క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

2. సమర్పణ



1. అతి పరిశుద్ధుడవైన తండ్రీ! నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులనుగా చేసినప్పటికిని, వారు పాపములో పడిపోవుటవలన వారినిబట్టి మాకందరికి పాపము ప్రవేశించినది. ఓ తండ్రీ! పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు. గానీ పాపములేకుండా ఉండలేక పోవుచున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవుచున్నాను, మరల నీ యెదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర, నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగియున్నవి, మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత, నీ పరిశుద్ధత ఎదుట తక్కువైయున్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై యుండగలము? నీవు క్షమించుటనుబట్టిగాని, లేనియెడల నేను ఇదివరకే నశించి యుండవలసినదే.


నా ప్రభువా! నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియలోనికి, పాపము ప్రవేశించినప్పుడెల్ల విసర్జింప పూనుకొనియున్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనబడినప్పుడు, "ఓ సైతానా! ఇది నీ పని. నా మీద నీకు ఏ అధికారములేదు, వెళ్లిపో" అని ఎదిరించుటకు పూనుకొన్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకొన్నాను.


2. దేవా! పాపము ఒక్కటే కాదు. పాపము ప్రవేశించి ఊరుకొనుటలేదు, అది వ్యాధిని కలిగించుచున్నది. అట్టి సమయములో నిన్ను వేడుకొని స్వస్థత పొందుటకు పూనుకొన్నాను. ఏ తప్పిదము వలన వ్యాధి చేరినదో తెలిసికొని, క్షమాపణకోరి, స్వస్థత పొందుటకు పూనుకొన్నాను.


ఒకవేళ వెంటనే స్వస్థత కలుగకపోయిన యెడల ప్రార్థించి, నీ దీవెనతో ఔషదము వేసికొందును. నీళ్లను ఔషదముగా నీవు నయమాను విషయములో వాడినావుకదా! నరుడు పాపములో పడిపోవుననియు, అందువలన జబ్బు తెచ్చుకొనుననియు నీకు ముందుగా తెలిసి, మూలికాదులు పుట్టించి; అవి ఔషదములుగా వాడుకొను జ్ఞానమును కొందరికిచ్చి, ఔషదములు చేయించుచు అనేకమందిని బాగుచేయుచున్నావు. ఇది నీ అద్భుతమైన కృప. అయినను మందులేకుండా ప్రార్ధన, విశ్వాస, స్తోత్రముల వలనను స్వస్థత పొందవలెనని నీ నామధారుల విషయములో కోరుచున్నావు.


3. తండ్రీ! పాపము వలననే ఇబ్బంది, పేదరికము, అప్పుల పాలగుట సంభవించుచున్నది. ఇట్టిది నాకు కలిగిన యెడల విశ్వాస మూలముగానే తొలగించుకొనుటకు పూనుకొన్నాను.


4. ఈ అవస్థలు కాక ఇంకను అనేకమైన అవస్థలు కలుగుచున్నవి. అట్టి సమయములో ప్రార్ధనవలననే తొలగించుకొనుటకు పూనుకొన్నాను.


5. పాపమునుబట్టి మరియొక పాపము, అవిశ్వాసము, అధైర్యము, దిగులు, అనిశ్చయత, విసుగుదల, నీ నడిపింపును అపార్ధము చేసికొనుట, నీ నిశ్శబ్ధమును గ్రహింపలేకపోవుట; సైతానుకు, శత్రువులకు, గాలి తుఫానుకు, ఎండకు, వానకు, పిడుగులకు, చెడ్డ కలలకు, తప్పుడు దర్శనములకు, యుద్ధములకు, కరువులకు, వ్యాపించు వ్యాధులకు, విషపురుగులకు, మరణమునకు, నరకమునకు భయపడక, నిన్నుబట్టి భయములను నివారణ చేసికొనుటకు పూనుకొన్నాను.


6. పాపపరిహారము, వ్యాధి నివారణ, ఇబ్బంది నివారణ, ఇంకను కావలసినవన్నియు, మోక్షభాగ్యము దయచేయుదువనియు మరియు నీ వాక్యములో వ్రాయించిన వాగ్ధానములన్నియు నమ్ముటకై పూనుకొన్నాను. ముఖ్యముగా యోహాను 14:14లో నున్న వాగ్ధానము, మార్కు 11:24లో నున్న సలహాను నమ్ముటకు పూనుకొన్నాను.


7. పరిశుద్దాత్మ దేవా! నేను పరిశుద్ధుడనైయున్నట్లు నీవును పరిశుద్ధుడవై యుండుమని సెలవిచ్చినదేవా! నీకనేక స్తోత్రములు. ప్రతి పాపమునుండి నన్ను దూరపర్చుము. శోధనలోనికి నన్ను రానీయకుము. నాకు తెలిసిన ప్రతి పాపమునుండి తప్పుకొనుటకు పూనుకొన్నాను. నిన్ను మరచియుండుట, నీ మీద విసుగుకొనుట, నీ యెడల కృతజ్ఞత లేకుండుట, ఆరాధనకు వెళ్లుటలో నిర్లక్ష్యము కలిగియుండుట, పెద్దల యెడల అమర్యాదగా నడచుట, కొట్టుట, స్త్రీ పురుషుల యెడల దుర్వాంఛ కలిగియుండుట, ఒకరిది ఆశించుట, అపహరించినది తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఒకరిని గురించి ఇతరులకు చెప్పి, అల్లరిచేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, తగని రీతిగా కోపపడుట, ఒకరిని ద్వేషించుట తిట్టుట, కుట్రాలోచనలు చేయుట, ఊరు పేరు లేని వ్రాతలు వ్రాయుట, ఇతరుల పాపములలో పాలివారగుట; ఇట్టి పాపములు చేయకుండుటకు పూనుకొన్నాను.


8. కష్టకాలము వచ్చినప్పుడు అదికూడ మేలుకొరకేనని అనుకొనుటకు పూనుకొన్నాను. యధాప్రకారమైన వాడుకలు చేయుటకును, మేలుచేయుట మానకుండుటకును పూనుకొన్నాను. రోజులోని ప్రతి సమయమందు నీ తలంపు కలిగియుండుటకును పూనుకొన్నాను. లేచుటతోనే నిన్ను స్తుతించుటకును, నీ గ్రంధములోని సంగతులు నేర్చుకొనుటకును, నా కొరకు, అందరికొరకు ప్రార్థించుటకును, కీర్తనలు పాడుటకును, ఇతరులకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుటకును పూనుకొన్నాను. దేవాలయమునకు వెళ్ళుట, మంచి మంచి పత్రికలు చదువుట, పుస్తకములు చదువుట, బీదలకు ధర్మము చేయుట, జీవరాసుల యెడల దయగా నుండుట, ప్రతి అవసరమైన పనుల సమయములలో వెంటనే ప్రార్ధనచేయుట, భోజన సమయమందు, నీళ్ళు తాగు సమయమునందు, ఎక్కడికైనా వెళ్ళు సమయమందు ప్రార్ధించుట కుటుంబ ప్రార్ధన చేసికొనుట; రాత్రులందు మెళకువ వచ్చినప్పుడు ప్రార్ధించుకొనుట; ఈ మొదలగు మంచి వాడుకలు మానకుండ జరుపుకొనుటకు పూనుకొన్నాను. మరియు నా పోషణార్ధమై నేను చేయవలసిన పనులలో, ఉద్యోగములో నమ్మకముగా ఉండుటకు పూనుకొన్నాను.


9.