొనుము.
ఎడమచేతి ప్రక్కన:- నీవు తలంచిన చెడుగు, చూచిన చెడుగు, విన్న చెడుగు, మాట్లాడిన చెడుగు, జరిగించిన చెడుగు, చెడ్డకలలు, ఇతరులను గూర్చిన పాపములు, చెడుగను మాటకు సంబంధించి యావత్తు చెత్తచెదారము పడవేసి, వాటిని పూర్తిగా మరచిపొమ్ము.
కుడిచేతి ప్రక్కన:- నీవు చేసిన మంచి చేయవలెనని తలంచిన మంచి, చేయబోవు మంచి, ఇతరులను గూర్చిన మంచి, మంచి సంగతులు బైబిలులోని మంచి, మంచికి సంబంధించిన సమస్తమును వదిలివేసి, ఆ మంచి అంతటిని మరచిపోవలెను.
నీ వీపు వెనుక:- వెనుకటి చెడ్డ, వెనుకటి మంచి అంతా ఆ వెనుకటి సంగతులను మరువుము.
నీ ఎదుట:- “నేను సదాకాలము మీతోకూడా ఉన్నాను” (మత్త. 28:20) అని చెప్పిన క్రీస్తు నీ యెదుట నిలువబడియున్నాడను ధ్యానము మాత్రము కలిగి నీ మనోనేత్రములతో ఆయనను చూచుటకు ప్రయత్నించుము. నీకు కనబడకపోయినను ఆయన నీ యెదుటనే ఉన్నాడని తలంచుము.
నీ ఇంటి విషయములు:- అనగా నీ భార్య, భర్త, బిడ్డలు ఇబ్బంది ఇల్లు, వాకిలి, ఆస్తి సంసార తాపత్రయములు మొదలగునవి జ్ఞాపకమునకు రానీయకుము.
నీ ఒంటి విషయములు:- అనగా శరీరములో నలత, మనసులో కలత, మతి నిబ్బరతనము, నగ, నాణ్యము, ఆకలి, దప్పిక, వస్త్రములు మొదలైనవి మరచిపోవలెను.
నీ వెలువటి విషయములు:- అనగా తండ్రి, తల్లి, బంధువులు, స్నేహితులు, విరోధులు వారి కష్ట నష్టములు మొదలైనవి మనసులోనికి రానీయకుము.
మరియు లోకములోని గతకాల విషయములు నీ కాలములో జరుగుచున్న విషయములు, ఇక ముందునకు జరగబోవునట్టి విషయములు, నీకుగాని దేవునికిగాని, వేటికిగాని సంబంధించిన మంచి విషయములైనను సరే, చెడ్డ విషయములైనను సరే, నీకు కలసివచ్చే వాటి తట్టు ఆకర్షింపనీయకుము.
మనోనిదానపు పని:- దానియేలు, దేవుని యెదుట తన మనస్సు నిబ్బరము చేసికొనినట్లు నీ యెదుట దేవుడు ఉన్నాడనే విషయమును మాత్రమే నీ మనస్సునందును, నీ తలంపునందును, నీ జ్ఞాపకశక్తియందును ఆవరించుకొనియుండనిమ్ము (దాని. 9:3). నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమటకార్చి ఆహారము తిందువు (ఆది. 3:19). ఆదాము ఆహారము నిమిత్తము చెమట కార్చవలసి వచ్చిన రీతినే ప్రార్ధనాది కార్యక్రమమును సాగించుటకై పని బూనిన నీవును ప్రార్థనాంతము వరకు దానియేలువలె మనస్సు నిబ్బరముగా కుదుర్చుకొనుటకు ఆదామువలె చెమటకార్చి కష్టపడవలెను.
“ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్ధనచేయగా ఆయన చెమట, నేలపడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను” (లూకా. 22:44).
మన రక్షకుడును ప్రభువైన క్రీస్తు గెత్సేమనే తోటలో ఉండగా ఆయన శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులతోను దేవాలయపు అధిపతులతోను, పెద్దలతోను వచ్చి ముద్దుపెట్టి అప్పగించుటకు ముందు; పేతురు, యాకోబు, యోహాను ఆయన వెంట పెట్టుకొని వెళ్ళి అర్ధరాత్రివేళ తాను పొందనైయున్న శ్రమ మరణములను తలంచి ప్రార్ధన చేయుచుండగా, తన చెమట రక్తబిందువుల వలె కార్చిన క్రీస్తు నీ ఎదుట ఉన్నాడనే మనో నిబ్బరము కలిగియుండుటకు ఎంతైనను ప్రయాసపడు పని నీదే. దైవ సహాయము కోరుకొనుము. ఈ విద్యను అభ్యసించిన తర్వాత ప్రార్ధన చేయుము. ఫలితము పొందుము. ఇట్టి నిదానము కుదిరిన నీవు తండ్రిని స్తుతించుము.
