(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
9. దైవసహవాస సంబంధ కళ
కీర్తన. 150, యోహాను 3:29-30, 1యోహా. 1:3.
షారోను పుష్పమువంటి - సంఘవధువునకు క్రీస్తు = ఏరూప మిచ్చినో నే - నెన్నగలనా ॥ షారోను మైదానము॥
ప్రార్ధన:- మా దేవా! ప్రియ పరలోకపుతండ్రీ! నీతో సహవాసము గలిగియున్నదే నీ సన్నిధి, అట్టి గొప్ప అంతస్థును, నీ శుభగుణములను నేటి వర్తమానముద్వారా మాకు అద్దుమని క్రీస్తు యేసు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
విశ్వాసము లేనివారలారా! అని అనిపించుకొన్ననూ విశ్వాసము గలవారలారా! మీకు ఆ విశ్వాసము కలుగునుగాక! ఆమేన్.
ప్రియులారా! చాలా కాలము క్రిందట ఒకప్పుడు ప్రభువు మా కూటములలో ఏమి చెప్పెననగా మీరు చాలా గడుసు పిల్లలు ఇది దాని అర్ధము మీకు తెలియదు, గాని స్తుతి చేయడము ద్వారా దాని అర్ధము తెలిసికొన్నాము. వరములు వాడుకొన్నాము స్తుతి అంటే ఏమిటంటే మద్దెల శబ్ధము. మద్దెలని రెండు ప్రక్కల కొడతారు, రెండు కలిపి కొడితే ఒక శబ్దము వచ్చును. ఒక ప్రక్కన శబ్దము ఎందుకంటే నా మనస్సులోనుండి నేను చెప్పిన నా కోరిక, ప్రార్ధన నెరవేరినది, గనుక సంతోష శబ్దము. ఈ రెండవ శబ్దము నోటిద్వారా రాదు, నోటిద్వారానే వస్తుందిగాని కొంచెము ఆలస్యముగా వచ్చును. అది వచ్చేవరకు హృదయములోనే ఉంటుంది అదే స్తుతి.
మనము ప్రార్దించకముందే, ఆ ప్రార్థన మన హృదయములోనే ఉంటుంది. ఇది అందరికికాదు, కాని ఈ తీరు తెలిసిన వారికి తెలియును. అందుచేతనే తండ్రి అన్నారు మీరు గడుసు పిల్లలు. గనుక నేను ఇయ్యకముందే నా గుప్పిలి విప్పి వరములు తీసికొంటున్నారు. ఇప్పుడు నేనేమి అనను. అంటే వారు మృతులైనప్పటినుండి సజీవులైనప్పటికిని పెండ్లి కుమార్తె వరుసలోనివారు అని గ్రహించుకొనవలెను. మన దేశములో ఆ వాడుక లేదుగాని నేను చెప్పుతాను ఆ వాడుక ఐరోపాలోనే ఉంది. ఒక ఇంటిలో పెండ్లికావలసిన ఏర్పాటుగల అమ్మాయి ఉన్నది. ఇంకొక ఇంటిలో ఆ అమ్మాయిని పెండ్లి చేసికొనే ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరును అప్పుడప్పుడు మీటింగులలోను, తల్లిదండ్రుల ఇంటిలోను కలుసుకొంటు ఉండేవారు. కలుసుకున్న ప్రతిసారి షేక్ హాండ్ ఇచ్చుకుంటారా! లేదా! ఆయన చేతిలో ఏమైన ఉంటే ఈమెకు ఇస్తారు. ఈమె చేతులో ఏమైన ఉంటే ఆయన తీసికొంటాడా? ఎందుకంటే వారు ఎలాగైన పెండ్లి చేసికొంటారు గనుక ఇక సిగ్గు ఉండదు. ఈ పరిచయము ఈ లోకములో ఉన్న సంఘము (విశ్వాసి) కలిగియుంటే ఆయన గుప్పిలిలోని వరములు తీసికొనుటకు సిగ్గుపడవు, భయపడవు. మీరట్టివారై ఉంటే ఇప్పుడే పెండ్లికుమార్తె వరుసలోనివారని గ్రహించుకొనండి. పెండ్లికి ముందు పెండ్లి కుమారుడు వేరే వీధిలో, పెండ్లికుమార్తె మరియొక వీధిలో ఉంటే, వారిద్దరికీ ఇంకా పెండ్లికాక మునుపే పెండ్లికుమారుడును, పెండ్లి కుమార్తె అను తలంపు మన దేశ వాసులు కలిగియుంటారా? అదే సన్నిధి. ఆమె ఒక చోట ఉంటుంది ఆయన ఇంకొక చోట ఉన్నాడు. కాని ఇరువురి తలంపులు ఒకటే అయినవి అదే సన్నిధి.
