(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
8. పరిశుద్ధుల - దైవ సన్నిధి
దాని. 9:1-27, యోహా. 21:20-23; 2పేతు. 1:20-21.
ప్రభుయేసుయొక్క రెండవ రాకడయొక్క సమీప కాలములో నివసించుచున్న ప్రియులారా! మీకందరకు రాకడ మహిమలో పాలు కలుగునుగాక! ఆమేన్.
నేటి ప్రసంగ వాక్యమేమనగా యేసుప్రభువు యోహానును ఎట్లు సన్నిధిలోనికి నడిపించి, ఎట్లు వాడుకొనెనో అదే ప్రసంగాంశము. మోషే సీనాయి కొండమీద దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ సన్నిధిలో ఉన్న దాని ఫలితముగా మోషేగారు ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితియోపదేశ కాండములు ఈ ఐదు పుస్తకములు సన్నిధి ఫలితముగా వ్రాసెను.
రెండవ సంగతి:- యెషయా, యెహెజ్కేలు, దానియేలు మొదలగు ప్రవక్తలందరు ఆ గ్రంథములు వ్రాయుటకు మూలము సన్నిధే. బైబిలులోని మిగిలిన పుస్తకములు వ్రాసినవారు సన్నిధిలో ఉండుటను బట్టియే వాయగలిగిరి. పాత నిబంధన గ్రంథములను, సన్నిధిలో ఉండగా దేవుడు చెప్పగా వ్రాయబడిన గ్రంధాలు, గనుక నేటి ఈ దినాలలో సన్నిధి కూటాలు పెట్టుకొనేవారు, భక్తులైన వారివలె
- 1) క్రొత్త
- 2) గొప్ప పనులు చేయగలరు.
దేవుడు చెప్పిన పని సంపూర్తిగా చేయవలెను, విసుగుకొనకూడదు. దేవుడు 23 నం॥లు యిర్మియాతో మాట్లాడెను, తరువాత మాట్లాడుట మానెను. దేవుడు ఆయన ద్వారా వ్రాయించవలసిన
- 1) వ్రాత
- 2) సేవ ముగింపైనది గాన మాట్లాడుట మానెను.
అలాగే ఈ కాలములోను అట్టి పనే తప్పక జరుగును. త్వరత్వరగా దేవుని సేవ చేయవలెను. ఎందుకనగా ప్రభువు త్వరగా వస్తున్నానని చెప్పుచున్నాడు గనుక సేవ చేయాలి. ఎలాగు సేవ చేయాలి?
దైవసేవ చేయు పద్ధతి:-
- 1. సన్నిధిలో ఉండుటవలన
- 2. ఇతరులకు వాక్యము చెప్పుట ద్వారా
- 3. దైవ విషయములు వ్రాసి వెల్లడి చేయుటద్వారా
- 4. తాను బోధించిన ప్రకారము నడిచి చూవుటద్వారా మనము ప్రభువును మహిమ పరచవలెను.
ఈ నాలుగు కలిపితే సేవ అయినది. మనలో ఈ నాల్గింటిలో దేనిలో లోటున్నదో సరిచూచుకొని వాటి ప్రకారము సేవ చేయాలి అలాగు చేయకపోతే
- (1) మనకు
- (2) ఇతరులకు మేలు లేదు.
మోషే గొప్ప దర్శనవరము కలవాడు. ఆయన తర్వాతి కాలములో వచ్చినవారు ఆయనకంటే గొప్ప దర్శన వరము కలవారు. 12మంది శిష్యులు క్రీస్తుప్రభువుని బాహాటముగా చూచిరి.
- 1) గొప్ప ప్రత్యక్షత
- 2) ప్రభువుతో గొప్ప దర్శనము
- 3) గొప్ప సన్నిధి అనగా ప్రభుని
సన్నిధిలో ఉండుట.
- 1. ప్రభువుతో ఉన్నారు
- 2. ప్రయాణము చేసిరి.
- 3. ప్రభువుతో భుజించి
- 4. యేసుతో ఉండి ఉపన్యాసములు చేసిరి.
మోషేయు, మిగతా ప్రవక్తలు సన్నిధిలో మౌనముగా ఉండిన తరువాత సేవ చేసిరి. 12మంది అట్లుగాక ప్రభువుతో కలసిమెలసి ఉండి సేవ చేసిరి. యెరూషలేములో ఆయనతోనే ఉండిరి అదే సన్నిధి. బేతనియలో ఆయనతో కలసి భోజనము చేసిరి అదే సన్నిధి. బేతనియ నుండి గలిలయకు వెళ్ళిరి ఆ ప్రయాణమే దేవునియొక్క సన్నిధి. గనుక 12 మంది శిష్యులది ఒక విధమైన సన్నిధి.
బైబిలులోని సన్నిధి ప్రత్యక్షతలు:-
- 1. మోషే సన్నిధి
- 2. ప్రవక్తల సన్నిధి
- 3. 12 మంది శిష్యుల సన్నిధి.
కానీ వీటన్నిటిలోకెల్ల 1) యోహాను సన్నిధి. జీవితములో అందరిని మించిన ప్రత్యక్షత. ఎందుచేతననగా ప్రకటనను వ్రాసినందున మించిపోయినది. ఈ కాలమందు సన్నిధి కూటాలు పెట్టుకొనేవారు
- 1) దర్శనాలు,
- 2) ప్రత్యక్షత గలవాలై క్రమముగా ప్రకటన వంటి వ్రాతలు వ్రాయవలసియున్నది. ఇది చాలా కష్టము. యోహాను, యోహాను
సువార్తలో
- 1) సంపూర్ణ ప్రత్యక్షత
- 2) దైవత్మము ఉన్నది.