షరా:- ఫోటో తీయునపుడు లెన్స్ (కెమేరా అద్దము) వైపు చూచునట్లుగా ప్రభువువైపే మనోనిదానముతో చూడవలెను.
స్తుతిప్రార్థన:- సృష్టికర్తవును సర్వశక్తియునుగల ఓ దేవా! తండ్రీ! నా రక్షణకును, నా భక్తికిని ఆధారమైయున్న నీవు నా యెదుట ఉన్నావనే గురి కలిగించి కుదిర్చిన నీ గొప్ప శక్తిని స్మరించి వందనములు చెల్లించుచున్నాను. ఇట్టి దీక్షలో ప్రవేశించు నిమిత్తము కావలసిన స్థలమును అమర్చినావు. ఇందుకు నమస్కారములు. స్థలము మాత్రమేకాదు. కావలసిన సమయమును ప్రసాదించినందుకు నిన్ను స్తుతించుచున్నాను. నా ప్రార్థనా దీక్షను చెరుపుటకై వచ్చు విషయములన్నిటిని ఆపుచేయుటకై వచ్చు నీవు, యోబు చుట్టు కంచె వేసినట్లు నా చుట్టును నీ రక్తమును కంచెగా వేయుమని కోరుచున్నాను. ఈ ఉపవాస దీక్షను ప్రారంభించిన నాయందు మార్పు కలిగించి నూతనమైన అనుభవములో ప్రవేశపెట్టుము. నీ యందు విశ్వాసములో పెంపారునట్లు కృప చూపుము. నీ శిష్యులలో ఒకరైన పేతురు నీ మాట చొప్పున నీళ్ళమీద నడుచుచు, గాలినిచూచి భయపడి మునిగి పోసాగిన రీతిగా నేను నీ గురినుండి తొలగిపోకుండ ప్రార్ధనాంతము వరకు నీవు ఉన్నావను దీక్షతో నడుపుదువని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.
"సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది" యెషయా 6:3. మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనైయున్నాను. లేవి. 19:2; 1పేతు. 1:14-16; 1థెస్స. 4:7.
హృదయము అన్నిటికంటె మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. దానిగ్రహింపగలవాడెవడు? యిర్మి 17:9. (మార్కు 7:21-23).
ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును (యాకోబు 1:14-15). నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగు చున్నదిగాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను (రోమా. 7:18-19).
మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను (యెష. 59:1) పరిశుద్ధ దైవసన్నిధిని మోకరించిన నీవు నీ కోరికను బైలుపరచక ముందే నీ పాపస్థితిని, అయోగ్యతా స్థితిని, ఒప్పుకొని క్షమాపణ భాగ్యమును శుద్ధీకరణానందనమును పొంద ప్రయాసపడుము. కయీనువలె పాపమును తెలిసికొనని మనస్సాక్షిని కలిగియున్నావా? యోసేపు సహోదరులవలెను, దావీదువలెను, యూదా ఇస్కరియోతువలెను పాపమును తెలిసికొనునట్టి మనస్సాక్షిని కలిగియున్నావా? లేక వాతవేయబడిన మనస్సాక్షి కలిగియున్నావా? లేక పాపముచేసి దానిని గూర్చిన తలంపే లేక మరచిపోయి ఉన్నావా? ఆది. 4:13; 50:17; 1సమూ. 24:5; 2సమూ. 12:13; మత్త. 27:3; 1తిమో. 4:3.
ప్రార్ధన:- పరిశుద్దుడువైన దేవా! నా పాపమును నా అయోగ్యతా స్థితిని జ్ఞాపకముచేసి, వాటిని ఒప్పింపచేసి వాటిని విడిచిపెట్టుటకు శక్తినిమ్ము. నీ పరిశుద్దాత్మ సహాయము వలననే ఇట్టి మార్పు నా అంతరంగమున జరిగించుదువని నమ్ముచు యేసుప్రభువు ద్వారా వినయముతో వేడుకొనుచున్నాను. ఆమేన్.
