(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
12. సన్నిధి వాక్యములు
- 1. “నాయొద్దకు వచ్చువానిని నేను ఎంతమాత్రము బైటికి త్రోసివేయను” యోహాను. 6:37 అని యేసుప్రభువు చెప్పెను.
- 2. “అడుగుడి మీకియ్యబడును” మత్త. 7:7.
- 3. “ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడవి మీకు కలుగును” మార్కు 11:24. అని క్రీస్తు పలికను.
- 4. “నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపువేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి ప్రతి ఫలమిచ్చును నీకు” మత్త. 6:6.
- 5. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱ పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా! ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. లూకా. 18:7,8.
- 6. తన న్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుకదీయక మనమందరి కొరకు ఆయనను అప్పగించినాడు. ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. రోమా. 8:32.
- 7. ఆత్మయు మన దౌర్భల్యము చూచి సహాయము చేయుచున్నాడు.
- ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్ధన చేయవలెనో మనకు తెలియదు. గాని ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మతానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు (రోమా. 8:26).
- 8. "దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పనము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము" రోమా. 8:28 అని పౌలు చెప్పుచున్నాడు.
- 9. నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్పలము కానేరదనియు, నేనిప్పుడు తెలిసికొంటిని. యోబు. 42:2 అని యోబు చెప్పెను.
- 10. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకసాధ్యమైనది ఏదైనా యుండునా! యిర్మియా 32:27 అని దేవుడు చెప్పుచున్నాడు.
- 11. ఇది మనుష్యులకు అసాధ్యమేకాని దేవునికి సమస్తము సాధ్యము. మత్త. 19:26 అని ప్రభువు చెప్పెను.
- 12. నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను. 14:14 అని రక్షకుడు చెప్పెను.
- 13. మనలోకార్య సాధనమైన తనశక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటెను ఊహించు వాటన్నిటి కంటెను, అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక! ఆమేన్ (ఎఫెసీ. 3:21) అని పౌలు వ్రాసెను.
- 14. సమస్తమును మీవి (1కొరింథి. 3:21) అని పౌలు చెప్పుచున్నాడు. దేనినిగూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్ధన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి (ఫిలిప్పీ. 4:6).
“మనము చూడనిదానికొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.” రోమా. 8:25.
ప్రభువిచ్చిన వర్తమానము:- నా ప్రియబిడ్డలారా! లోకములో శాంతి, సమాధానములు లేవు. కాబట్టి మీకు అట్టి ధన్యత కలుగుటకు సన్నిధిని ఇచ్చితిని. ఇది విశ్వాసులకు ప్రత్యేకమైన మేలును, కృపయై యున్నది.
-
1. నిజ సన్నిధి సభ్యుల లక్షణములు:-
- 1. ఇతరుల పాపముల గూర్చి సంభాషించుకొనక తన పాపములు దేవునియెదుట ఒప్పుకొనెడివారు.
- 2. సత్ ప్రవర్తన కలిగి యుండెడివారు.
- 3. తమ ఇష్టమునకు చోటు ఇవ్వక దేవుని చిత్తమునకై తృష్ణ గొని యుండెడివారు.
- 4 దేవునియొక్క దివ్య లక్షణములను ధరించుకొనువారు. దేవుడు సమర్ధుడు గనుక తమకు వచ్చు కష్టనష్టములను సమర్ధించుకొనువారు.
- 5. ఐక్యత కలిగి అంతకంతకు అభివృద్ధిని కోరుచుండవలెనుగాని పోటీగా పనిచేయక ఇతరులను వృద్ధిలోనికి తీసికొని వచ్చెడివారు.
- 6. ఒకరు పాపములో పడవలెనని కొరిక యుండనివారు.
- 7. తమ సొంత తోటవలె ఇతరుల తోటలు ఎదుగవలెనని కోరెడివారు.
- 8. పొరుగువారిని ప్రేమించెడివారు.
-
2. సన్నిధి లక్షణములు:-
- 1. నిష్కపటమైన సన్నిధి
- 2. నిష్కళంకమైన సన్నిధి.
- 3. నిందారహితమైన సన్నిధి యుండవలెను.
- 4 నిధిగలదై యుండవలెను.
- 5. కృషిచేయునదైయుండవలెను.
- 6. ఐక్యతగలదై యుండవలెను.
- 7. ఐశ్వర్యముగలదై యుండవలెను.
- 8. శాంతి సమాధానములు గలదై యుండవలెను.
- 9. వృద్ధికోరునదై యుండవలెను.
- 10. అనుభవముకలదై యుండవలెను.
- 11 సాగిపోవునదైయుండవలెను.
- 12. సంతోషించునదై యుండవలెను.
- 13. సందేహము లేనిదై యుండవలెను.
- 14 సంతుష్టిగల సన్నిధి.
- 15. సమృద్ధిగల సన్నిధి
- 16. సౌందర్యముగల సన్నిధి
- 17. సాఖ్యమిచ్చ సన్నిధి.
- 18. ప్రతి దానిని సాధించే సన్నిధి.
- 19. తనను సాగగొట్టె సన్నిధి.
- 20. శక్తితో నిండిపోయే సన్నిధి.
- 21. మహోపకార సన్నిధి.
- 22. రుచిగల సన్నిధి.
- 23. సుఖించే సన్నిధి.
