(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

ప్రశ్నోత్తరములు



1. దేవుడు లేడనియు, ఉన్నయెడల ఆయనను యెవరు కలుగజేసిరనియు కొందరనుచున్నారు మీరేమందురు?


జ: ఆకాశము, భూమి, అన్నిలోకములు వాటియంతట అవే కలిగినవి అని తలంచువారు దేవుడు కూడి తనంతటతానే కలిగెనని యెందుకు అనుకొనకూడదు.


2. ఉన్నయెడల యెందుకు కనబడడు?


జ: ఆయనతత్త్వము కనబడకుండునట్టి నిరాకారము వస్తువుయొక్క తత్వము కనబడునట్టి ఆకారము దేవుని తత్త్వము, వస్తువునకు లేదు. వస్తువు తత్వము దేవునికి లేదు. ఈ ప్రశ్న వేయువారు వస్తువునకు యెందుకు నిరాకార తత్వములేదు అని అడుగరు? మన తలంపులు మనకు కనబడవుగదా! కనబడనంత మాత్రమున లేవు అని చెప్పవచ్చునా?


3. క్రీస్తును గురించి తెలియనివారు గలరు. తెలిసియు నమ్మనివారు గలరు. వారి గతియేమి? అట్లే యితర మతముల సంగతి యేమి?


జ: క్రీస్తు దేవుడును, మనుష్యుడును గనుక తాను కలుగజేసిన యే మనిషిని, యే మతస్థుని విడిచిపెట్టడు. రక్షింపబడుటకు అందరికిని సమయమిచ్చును. నాకు మోక్షము దొరకదేమో యని యెవరును సందేహింపనక్కరలేదు. ఆయనను ప్రార్థించండి. ప్రార్థించి నమ్మినయెడల మార్గము సరాళమగును.


4. క్రీస్తు దేవుడని యెందుకు చెప్పుచున్నారు?


జ: ఆయన దేవుడు అని బైబిలు చెప్పుచున్నది.
రోమా. 9:4,5 - “వీరు ఇశ్రాయేలీయులు స్వీకృత పుత్రత్వమును, మహిమయు, నిబంధనలును, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచా రాదులును, వాగ్ధానములును వీరివి. పితరులు వీరివారు. క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు” ఆమేన్.
తీతు 2:12,13 “మనము భక్తిహీనతను, యిహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రధమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత నిమిత్తమై యెదురుచూచుచు యీ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది”.


5. క్రైస్తవేతర మతమువల్ల యేదియు ప్రయోజనములేదా?


జ: సమస్తమును కలుగజేసిన క్రీస్తు మూలముగ లోకమున ప్రకటనయగుచున్న రక్షణ మార్గములోనికి చేరుకొను మార్గము ఒకటే. అన్ని మతములలో ఆ మార్గము కానరాదు దేవుని తలంపులేని మతములేదు.


6. నాస్తికులు దేవుడు లేడనుచున్నారుగదా


జ: వారిని గురించి అందరును అట్లే అనుకొనుచున్నారు. వారి మనస్సులో యేమున్నది మీకు తెలియునా? “దేవుడు ఉన్నట్లు మాకు యొవ్వరైనా బుజువు పరచినయెడల నమ్ముదుము” అని వారిమనస్సులోనున్నది కనుగొనండి. తాను ఉన్నట్లు తెలియని స్థితి దేవుడు మానవునిలో పెట్టలేదు. అట్లే తానును క్రీస్తుగా అవతరించిన విషయము అర్ధముకాన్నట్టుగా వ్రాయింపలేదు. 1తిమో 1:15 “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెననువాక్యము నమ్మదగినదియు పూర్జాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. చూచినారా! క్రీస్తుచరిత్ర! నమ్మతగినది, అంగీకరించుటకు తగినది అని యీ వచనమువల్ల కనబడుచున్నది.


7. క్రీస్తు మతము ఈ మధ్యనే వచ్చినది గదా?