అందుచేత పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఆయనే ఒప్పుకొనజేయును. యోహా. 16:8; ఎజ్రా 9:6, 7:15; కీర్తన. 106:6.
ప్రార్ధనా దీక్ష కార్యక్రమమును సాగించుటకు పనిబూనిన నీవు సమస్త పాపములనుండి విడుదలపొంది, పరిశుద్ధ పరచబడి, ఈ శరీరములో నుండు కాలమునందే మనసానందము పొందుటకును, శరీరేచ్చలమీదను, లోకేచ్చలమీదను, పాపేచ్చల మీదను, సైతానుయొక్క సర్వతంత్రోపాయములమీద, జయము పొందుటకును ప్రార్ధనయొక్క ఫలితమును చూచుటకై నిర్ణయ స్థలమునందు మోకరించియున్న నీవు నీ అంతరంగమును పరీక్షించుకొనుము. ఈ దిగువ వ్రాయబడిన పాపముల జాబితాను చదివి దైవసన్నిధియందు నీ పాపమును ఒప్పుకొనుము. హృదయాంతరంగములను పరీక్షించు దేవుడు నీ సమస్త పాపములను క్షమించి నిన్ను విడిపించుటకై యేసు క్రీస్తుగా తానే కొరత వేయబడి సిలువపై చిందించిన ప్రశస్త రక్తమే నీకాధారమై యున్నది కీర్తన. 51:1-10, 139 అధ్యా.
దుఃఖ భాష్పముల ధ్వని:- నా పాపకార్యముల వలన పరలోకపు తండ్రి మనస్సును ఆయాస పెట్టితిని గదా యని వాటిని ఒప్పుకొను సమయమున నీ హృదయము నిండా వేదనయు, బాధయు కలిగి కన్నీరు కార్చవలయును.
నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగి వేసికొనుము. యిర్మి 4:14
నీ జీవితములో దేవునికంటె ఎక్కువగా దేనిని లేక వేటిని, ఎవరిని తలంచుకొనుచున్నావో లేక ఎంచుకొనుచున్నావో లేక చూచుకొనుచున్నావో లేక ప్రేమించుచున్నావో ఒకసారి దుర్చిణీవేసి పరీక్షించి చూడుము. తల్లిదండ్రులనా, భార్యనా, భర్తనా, బిడ్డలనా, పొలమునా, పంటనా, పశువులనా, పాడినా, ఇంటినా, ఒంటినా, నగలనా, వస్త్రములనా, ఆస్థినా, గౌరవమునా లేక సౌఖ్యమునా దేనిని దేవునికంటె ఎక్కువగా ప్రేమించుచున్నావో!
మరియు ఆకాశములో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాదులను, భూమి, చెట్టు, గంగ, గాలి అను వాటినైనను మన్ను, కర్ర, ఇనుము, ఇత్తడి, రాగి, వెండి, బంగారముతో తయారుచేయబడిన ప్రతిమలనైనను పూజింపరాదు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షులయొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. రోమా 1:23; ఆది. 1:26-28; కీర్తన. 115:4-7; యెష 46:6,7; రోమా. 1:23లో ఉన్నట్లు సృష్టిని ఏలవలసినను మనిషి సృష్టిని పూజించుట చాలా విషాదకరము. ఇది పాపములన్నిటికంటె గొప్ప పాపమని నీకు తోచుటలేదా! దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానిని కిరీటము ధరింపజేసియున్నావు. నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చియున్నావు (కీర్తన. 8:5,6).
ఆపత్కాలమందును, జబ్బుకాలమందును, మరణదశయందును, పంటమొన కాలమందును, విత్తనవెద కాలమందును, పంటకోత కాలమందును, దేవుని సహాయము కోరక, దేవతల పేరున కొబ్బరికాయలు కొట్టుట, కోళ్ళయొక్కయు మేకపోతుల యొక్కయు రక్తము చిందించుట, సంభ్రములు చేయుట, కుంభములు పోయుట, చనిపోయిన పెద్దల పేరున అన్నము పెట్టుటయు, సోదె చెప్పించుకొనుట, శకునములు చూపుట, తిధులు, గడియలు పాటించుట, తురపములు, తావీదులు, రక్షరేకులు, భూతములకు సంబంధించిన దండ కడియములు, పద్ధములు, సాముద్రికము, గారడీ మంత్ర తంత్రములు మొదలైనవి చేయకూడని పనులైయున్నవి. యెష 47:9-15 ప్రక. 21:8 22:15.