అట్లే యేసుప్రభువు పరలోకములో ఉన్నాడు. సంఘము భూమిమీద ఉన్నది. అయినప్పటికి తలంపు ఉంటుందా? ఉండదు.
అయితే ఈ నరలోకములో పరలోకము వారియొక్క పెండ్లికుమార్తె తయారగుచున్నది. ఇది ఈ లోకము సైతాను సంబంధము గనుక ఈ పెండ్లి కుమార్తెకు ఆ సైతాను తలంపు ఉంటే మొదలు చెడిపోతుంది. ఏర్పాటు కానిది వస్తుంది, ఏర్పాటు చెడిపోతుంది. మీరెప్పుడును పరలోకవు పెండ్లి కుమార్తె తలంపే కలిగి యుండవలెను. మరొక తలంపు కలిగియుండరాదు. పెండ్లి ఏర్పాటు అయిన తరువాత పెండ్లి కుమార్తె యొక్క ముఖ వర్చస్సు మారుతుందా! మామూలుగానే ఉంటుందో? పెండ్లి కళ ఆరంభము లోపల సంతోషమున్నది. గనుక అది ఎంత దాచుకున్నను దాగక ఆ వెలుగు బైటికి వచ్చి కళ కనబడక మానదు. ఆలాగే దైవ సన్నిధిలో ఉన్నవారు ఆ గదిలో అనుభవించిన దైవకళ గది బైటికి వచ్చినను కనబడుచునే ఉండును. ఎవరికి కనబడుచున్నదో అంటే చేతులెత్తండి. ఈ ప్రశ్నకి జవాబు మనసులో చెప్పుకొనండి.
బైబిలు మిషనులో స్థిరమైన కూటములు ఉన్నందున మనకు ఉపయోగమేగాని ప్రజలకు ఏమి ఉపయోగము? ఇతర కూటముల వారు లేని అక్కర్లు మన సన్నిధి కూట స్థలాలకు చెప్పుకుంటారు. ప్రభువు ఏమి చెప్పారో చెప్పు అన్నా! దేవునిని అడగటము మాకు చేతకాదు. అడిగినను ఆయన మాకు జవాబు ఇయ్యడు. ఆయన జవాబు ఇచ్చినా మాకు వినబడదు. గనుక మీరు మా గురించియే ఆ ప్రభువును అడిగి జవాబు ఏమి తెస్తారో అది మాకు చెప్పండి అని అంటారు. అదే లాభము మాకు అని అంటారు. అట్టివారు విశ్వాసులా? క్రీస్తును నమ్మినారు గనుక విశ్వాసులే గనుక వారు విశ్వాసుల రోడ్డుమీదకు (క్రైస్తవ విశ్వాసులందరూ నడిచే రోడ్డుమీదకు - క్రైస్తవ మార్గములోనికి) వచ్చారు. కాని ఆ దర్శనాలు సరిగా లేకపోతే అది వట్టిదే అని చెప్పి తిరిగి ఆ రోడ్డు దిగి ఇంకో రోడ్డు ఎక్కుతారు. గనుక సన్నిధి కూటములు స్థాపించుకొనుట ద్వారా సంతోషము కాదు కాని ఎప్పటికప్పుడు ఆత్మీయ స్థితిని వృద్ధి చేసికొనుచు తప్పుడు దర్శనములు రాకుండా చూచుకొనుము.
