క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

1. సమర్పణ ప్రార్ధన

(స్తుతులు, సమర్పణ, ప్రార్ధనలు)



స్తుతులు:

1. దేవా తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండ అందించుచున్న తండ్రీ! నన్ను కలుగజేసిన తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా! నా ప్రభువా! నా పోషకుడా! నా రక్షకుడా! నా సర్వమా! నీకనేక నమస్కారములు. తండ్రీ! సృష్టిమూలముగా మాత్రమేకాక, నీ కుమారుని మూలముగా కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీకనేక వందనములు.


నీ దానముల మూలముగాను, నీ సహింపు మూలముగాను, నీ నడిపింపు మూలముగాను, మా కష్టములు నివారణచేయు నీ క్రియల మూలముగాను, నీవు మాకు చేయు ఉపకారముల మూలముగాను నాకు నీవు చూపుచున్న ప్రేమను తలంచుకొని నిన్ను స్తుతించుచున్నాను, గాని నా స్తుతి నీ ప్రేమ ఎదుట ఏ మాత్రము! నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ ఎదుట ఏ మాత్రము! నేను ఏ పనియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను, అది సహితము నీ కనికరము ఎదుట మిక్కిలి స్వల్పమై యుండును. ఆ స్వల్ప స్తుతులనుకూడ నీవు హస్తార్పణముగా అందుకొను చున్నావు, గనుక నీకు వందనములు.


నీవు నన్ను నేటివరకు కాపాడుచు, నడిపించుచు వృద్ధిలోనికి తీసికొని వచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు, ఇక ముందునకుకూడా నా విషయములో ఇట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు నిశ్చయముగా నన్ను పరలోకమునకు చేర్చుకొందువని నిరీక్షించుచున్నాను. నీకనేక వందనములు.


2.

3. తండ్రీ! నీ స్థితిని, నీ క్రియలను, నీ దివ్యలక్షణములను నాయెడల ఉన్న నీ తీరును, నీ మహిమను ఎవరు వర్ణింపగలరు? నీకనేక వందనములు.


4. దానకర్తవైన తండ్రీ! నీ ఉచిత దానముల నిమిత్తమై నీకు స్తోత్రములు. గాలి ఉచితము, నేను పన్ను కట్టుట లేదు. ఒకవేళ నేను కట్టినను అది చాలదు. నీ ఉచిత ధర్మము నిమిత్తమై అవి యున్నంతకాలము నీకు స్తోత్రములు. లోకాన్ని కలుగజేసినది మొదలుకొని, లోకాంతము వరకు నీవు నరులందరకు, అవిశ్వాసులకు, విశ్వాసులకు, మృగములకు, వృక్షాదులకు, జీవరాసులకు ఉచితముగా ధర్మము చేయుచునేయున్నావు. ఇవన్నియు మేము సంపాదించుకొనవలెనన్న యెడల రవ్వంతయైనను సంపాదించుకొనలేము. ఎన్నో పండ్లు, ఎన్నో కూరగాయలు ఇచ్చుచున్నావు.

మానవులు తినగా ఎన్నో మిగిలిపోవుచున్నవి. నీకనేక స్తోత్రములు. నీళ్లుకూడ మిగిలిపోవుచున్నవి. నీవు భూమిలో పెట్టిన ఖనిజములు, లోహములు అనేకములున్నవి. మానవులు ఇంకా వీటిని తీసికొని వాడుకొనలేదు. కొన్ని వాడుకొనుచున్నారు గాని తరగడములేదు. నీవు మా యెదుట వేసిన భోజనపు బల్లమీదనున్న పదార్ధములు ఇంకా తరగడములేదు. ఒకదరినుండి మేము వాడుకొనుచుండగా, నీవు ఇంకొకదరినుండి ఇంకను క్రొత్తవి ఇచ్చుచూనే యున్నావు.