మత్తయి, మార్కు లూకాలోను యున్నది. యోహాను సువార్తను మించి, ప్రకటన గ్రంథములో ఇంకా ఎక్కువగా ఉన్నది. యోహాను 20 అధ్యాయములుగల సువార్త వ్రాసెను. ప్రభువుకు నేను చేయవలసిన సేవ అయినదని కలము క్రిందపెట్టి 21 అధ్యాయములు వ్రాసి, ఇక నేను వ్రాయలేను ఇంకా వ్రాయవలసినది చాలా ఉన్నది అవన్నియు వ్రాస్తే నా గ్రంథాలకు భూలోకము పట్టదని కలము క్రింద పెట్టిరి.
దైవసన్నిధి సహవాసమునకు ప్రభువు యోహానును ఏర్పాటు చేసికొనుట: -
యోహాను. 21:22వ వచనములో "యేసు - నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుమని" పేతురుతో అనిన మాటలను ఇతరులు అర్ధము చేసికొనుటనుబట్టి (అనగా ఆ శిష్యుడు (యోహానుగారు) ప్రభువు రెండవ రాకడలో వచ్చేవరకు మరణము లేకుండా ఉండును). ప్రభువు నవ్వుకొని నేను యోహానుతో చేయించవలసిన పని చాలా ఉన్నది అని, "నేను వచ్చేవరకు యోహాను ఉండాలి" అని అన్నారు ఆ మాటకు అర్ధము (అయ్యగారి అభిప్రాయము) యోహానుగారు సజీవుడై రాకడవరకు ఉండవలెనని కాదు, పత్మసు లంకలో ఉన్నప్పుడు ప్రకటన వ్రాయించుటకు అని అర్ధమిచ్చునట్లుగా నేను వచ్చేవరకు అని అన్నారు. ఈ మాట శిష్యులకుగాని, తరువాత వచ్చినవారికిగాని గ్రహింపుకాలేదు. సంఘకాలమునాటి బైబిలు చారిత్రక అంశాల ననుసరించి అపోస్తలుల కార్యములు వ్రాయబడెను ముందు వత్రికలు వ్రాయబడెను. ఆ తరువాత సువార్తలు వ్రాయబడెను కలము యోహాను క్రింద పెట్టగా ప్రభువువచ్చి నేను బలమిచ్చి నేను వ్రాయించాలి, బలము రావాలంటే నా సన్నిధిలోనికి రమ్మని ప్రేరేపణ ఇచ్చి యోహానును నడిపించెను.
ఐగుప్తు దేశములో యోసేపు తన సహోదరులతో మీరు నన్ను వర్తకులైన ఇష్మాయేలీయులకు అమ్మి ఐగుప్తుకు పంపినామని మీరనుకుంటున్నారు. మీరుకాదు నాకు, మీకు తెలియకుండా యెహోవా నడిపించెనని చెప్పెను. అట్లే ప్రకటన వ్రాయించుటకు పత్మను లంకకు యోహానును దైవ సన్నిధికి ప్రకటన వ్రాయించుటకు నడిపించెను. ఆయన ఈలోకరీత్యా ఎంత ముసలివాడైన సేవ మానలేదు. మనవారు రిటైర్డ్ అవగానే పని మానివేస్తారు. కాని యోహాను మానలేదు. ఈ ముసలాయనను ఎత్తికొనిపోయి కూటములో పెట్టగా గుడిలో ప్రసంగముచేసిరి. ఈ వృద్దునికంటే గుడిలోని వారు చిన్నవారు గనుక పిల్లలారా అని అన్నాడు గాని వృద్ధులారా అని అనలేదు.
యోహాను ఒకప్పుడు 12 మందిలో చిన్నవాడు, వారందరు చనిపోగా యోహానే దేవుని సువార్త పనిమీద మిగిలెను. ప్రకటన వ్రాయాలంటే ఆదికాండము మొదలు క్రొత్త నిబంధనలో చివరి పత్రికైన యూదా పత్రిక వరకును సంగతి యావత్తు నెరవేరే ఒక పుస్తకము, బైబిలు గ్రంథములో చివరికి యోహానే ఆ పుస్తకము వ్రాయాలి. చిన్నవాడును ఇప్పటికి వృద్దుడును సేవ చాలించి రిటైర్డ్ కావలసినవాడైనను యోహానును కొత్త పనికి దేవుడు నడిపించాడు. ఇంతవరకు సంఘములో, లోకములో సేవచేసెను. ఇప్పుడు సన్నిధిలో సేవచేయవలెను, గనుక పద్మసులంకకు నడిపించెను.
ఈ యోహాను
- 1. లోకములో సేవచేసెను.
- 2. సంఘములో సేవచేసెను
- ౩. సన్నిధిలో సేవచేసెను.
ఈ మూడింటిలోను సేవ తప్పలేదు. ఈ మాటలు విన్న దేవుని బిడ్డలారా మీరును రక్షింపబడినవారైతే ఈయోహానుయొక్క వరుసలోకి రండి.
- 1. ప్రభువును గూర్చి లోకములో ప్రకటించండి.
- 2. ప్రభువునుగూర్చి సంఘములో ప్రకటించండి.
- 3. ప్రభువునుగూర్చి సన్నిధిలో ప్రకటించండి.
ప్రకటన 65 పుస్తకముల ప్రకటనయై యున్నది. మన జీవితములో ఎప్పుడు ప్రభువును తెలినసికొన్నామో, అది మొదలు సన్నిధిలోనికి వచ్చువరకు ఉన్న కాలమంతయు సన్నిధి కూటములు తేజరిల్లును గాక! ఆమేన్.