(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

3. సన్నిధి నిబంధన



ఆది. 15:9-21; మత్త, 5:17-20, రోమా. 3:4

ప్రార్థన:- దయానిధివైన తండ్రీ! త్రియేకుడా నీకు వందనములు, ఎందుకనగా ఏనాడు లేని సన్నిధి కూటము నీవు కనిపెట్టి ముఖ్య స్థానముగా చేసినందుకు వందనములు. మేము ఇంతలో శరీరము విడిచి పరలోకానికి రాలేమని పరలోకాన్ని తెచ్చి, మా మధ్య పెట్టినందుకు వందనములు. మేము ఎగిరి రాలేమని నీవే ఎగిరి వచ్చి మాతో మాట్లాడుచున్న నీకృపనుబట్టి నీకు స్తోత్రము. మేము కష్టము అనక కూడుకోవాలేగాని నీవు కొత్త సంగతులే తెస్తూ చెప్పుచున్నావు. ఇన్నాళ్లకు నీ ఏర్పాటు ప్రకారము నెరవేర్చుచున్నందున స్తోత్రములు ఆమేన్.


దైవ సన్నిధి:- అనగా దేవుడు, మనిషి దేవదూతలు ఉండేది. దేవుడు ఉండేది దైవ సన్నిధి, గాని వీరు దైవసంబంధికులే. సన్నిధి అంటే వీరుకూడ ఉంటారు. సన్నిధిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుందురు. కొందరు మన మీటింగునకు వచ్చి ఈలాగున అనగలరు.... ఏది? వారు ముగ్గురున్నారన్నారు? ఏరి? మాకు కనబడుటలేదేమి? ఆ వేదికపైన ఒక నాయకురాలు కనబడుచున్నది. కొందరు నాయకులు కనబడుచున్నారు. మరికొందరు లౌకికులు కనబడుచున్నారు. కాని వారు ముగ్గురు కనబడుటలేదేమి? అని అందురు. అందుకు.....జవాబుగా మనమేమి అనవలెనంటే.... మీరు చూడడములేదేమి ("వారు ఉన్నారు, అదిగో చూడండి") అని అనవలెను. ఇటువంటి సందర్భమునకే సాధు సుందర సింగు దానికేం అన్నారంటే బాగా తేరిచూడండి మా ప్రక్కనే గార్డియన్ ఏంజిల్ (Guardian Angel) ఉన్నాడు, మీరు చూడకపోతే కనబడడు అని అన్నారు. ఈ ప్రశ్ననుబట్టి మనిషి ఎంత అవిశ్వాసియో! ఎంత గుడ్డి మహాత్ముడో! తెలిసికొనవచ్చును. బహిరంగముగా కనబడని దేవుడు మనకు లేడు.


సన్నిధి అనగా దేవుడు ఒక్కడే. సన్నిధి అనగా కూర్చుని కూర్చుని వెళ్ళి పోవడముకాదు. మనిషి దేవునియొద్ద నుండి సమాధానము వచ్చేవరకు ఉండడము అదే సన్నిధి. గనుక మా ఇంటిలో స్థాపించుకుంటే మా ఇంటిలో ఉన్నవారందరు వచ్చేవరకు సన్నిధి ఉండును. సన్నిధి అనగా వేచి ఉండడము, వెళ్ళిపోవడముకాదు, దైవ సన్నిధి మనకు ముందే ఉండును. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉందురో వారి మధ్య ఉంటాను కాదు ఉన్నాను అని అన్నారు. మనము ఎంత త్వరగా సిద్ధపడి సన్నిధికి వెళ్ళి కూర్చున్నప్పటికిని ప్రభువు మనలను చూచి త్వరగా సిద్ధపడలేకపోవుచున్నారనును. మనయొక్క సిద్ధపడటము ఏమోగాని ఆయన ఎదురు చూస్తుంటారు గనుక ప్రభువు మెచ్చే సిద్ధపాటు కలిగియుండవలెను. ఆయన ఏర్పాటు సమయమునకు మనము సిద్ధపడి రాకపోవడము, ప్రతి దానికి ఆలస్యముగా రావడము మనకు చిన్నప్పటినుండి ఇట్టే ఆలస్యము అలవాటైనది.