- 24 నీతిగలిగిన సన్నిధి.
- 25. సుబోధలిచ్చె సన్నిధి.
- 26. సువిశేష సన్నిధి.
- 27. సూర్యోదయ సన్నిధి.
-
28. సువర్త మాన సన్నిధియైయుండవలెను.
ఇట్టిది నా సన్నిధి నా స్వజనుల సన్నిధి. మీరును అట్టి సన్నిధి సభ్యులైయుండుడి.
-
సన్నిధి ప్రయోజనములు:-
- ప్రియబిడ్డలారా! సన్నిధి మీకు
- 1. ఐశ్వర్యదాయకము
- 2. పరలోకసంపద
- 3. దొంగిలింపబడని సంపద.
- 4 శాశ్వతమైన సంపద
- 5. వేరు పారి ఫలించి విస్తరించు సంపద
- 6. బహుగా సంతోషించు సంపద
- 7. సన్నిధి వలన కొత్త వరములను సంపాదించుదురు.
- 8. సన్నిధి వలన యిదివరకు పొందిన వరములను వాడుకోలేక అడుగున పడిపోయిన వరములను వాడుకొనెదరు.
- 9. సన్నిధివలన క్రమము, మర్యాద, చురుకుదనము, శుద్ధి, విశ్వాసము, ధైర్యము పవిత్రత నేర్చుకొనెదరు.
- 10. సన్నిధి వలన అనుదినము కూడుకొనుట నేర్చుకొనెదరు.
- 11. సన్నిధి మర్మములను నేర్పును. మరియు ఐక్యత, ప్రేమ, నీతి, భక్తినలవర్చును.
- 12. దేవునియందు గౌరవము కలిగియుండుట.
- 13. ప్రతి దానికిని దైవ చిత్తమును తెలిసికొనుట.
- 14. సన్నిధి వలన వ్యాధులు, అవస్తలు కొట్టివేయబడును.
- 15. సన్నిధి ఆత్మశుద్ధి, శరీరశుద్ధి, వస్త్రశుద్ధి, వాక్కుశుద్ధి, గృహశుద్ధి, మొదలైన శుద్దులను నేర్పును.
- 16. సన్నిధివలన దేవునితో చనువు ఏర్పడును.
- 17. సన్నిధివలన అన్ని విషయములలో శ్రద్ధగలిగియుందురు.
- 18. సన్నిధివలన మీకు సంపాదన కలుగును.
- 19. సన్నిధివలన పరలోకము యొక్కయు, పరిశుద్దులయొక్కయు, దేవదూతల యొక్కయు, బుషులయొక్కయు, భూలోక పరిశుద్ధుల యొక్కయు సహవాసము దొరుకును.
- 20. సన్నిధివలన కార్యసిద్ధి కలుగును.
- 21. సన్నిధివలన అపోస్తులుల కళల భక్తుల తత్వములను పొందెదరు.
- 22. సన్నిధివలన త్యాగబుద్ధి కలుగును.
- 23. సన్నిధి వలన దేవునితో సహవాసము లభించును.
- 24. సన్నిధి వలన పరలోకము భూలోకము ఏకమగుచున్నది.
- 25. సన్నిధి సంతోషము కలిగించును.
- 26. సన్నిధి పాపములను పరిహారము చేయును.
- 27. సన్నిధి సాతానుయొక్క కట్లను త్రెంపివేయును.
- 28. సన్నిధి సాతాను క్రియలను లయపరచును.
- 29. సన్నిధి సాతానును ఓడించును.
- 30. సన్నిధి సాతానును నలుగగొట్టి ఏడ్పించును
- 31. సన్నిధి సాతానును జయించుటకు శక్తినిచ్చును.
- 32. సన్నిధి సాతానును పూర్తిగా త్రొక్కించును.
- సన్నిధి:- సన్నిధి అనగా నానిధిలో, నారాశిలో, నా సహవాసములో, నా ఏర్పాటులో ఉన్నస్థలము. మీరు నా సన్నిధిలో పరిశుద్దుల లక్షణములు గలిగియుందురు అని ప్రభువు పలుకుచున్నారు. ఇదే మీకు కలుగు ధన్యత. మంచిగాలి, నీరు, ఆహారములను దినదినము సేవించువారు ఆరోగ్యవంతులుగా నుందురు. అట్లే సన్నిధి చేయువారు ఆరోగ్యములను పొందుదురు. కాబట్టి క్రైస్తవ జీవితములో అంతకంటే అంతస్థు లేనేలేదు. నా పాదసన్నిధిలో యుండుటవలన మీ ఆత్మీయ శ్వాసకోశములు విశాలపరచబడుచున్నవి. క్షయరోగి శ్వాసకోశమునకు గాలి, ఇంజక్షను ఎట్లు పనిచేయునో అట్లే నా సన్నిధి ఆత్మీయ శ్వాసకోశమును బలపర్చును. సన్నిధి గాలివలన అస్వస్థతలన్నియు అంతరించును.
మీరు ఆరోగ్యవంతులుగా అంతకంతకు అభివృద్ధి పొందెదరు. మహిమనుండి అధిక మహిమకు సాగిపోవుదురుగాక. “నేను దాగుచోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు” కీర్తన. 32:7. ఈ పత్రికను చదువువారికి, వినువారికి సన్నిధి భాగ్యము కలుగునుగాక. ఆమేన్.