నా ప్రార్ధన మెట్లు ప్రకారము ఎవరైనా సరే విశ్వాసియైన, అవిశ్వాసియైన, క్రైస్తవుడైన, అన్యుడైన, దుష్టుడైన (సాధనచేసి చూసిన యెడల) వారు ధన్యుడే. ఎందుచేతనంటే అతడు నా సన్నిధిలోనికి వస్తాడు. గుంటూరు సన్నిధిలోనికి కాదు ప్రార్ధనా ప్రకారము అతడెక్కడ చేయునో అక్కడే దానంతట అదే సన్నిధి కూటము ఏర్పడును, అదే సన్నిధి. సన్నిధి కూటము గురించి విననక్కర్లేదు. మొదట మనోనిదానము, పాపపు ఒప్పుదల మెట్టు, ఈ విధముగా అన్ని మెట్లు చేసి కనిపెట్టిన వెలుగు గదిలోనికి వస్తుంది. మీరెప్పుడు చూడలేదా?ఉదయమున ఎండ ముందు గదిలోనికి వచ్చును. అలాగే కనిపెట్టిన గంటలో కనిపెట్టుచున్న వారి జీవితములో వెలుగు వస్తుంది. ఆ వెలుగు క్రమముగా వృద్ధియై ప్రభువుతో మాట్లాడుట జరుగుతుంది అదే దైవసన్నిధి. బైబిలు మిషను ఉన్నటువంటి స్థలాలలో బైబిలు మిషను దాటి బైటనున్న వారికి ఏమి ఉపయోగము! వారికి ఇవి ఏమియు తెలియవు. వారు మంచివారేగాని వారికేమియు తెలియదు. కూటమందున్న వారికి ఏమి ప్రయోజనము? వారి సన్నిధి కూటములో ప్రభువు వారికి కనబడి, వారితో మాట్లాడుటయే.
నిన్న బైబిలులో సన్నిధి గురించి ఎక్కడెక్కడ ఉన్నదో ఆ వాక్యములు ఏరి కొద్దికొద్దిగా వివరించాను. గాని ప్రసంగముకాదు బైబిలు క్లాస్ లో విద్యార్దులను కూర్చోబెట్టి ఏ ప్రకారముగా బైబిలు పాఠములు చెప్పుతారో ఆ ప్రకారముగా కొద్దికొద్దిగా చెప్పాను. కాని ప్రసంగము చేయలేదు. నేనొకప్పుడు బైబిలు టీచర్ ని గనుక ఆ వాలు వచ్చినది. గనుక కొద్దిగా చెప్పాను. మిషనెరీలు ఏలాగు బైబిలు పాటము చెప్పారో ఆలాగే చెప్పితిని.
నిర్గమ. 33:14లో ఈలాగున్నది. “నా సన్నిధి నీతో వచ్చును”, అదే ప్రసంగ వాక్యము. ఆ వచనముమీద ఒక పావుగంటో, గంటో ప్రసంగము చేస్తాను. అది చేయలేదు. గనుక బైబిలు పాఠానికి, ప్రసంగానికి గల తేడా ఇప్పుడు చెప్తాను. మొదటి రోజున నేను బైబిలు పాఠము చెప్పాను రెండవ రోజున ఈ వాక్యము ప్రసంగించాను. విద్యార్థులు విన్నారు. నిన్ననే ఈ వాక్యము చెప్పాను. నిన్నటి దినము ప్రసంగము వినినవారు ఇంకా ఈరోజున ఏమి చెప్తారో ఈ వాక్యముతో అని అనుకుంటారు. ఆలాగు అనుకున్నవారు ప్రసంగము అంతా విన్న తరువాత అబ్బో! ఎన్ని సంగతులున్నవి, ఇవి ఎప్పుడు వినలేదుగదా అని అనుకుంటారు.
ఒకరోజు బైబిలు పాఠము, 2వ రోజు ప్రసంగము లేక ఉపన్యాసము 3వ రోజున వివాదము అంటే ఏమిటంటే ఆ వాక్యముమీద ప్రశ్నలు వేసి తిప్పలుపెట్టుట. ఆ వాక్య పాఠములమీద, ఆ వాక్య ప్రసంగములమీద ఇష్టము వచ్చిన ప్రశ్నలువేసి వివాదము పెట్టుట. 4 అలాగు చేసినట్టైన అప్పుడు ఇంకా ఎక్కువ సంగతులు తెలిసి వాక్యముయొక్క అర్ధము హృదయములో స్థిరమైపోవును. 4వ రోజున మాస్టారు ఏమి చేస్తారంటే పిల్లలందరికిని అన్ని వాక్యములు ఇచ్చి రెండు పేజీల ప్రసంగము వ్రాసికొని రమ్మంటారు. తర్వాత రోజున వారు వ్రాసికొచ్చినవి చదువుతారు.