ఉదా:- బడిపిల్లలు మొదటి గంట అయినదేగాని రెండవ గంట కాలేదు అని ఆలస్యముగా వెళ్లుదురు. అది అలవాటైనది. ఆలాగే గుడికి వెళ్లే భక్తులు మొదటి గంట అయినది రెండవ గంట కాలేదు ఇంకా కీర్తన ఎత్తలేదు అని అనుకొందురు. ఈలాగున మనసొంత మనస్సులో సిద్ధపడము మనకు అలవాటైనది. ఆ అలవాటు సన్నిధి దగ్గరకుకూడా వచ్చును. ఇంతేకాదు. ఇది రాకడ వరకుకూడా వచ్చును. రాకడవరకు ఇట్లే ఉండును. అందుచేత మన సొంత సిద్ధపడుట అనేదానిని తెగ తెంపుచేసికొనవలెను. ఈమధ్య సిద్ధపడకపోవుట అంత గొప్ప నష్టము ఉండకపోయినను, రాకడ సమయములో గొప్ప నష్టము కలుగును. ఆఖరున అట్టి గొప్ప నష్టము కలుగును గనుక జాగ్రత్త సన్నిధికి సమయానికి సిద్ధపడివెళ్ళాలి అనేది, అది శరీరములో లేదు, మనస్సులో ఉన్నది. అది అసలు మనస్సులోనే ఉన్నది, ఆ కిటుకు, ఆలస్యముగా వెళ్ళితే పంతులుగారు లేటు మార్కువేసి సంతకము చేస్తాడు.

ఉదా:- శిష్యులు ప్రభువును నీటిమీద నడచుట చూచి భూతమనుకున్నారు. ఆలాగే భూతమును చూచి ప్రభువు అనుకుంటారు. మనము ఇంతపెద్ద మనుష్యులము! అయినప్పటికీ మన కంటిలో పువ్వుగాని పొరగాని ఉన్నయెడల వస్తువు ఉన్నది ఉన్నట్టుగా కనబడదు. అప్పుడు మోసము కలుగును జాగ్రత్త తరచూ సన్నిధి అనుభవములు నివృత్తి చేసుకొను మనకు మోసము కలుగదు. ఎందుకంటే సందేహమున్నప్పుడు సన్నిధిలో ప్రశ్నించుట మనకు గలదు. గనుక మనము భయపడనక్కరలేదు. శిష్యులకు తప్పు దర్శనము (అర్ధము) అగుట ఎందుకనగా వారి హృదయములో భయమున్నది అందుచేత భయపడిరి. కాబట్టి భక్తులకు భయము పాపముకాకపోయినను పాపమగును. శిష్యులకు ప్రభువునందు అభిమానమున్నప్పటికిని భయపడిరి. శిష్యులకు యేసుప్రభువు శక్తిమంతుడని తెలిసే ఉన్నది. ఆలాగైతే యేసుప్రభువు నీటిమీద నడిచే శక్తిగలవాడని తెలిసి భూతమని ఎందుకు అనుకోవాలి? ఇది ఏలాగున్నదంటే వారికి భూతముయొక్క సంగతులు ఎక్కువ అలవాటు అయినట్టున్నది.


ఒక కథ:- ఒకప్పుడు జపానువారు చైనా దేశము వారిపైకి యుద్ధమునకు వెళ్లినప్పుడు అందరును పారిపోయిరి. ఒక్క క్రైస్తవ కుటుంబములో తల్లిదండ్రి పిల్లలు ప్రార్ధనలో ఉన్నారు, అప్పుడు ఆ వేరే దేశపు యుద్ధదండు నాయకుడు వచ్చి అందరు పారిపోతే మీరెందుకు ఇక్కడున్నారు? అని అడుగగ, వారు మేము క్రీస్తు యొక్క సన్నిధానములో ఉండి ప్రార్ధనచేయుచున్నాము అని ఆ నాయకుని భాషలో జవాబిచ్చెను. అప్పుడు ఆ నాయకుడు ఆ మాటలకు మా భాష నేర్చుకొని ఎన్నాళ్లయినది అని అడిగెను. అప్పుడతడు నేను నేర్చుకోలేదు ఇప్పుడే యేసుప్రభువు ఆ భాషను నాకిచ్చినాడని చెప్పెను. ఆ నాయకుడు కీడు చేయకుండ (ఆశ్చర్యపడి) వెళ్లిపోయెను. సన్నిధిలో దాగినందులకు వారికి కాపుదల వచ్చిందా లేదా? సన్నిధి ఉన్నను శ్రమలు తప్పలేదు. సహించిన దానికంటే ఎక్కువ పంపడనే వాగ్ధానము తట్టుచూడగా సన్నిధికాంతి క్రమముగా మనమీదికి వచ్చును.