బీదలకు ధర్మము చేయుట అను ధర్మబుద్ధి మంచిదేగాని దాని వలన రక్షణ దొరకదు గుళ్ళు, గోపురములు, సత్రములు, వైద్యశాలలు, పాఠశాలలు కట్టించుట ఇవి ఉపకార కార్యములే గాని వీటివలన రక్షణ దొరకదు. దైవ విషయములుండు గ్రంథములు వల్లించి, ధర్మోపదేశము చేయుట, భక్తి మార్గకృత్యములేగాని వీటివలన రక్షణ దొరుకదు. జీవరాసులకు మేతపెట్టుట, ఇది మేలైన పనియేగాని రక్షణ మాత్రము దొరకదు. మహానుభావులను ఆశ్రయించుట, దేవస్థానములను చూచి వచ్చుట, ఏ సత్కారము చేసిన యెడల రక్షణ దొరుకునని తోచునో ఆ సత్కార్యముల వలన రక్షణ దొరుకునని తలంచరాదు. చనిపోయిన వారిపేరున భూదానము, గోదానము, సువర్ణదానము, వస్త్రదానము, అన్నదానము మొదలగునవి జరిగించుట ధర్మకార్యములేగాని మోక్ష సాధనములు కావు. ఇట్టివి చనిపోయిన వారి పేరున దానములిచ్చుట వ్యర్థ కార్యములైయున్నవి. మా నీతి క్రియలన్నియు మురికి గుడ్డవలెనాయెను (యెష 64:0).
మరియు భక్తిలేకుండ బైబిలు చదువుట, సరదాగా బైబిలు వాక్యములు ఎత్తి మాట్లాడుట, ప్రేమ ఉత్తరములలో బైబిలు వాక్యములు వాడుట, వేడుకకు ఆయన వాక్యము వినుట; ఇవి దేవునికి అనిష్టములు. దెబ్బతగిలినప్పుడు, ఉలికి పడినప్పుడు, ఆవలింతలు వచ్చినప్పుడు, ఆశ్చర్యకరమైన సంగతులు, విచారకరమైన సంగతులు చెప్పుకొన్నప్పుడు మరియు వినునప్పుడు అలవాటును బట్టి దేవునిపేరెత్తుట దేవదూషణయై యున్నది. గనుక ఒప్పుకొని విడిచిపెట్టుము.
కోర్టులలోను, న్యాయసభలలోను, పంచాయితీలలోను దేవుని పేరెత్తి ప్రమాణములు చేయుట, ఉన్నవి లేనట్లుగాను లేనివి ఉన్నట్లుగాను ఒట్టు పెట్టుకొనుట సగము సత్యము సగము అబద్దము పలుకుట, ఇతరులకు కీడు రావలయునని కోరుట, కీడు వచ్చు నిమిత్తము దేవునిని ప్రార్థించుట, వారిని శపించుట తనకు తాను శపించుకొనుట, విరోదుల క్షేమము నిమిత్తమై ప్రార్ధింపకపోవుట; ఇవియు కూడని పనులే (లూకా. 6:27,28).
విశ్రాంతి దినమున పనులు ఎక్కువ కల్పించుకొనుట, ఆరాధనకు ఆలస్యముగా వెళ్ళుట, వెళ్ళినను పరధ్యానము కలిగియుండుట, సగము ఆరాధనలోనుండి వచ్చివేయుట, అసలే ఆరాధనకు వెళ్ళకపోవుట, లోకవార్తలు చెప్పుకొనుట, వార్తా పత్రికలు చదువుట, బైబిలు చదువకపోవుట, ప్రార్ధనలు చేయకపోవుట; ఇవన్నియు విశ్రాంతి దినమును మిరినట్టె. గనుక తప్పు ఒప్పుకొనుము (యెషయా 58:13, 14).
