క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
3. ఆదివారమున చేయు స్తుతులు
- 1. దేవా! నీవు మొదటి దినమున వెలుగు కలుగజేసినావు. కడపటి దినమగు ఏడవ దినము సృష్టి పని ముగించినావు. ఏడవదినము శనివారము అని బైబిలు చరిత్రవలన తెలియుచున్నది. అలాగైతే మొదటి దినము అనగా "వెలుగు కలుగునుగాక" అని నీవు చెప్పిన రోజు ఆదివారమై యుండవలెను. లోకముయొక్క చరిత్రలోనికి మొదట వచ్చిన దినము ఆదివారము. ఆ దినము వెలుగు దినము కాబట్టి నీకు స్తోత్రములు.
- 2. వెలుగు దినమైన ఆదివారము, క్రైస్తవులమైన మాకు ఆరాధన దినముగా వాడుకొననిచ్చినావు గనుక మా ఆరాధన దినము వెలుగు దినము. కాబట్టి నీకు వందనములు.
- 3. యేసుప్రభువు వచ్చి పరలోకమునకు వెళ్లేవరకు, ఏడవ దినమే అనగా సబ్బాతు దినమే విశ్రాంతి దినముగ ఆచరింపబడెను. గనుక నీకు స్తుతులు.
-
4. యేసుప్రభువా! నీ శిష్యులకు శనివారము దుఃఖదినము. అది వారికి చీకటి దినము. వెలుగు దినముకాదు. ఎందుకనగా వారికి
రక్షకుడవైన
నీవు లేవు(absent). నీవు సమాధిలో ఉన్నావు. అయ్యో! యేసుప్రభువు మనలను ఎంతో ఉద్ధరిస్తారనుకొన్నాము గాని శత్రువులు చంపిన
చంపనిచ్చినాడు. ఇక మన గతి ఏమిటని నిరాశలో దిగిపోయినారు. గనుక శనివారము మరింత దుఃఖదినము, అమావాస్య చీకటి దినము, అందరును
చెదిరిపోయిన దినము. సంఘము కూడుకొనలేదు.
యేసుప్రభువా! నీకు చావు ఎట్లు రానిచ్చినావో, అట్లే నీ శిష్యులకు దుఃఖదినముకూడా రానిచ్చినావు. ఇది వారిని వెలుగు దినమునకు సిద్ధపర్చుటకై ఏర్పరచిన దినము. కష్టము తరువాత కష్టనివారణ కలుగును. దుఃఖము తరువాత సంతోషము కలుగును. ఇది లోకములోనున్న చరిత్ర గనుక నీకు మంగళ స్తోత్రములు. - 5. యేసుప్రభువా! మార్కు 16 అ॥లో వ్రాయబడియున్నట్లు, నీవు ఆదివారమున బయటకు వచ్చినావు. అప్పుడు నీ వెలుగు వలన కావలివారు మూర్చిల్లిపోయిరి. ఆ మొదటి దినము సృష్టి వెలుగు దినము. అలాగు ఈ దినము, ఈ పునరుత్తాన దినము కూడా వెలుగు దినము. గనుక నీకు స్తోత్రములు.
- 6. అప్పటినుండి శిష్యులు నీకు నమస్కరించిరి. ఆదివారము నిన్ను స్తుతించిరి. ఆ నమస్కారము సంఘములో నేటివరకు నున్నది. ఆదివారము గుడికి వెళ్ళుట నీకు నమస్కారము చేయుటకే. అదే నీకు స్తుతి. ఆదివారము స్తుతిదినము గనుక 52 ఆదివారములు, మేము నీ పునరుత్థానమును జ్ఞాపకమునకు తెచ్చుకొనవలయును. ఒక ఈస్టరు పండుగ దినముననే కాదు గనుక నీకు స్తుతులు.
- 7. యేసుప్రభువా! నీ శిష్యులు ఆదివారమున కూడుకొనినప్పుడెల్లా వారి మీటింగులలోనికి నీవు వెళ్ళి, వారితో సహవాసమునందు పాల్గొన్నావు. కాబట్టి క్రైస్తవులమైన మేము ఆదివారము ఆరాధన పెట్టుకొనుట నీకిష్టమే గనుక అనేక నమస్కారములు.
- 8. ఓ శిష్యులారా నాలుగువేల సం॥ల నుండి ఆచరించుచున్నారు. శనివారము మానివేసి ఎందుకు ఆదివారము ఆరాధన పెట్టుకున్నారు? అని నీవు గద్దింపలేదు. గనుక శనివారము ఆచరింపక పోవడము నీకు ఇష్టము గనుక నీకు ప్రణుతులు.
- 9. నాలుగువేల ఏండ్ల పాపము ఏలినందుకు భూమి చీకటియాయెను. మరల నీ పునరుత్థానమునుబట్టి క్రొత్త సృష్టి కలిగినది. అది కాకుండ నీ నామమున ఎవరెవరు బాప్తిస్మము పొందుదురో, అప్పుడు వారు నీ యొక్క నూతన సృష్టియై యుందురు. వారికాదినము వెలుగు దినము గనుక నీకు వందనములు.
- 10. పాపి మారుమనస్సు పొందినప్పుడు అది అతనికి వెలుగు దినము. అది ఆదివారము వంటిదే గాని శనివారము వంటిదికాదు గనుక నీకు స్తుతులు.
-
11. అపోస్తలుడైన పౌలు వ్రాసినట్లు మేము పునరుత్థాన బలము పొందవలెను. సాతానును, దయ్యములను, పాపములను, పాప ఫలితములగు
మరణమును
జయించుటకు నీ పునరుత్ధాన బలము చూపించినావు. ఆ వేళ కావలివారు ఎట్లు పడిపోయినారో, అట్లే పాపములు చేయించు దయ్యములన్నియు
పడిపోయినవి, శత్రువులు పడిపోయినారు.
