(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

క్రీస్తుప్రభువు విషయము



1తిమో. 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది.


దేవుడు నరావతారమెత్తి లోకైక రక్షకుడు అని యర్ధమిచ్చు యేసుక్రీస్తు అను నామమున ప్రసిద్ధికెక్కెను. తన ప్రభావము వలన రోగులను స్వస్థపర్చెను. ఆకలిగొన్న వారికి ఆహారమును కల్పించెను. ఆపదలో నున్నవారిని విడిపించెను. భూతపీడితులను రక్షించెను. పాపులకు క్షమాపణ నిచ్చెను. మృతులను కొందరిని బ్రతికించెను. సాతానును, పాపములను, పాపపలితములగు వ్యాధులను, యిబ్బందులను, మరణములను జయించెను. మరియు లోక పాపభారమును తనమీద వేసికొనెను గనుక మరణము పొందవలసి వచ్చెను. అయినను బ్రతికి ఆరోహణమాయెను. ఆయన గొప్ప జయశాలి గనుక మనకన్నిటిలో జయము కలిగింపగలడు. ఆయన త్వరలోనే వచ్చి, నమ్మినవారిని చావులేకుండా మోక్షమునకు తీసుకొని వెళ్ళును. చావులేకుండా మోక్షమునకు వెళ్ళగోరువారు పాప విసర్జన చేసి సిద్ధపడండి.


మనుష్యుని కుమారుడు మనుష్యుడేగదా! అలాగే దేవుని కుమారుడు దేవుడే గదా! యేసుక్రీస్తు దేవుని కుమారుడని వ్రాయబడి యున్నది గనుక ఆయన దేవుడే! ఇది మార్చలేము. క్రీస్తుప్రభువు ప్రవక్త మాత్రమే అయియున్నాడని కొందరు నొక్కి చెప్పుచున్నారు. అలాగైనయెడల ఆయన చెప్పినమాటలన్నియు యెందుకు నమ్మకూడదు? మత్తయి, మార్కు లూకా, యోహాను అను భక్తులు వ్రాసిన సువార్త పుస్తకములో ఆయన మాటలున్నవి. ప్రవక్త అనగా యెవరు? గతకాలములో జరిగిన విషయములు యొత్తి చూపించ గలవాడు, నవీనకాలమందు జరుగుచున్న విషయములను యెత్తి బోధించువాడు: ఇకముందునకు రానైయున్న విషయములనెత్తి ప్రవచించువాడు, గొప్ప బోధకుడు గొప్ప బోధకుడే ప్రవక్త. క్రీస్తు అందరికంటే గొప్ప మానవుడు అందరికంటే గొప్ప దేవకుమారుడు. అందరికంటే గొప్ప బోధకుడు. అందరికంటే గొప్ప ప్రవక్త, అందరికంటే గొప్ప పాపపరిహారకుడు, అందరికంటే గొప్ప వైద్యుడు అందరికంటే పోషకుడు. అందరి కంటే గొప్ప భూతపీడితుల విమోచకుడు అందరికంటే గొప్ప పునరుత్థానదాయకుడు. అందరికంటే గొప్ప మార్గదర్శి. అందరికంటే గొప్ప ఆరోహణ ప్రభువు. అందరికంటే అన్నిటిలోను యెక్కువ గనుక ఆయనను ఆశ్రయించినపుడే మనకుపకారము గలుగును. చూడండి! ఆయన బోధవలన యిప్పుడన్ని దేశములలో క్రైస్తవులున్నారు. వారు బైబిలు గ్రంథమును బోధించుచున్నారు. మనుష్యుని ఆత్మ యెంత విలువైనది; కానియెడల ఆయన నరుడై కర్ణకఠోరమైన శ్రమల ననుభవింవనేల అట్లనుభవించుటకు దేవునికేమి పట్టినది.