క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

9. సమర్పణ ప్రార్ధన



నీ చిత్తము అబ్రాహాము నెరవేర్చినట్లు, మేమును నెరవేర్చునట్లు "చిత్తము ప్రభువా"! అనేటట్లు దీవించుము. ఇస్సాకు బలి అయినట్లు నీకు మేము సమర్పణ అయేటట్లు దీవించుము. మాలో ఏ మంచి కార్యము జరిగినా నీ కార్యములకు ముంగుర్తు అయేటట్లు దీవించుము. పొట్టేలువలె ధనము ఇచ్చినావు. నీ సేవలో వాడునట్లు దీవించినందుకు స్తోత్రములు.


ప్రభువా! నీవు ఏమి చెప్పితే అది చేయునట్లు గొప్ప మంచి మనస్సు ఉండునట్లు దీవించుము. ఏ గొప్ప కార్యమును చేయనుద్దేశించిన, నీ చిత్తములో చేయునట్లు దీవించుము. మరణమంత కష్టమున్నను సమర్పణ చేయునట్లు దీవించుము. ఇస్సాకునకు మరణములేదు. ఇస్సాకునకే జయముగాని మరణమునకుకాదు. ఇప్పుడు చేయు మంచి కార్యములు రాబోయే కాలమునకు మేలు, మాదిరి, ముంగుర్తుగానుండునట్లు దీవించుము. నీ సేవలో ఏది చేసినను ఈ కాలము నిమిత్తమును, రాబోవు కాలమునకు ఉపయోగముగా నుండునట్లు దీవించుము.


సర్వస్వాధీనపరుడవైన త్రియేకదేవా! మేము నీ స్వాధీనము. నీ చిత్తానుసారముగా చేయవలెను. గాని మా ఇష్టప్రకారము చేయవీలులేదు. గత కాల భక్తులందరు నీ స్వాధీనము. నీ వాక్కు నీ సంపాదనయైయున్నారు. నీ చిత్తమును నెరవేర్చునపుడు మాకు శ్రమ, నొప్పి, శ్రమ, బాధ గానీ, నీ చిత్తములో మా చిత్తములు ఏకీభవింపజేసినపుడు మాకు బలము, ఆనందము, జీవము. అప్పుడు మా సంపాదన దేవుడవు, రక్షకుడవు సమస్తమునైయున్న, సమస్తమునై యుందువు.


దయగల ప్రభువా! మేము నీ స్వాధీనము. నీవు మా స్వాధీనము. మా చిత్తము నీ చిత్తముయొక్క స్వాధీనము. నీ గ్రంధము మా స్వాధీనము. మాకు కలిగినదంతయు నీకు సమర్పించుకొంటే ఆస్తి సంపాదన, కష్టములు, లోపములు అన్నీ నీకు సమర్పించుకొంటే నీకున్నవన్నీ మావి.


అంతయు మనదేగదా యేసునికున్న ॥బహుగా॥


ప్రభువా! ఇంకేమున్నది. మేము నీకు సమర్పణ చేసిన వాటికంటే ముందే నీవు మా నిమిత్తము సమర్పణయైనావు. మాదొక రకమైన సమర్పణ. నీదొక రకమైన సమర్పణ. నీ సమర్పణనుబట్టి మా సమర్పణ. మొదటే నీ సమర్పణ. భూమి పుట్టనప్పటికంటే ముందే కొన్నివందల ఏండ్లముందే నీ ప్రాణ సమర్పణ చేసినావు. గాని మేమిప్పుడు గ్రహించుచున్నాము. భక్తులందరు నీకు సమర్పణయైనారు. వారే ముందు సమర్పణయైనారని అనుకొంటున్నాము. గాని జగత్తు పునాది వేయబడకముందే నీవు సమర్పణయైనావని పేతురు వ్రాసెను. పాత నిబంధన భక్తులకంటే, క్రొత్త నిబంధన భక్తులకంటే నీవే ముందు సమర్పణ. సిలువమీద నీవు చేసిన సమర్పణను అప్పుడు మేము లేము గనుక చూడలేదు. అప్పుడున్న వారు చూచారు. గాన నీ సమర్పణ ఇప్పుడు చూస్తున్నాము.


భూగోళము, మేము పుట్టకముందే నీవు మాకు సమర్పించినావు. తరువాత నీవు సమర్పణయైనావు, గనుక మేము నీకు సమర్పించుకొనవలెను. ఆ రెండు గోళములుగాక మా ప్రాణమును, శరీరమును సమర్పించినావు.


పరలోకము పరలోకమునే మాకు సమర్పింపనై యున్నావు. కాబట్టి దానికి అంతములేదు. గాన మా చిత్తము లేక ఇష్టము, నీకు సమర్పింపవలెను. ప్రభువా! ఇద్దరి సమర్పణను గూర్చి మా జ్ఞానమును వెలిగించుము. మా మనస్సాక్షిని శుద్ధీకరించుము. మా ఆత్మను ప్రత్యక్షతతో నింపుము. ప్రార్ధనను, మా సమస్తమును అట్లే సమర్పించుకొమ్మని త్వరలో రానైయున్న యేసుప్రభువుద్వారా వేడుకొంటున్నాము. ఆమేన్.