పిల్లలారా! అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినుడి (కొలస్స. 3:20). తల్లిదండ్రులను, పెద్దలను, గౌరవనీయులను, మన్నన చేయకపోవుట, మురాబితనముగా జవాబిచ్చుట, విచ్చల విడిగా తిరుగుట, తల్లిదండ్రులకు కోపము పుట్టించు పనులు చేయుట, కోపము, తాపము, అసూయ, కలహము, వైరము, తిండిబోతుతనము, తిరుగుబోతు తనము, పొగరుబోతు తనము పోకిరితనము, ఓర్వలేనితనము, కసి తీర్చుకొనుట, పగతీర్చుకొను గుణము కలిగియుండుట, తుచ్చబుద్ధి కలిగియుండుట, ఆశా పాతకము, చేసిన పాపమును దాచి పెట్టవలెనను కోరిక, క్రొత్తగా పుట్టిన చంటిబిడ్డ ప్రాణమునైనను, ఇంకను పుట్టని శిశువు ప్రాణమునైనను నిర్మూలముచేయుట, ప్రాణ భంగమునైనను, హానినైనను తెచ్చిపెట్టునట్టి అక్కరమాలిన పనులు చేయుట, ఆయుష్షును తగ్గించు త్రాగుడు అలవాటు కలిగియుండుట, ఇవి ఇతరులకు అబ్బునట్లుగా వారిని ప్రేరేపించుట, ఊపిరాడకుండ పనులు చెప్పి హింసించుట, ఎవరినైనను కష్ట పెట్టుట అనవనరముగా నిన్ను నీవు కష్టపెట్టుకొనుట, ఏక చక్రముగా దుఃఖపడుట, ఇతరులను దుఃఖ పెట్టుట, ఎవరికైనను హాని కలుగునని తెలిసియు చెప్పకపోవుట, కష్టకాలమందు సహాయము చేయు శక్తి కలిగియు సహాయము చేయకపోవుట, గతించిన విషయములను తలంచుకొని మనో వ్యాకులము కలిగి క్షీణించిపోవుట, అనవసరముగా తొందరగొని అపాయములోపడుట, అన్నీనావే అని కల్పించుకొని తనకు తానే కొన్ని చిక్కులు తెచ్చిపెట్టుకొనుట, ఆ చిక్కులవలన మనస్సు చలించి పిచ్చితనముగా తిరుగుట, జబ్బు వచ్చినప్పుడు తగిన చికిత్స చేయించుకొనకపోవుట, అందువలన జబ్బు ముదరబెట్టుకొనుట, అసలు ఏ ఔషము వాడకపోవుట, ఆరోగ్యమునకు సంబంధించిన ఏ ఏ పద్ధతులను అవలంభించకపోవుట, వాటిని నిరాకరించుట, ఇవి నరహత్య పాపములైయున్నవి. ఒప్పుకొని విడిచిపెట్టుము (2కొరింథి. 5:10, 11).
శరీరకార్యములు స్పష్టమైయున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను (గలతీ. 5:19-21). వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయముగలవారును, శాపగ్రస్తులునై యుండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి (2పేతురు 2:14,15).
ఒక స్త్రీని మోహపుచూపులతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును.
మన తలంపులోనికి అపవిత్రతను, చెడు కోరికను రానిచ్చుట, దానిని మనస్సులో పెట్టుకొని మురియుట, దానిని రూపుమాపుటకు ప్రయత్నింపకపోవుట, సరసపుమాటలు, పాటలు, దుర్నీతి కథలు, సిగ్గుమాలిన పరిహాస్యకములు, సంభాషణలు కాని జతలు, మరియు ఇతర పుస్తకములు (నవల్సు), పత్రికలు చదువుట, బూతుబొమ్మలు చూచుట, అవి ఇంటిలో పెట్టుకొనుట, నీతివిడచి పెట్టిన ఆట చూచుట, ఆడుట (సినిమా), అల్లరితో కూడిన ఆటలు మొదలైనవి. దేహము జారత్వము నిమిత్తముకాదు ప్రభువు నిమిత్తమే.
వ్యభిచార కారణమునుబట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు (మత్త. 5:32).
భర్త భార్యను దాసీవలె చూచుట, ఒకరినొకరు నమ్మక పోవుట, వారిలో వారికే పడకపోవుట, ఒకరి కష్టములో ఒకరు పాల్గొనకపోవుట, ఈ మొదలైనవి ఐక్యతకు భంగము కలిగించు పనులు చేయుటకూడ పాపములైయున్నవి.