జ: సృష్టాదిలో యిన్ని మతములునులేవు, ఇన్ని మిషనులును లేవు, ఇన్ని కులములును లేవు. ఇన్ని భేదములును లేవు. చివరకు అన్నియు ఒకటేయగును. ఎందుకనిన ఆదిలో ఒకటియే, అదే చివరకూడ ఉండును. క్రీస్తుమతము యీ మధ్య అనగా రెండువేల యేండ్ల క్రిందట ప్రత్యక్షమైన సంగతి నిజమేగాని అదివరకు అది ప్రవచన రూపములో నున్నది. సృష్ట్యాది వాగ్థానములో నున్నది తత్పూర్వము దేవుని అంతరంగములో నున్నది. ఈ మధ్యనే వచ్చిన ఇంజక్షన్ , ఎక్స్ రే మొదలైనవి మనకక్కరలేదా! ఈ మధ్యను వచ్చినవి యక్కరలేని వారుందురా? క్రీస్తు అందరిని పిలుచుచున్నాడు గనుక క్రీస్తుమత మందరి మతము. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైన వారలారా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును” మత్తయి 11:28. నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను యోహాను 6:37 చూడండి! క్రీస్తు పిలుచుటలో నెవరినైన విడిచిపెట్టెనా? మొదటి వచనములో క్రీస్తు స్వయముగా పిలుచుచున్నాడు. రెండవ వచనములో మనుష్యుడు తన “మనస్సాక్షి బోధవిని వచ్చుచున్నాడు గనుక క్రీస్తు చేర్చుకొనును.


8. క్రీస్తే రక్షకుడని యెందుకు చెప్పుచున్నారు?


జ: బైబిలులో నున్నది గనుక మరి యెవని వలనను రక్షణ కలుగదు “ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో యివ్వబడిన మరియే నామమున రక్షణ పొందలేము.” అపో. 4:12. క్రీస్తే రక్షకుడనియు, ఆయన అందరిని పిలుచుచున్నాడనియు బైబిలులో నున్నది. గనుక అందరును సంతోషించవలసినదే. ఆయనవలె రక్షింపగల రక్షకులున్నారని నమ్మువారు, రక్షణపొందిన తరువాత యెవరడ్డుపెట్టగలరు! ఎవరివలననైన రక్షణ పొందినయెడల మంచిదేగదా! దేవుడు మీకు మరియొక రక్షకుని చూపువరకు మీరక్షకుని విషయమైన నమ్మికలోనే నిలచి యుండవలెను. దిగులు పడకండి తండ్రియైన దేవునియెడల అపనమ్మిక రానీయకండి, సంతోషముతో మోక్ష ప్రవేశము కొరకు నిరీక్షించండి. గొప్ప విషయములు కొన్ని నేర్చుకొన్నవారు యింకను యెక్కువ విషయములు నేర్చుకొనవలెనని యత్నింతురు. ఈ ప్రయత్నము మత సంఘస్థులలోను, లౌకికులలోను కనబడుచున్నది. “అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును” మత్తయి 7:7.


9. బాప్తీస్మము పొందితేనేగాని మోక్షము లేదని యెందుకను చున్నారు?


జ: యేసుప్రభువు చెప్పుచున్నమాట వినండి “మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తీస్మము పొందినవారు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును” మార్కు 16:15-16. దీనికి ఒక మినహాయింపు గలదు. వినండి అమెరికాలో లూథరను సంఘముయొక్క గ్రంథకర్తయగు జోసెఫ్ స్టంపు దొరగారు తన ప్రశ్నోత్తరిలో యిట్లు వ్రాయుచున్నాడు. “బాప్తిస్మమును యెవరు తృణీకరించి, పొందనిష్టపడరో వారికి రక్షణ లేనేలేదు. అయితే బాప్తీస్మము కావలెననికోరియు, పొంద వీలులేనివారికి, పొందని హేతువుచేత నాశనము కలుగదు. బాప్తిస్మము పొందక పోవుటవలన కాదుగాని బాప్తీస్మమును తృణీకరించుటవలననే నాశన శిక్ష గలుగును” నమ్మికలేని బాప్తీస్మమువల్ల యేమి మేలు?


10. అందరును అన్ని విధముల బోధించుచున్నారు. గనుక శాంతి కలుగదు గదా?


జ: నిత్యమును క్రీస్తును తలంచుకొనిన శాంతి కలుగును ఇది సుళువైన సూత్రము.