(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
దైవ ప్రార్ధన చేయవలసిన క్రమము
నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనియు, అడుగుడి మీకియ్యబడును అనియు యేసుప్రభువు చెప్పుచున్నాడు. యోహాను 14:14, మత్తయి 7:7.
- 1. మనోనిదానము:- నీ గదిలోనికివెళ్ళి ఏకాంతస్థలమందు ప్రభువు సన్నిధిలో మోకరించి ఆయనను మాత్రమే తలంచుకొనవలెను, మంచివాటినిగాని, చెడ్డవాటినిగాని తలంపులోనికి రానీయకూడదు. వచ్చినయెడల విసర్జింపవలెను.
- 2. నమస్కారము:- ఇట్లు చేసినప్పుడు యేసుప్రభువు నీయెదుట నున్నాడనియు, నీ ప్రార్ధన వినుటకు వచ్చినాడనియు నమ్మి ఆయనకు నమస్కరింపవలయును, అధికారిగాని, స్నేహితుడుగాని గనబడినప్పుడు వందనము చేయుదువుగదా! ప్రభువు వచ్చినపుడు ఆయనకు యొందుకు నమస్కారముచేయకూడదు?
- 3. పాపపుటొప్పుదల:- తలంపులోను, మాటలోను, యత్నములోను క్రియలోనున్న పొరబాట్లు ఒప్పుకొనవలెను. దేవునికిని, మనుష్యులకును, నీకును విరోధముగా చేసిన తప్పులొప్పుకొనవలెను. మరియు జీవరాసులయెడల చూపిన నిర్దయ యను తప్పుకూడ ఒప్పుకొనవలెను. మరియు తత్పూర్వమే మరియొక తప్పు ఒప్పుకొనవలెను. అది యేదనిన, నీవు యెవరి మనస్సయిన నొప్పించినయెడల ఆ మనుష్యునియొద్దకు వెళ్ళలేకయుత్తరము వ్రాసి ఒప్పుకొనవలెను. ఎవరిమీదనైన చాడిచెప్పిన ఒప్పుకొనవలెను. ఒప్పుకొనినప్పుడు మనసులో వేదనయుండకపోయినయెడల అది నిజమైన ఒప్పుదల కాదు, వస్తువులను సరిగవాడక పోవుటకూడ నేరమే.
- 4. తీర్మానము:- ప్రభువా! నాలో యిదివరకున్న పొరబాటును యికమీదట చేయను. నాకు తెలిసిన యేపొరబాటును చేయను చేయకుండునట్లు ప్రయత్నింతును అని ప్రభువునెదుట తీర్మానించుకొనవలెను.
- 5. సమర్పణ:- ప్రభువా! నీవునాకిచ్చిన శరీరము, ఆత్మ, యింటిలోని వస్తువులు, ధనము, ఉద్యోగము, పొలము, పశువులు, సమస్తము నీకు సమర్పించుచు, కాపుదల నిమిత్తమై నీ స్వాధీనము చేయుచున్నాను.
- 6. మొదటి స్తుతి:- గడచిన కాలమందు ప్రభువు చేసిన గండముల నిమిత్తమై స్తుతింపవలయును.
- 7. రెండవ స్తుతి:- గడచిన కాలమందు ప్రభువు చేసిన ఉపకారము నిమిత్తమై స్తుతింపవలయును.
- 8. అంశ ప్రార్ధన:- ఇప్పుడు నీవు చేయవలసిన ప్రార్ధనలు చేయవచ్చును. అనేక అంశములున్న యెడల పట్టునకొక యంశమును గూర్చి ప్రార్థన చేయుట మంచిది. ఎట్లనగా ఒకనాడు స్వస్థత కావలెననియు, రెండవనాడు అప్పు తీర్చుమనియు, మూడవనాడు బిడ్డలు కావాలనియు, నాల్లవనాడు యితరులనందరిని కాపాడు మనియు ఐదవనాడు భక్తి స్థిరపర్చుమనియు ప్రార్ధింపవచ్చును. ఇవిగాక నీకిష్టమువచ్చిన యంశములన్నిటిని గురించి ప్రార్ధింపవచ్చును అన్నియుకలిపి చేయవచ్చును లేక వేరు వేరుగా చేయవచ్చును.
- 9. మూడవ స్తుతి:- ప్రభువా! ఎనిమిది మారులు నీతో మాట్లాడుటకు సెలవిచ్చినావు గనుక నీకు వందనములు అని చెప్పవలెను.
- 10. కనిపెట్టుట:- ప్రభువా! నేను నీకు చెప్పుకొనవలసినవి చెప్పుకొంటిని ఇప్పుడు నీవు నాకు చెప్పవలసినది చెప్పుము నేను విందును, నీవు చెప్పినట్లు నేను చేయుదును అని ప్రార్ధింపవలయును. తరువాత ప్రభువు నీ మనస్సులో తలంపులు, జవాబుగా పుట్టించువరకు మోకాళ్ళమీదనే యుండవలయును. ఆయన నీకు కనబడువరకుగాని నీతో స్పష్టముగా మాట్లాడువరకు గాని, మోకాళ్ళమీదనే యుండవచ్చును. తరువాత వందనములు చేసి ఆమేన్ చెప్పి ముగింపవచ్చును. ఈ క్రమము కాక నీ యిష్టము వచ్చిన క్రమము కూడ ఏర్పరచుకొనవచ్చును.