భార్యలారా! మీ భర్తలకు విధేయులై యుండుడి. ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. భర్తలారా! మీ భార్యలను ప్రేమించుడి. వారిని నిష్టూరపెట్టకుడి (కొలస్స. 3:18).
జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుట ఉన్నది గాని జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు (కొరింథి. 6:18).
మన పొరుగువాని సొమ్మునైనను, సాత్తునైనను దొంగిలించుట, దోపుడు, దొంగతనము, కన్నమువేయుట, దాచిబెట్టినది అపహరించివేయుట, తప్పు పత్రములు పుట్టించుట, చోరీ, ఆస్తిని దాచుట, దొరికిన వస్తువులు దాచుకొనుట, అరువు తెచ్చుకొన్నవి మరల ఇవ్వకుండుట, పన్ను తప్పించుకొనుట, అప్పు తీర్చకుండుట, పని ఉన్నను బద్దకించి చేయకుండుట, పనిచేయు శక్తి ఉండియు బిక్షమెత్తుకొనుట, పందెములు వేయుట, జూదమాడుట, లాటరీ, మరియు చీట్లువేయుట, లంచములు పుచ్చుకొనుట, అక్కరమాలిన వ్యాజ్యములలో తిరుగుట, ఇతరుల వ్యాపారములలో పనిచేసి పెట్టుటయందు అశ్రద్ధగా ఉండుట, టిక్కెట్లు కొనకుండ బండ్లలో ప్రయాణముచేయుట, పని నమ్మకముగా చేయకపోవుట, కష్టమునకు తగిన జీతమియ్యకుండుట, ఇతరుల ఇబ్బంది సమయము కనిపెట్టి సరుకెక్కువ ధరకు అమ్ముట, ఎక్కువ వడ్డీ కట్టుట, సరకులలో ఏదైనా కలుపుట, సిసలుకాని పిచ్చపడులతో కొలచుట, తమ పశువులను ఇతరుల చేలలోనికి తోలుట, సరిహద్దు రాళ్ళను తీసివేయుట, చేలగట్టు దున్నుకొనుట, దురాశ, దూబరితనము కూడదు (ద్వితీ. 16:19,20; 6:10) ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము (1తిమో. 6:10). ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవుని కిష్టమైనవి (హెబ్రీ. 13:6).
ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి (కొలస్స. 3:9). పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయన కిష్టులు (సామె. 12:22). చెడ్డమాటలు పలుకకుండను నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము (కీర్త. 34:13) మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతిమాటను గూర్చియు విమర్శ దినమున లెక్కచెప్పవలసియుండును (మత్త. 12:36).
పైకి స్నేహితునివలె నటించుచు ఒకరిని పట్టి ఇచ్చుట న్యాయసభవారుగాని, తల్లిదండ్రులుగాని, సంగతి తెలిసికొను హక్కుగల మరియెవరుగాని, నిజస్థితినిగూర్చి మనలనడిగినప్పుడు వారినిగూర్చి మనకు తెలిసినదంతయు దాపరికము లేకుండ చెప్పకపోవుట, కొండెగాడై తిరుగులాడుట, లేనిపోని వదంతులు పుట్టించుట, ఒకరి మంచిపేరు చెడగొట్టుట, అందుకు ప్రయాసపడుట, మన పొరుగువాడు చేయు దానినిగూర్చి మంచిభావము కలిగియుండక పోవుట, పెడర్ధము చేసికొనుట, లేనిపోని ఊహలు, అనవసరమైన తలంపులు కలిగియుండుట, ఇవన్నియు పాపములైయున్నవి మన పొరుగువాని గురించి మంచి మాటలాడ లేనియెడల, ఎంతో అంత అవసరమైతేనే తప్ప అతని గొడవ ఎత్తకుండుటయే మంచిది.
మన పారుగువానికి కలిగినది మనకున్న యెడల బాగుండుననుకొనుట యుక్తి, టక్కు మోసము, తంత్రోపాయముల వలన మన పొరుగు వానికి కలిగినది సంపాదింప ప్రయత్నించుట, అట్టి కోరిక కలిగియుండుట, దేవుని దృష్టికి న్యాయముగా ఉండక పోయినను మనుష్యులు కల్పించిన చట్టములచేత అన్యాయము న్యాయమని సాధించి, దాని నాకయించు కొనుగోరుట, మన పొరుగువాని భార్యనైనను అతని సేవకులనైనను, పశువులనైనను లాలన చేసికొని, ఇచ్చకము లాడికాని అబద్ధము చెప్పిగాని, బలవంతము చేసికొనిగాని విడదీయుట, దూరపరచుట, ఇవి కూడని పనులైయున్నవి (నిర్గ 20:1-17).