నీ దాన స్వభావమును ఎవరు వర్ణింపగలరు? మా తెలివితక్కువవల్ల మేము వాటిని పూర్తిగా వాడలేకపోవుచున్నాము. నీ దానములు అందుకొనుశక్తి నరులకందరకున్న యెడల అందరును ధనికులే. ఒక్కరైనను బీదవారుందరు. నీవు కలుగజేసిన వాటిలో ఉపయోగములేనిది ఏదియులేదు. నా విషయమై నీకు ప్రతిదినము ఎంతో ఖర్చున్నది. నీవు బిల్లు వేసినయెడల నేను ఇయ్యగలనా? ప్రతి నిమిష దానములనుబట్టి నీకనేక వందనములు.


5. నీవిచ్చిన అన్నిదానములకంటే ఓ తండ్రీ! నీవు నీ కుమారుని పంపిన దానము గొప్పది, అనంతమైనది. ఎందుకు నిన్ను స్తుతింపవలెనని కోరినయెడల ప్రతి రెప్పపాటున స్తుతింపవలెను. నీ కుమారుని అవతార దానమునకు మించిన దానము లేనేలేదు. ఆ దానమునుబట్టి నీకు స్తోత్రములు.


నేను పాపవిసర్జన చేయవలెననియు, బాప్తిస్మము పొందవలెననియు, రక్షణ అందుకొనవలెననియు, సంస్కార భోజనము భుజింపవలెననియు, ఇతరుల రక్షణార్థమైన సేవ చేయవలెననియు, నీ వాక్యగ్రంధమును మా హృదయములో అచ్చు వేయించుకొనవలెననియు, జీవాంతమందు నీ సన్నిధికి వచ్చివయవలెననియు నీవు కోరుచున్న కోరికకు ఏమి చెప్పగలను. నీ దానములు లెక్కపెట్టుటకు కూర్చున్నయెడల మా దీర్ఘ జీవితకాలము చాలదు. మా విశ్వాసము, మా గ్రహింపు, మా స్తుతి నీ దృష్టి యెదుట మిగుల స్వల్పమైనను నీవు అంగీకరించుట ఆశ్చర్యముగానున్నది. ఏమి చెప్పగలను! ఏమి వివరింపగలను! ఎంత జాగ్రత్తగా స్తుతి చేసినను ఎప్పుడు పూర్తిగా కుదరదు. అయినను నీవు ఆనందించుచున్నావు. నీకు స్తోత్రము. నీ కుమారుని దానమునకు వెలుపల ఏ దానమును లేదు. నీవు చూపుచున్న కృప వెలుపల ఏ కృపయు లేదు. సంఘముయొక్క వెలుపల రక్షణలేదు. నీ మహత్తు విషయమై నీకు లెక్కకు మించిన స్తోత్రములు.


6. నా జన్మము, నా బ్రతుకు ఎంత పవిత్రముగానున్నను, మరణ సమయమందు పరలోకమునకు నేను సిద్ధము కాని యెడల మా ఆయుస్సు అంతయు వ్యర్థమే. ఒకవేళ నేను మరణ సమయమునందు సిద్ధముగా నున్న యెడల మోక్ష ప్రవేశము కలిగించుకొనుటకు ధన్యత కలదు. అంతకన్న మించిన అంతస్థు గల మరియొక ధన్యకాలము కలదు.


ఆ కాలమునకు, ఆ రెప్పపాటు కాలమునకు, మా ప్రభువుయొక్క రెండవ రాకడకు నేను సిద్ధపడని యెడల భూమిమీద శ్రమలు అనుభవించుటకు మిగిలిపోవుదును. నేను అంతకాలము భక్తిగా బ్రతికి, అన్నియు నమ్మి రెండవరాకడను నమ్మకయు, నమ్మినను సిద్ధపడకయు నున్నయెడల నాకు ఎంత దౌర్భాగ్యత దాపురించును? భక్తిగల జీవనము, భక్తిగల మరణము సజీవుల గుంపులో చేరవలసిన ఆరోహణము, మా యెదుట పెట్టియున్నావు గనుక నీకు స్తోత్రములు. లేనియెడల మా బ్రతుకువలన నీకు ప్రయోజనమేమి? ఇట్టి ప్రయోజనములేని స్థితి నాకు రాకుండా చేయగల తండ్రీ! నీకు స్తోత్రము.