వారు వ్రాసిన వాక్యార్ధములు బాగా ఉంటే మాస్టరుగారు సంతోషిస్తారు, వ్యతిరేకముగా వ్రాస్తే నవ్వుకుంటారు. బైబిలు క్లాసు ఏమంటే
- 1) బైబిలు చెప్పుట,
- 2) ప్రసంగము చెప్పుట,
- 3) వివాదము.
- 4) ప్రసంగ అభ్యాసము చేయుట.
ఈ నాలుగు కలిపితే ప్రసంగము అయినది. అబ్బాయీ! ఈ నాలుగు ఏలాగు నేర్చుకోవాలో రేపు యేసుప్రభువు వచ్చి నీకు పాఠము నేర్పుతారంటే ఈలాగున మీరు చేతులు ముడుచుకొని కూర్చొని, స్నానము చేసి, తెల్లబట్టలు కట్టుకొని, కలము తీసికొని నమస్కారము చేసి, చేసిన తప్పులు ఓ ప్రభువా! క్షమించు, అని బెంచీలు తీసివేసి చాపలు వేసి క్రిందకూర్చొని వ్రాసికొంటారు. అప్పుడు ప్రభువు వచ్చి చెప్పుతారు. ఈ నాలుగు రోజులు పాఠములు నలిగినవి గనుక బాగా పాఠములు నేర్చుకొన్నారు. గనుక 5వ రోజున ప్రభువు వచ్చి అన్ని చెప్పుతారు. ఆలాగు ప్రభువు వచ్చి చెప్పకపోతే 9 రోజులు చేసిన బోధ అంతా సున్న! ప్రభువు వచ్చి చెప్పితే సన్నిధి కూటమునకు ఫలితము చేకూరును. అయ్యగారంటారు! అబ్బాయ్ నా మీద మీరు వేసిన ప్రశ్నలన్నియు ఈ వేళ మీరు ప్రభువు మీద వేయండి. అప్పుడు బైబిలు వేదాంతము, పాఠశాల పని పూర్తియైనవి. కాని ఇప్పుడు అది లేదు. 40 ఏండ్ల నుండి నేను చెప్పుచున్నాను గాని ఎవరు చేయలేదు, నమ్మలేదు. గుంటూరు వారు చేసిరి. దానికంటే ముందు బెజవాడవారు ఆరంభించి ఆపుచేసారు. అప్పుడు వారికి ఒకసారి అయ్యగారు వెళ్ళి చూచినప్పుడు వారి ముఖములు చూడగానే తెలిసిపోయింది. మరలా వారు సన్నిధి పని ఆరంభించి ఆ పని క్రమముగా సాగించారు కాని మొదటి పట్టు పోయింది, పోయిన పట్టు వారికి తెలియదు. గనుక నేను చెప్పవలసిన ప్రోగ్రాము చెప్పాను, గనుక మీ స్వంత ఖర్చులమీద ఒక నెలంతా అయ్యగారి వద్ద ఉంటే ఈ చెప్పినదంతా చేయిస్తారు. మనము నెలరోజులకే ఈలాగు అనుకుంటే అమెరికాలో ఒక పాదిరిగారిని తయారు చేయడానికి 7సంవత్సరములు పట్టును.
ప్రార్ధన:- దయారసముగల ఓ తండ్రీ! నీ కృప మమ్మును వెంబడిస్తున్నందున స్తోత్రము. దురాత్మలుకూడ వెంబడిస్తు హాని చేయగోరుచున్నందున అట్టి హాని కలుగకుండుటకై అనుదినము నీ కృప వెంబడింపచేయుచున్నందున మా వందనములు. ఈ వేళ నీవు మా ద్వారా మాట్లాడవలసిన, చేయవలసిన కార్యక్రమమంతటి మూలముగా మహిమ పొందుమని నీ కుమారుని ద్వారా వేడుకొను చున్నాము ఆమేన్.