సత్ = మంచి -> సన్నిధి = మంచి బ్యాంకు లేక మంచి ధననిధి


సన్నిధి = బ్యాంకు = మంచి ధననిధి ఉండే బ్యాంకు.


సత్య నిధి (నీతి) ఉన్న సన్నిధి:- సత్ = మంచి అని అర్ధము. హిందువులు ఒక పేరు పెట్టుకొంటున్నారు. సద్ = చిత్త ఆనందము. చిత్ అనగా కోరిక.


"సద్ చిత్ = మంచి కోరిక = మంచి కోరికయందు ఆనందము కలిగినవారు ఆ పేరు హిందువులు పెడతారు. వ్యాకరణ సూత్రము ప్రకారము.

ఈ మూడు కలిపేటప్పుడు 'చ' క్రింద ఇంకొక 'చ' కలిపితే అపుడు సచ్చిదానందము = మంచి కోరికయందు ఆనందించువాడు. మనమందరము మంచి కోరికయందు ఆనందించవలెను అది ఎంత హిందూమత నామమైనను మంచిమాటే మంచిపేరే. అది మన క్రైస్తవులును పెట్టుకొనవచ్చును.


అది హిందూమత నామము అయినను సరేగాని అది తెలుసును నామము. అందుచేత మనమును ఆ పేరు పెట్టుకొనవచ్చును. అది ఏ దేవతపేరు కాదు. తెలుగు భాషలోనిపేరు. క్రైస్తవులు బైబిలుపేరులు పెట్టుకొనవచ్చును, ఏలాగంటే మత్తయి, మార్కు, లూకా, యోహానులు ఇవి రెండు రకములు

ఉదా:- ఆల్ ప్రెడ్ హౌస్ , మొదలైనవి క్రైస్తవులు పెట్టుకొను పేర్లు ౩ రకములుగా కలవు. అవి

బైబిలు పేర్లు పెట్టుకొంటే అర్దములు తెలియవలెను. రాజమండ్రిలో ఒక టీచరు తన పిల్లలకు బైబిలు పేర్లు పెట్టలేదు. గౌరవముగా పిలువరని మత్తయి అనుపేరు పెట్టుకొంటే....ఓరి... మత్తయిగో అని అంటారు. అందుచేత భాస్కరరావు, అనంతరావు, శుభాషమ్మ అనే పేర్లు పెట్టుకుంటారు. సద్ అనగా మంచి అని చెప్పితినిగదా! కృపానిధి అని అంటే అర్ధము ఏమి? దయానిధి అంటే ఏమి? ధననిధి అంటే ధననిధి = ధనరాసి, అట్లే సన్నిధి. అట్లే మనకూటములు, “సన్నిధి కూటము” అంటే "మంచితనము ఎక్కువగానుండేది."


సత్ నిధి = మంచితనము ఎక్కువగా ఉండేది. అనగా సన్నిధి కూటము చేయువాడు. ఎక్కువ మంచితనము నిధిగ కలిగి ఉండవలెను. మంచితనము లేనియెడల సన్నిధి కూటముకాదు. (మనవారు) ఏమంటారు:- 1) వారికి దర్శనములు వచ్చుచున్నవి. మాకు రావడములేదు. ఆ కూటములకు దర్శనములు వచ్చుచున్నవి మాకు రావడములేదు. అట్లు అనుకొనువారు చేయునది సత్ నిధికాదు. సన్నిధి కూటములో ఉన్నవారికి అభిప్రాయ బేధముంటే సన్నిధికాదు. అసలు సత్ నిధే గొప్పది గాని మనము దానికి దైవసన్నిధి అనుమాట చేర్చుచున్నాము. గనుక సత్ కంటే మంచిది దైవసన్నిధి. లోకములో మామూలుగా ఉన్న మంచితనముకంటే దైవసన్నిధి కూటాలలో ఎక్కువ మంచి ఉండవలెను అని ప్రభువు (అయ్యగారికి) చెప్పినారు.