మరియు అలుగుట, గొణుగుట, చెలగుట, ముక్కుట, మూల్గుట, మంకుట, జంకుట, కంకుట, చిరబొరలాడుట, చిందెలు ద్రొక్కుట, గప్పాలు గొట్టుట, చింత, చివుకు, చిరాకు, గిరాకు, పరాకు, తంటాల మారితనము, పిసినారితనము, సిగ్గుమాలిన తనము, సోమరితనము, పెంకితనము, మంకుతనము, వేళాకోళము, వెక్కిరింతలు, కత్తిపోటులవంటి మాటలు పలుకుట, మరియు మనస్సును ఆయాసపరచునవి మనస్సును చెరుపునట్టి విషయములను పదేపదే తలంచుకొనుట, మొక్కనుండి కత్రుంచిన పుష్పము రీతిని కష్టనష్టములకు త్వరగా వాడిపోవుట, అందువలన దేవుని పోలికగా సృష్టించిన మనిషిని దూషించుట, శ్రమలకు శోధనకు ఇరులు ఇబ్బందులకు నలిగి అలిగి దేవునిమీదనున్న మంచి అభిప్రాయమునుండి తొలగిపోవుట, మరియు వాటివలన అరగి కరగి వారిమీద, వీరిమీద సబబు సందర్భము లేకుండ రుసరుసమంటూ, పగబట్టిన తాచువలె బుసగొట్టుచు పొరలు గ్రమ్మిన సర్పరీతిని, కన్నుమిన్ను గానకుండ చిన్న, పెద్దకానక, గురువు దైవము అనక, చెలాం చిందెలు ద్రొక్కుచు, తిరిగులాడుట పాపమని నీకు తోచుటలేదా? వీటిని దైవ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుము (ఎఫెసి. 4:31).
సందేహము:- అనగా అవిశ్వాసము, వెనుకాడుట, ఇది నిజమా! అని అనుమానించుట, మోక్షనరకమనునవి నిజమా! అని అనుమానపడుట పాపమే గనుక వీటిని ఒప్పుకొని వాటినుండి తప్పుకొనుము.
అనిశ్చయము:- బైబిలు సంగతులు అందరు అన్ని విధములుగా బోధించుచున్నందున ఎవరిబోధ నిజమో నిశ్చయము తెలియని స్థితి కలిగియుండుట, అది నెరవేరలేదు అను చింత కలిగియుండుట, అది లేదు ఇదిలేదు, దానికి కొరత దీనికి కొరత అని అనుకొనుట, తృప్తిలేకపోవుట, ఇట్టి 'పేద అరుపులు' కూడ పాపమునకు సంబంధించినవే. మరియు చిరచిరలాడుట, నిష్కారణ కోపము, మందస్థితి కలిగియుండుట, మతబోధ విన్నప్పుడు పాప స్థితిని తెలిసికొనియు నిర్లక్ష్యముగా నుండుట పాపమువల్ల కష్టములు, మరణము, నరకము అని విన్నప్పటికిని లెక్కలేకుండుట, మోక్షములో మహిమ ఉన్నదని విన్నను ఆశలేకుండుట, ఎన్ని తప్పులు చేసినను దేవుడు క్షమించునుగదా! అనుకొని విచ్చలవిడిగా తిరుగుట, అనగా కృపను లోకువ కట్టుట, నెరవేర్చవలసిన విధులను నెరవేర్చకుండుట, పొందినమేలు గుర్తెరిగి ఉపకారులను మరచుట, దేవునియెడల కృతజ్ఞతలేకుండుట, మోసము చేయవలెననియు, మరియు అబద్ధమాడవలెననియు దంద్వార్ధముగా మాటలాడుట ఇవి దేవునికి అనిష్టములైయున్నవి. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను, బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను (యోబు 42:6). వీటిని ఒప్పుకొని విడుదల పొందుటకై ప్రభువును రక్షకుడునైన క్రీస్తు పాదములు పట్టుకొనుము. క్రీస్తుయొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధిచేయును (హెబ్రీ. 9:14).