నీ కాంతికి ఎవరు నిలువగలరు! నీ శక్తి ఎదుట ఎవరు నిలువగలరు! లొంగకుండ ఎవరు ఉందురు? మరణమునకు గతిలేదు. ఇంక ఎవరికి గతియుండును! అంత గొప్ప బలము నేడు అనగా ప్రతి ఆదివారము దయచేయుదువు. కాబట్టి నీకు స్తోత్రములు. - 12. ఆదివారము ఉదయమునుండి సాయంకాలము, రాత్రి వరకు స్తుతి చేయవలెను. బజారుకు వెళ్ళుట మా పనికాదు. లోక సంబంధమైన పనిచేయుట మా పనికాదు. దుఃఖము పెట్టుకొనుట మా పనికాదు. యేసుప్రభువా! నీ పునరుత్థాన చరిత్ర, నీ పునరుత్థాన బలము, నీ పునరుత్థాన వెలుగు తలంచుకొనకుండుట మా పనికాదు. మేమట్లు చేసినయెడల నీవు మమ్ములను క్షమించుము. నిజమైన పట్టుదలగల ఉపవాసపరులకు ఆ వేళ ఉపవాసమే, ఆనంద ఉపవాసమే. తెలియని ఆహారముగల దినమే. ఆకలి తీరే దినమే. ఇంతగొప్ప దినమును క్రైస్తవసంఘము నిర్లక్ష్యము చేయుచున్నది. ఈ రోజు అంతా గుడిలో లేక ఇంటివద్ద, ఈ రెండు స్థలములలో మేము ఉపవాస కార్యక్రమము ఆచరింపగలిగితే మాకు వేలకొలది నోట్సులు చెప్పగలవు. గాని అవి ఎవరికి కావాలి? గుడిలో పాదిరిగారు బోధించే దానికంటే నీవు ఉపవాస స్థలములోనే ఎక్కువ బోధిస్తావు. కాబట్టి నీకు స్తోత్రములు. అయినను మేము గుడికివెళ్ళి ఏర్పాటు ప్రకారము ఏకీభవించవలెను. అప్పుడు మమ్మును పాతాళలోక శక్తులు ఏమియు చేయనేరవు గనుక నీకు నిత్య స్తోత్రములు.
- 18. ఓ ప్రభువా! మేము పరలోకమునకు వచ్చినప్పుడు ఆరు రోజులు ఇక్కడ ఉండిపోవును. ఒక్క ఆదివారమే అక్కడకు వచ్చును. అక్కడ అంతా పగలే, అంతా వెలుగే, అంతా పునరుత్థాన బలమే, అంతా నీవే, శాశ్వతము వరకు అంతా ఆదివారమే, అంతా ఆరాధనే, అంతా విశ్రాంతియే, అంతా సహవాసమే. ఆ మహాభాగ్యము పొందకముందే, ఇక్కడ ఆదివార భాగ్యము అలవాటు చేసికొను కృప దయచేయుము. నీకే ఘన వందనములు.
- 14. ఆదివారము ఆదిరోజు. మా జీవితకాలమంతయు విశ్వాసమును కలిగియున్నయెడల సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారములు ఆదివారములే. సంవత్సరములన్నియు ఆదివార సంవత్సరములే. గనుక మా తలలోనుండి, మా హృదయములోనుండి, మా బ్రతుకులోనుండి ఆదివారమును ఎప్పుడు తీసివేయకూడదు. ఆ దినము విజయమునకు సూచన దినము గనుక నీకు స్తోత్రములు. అక్కడ ఇక్కడ స్తోత్రములు.
- 15. క్రైస్తవులు ఆదివారమునాడు తమయొక్క అవసరములనుబట్టి చిన్న చిన్న పనులు చేసికొనుచున్నప్పుడు ప్రభువు ఊరుకొనుచున్నారు. సబ్బాతు దినమున యూదులు పనిచేస్తే మోషే ధర్మశాస్త్రము వారికి శిక్ష విధించెను. అలాగే యేసుప్రభువుకూడ మనలను ప్రతి ఆదివారము శిక్షించిన మతములోనికి ఎవ్వరును రారు. అయితే ధర్మశాస్త్ర ఆజ్ఞ శనివారము గతించిపోయినట్లుగా గతించిపోగా ఆదివారము వచ్చినది. అచ్చటినుండి కృపాశాస్త్రము ఆరంభమైనది. యోహాను 1:18. కృపాశాస్త్ర ప్రకారము, మనిషి తన అనుకూలతనుబట్టి నడుచుకొన వచ్చును. ఆ అనుకూలమైనది క్రైస్తవమతముయొక్క ప్రేమ నిర్ణయమై యుండవలెను. గనుక నీకు వందనములు.
-
16.
- ఎ) త్రిత్వము ఆదివారమున వెలుగు కలుగునుగాక! అని చెప్పెను. అది తండ్రియొక్క పనిదినమై యున్నది.
- బి) పునరుత్ధానము ఆదివారమున జరిగెను. అది కుమారుడైన దేవుని పనిదినమై యున్నది.
- సి) పెంతెకొస్తు ఆదివారమున జరిగెను. అది పరిశుద్ధాత్మ పనిదినమై యున్నది.
ఈ మూడు దినములు ఆదివారములే. తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు మూడు పని దినములు మనకు జ్ఞాపకమునకు వచ్చు దినము ఆదివారము. ఇంతకంటే ఆనందకరమైన రోజు ఏది? గనుక నీకు నిత్య మంగళ స్తుతులు. ఆమేన్.