ఉదా:- పరిసయ్యులకు నీతి ఉన్నది. అది ధర్మశాస్త ప్రకారమైన నీతి, అది ఆచారనీతి. ప్రభువు శిష్యులకు ఏమిచెప్పెను? ఆ నీతి మంచిదే గాని అది మీకు వద్దు. (మత్తయి 5:20)న ఉన్నవాక్యములో శాస్తులయొక్కయు, పరిసయ్యుల యొక్కయు నీతికంటే మానీతి ఎక్కువ కాకపోతే మీరు పరలోక రాజ్యమునకు రారు అని ప్రభువు చెప్పెను. లోకములో ఉన్న మంచితనము పరలోకమునకు తీసికొని వెళ్ళగలిగినంత మంచితనముకాదు. క్రైస్తవులు అప్పుడప్పుడు ఒక్కమాట అంటారు, అంటున్నారు, అదేమంటే మనకంటే హిందువులే నీతిగా నడుచుకొంటున్నారు. ఆ హిందూవులు ఏమంటున్నారు? మన క్రైస్తవులలో మంచి బోధ ఉన్నది గాని ఆ బోధ ప్రకారము క్రైస్తవులు నడవడము తక్కువ. అందుచేత హిందువులు ఏమంటున్నారు? మీ క్రైస్త్రవులలోకంటే మా హిందువులలోనే నీతి ఎక్కువ నీతి ఉన్నది. హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలున్నను సత్యము తప్పలేదు. అట్టివారు మీలో తక్కువ అని నిందిస్తున్నారు.


కాబట్టి అన్ని క్రైస్తవ మతశాఖలలో ఉన్న కూటములలో ఉన్న మంచితనముకంటే మన కూటములలోను, మన బైబిలు మిషను కూటములలోను, అయ్యగారి కూటములలోను, సన్నిధి కూటములో ఉండవలెను. ఆలాగు మీ సన్నిధి కూటములలో మంచితనము లేనియెడల ఎత్తివేయవలెను. శాస్త్రుల నీతియు, పరిసయ్యుల నీతియు తగ్గినందువల్ల క్రమముగా వాటంతట అదే అంతరించిపోయింది. అది ఆచారమేగాని భక్తిగాదు. కాబట్టి సన్నిధి కూటస్తులు మంచి ప్రశ్నలు వేసినప్పుడు దర్శనములు వచ్చినా, మంచివర్తమానములు వచ్చినపుడు సరిగా వ్రాయకపోయినా వాటిని సరిగ్గా వ్రాసి, అచ్చు వేయించండి అప్పుడు మీ నీతి తక్కిన క్రైస్తవుల ఆచార నీతికంటే ఎక్కువై ఉంటుంది.


మంచితనము ధననిధివలె ఉండవలెను. నిధి అనగా ఈ కాలమున = (Bank)భోషాణము ఈ రెండు దానికి సరిపోవును. దానియొక్క అర్దము ఏదంటే
> Bank = భోషాణము.


“నేను నీలో నీవు నాలో - లీనమైనట్టే యనుకొనుము = గాన నీకు లేని దేది - పోనిదేది - రానిదేది ॥మనోవిచారము॥


ప్రార్ధన:- ప్రభువా! దయగల ప్రభువా! నీవు నరులకు ఏమియు తక్కువ చేయలేదు.

ఈ రెండు రకములైన ధన నిధులను ఉదహరించుచు నీ సన్నిధిలో స్తుతించువారే మహాధన్యులు అగుదురు. అట్లు స్తుతించి ధన్యులు కాగలస్థితి ప్రభువు అనుగ్రహించును గాక! ఆమేన్.